Illustration: Why Is the Government Unable to Control Rising Food Prices?
ఈ ఏడాది ప్రారంభం నుంచే ఆహార పదార్థాల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. వర్షాకాలంలో వర్షాలు సరిగా పడకపోవడం వల్ల వ్యవసాయ ఉత్పత్తులపై మరిన్ని ప్రభావాలు పడే అవకాశం ఉంది. ఆ ప్రభావాలు రాబోయే రోజుల్లో మరింత స్పష్టమవుతాయి. ఈ ఏడాది పంటలు మార్కెట్లోకి వచ్చిన తర్వాత కూడా ఆహార ధరల పెరుగుదల ఆగక పోవచ్చని చెప్పవచ్చు.
ఇక్కడ గమనించాల్సిన విషయం ఏమిటంటే, ఆహార ధరలు పెరగడమే కాదు, ధరలు పెరిగే వేగం కూడా పెరుగుతోంది. అంటే గతంతో పోలిస్తే మరింత వేగంగా ధరలు పెరుగుతున్నాయి. గణాంకాలు, కార్యక్రమాల అమలు మంత్రిత్వ శాఖ (MOSPI) విడుదల చేసిన సమాచారం ప్రకారం 2026 జనవరిలో ఆహార ద్రవ్యోల్బణం 2.1 శాతంగా ఉంది. సెప్టెంబరు నాటికి అది 7.7 శాతానికి పెరిగింది. అంటే కేవలం ఎనిమిది నెలల్లో ఆహార ద్రవ్యోల్బణం రెండింతలకు పైగా పెరిగింది. అక్టోబరు నెలకు సంబంధించిన గణాంకాలు ఇంకా విడుదల కాలేదు.
జనవరి నుంచి ప్రతి నెలా ఆహార ద్రవ్యోల్బణం పెరుగుతూనే ఉంది. అయినప్పటికీ, ఇటీవలి త్రైమాసికంలో దేశ స్థూల దేశీయోత్పత్తి (GDP) వృద్ధి అంచనాలకంటే ఎక్కువగా నమోదైందనే చర్చల మధ్య ఈ సమస్యకు తగినంత ప్రాధాన్యం లభించలేదు. ఒక త్రైమాసిక GDP వృద్ధి రేటుకే ఇంత ప్రాధాన్యం ఇవ్వడం కూడా ఆర్థిక వ్యవస్థలో ప్రజలకు నిజంగా ముఖ్యమైన సమస్యలపై తగినంత చర్చ జరగడం లేదని అర్ధమవుతున్నది.
“ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే బలమైన విధానాలు లేవు”:
ఆహార ధరల పెరుగుదల ప్రజల జీవన ప్రమాణాలపై తీవ్ర ప్రభావం చూపుతుంది. ఎందుకంటే భారతదేశంలో కుటుంబాలు తమ ఖర్చుల్లో పెద్ద భాగాన్ని ఆహారం కోసమే వెచ్చిస్తాయి. అధికారిక గణాంకాల ప్రకారం వినియోగదారుల మొత్తం ఖర్చులో ఆహారం వాటా భారతదేశంలో దాదాపు 45 శాతం. చైనాలో దాదాపు 21 శాతం. అమెరికాలో కేవలం 7 శాతం. ఈ గణాంకాలు భారతదేశంలో ఆహార ధరలు పెరిగితే సాధారణ కుటుంబాలపై ఎంత ఎక్కువ భారం పడుతుందో తెలియజేస్తున్నాయి.
అందువల్ల ఆహార ధరల పెరుగుదలను అడ్డుకునేందుకు భారత ఆర్థిక విధానాల్లో గట్టి చర్యలు ఉండాలి. కానీ అలాంటి సమర్థమైన చర్యలు లేవు. భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని నియంత్రించే బాధ్యత ప్రధానంగా భారతీయ రిజర్వ్ బ్యాంకు (RBI) ద్రవ్య విధానంపై ఉంటుంది. 2016లో మోదీ ప్రభుత్వం పార్లమెంటు ద్వారా రిజర్వ్ బ్యాంక్ చట్టానికి సవరణ చేసి, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడాన్ని ద్రవ్య విధానానికి ప్రధాన లక్ష్యంగా నిర్ణయించింది. దీని కోసం ద్రవ్యోల్బణ లక్ష్య నిర్దేశం (Inflation Targeting) అనే విధానాన్ని అమలు చేశారు. ఈ విధానంలో ప్రధాన సాధనం రెపో రేటు. రెపో రేటు అంటే వాణిజ్య బ్యాంకులకు ఆర్బీఐ అప్పుగా డబ్బు ఇచ్చేటప్పుడు వసూలు చేసే వడ్డీ రేటు. ధరలు ఎక్కువగా పెరుగుతున్నప్పుడు ఆర్బీఐ రెపో రేటును పెంచితే బ్యాంకులు తమ రుణాలపై వడ్డీ రేట్లను పెంచే అవకాశం ఉంటుంది. గృహ రుణాలు, వ్యాపార రుణాలు తీసుకోవడం ఖరీదవుతుంది. ప్రజలు, వ్యాపార సంస్థలు ఖర్చు చేయడం, అప్పులు తీసుకోవడం తగ్గించవచ్చు. దాంతో మొత్తం డిమాండ్ తగ్గి ద్రవ్యోల్బణం అదుపులోకి వస్తుందని భావిస్తారు.
ఈ విధానంలో వడ్డీ రేట్లు పెంచడం వల్ల ఉత్పత్తి, ఆర్థిక కార్యకలాపాలు తగ్గినా దాన్ని ద్రవ్యోల్బణ నియంత్రణలో భాగంగా పరిగణిస్తారు. అయితే, ఆహార ధరలు పెరగడానికి అసలు కారణం ఆహార సరఫరా తగ్గడమే అయితే, వడ్డీ రేట్లు పెంచడం ద్వారా ఆ సమస్యను పరిష్కరించడం వీలు కాదు.
‘సహజ ఉత్పత్తి స్థాయి’ అనే భావనపై విమర్శ:
పాశ్చాత్య ఆర్థిక సిద్ధాంతాల్లో ‘సహజ ఉత్పత్తి స్థాయి’ (Natural Level of Output) అనే భావనకు ప్రాధాన్యం ఉంది. ప్రభుత్వ జోక్యం లేకుండా మార్కెట్ తనంతట తాను పనిచేస్తే ఆర్థిక వ్యవస్థలో ఉత్పత్తి ఎంత ఉండేదో తెలిపే స్థాయిగా దీన్ని సాధారణంగా అర్థం చేసుకోవచ్చు. కానీ ఈ స్థాయిని నేరుగా గమనించడం సాధ్యం కాదు. దాన్ని ఎలా కొలవాలి అనే విషయంలోనూ ఆర్థికవేత్తల మధ్య ఏకాభిప్రాయం లేదు. అయినా పాశ్చాత్య ఆర్థిక ఆలోచనల్లో ఈ భావనకు చాలా ప్రాధాన్యం లభించింది.
ఈ సిద్ధాంతం ప్రకారం, వాస్తవ ఉత్పత్తి సహజ స్థాయిని మించినప్పుడు ద్రవ్యోల్బణం పెరగ వచ్చు. వడ్డీ రేట్లు సహజ వడ్డీ రేటుకంటే తక్కువగా ఉండటం కూడా దీనికి కారణమని భావిస్తారు. కానీ సహజ వడ్డీ రేటును కూడా నేరుగా కొలవడం కష్టం. నేరుగా కొలవలేని అంశాలపై ఆధారపడిన సిద్ధాంతం ఎలా అంగీకరించ బడింది? అనేది రచయిత ప్రశ్న.
ఫ్రెంచ్ తత్వవేత్త మిషెల్ ఫూకో చెప్పిన “జ్ఞానమే అధికారం” అనే భావనను ఇక్కడ ఆయన ప్రస్తావిస్తున్నారు. అంటే ఏ ఆలోచనకు అధికారిక గుర్తింపు లభిస్తుందనేది కేవలం దాని నిజానిజాలపైనే కాకుండా, దాని వెనుక ఉన్న అధికార సంబంధాలపైనా ఆధారపడవచ్చు. భారతదేశంలోనూ ద్రవ్యోల్బణ నియంత్రణకు ఈ పాశ్చాత్య విధానమే అధికారికంగా అంగీకరించ బడటాన్ని ఈ కోణంలో చూడాలని రచయిత అభిప్రాయపడుతున్నారు.
ద్రవ్యోల్బణ లక్ష్య నిర్దేశం ఎందుకు పనిచేయడం లేదు?
2016లో భారతదేశం ద్రవ్యోల్బణ లక్ష్య నిర్దేశం విధానాన్ని ప్రవేశ పెట్టినపుడు దాన్ని ఆధునిక ద్రవ్య విధానంగా అభివర్ణించారు. కానీ ఈ విధానం నిజంగా పనిచేస్తుందా లేదా అనేది దాని ఫలితాలను బట్టి నిర్ణయించాలి. ఆహార ధరలు నిరంతరం పెరుగుతూనే ఉంటే, ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి ప్రపంచ స్థాయి విధానం ఉందనే వాదనకు అర్థం లేదు.
గణాంక పద్ధతుల ద్వారా రచయిత గుర్తించిన మూడు ముఖ్యమైన అంశాలు-
- భారతదేశంలో ద్రవ్యోల్బణాన్ని ప్రభావితం చేసేది ప్రధానంగా ఆహార ధరల్లోని మార్పులే. ఉత్పత్తి తన సహజ స్థాయిని ఎంత మించిందనే అంశం (Output Gap) ప్రధాన కారణంగా కనిపించలేదు.
- ప్రజలు భవిష్యత్తులో ధరలు ఎలా ఉంటాయని భావిస్తున్నారు అనే అంచనాలు ద్రవ్యోల్బణ గమనాన్ని వివరించడంలో ఆశించినంత ప్రభావం చూపలేదు.
- ఆర్బీఐ రెపో రేటు కూడా ద్రవ్యోల్బణం ఎలా మారుతుందనే విషయంలో గణనీయమైన పాత్ర పోషిస్తున్నట్లు వారి పరిశోధనలో కనిపించలేదు.
“ఆహార మార్కెట్లు ఇతర మార్కెట్లకు భిన్నమైనవి”
సాధారణంగా కొన్ని పారిశ్రామిక వస్తువుల మార్కెట్లలో కంపెనీలు భవిష్యత్తులో ధరలు పెరుగుతాయని భావిస్తే, ముందుగానే తమ వస్తువుల ధరలను పెంచవచ్చు. కానీ వ్యవసాయ ఉత్పత్తుల మార్కెట్లు భిన్నంగా పనిచేస్తాయి. అక్కడ పెద్ద సంఖ్యలో రైతులు, విక్రేతలు ఉంటారు. ఒక్కొక్క విక్రేతకు మొత్తం మార్కెట్ ధరను తన ఇష్టానుసారం మార్చే శక్తి సాధారణంగా ఉండదు.
ఆహార ధరలను ప్రధానంగా ప్రభావితం చేసేవి మార్కెట్లోకి వచ్చే ఆహార ఉత్పత్తుల పరిమాణం. ప్రజలకు ఆహారం కోసం ఉండే డిమాండ్. సరఫరా, డిమాండ్ మధ్య సమతుల్యత. ఆహారం కోసం డిమాండ్ సాధారణంగా స్థిరంగా ఉంటుందని భావిస్తారు. అందువల్ల స్వల్పకాలంలో ధరలు పెరగడానికి సరఫరా తగ్గడం ప్రధాన కారణం కావచ్చు. దీర్ఘకాలంలో జనాభా, ఆదాయాలు, వినియోగం పెరగడం వల్ల డిమాండ్ పెరుగుతుంది. దానికి అనుగుణంగా ఆహార ఉత్పత్తి పెరగకపోతే ధరలు పెరుగుతాయి.
అందువల్ల ఆహార ధరల పెరుగుదలను అరికట్టడానికి రెపో రేటును పెంచడం ఒక్కటే సరైన పరిష్కారం కాదు. ద్రవ్య విధానంతో ఆహార ధరలను నియంత్రించ లేము. వ్యవసాయ ఉత్పత్తుల్లో వచ్చే మార్పులు యాదృచ్ఛికంగా జరుగుతాయని, ఒక సమయంలో ధరలు పెరిగినా మరో సమయంలో తగ్గి దీర్ఘకాలంలో ఆ మార్పులు సమానం అవుతాయని కొందరు ఆర్థికవేత్తలు భావిస్తారు. అలా జరిగితే ఆహార ధరలపై ప్రత్యేకంగా దృష్టి పెట్టాల్సిన అవసరం తక్కువగా ఉండవచ్చు. కానీ భారతదేశంలో వాస్తవ పరిస్థితి అలా లేదు. 2003 నుంచి రెండు దశాబ్దాలకు పైగా కాలంలో ఆహార ధరలు ఏకంగా 58 శాతం పెరిగాయి. అంటే ఆహార ధరలు పెరగడం తాత్కాలిక సమస్య మాత్రమే కాదు. దీర్ఘకాలంగా కొనసాగుతున్న సమస్య.
పరిష్కారం:
ఆహార ధరలను నియంత్రించాలంటే ఉత్పత్తి స్థాయిలో మార్పులు తీసుకురావాలి. ముఖ్యంగా వ్యవసాయ ఉత్పాదకతను పెంచాలి. రైతులకు స్థిరంగా నీరు అందేలా చూడాలి.
- విద్యుత్ సరఫరా – వ్యవసాయానికి అవసరమైన విద్యుత్ సమయానికి, నమ్మకంగా అందించాలి.
- ఎరువుల లభ్యత – రైతులకు అవసరమైన ఎరువులు సరైన సమయంలో అందుబాటులో ఉండాలి.
- వ్యవసాయ ఉత్పాదకత – తక్కువ ఖర్చుతో ఎక్కువ పంట దిగుబడి సాధించే విధానాలను ప్రోత్సహించాలి.
- రాష్ట్ర ప్రభుత్వాల పాత్ర – సాగునీరు, విద్యుత్, వ్యవసాయ సేవల వంటి అంశాల్లో రాష్ట్ర ప్రభుత్వాలు కీలక పాత్ర పోషించాలి.
ఉత్పత్తి పెరిగి, మార్కెట్లో ఆహార సరఫరా మెరుగుపడితే ధరలను స్థిరంగా ఉంచేందుకు అవకాశం పెరుగుతుంది. అందువల్ల ఆహార ధరల సమస్యకు పరిష్కారం కేవలం ద్రవ్య విధానంలో కాకుండా వ్యవసాయ ఉత్పత్తి, సరఫరా వ్యవస్థల్లోనూ ఉండాలి.
1991 ఆర్థిక సంస్కరణలు భారత ఆర్థిక విధానాన్ని ఎలా మార్చాయి?
భారతదేశం ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కోవడంలో బలహీనంగా ఉండటానికి మరో కారణం పాశ్చాత్య దేశాల ఆర్థిక నమూనాలను వాటితో భారతదేశానికి ఉన్న అనుకూలతను సరిగా పరిశీలించకుండా స్వీకరించడం. 1991లో ప్రారంభమైన ఆర్థిక సంస్కరణలు ఈ మార్పులో కీలక మలుపు. ఆ సంస్కరణల అమలులో అభివృద్ధి చెందుతున్న దేశాలు ఆర్థిక వ్యవస్థను ఎలా నిర్వహించాలనే విషయంలో వాషింగ్టన్ కేంద్రంగా పనిచేసే అంతర్జాతీయ ఆర్థిక సంస్థలు సూచించిన విధానాలపై ఎక్కువగా ఆధార పడ్డాయి.
భారతదేశాన్ని పాశ్చాత్య దేశాల ఆర్థిక నమూనాల మాదిరిగా మార్చాలనే లక్ష్యం పాలక వర్గాలు, వారికి సలహాలు ఇచ్చే ఆర్థికవేత్తలపై బలంగా ప్రభావం చూపింది. అయితే, పాశ్చాత్య దేశాలకు అనుకూలంగా ఉన్న ప్రతి విధానమూ భారతదేశానికి సరిపోతుందని అనుకోవడం తప్పు.
“నెహ్రూ కాలంలోని ఆర్థిక స్వతంత్ర ఆలోచన”
1950లలో భారతదేశ విధాన నిర్ణేతలు తమ దేశ పరిస్థితులను బట్టి ఆర్థిక విధానాలను రూపొందించడానికి ప్రయత్నించారు. అప్పటి ప్రధానమంత్రి జవహర్లాల్ నెహ్రూ, భారత్ అమెరికా లేదా సోవియట్ యూనియన్ ఆర్థిక విధానాలను గుడ్డిగా అనుసరించదని, ఎందుకంటే భారతదేశ సమస్యలు భారతదేశానికి ప్రత్యేక మైనవని చెప్పిన విషయాన్ని ఇక్కడ గమనించాలి. ఆ కాలంలో భారతదేశం తన అవసరాలకు తగిన మార్గాన్ని ఎంచుకోవాలనే ఆలోచనకు ప్రాధాన్యం ఇచ్చింది. కానీ తరువాతి కాలంలో ఆ స్వతంత్ర ఆలోచన బలహీనపడింది.
“ఆర్బీఐ విధానాల్లో వచ్చిన మార్పులు”
1980ల వరకు భారతీయ రిజర్వ్ బ్యాంకు పాశ్చాత్య దేశాల నుంచి వచ్చిన ఆర్థిక సిద్ధాంతాలను కొంత స్వతంత్రంగా పరిశీలించేది. ముఖ్యంగా ఆహార ధరల ద్రవ్యోల్బణాన్ని ప్రత్యేకంగా పరిష్కరించాల్సిన అవసరం ఉన్నదని గుర్తించింది. కానీ 1980లలో ఆర్బీఐ ద్రవ్యోల్బణ నియంత్రణ విధానాలు ద్రవ్య పరిమాణంపై దృష్టి పెట్టే మానిటరిజం (Monetarism) వైపు మళ్లడం ప్రారంభించాయి.
“మానిటరిజం అంటే ఏమిటি?”
ఆర్థిక వ్యవస్థలో చలామణిలో ఉన్న డబ్బు పరిమాణాన్ని నియంత్రించడం ద్వారా ద్రవ్యోల్బణాన్ని అదుపు చేయవచ్చనే ఆలోచనకు మానిటరిజం అని పేరు. ఈ సిద్ధాంతాన్ని ఆర్థికవేత్త మిల్టన్ ఫ్రైడ్మన్ ప్రముఖంగా ప్రచారం చేశారు. ఆర్థిక వ్యవస్థలో ప్రభుత్వ జోక్యాన్ని వ్యతిరేకించడం ఫ్రైడ్మన్ ఆలోచనల్లో ముఖ్యమైన లక్ష్యం. మార్గరెట్ థాచర్ బ్రిటన్ ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు, అలాగే పాశ్చాత్య దేశాల కేంద్ర బ్యాంకులు కొంతకాలం ఈ విధానాన్ని అనుసరించాయి. అయితే తరువాత పాశ్చాత్య కేంద్ర బ్యాంకులు కూడా ఈ విధానం నుంచి క్రమంగా దూరమయ్యాయి. ముఖ్యంగా జర్మనీకి చెందిన బుండెస్ బ్యాంక్ దీనికి ఉదాహరణ.
1990లలో మరో మార్పు:
1990లలో ఆర్బీఐ కేవలం డబ్బు సరఫరాపైనే దృష్టి పెట్టకుండా, అనేక ఆర్థిక సూచికలను పరిగణనలోకి తీసుకునే బహుళ సూచికల విధానం (Multiple Indicators Approach) వైపు మారింది. ఈ విధానంలో ఆర్థిక వ్యవస్థను అర్థం చేసుకోవడానికి మరింత విస్తృతమైన అంశాలను పరిశీలించారు. అయితే, ఈ విధానంలోనూ నిరుద్యోగ సమస్యకు తగిన ప్రాధాన్యం ఇవ్వలేదు. ఆహార ద్రవ్యోల్బణాన్ని సమర్థంగా నియంత్రించే సామర్థ్యం కనిపించలేదు. అయినప్పటికీ, భారతదేశం తనదైన మార్గంలో ఆర్థిక విధానాలను రూపొందించడానికి ప్రయత్నం చేసింది.
‘జాతీయవాద’ ప్రభుత్వం ఉన్నప్పటికీ పాశ్చాత్య విధానాలనే ఎందుకు అనుసరించింది?
2016లో ఆర్బీఐ మళ్లీ విధానాన్ని మార్చి, ద్రవ్యోల్బణ లక్ష్య నిర్దేశం (Inflation Targeting) పద్ధతిని స్వీకరించింది. ఈ విధానం పాశ్చాత్య దేశాల కేంద్ర బ్యాంకులు అనుసరిస్తున్న విధానానికి దగ్గరగా ఉంది. భారతీయ సంస్కృతి, జాతీయ ప్రయోజనాలు, స్వతంత్ర నిర్ణయాలకు ప్రాధాన్యం ఇస్తామని చెప్పిన ప్రభుత్వం అధికారంలో ఉన్న సమయంలోనే, భారతదేశ ప్రత్యేక పరిస్థితులకు సరిపోతుందా లేదా అనే ప్రశ్నను పక్కనపెట్టి పాశ్చాత్య కేంద్ర బ్యాంకుల విధానాన్ని ఎందుకు స్వీకరించింది? ఈ నిర్ణయం వల్ల భారతదేశం ఆహార ద్రవ్యోల్బణాన్ని ఎదుర్కొనే విషయంలో బలహీనంగా మిగిలింది. ఇటీవలి నెలల్లో ఆహార ధరలు వేగంగా పెరగడం ఈ బలహీనతను స్పష్టంగా చూపిస్తోంది
ప్రధాన వాదనలు :
భారతదేశంలో సాధారణ ప్రజలపై ఆహార ధరల పెరుగుదల ప్రభావం చాలా ఎక్కువగా ఉంటుంది. ద్రవ్యోల్బణాన్ని నియంత్రించడానికి రెపో రేటును పెంచడం ఒక్కటే సరిపోదు. ఆహార ధరలు పెరగడానికి వ్యవసాయ సరఫరా, ఉత్పత్తి, డిమాండ్ వంటి అంశాలు కీలకం. సాగునీరు, విద్యుత్, ఎరువులు, వ్యవసాయ ఉత్పాదకత మెరుగుపడేలా ప్రభుత్వాలు చర్యలు తీసుకోవాలి. భారతదేశ పరిస్థితులకు సరిపోతాయో లేదో పరిశీలించకుండా పాశ్చాత్య ఆర్థిక విధానాలను అనుసరించడం వల్ల సమస్యలు రావచ్చు. భారతదేశానికి అవసరమైనది తన ఆర్థిక, వ్యవసాయ పరిస్థితులకు తగిన విధానాలను రూపొందించడం.
రచయిత: పులాప్రే బాలకృష్ణన్, ఎం. పరమేశ్వరన్తో కలిసి భారతదేశంలో ద్రవ్యోల్బణంపై కొన్ని సంవత్సరాలుగా పరిశోధనలు చేశారు.
అనువాదం: డి. వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
