Activists demand the resignation of Chief Election Commissioner Gyanesh Kumar over the Special Intensive Revision of electoral rolls, in Bengaluru, October 23, 2026. Photo: PTI/Shailendra Bhojak
ప్రత్యేక సమగ్ర సవరణ ప్రక్రియలో తలెత్తిన తీవ్ర అవకతవకలను పరిశీలిస్తే, ‘ఒక్క ఓటరునూ వదిలిపెట్టకూడదు’ అనే లక్ష్యాన్ని సాధించాలంటే ఫారం-6లో మార్పులతోపాటు విస్తృతమైన మీడియా ప్రచారం అవసరమని స్పష్టమవుతున్నది.
ఎస్ఐఆర్ ప్రక్రియలోని కొన్ని లోపాలను సరిదిద్దేందుకు భారత ఎన్నికల సంఘం ఇటీవల తీసుకున్న నిర్ణయాలు, తీవ్రంగా దెబ్బతిన్న భారత ప్రజాస్వామ్య వ్యవస్థకు తాత్కాలిక ఉపశమనం మాత్రమే కలిగిస్తాయి. ఎన్నికలపై ప్రజల విశ్వాసాన్ని పునరుద్ధరించాలంటే మొత్తం ఎస్ఐఆర్ ప్రక్రియను రద్దు చేయాలి.
ఎస్ఐఆర్ అనంతరం రూపొందించిన ఓటర్ల జాబితాలు చాలా లోపభూయిష్టంగా ఉన్నాయి. సాంకేతిక అంశాలలో తేడాల పేరుతో ఓటర్ల తొలగింపు, ఆచూకీ లేని ఓటర్ల పేర్ల చేర్పు, ఒకే వ్యక్తికి అనేక చోట్ల ఓటరు నమోదు, ఓటర్ల తొలగింపునకు ఫారం-7 దుర్వినియోగం వంటి అంశాలపై మీడియాలో పుంఖాను పుంఖాలుగా కథనాలు వెలువడ్డాయి. స్థానిక ఎన్నికల నమోదు అధికారుల (ఈఆర్ఓ)కు తెలియకుండా, తొలగింపునకు కారణాలు చూపకుండా వారి పేరుతో ఫారాలను స్వయంచాలకంగా నింపడం, ఈసీఐ నెట్లో అవకతవకలు, అసంబద్ధమైన పేర్ల చేర్పు వంటి ఆరోపణలూ వచ్చాయి.
మీడియా కథనాల్లో వెల్లడైన ఆరోపణలు అత్యంత తీవ్రమైన, విస్తృతమైనవి. చైతన్యవంతమైన ప్రజాస్వామ్యంలో వీటిని అత్యవసరంగా పరిష్కరించాలి. అందుకు ఎస్ఐఆర్ను రద్దు చేయడమే సరైన మార్గం.
ప్రస్తుతం నివసించే ప్రాంతం-సాధారణ నివాస ప్రాంతం మధ్య తేడా:
ఎస్ఐఆర్లో జరిగిన తీవ్రమైన అవకతవకల్లో ఓటర్లు అందుబాటులో లేరని లేదా వేరే ప్రాంతానికి వెళ్లిపోయారని పేర్కొంటూ వారి పేర్లను తొలగించడం ఒకటి. ఓటరు అందుబాటులో లేకపోవడం లేదా మరో చిరునామాకు మారడం అనే కారణం సమంజసంగానే కనిపించవచ్చు. అయితే, ఈ కారణంతో ఓటు హక్కును తొలగించడం చట్టాలకు, ఎన్నికల సంఘం మార్గదర్శకాలకు అనుగుణంగా ఉందా అనేదే ప్రధాన ప్రశ్న.
ఈ తరహా తొలగింపులపై అభ్యంతరాలు, చర్చలు జరిగినప్పటికీ, వాటి వెనుక ఉన్న అసలు చట్టపరమైన అంశానికి చర్చల్లో తగిన ప్రాధాన్యం లభించలేదు.
ప్రజా ప్రాతినిధ్య చట్టం-1950లోని సెక్షన్ 20(1ఏ) ప్రకారం, ఒక వ్యక్తి తన సాధారణ నివాస ప్రాంతం నుంచి తాత్కాలికంగా దూరంగా ఉన్నంత మాత్రాన ఆ ప్రాంత నివాసిగా గుర్తింపు కోల్పోరు. అలాగే, 2023 ఓటర్ల జాబితా మార్గదర్శకాలలోని పేరా 8.3 ప్రకారం, తిరిగి వచ్చే ఉద్దేశం, సామర్థ్యం ఉన్నవారు తాత్కాలికంగా ఇతర ప్రాంతాల్లో నివసించినా తమ సాధారణ నివాస హోదాను కోల్పోరు. అందువల్ల తాత్కాలికంగా ఇతర ప్రాంతాలకు వెళ్లిన ఓటర్ల పేర్లను ఆ ఒక్క కారణంతోనే ఓటర్ల జాబితా నుంచి తొలగించకూడదు.
ఉదాహరణకు, లక్నోలో ప్రభుత్వ నివాసంలో ఉంటూ అక్కడ ఓటరుగా నమోదైన ఉద్యోగి ఢిల్లీకి బదిలీ అయ్యాడనుకుందాం. ప్రభుత్వ ఉద్యోగులకు తరచూ బదిలీలు జరుగుతుంటాయి. అతడు తిరిగి లక్నోకు రావాలనుకుంటే అక్కడి ఓటర్ల జాబితా నుంచి అతని పేరును తొలగించడానికి తగిన కారణం లేదు. విద్య, ఉద్యోగం, వ్యాపారం తదితర అవసరాల కోసం ఇతర ప్రాంతాలకు వెళ్లిన చాలామంది తమ అసలు నివాస ప్రాంతంలో ఓటు హక్కును కొనసాగించాలనుకుంటారు.
ప్రస్తుతం నివసిస్తున్న ప్రాంతాన్నే ఓటరు నమోదుకు తప్పనిసరి ప్రమాణంగా నిర్ణయిస్తే, వివిధ అవసరాల కోసం ప్రాంతాలు మారే లక్షలాది మంది తరచూ ఓటర్ల జాబితాల నుంచి తొలగింపునకు గురవుతారు. తక్కువ కాల వ్యవధిలో బదిలీలు జరిగే అఖిల భారత సర్వీసులు, కేంద్ర పౌర సర్వీసుల అధికారులకూ ఈ సమస్య ఎదురవుతుంది. అనేకమంది అధికారులు, న్యాయమూర్తులు సైతం మొదట నమోదైన ప్రాంతంలోనే ఓటర్లుగా కొనసాగాలని కోరుకుంటారు.
సాధారణ నివాసం, ప్రస్తుత నివాసం రెండింటినీ ఒకే విధంగా పరిగణిస్తే విద్యార్థులు, వివాహిత మహిళలు, సంచార జాతుల ప్రజలు, మురికివాడల నివాసితులు, పేద వలస కార్మికుల ఓటు హక్కు ప్రమాదంలో పడుతుంది. ఎన్నికల సంఘం నిబంధనల్లో తాత్కాలికంగా ఎంతకాలం దూరంగా ఉంటే ఓటు హక్కు కోల్పోతారనే కాలపరిమితి లేదు. తిరిగి స్వస్థలానికి వచ్చే ఉద్దేశం, సామర్థ్యం ఉన్నాయా లేదా అనేదే ప్రధాన ప్రమాణం.
ఉద్యోగం, వ్యాపారం, విద్య తదితర కారణాలతో ఇతర ప్రాంతాల్లో ఉంటున్నవారికి తమ అసలు నియోజకవర్గంలో ఓటరుగా కొనసాగే హక్కు ఉందని ఎన్నికల సంఘం గుర్తించినట్లు కనిపిస్తోంది. అందుకే 2026 ఆగస్టు 5న ఎన్నికల సంఘం, హర్యానా ప్రధాన ఎన్నికల అధికారి “ది ఇండియన్ ఎక్స్‌ప్రెస్” పత్రికలో ప్రకటన ఇచ్చారు. అలాంటి ఓటర్లు ఫారం-6 ద్వారా తమ పేర్లను నమోదు చేసుకోవచ్చని స్పష్టం చేశారు.
వెనక్కి తగ్గిన ఎన్నికల సంఘం:
అర్హులైన ఓటర్ల నమోదును సులభతరం చేసేందుకు 2026 అక్టోబర్ 15న ఎన్నికల సంఘం కీలక నిర్ణయం తీసుకుంది. ఎస్ఐఆర్ పూర్తయిన ప్రాంతాల్లో ప్రత్యేక సంక్షిప్త సవరణ (ఎస్ఎస్ఆర్) ద్వారా ప్రస్తుత ఓటర్ల జాబితాలను సవరించాలని ఆదేశించింది. గత ఎస్ఐఆర్ జాబితాలో తల్లిదండ్రులు లేదా తాత ముత్తాతల పేర్లు ఉన్నాయో లేదో ప్రకటించాలనే వివాదాస్పద నిబంధనను ఫారం-6 నుంచి తొలగించింది.
గతంలో మొదటిసారి ఓటరుగా నమోదు కావడానికి, ఒక నియోజకవర్గం నుంచి మరో నియోజకవర్గానికి మారడానికి ఫారం-6 ఉపయోగించేవారు. ఓటరు వివరాల సవరణకు ఫారం-8 ఉపయోగించేవారు. ప్రస్తుతం ఫారం-6ను కొత్త ఓటర్ల నమోదుకే పరిమితం చేశారు. సవరించిన ఫారం-8ను ఒకే నియోజకవర్గంలో లేదా ఇతర నియోజకవర్గానికి నివాస మార్పు, ఓటరు వివరాల సవరణ కోసం ఉపయోగిస్తున్నారు.
ముగింపు:
పూర్వీకుల వివరాలు లేకుండానే ఫారం-6 సమర్పించేందుకు అనుమతించినంత మాత్రాన ‘ఒక్క ఓటరునూ వదిలిపెట్టకూడదు’ అనే లక్ష్యం నెరవేరదు. సాధారణ నివాస ప్రాంతానికి సంబంధించిన గందరగోళాన్ని కూడా తొలగించాలి. ఈ కారణాలతో ఓటర్ల జాబితాల నుంచి తొలగించిన వారి ఓటు హక్కును పునరుద్ధరించాలంటే ఎస్ఐఆర్కు ముందు ఉన్న ఓటర్ల జాబితాలను తిరిగి అమల్లోకి తీసుకురావడమే ఏకైక మార్గం.
ఏదైనా నియోజకవర్గంలో లేదా దానిలోని కొంత ప్రాంతంలో కొత్తగా ఎస్ఐఆర్ నిర్వహించాల్సిన అవసరం ఉందని ఎన్నికల సంఘం భావిస్తే, అందుకు కారణాలను వెల్లడించాలి. ఎన్నికల ప్రవర్తనా నియమావళి విషయంలో మాదిరిగానే ఎస్ఐఆర్ నిర్వహణ విధానంపై అన్ని రాజకీయ పార్టీల ఏకాభిప్రాయాన్ని సాధించాలి.
పరిమిత ప్రాంతంలో కొత్తగా చేపట్టే ఎస్ఐఆర్ను హడావుడిగా నిర్వహించకూడదు. ప్రస్తుత ఎస్ఐఆర్లో బయటపడుతున్న అనేక తప్పులు పునరావృతం కాకుండా ఈ ప్రక్రియను ఏడాది కాలంలో సమగ్రంగా నిర్వహించాలి. ఈలోగా ఓటర్ల జాబితాల నుంచి పేర్లు తొలగించినవారికి నిలిచిపోయిన సంక్షేమ ప్రయోజనాలను పునరుద్ధరించాలని రాష్ట్ర ప్రభుత్వాలకు కేంద్ర ప్రభుత్వం సూచించాలి.
భారత ఎన్నికల ప్రజాస్వామ్య సమగ్రతపై దేశ ప్రజలకు, అంతర్జాతీయ పరిశీలకులకు విశ్వాసాన్ని పునరుద్ధ రించేందుకు ఇంతకు మించిన మార్గం లేదు.
రచయితలు: ఎన్.కె. శర్మ, సంజయ్ కుమార్ కేంద్ర గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖలో వరుసగా డైరెక్టర్ జనరల్, అదనపు డైరెక్టర్ జనరల్‌గా పదవీ విరమణ చేశారు. సిరాజ్ హుస్సేన్ కేంద్ర వ్యవసాయ శాఖ మాజీ కార్యదర్శి.
అనువాదం: కె. గంగాధర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
