AISA national president Neha Bora.
- నేహా బోరాపై అపవాదుల ముసుగు తొలగిన వేళ
- కల్పిత కథలపై ‘అక్షరాయుధం’ సాధించిన అపూర్వ విజయం
- నీతి, నిజాయితీ, ప్రజాస్వామ్య విలువల ప్రతిరూపం ఎఐఎస్ఎ నాయకురాలు
నేహా బోరాపై దుష్ప్రచారానికి ‘ఫ్యాక్ట్‌చెక్’ చెక్
సామాజిక మాధ్యమాల్లో నిజాన్ని నొక్కిపెట్టి, విద్వేషాన్ని వ్యాప్తి చేయడం సులువైన కాలమిది. కానీ అబద్ధం ఎంత వేగంగా దూసుకెళ్లినా, సత్యం వైపే విజయం నిలుస్తుందని మరోసారి నిరూపితమైంది. ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ (ఎఐఎస్ఎ) జాతీయ అధ్యక్షురాలు నేహా బోరాపై కొన్ని రాజకీయ వర్గాలు, మీడియా ప్రతినిధులు సాగించిన దుష్ప్రచారం ‘ఆల్ట్ న్యూస్’ సమగ్ర ఫ్యాక్ట్-చెక్ దర్యాప్తుతో ముక్కలైంది. భారతదేశంలో బంగ్లాదేశ్ తరహా అరాచకాన్ని, విద్వేషాన్ని లేదా ప్రభుత్వ కూల్చివేత (రెజీమ్ చేంజ్)ను ఆమె కోరుకున్నారంటూ అల్లిన అసత్యపు కథనాల వెనుక ఉన్న కుట్ర కోణం తేటతెల్లమైంది. ఒక యువ నాయకురాలి గొంతును నొక్కేందుకు జరిగిన ప్రయత్నాన్ని తిప్పికొడుతూ, ప్రజాస్వామ్యం, విద్యా హక్కులు, లౌకిక విలువల కోసం ఆమె నిలబడ్డ తీరు నేటి యవతకు ఒక దిశానిర్దేశం!
ఆక్టోబర్ 15, 2026న భారతీయ జనతా పార్టీ (బిజెపి) జాతీయ అధికార ప్రతినిధి ప్రదీప్ భండారీ, ఆ తర్వాత కొన్ని మితవాద సామాజిక మాధ్యమ ఖాతాలు, ఆర్నాబ్ గోస్వామి నేతృత్వంలోని రిపబ్లిక్ టీవీ ఛానెల్… నేహా బోరా వ్యాఖ్యలను తప్పుదోవ పట్టిస్తూ కథనాలను ప్రసారం చేశాయి. ‘భారత్‌లో బంగ్లాదేశ్ తరహా హింసాత్మక తిరుగుబాటును, అరాచకాన్ని నేహా బోరా ఆహ్వానిస్తున్నారు’ అంటూ ఆమె మాట్లాడిన ఒక చిన్న వీడియో క్లిప్‌ను సందర్భం లేకుండా ప్రదర్శించారు. ప్రజాస్వామ్య హక్కులు, విద్యార్థుల స్వేచ్ఛ, విద్య ప్రైవేటీకరణ, మత ఛాందసవాదానికి వ్యతిరేకంగా పోరాటాల గురించి ఆమె పంపిన సందేశాన్ని హింసకు మద్దతుగా చిత్రీకరించడమే ఈ వివాదానికి కేంద్రబిందువు.
నిజాల వేటలో ‘ఆల్ట్ న్యూస్’ తేల్చిన అక్షర సత్యాలు
ఒక యువ నాయకురాలు మాట్లాడిన మాటల్లోంచి కొన్ని వాక్యాలను మాత్రమే తీసుకుని, మిగతా సందర్భాన్ని మరుగునపెట్టి, ఆమె హింసాత్మక తిరుగుబాటుకు పిలుపునిచ్చిందని ప్రచారం చేస్తే.. ప్రజల ముందుకు వచ్చినది నిజమా, రాజకీయంగా రూపొందించిన అపోహనా? ఈ ప్రశ్నకు సమాధానం వెతికిన ప్రముఖ ఫ్యాక్ట్‌చెకింగ్ సంస్థ ఆల్ట్ న్యూస్ (Alt News) చేపట్టిన నిష్పాక్షిక దర్యాప్తులో అసలు నిజాలు బయటపడ్డాయి. నేహా బోరా భారతదేశంలో బంగ్లాదేశ్ తరహా పరిస్థితిని సృష్టించాలని పిలుపునిచ్చారన్న వైరల్ ఆరోపణ తప్పుదోవ పట్టించేదని సంస్థ పేర్కొంది.

దర్యాప్తులో బయటపడ్డ వాస్తవాలు
సందర్భం దాచిపెట్టిన కుట్ర: 2026 అక్టోబర్ 13న బంగ్లాదేశ్‌కు చెందిన ‘సోషలిస్ట్ స్టూడెంట్స్ ఫ్రంట్’ (ఎస్.ఎస్.ఎఫ్) 6వ జాతీయ మహాసభల సందర్భంగా ఆ సంస్థకు నేహా బోరా వీడియో సందేశం పంపారు. అది 1 నిమిషం 49 సెకన్ల శుభాకాంక్షల వీడియో. పాస్‌పోర్ట్, వీసా సంబంధిత సమస్యల కారణంగా సమావేశానికి ప్రత్యక్షంగా హాజరుకాలేకపోవడంతో, ఆ సంఘం నాయకులకు అభినందనలు తెలియజేస్తూ తమ సంఘీభావాన్ని వ్యక్తం చేశారు. ఎస్ఎస్ఎఫ్ అనేది బంగ్లాదేశ్‌లోని ఒక లౌకిక, విప్లవాత్మక వామపక్ష విద్యార్థి సంఘం.
ప్రజాస్వామ్య పోరాటాలకే మద్దతు: నేహా బోరా తన సందేశంలో విద్యార్థుల ఓటు హక్కు, ప్రజాస్వామ్య పరిరక్షణ, మతమౌఢ్యానికి వ్యతిరేకంగా పోరాటం, విద్య కాషాయీకరణ, ప్రైవేటీకరణలపై మాట్లాడారు. అంతేతప్ప ఎలాంటి హింసను లేదా ప్రభుత్వాన్ని అక్రమంగా కూల్చడాన్ని ఆమె ప్రోత్సహించలేదు.
వీడియో లోగోల తొలగింపు: నేహా బోరా వివరణ ఇస్తూ… సదరు వీడియో వెనుక ఉన్న ఎస్ఎస్ఎఫ్ కాన్ఫరెన్స్ లోగోలను, గ్రాఫిక్స్‌ను కావాలనే తొలగించి, తప్పుడు ప్రచారానికి వాడుకున్నారని స్పష్టం చేశారు. తన సందేశం బంగ్లాదేశ్‌లో జరిగిన ప్రతి పరిణామానికీ లేదా ఆ ఉద్యమం తరువాత ప్రభావం చూపిన అన్ని రాజకీయ శక్తులకూ మద్దతు కాదని ఆమె వివరించారు. ప్రజాస్వామ్య హక్కులు, విద్యార్థుల హక్కులు, అందరికీ అందుబాటులో ఉండే విద్య, మత సామరస్యం కోసం పోరాడుతున్న ప్రగతిశీల, లౌకిక విద్యార్థి శక్తుల నుంచి స్ఫూర్తి పొందడమే తన ఉద్దేశమని స్పష్టం చేశారు
అంతర్జాతీయ మద్దతుదారుల స్పష్టత: బంగ్లాదేశ్ సోషలిస్ట్ పార్టీ కార్యదర్శి బాజ్లూర్ రషీద్ ఫిరోజ్ ఇతర నాయకులు స్పందిస్తూ, ‘నేహా మాటలను కావాలనే అపార్థం చేసుకునేలా ఎడిట్ చేశారు. ఆమె లౌకికత్వానికి, ప్రజాస్వామ్య హక్కులకు మద్దతు ఇచ్చారే తప్ప హింసను సమర్థించలేదు’ అని స్పష్టం చేశారు.
రాజకీయ అభిప్రాయాలతో విభేదించడం ప్రజాస్వామ్య హక్కు. కానీ మాట్లాడిన మాటల్లోంచి కొన్ని వాక్యాలను మాత్రమే ఏరి, మిగతా సందర్భాన్ని మరుగునపెట్టి, అసలు ఉద్దేశాన్ని వక్రీకరించి హింసాత్మక పిలుపుగా చిత్రీకరించడం విమర్శ కాదు.. వాస్తవాలను వక్రీకరించి ప్రజలను తప్పుదోవ పట్టించడమే!
ప్రజాస్వామ్యానికి అసలైన పరీక్ష విభేదించే గొంతులను ఎలా ఎదుర్కొంటున్నామన్నదే. విమర్శించాలంటే వాస్తవాలతో విమర్శించాలి. ఆరోపించాలంటే ఆధారాలు చూపాలి. ఒకరి మాటలను అర్థం చేసుకోవాలంటే పూర్తి సందర్భాన్ని పరిశీలించాలి. నేహా బోరాపై సాగిన ఈ ప్రచారం మనకు గుర్తుచేసే ముఖ్యమైన పాఠం ఇదే.
నిప్పులాంటి నిజం.. నింగి వంటి ధైర్యం..
నేహా బోరా ప్రగతిశీల ప్రస్థానం!
నేహా బోరా కేవలం ఒక విద్యార్థి సంఘం నాయకురాలిగా మాత్రమే సరిహద్దుల్లో ఆగిపోలేదు. ఆమె నేటి తరం యువత ఆకాంక్షలకు, హక్కులకై సాగే చైతన్య పోరాటానికి నిలువెత్తు రూపం. దేశంలోని కేంద్రీయ విశ్వవిద్యాలయాల్లో స్వయంప్రతిపత్తి క్రమంగా దెబ్బతింటున్న అభద్రతాభావ సమయంలో, అందరికీ ఉచిత, నాణ్యమైన విద్య అందాలని ఆమె గళం విప్పుతున్న తీరు ప్రతి హృదయాన్నీ కదిలిస్తుంది. ఆమె గొంతులో ఎక్కడా అరాచకపు ఛాయలు కనిపించవు. కేవలం రాజ్యాంగం కల్పించిన హక్కులకై సాగే ప్రజాస్వామ్య బద్ధమైన నిలదీత మాత్రమే స్పష్టంగా వినిపిస్తుంది.
కేవలం స్వదేశానికే పరిమితం కాకుండా, బంగ్లాదేశ్ వంటి పొరుగు దేశాల్లో మతమౌఢ్యానికి వ్యతిరేకంగా, యువత హక్కుల కోసం జరిగే సమస్త ప్రగతిశీల పోరాటాలకు సంఘీభావం తెలపడం ఆమెకున్న విశాలమైన, మానవీయ భావజాలానికి నిదర్శనం. సరిహద్దులు వేరైనా, పీడితుల గొంతు ఒక్కటేనని చాటిచెప్పే ఆమె విశాల దృక్పథం ఎంతోమందికి స్ఫూర్తినిస్తుంది. అయితే, స్వార్థపూరిత రాజకీయాల కోసం కొందరు ఆమె మాటలను వక్రీకరించి, ఆమెపై తీవ్రమైన నిందలు మోపి, విద్వేషం చిమ్మే ప్రయత్నం చేశారు. అయినప్పటికీ ఆమె ఏమాత్రం భయపడలేదు, వెనకడుగు వేయలేదు. ఇన్స్టాగ్రామ్ వేదికగా నేరుగా ప్రజల ముందుకు వచ్చి సత్యాన్ని అక్షరాల, ఆధారాల సహా ప్రపంచం ముందు నిలబెట్టింది. ఆ సంక్షోభ సమయంలో ఆమె ప్రదర్శించిన గుండె ధైర్యం ఎంతోమందికి ఒక నైతిక బలాన్నిచ్చింది.
విద్యావ్యవస్థలో పదునైన క్రిటికల్ థింకింగ్ (విమర్శనాత్మక ఆలోచన) నిర్వీర్యం కాకుండా, యువతను కేవలం మూకలుగా కాకుండా నిజమైన బాధ్యతగల పౌరులుగా తీర్చిదిద్దాలనే ఆమె ఆకాంక్ష ఈ దేశ ప్రజాస్వామ్య రక్షణకు ఊపిరి పోస్తుంది. అబద్ధాల బురదలో మాయం కాని నిజాయితీలా, విద్వేషపు తుఫానులోనూ చెదరని దృఢచిత్తంతో నేహా బోరా నేడు భారతీయ యువతకు ఒక దిక్సూచిలా నిలుస్తున్నారు!
అసత్యంపై గెలిచిన సత్య శోధన
రాజకీయ ప్రయోజనాల కోసం ఒక యువ విద్యార్థి నాయకురాలి మాటలను విరిచి, తుంచి, తప్పుడు రంగు పూసి విద్వేషాన్ని పెంచి పోషించాలని చూసిన వ్యూహాలు సత్యం ముందు చిన్నబోయాయి. ‘విద్యార్థుల హక్కులు, ప్రజాస్వామ్య పరిరక్షణ, లౌకిక విలువల కోసం ప్రశ్నించే గొంతును అబద్ధాలతో తొక్కేయలేరు’ అని నేహా బోరా నైతిక విజయం చాటిచెప్పింది. సత్యం వైపే నిలబడే నిజమైన నాయకత్వానికి, నేహా బోరా కనబరిచిన స్థిరచిత్తం ఒక ఉజ్వల ఉదాహరణ!
కృష్ణ కానూరి, 7981305779
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
