రష్యాపై నియంత్రణ విషయంలో లోటు రాకుండా ఉండేందుకు వాషింగ్టన్ సమన్వయం చేయాలని ఎస్టోనియా మంత్రి అన్నారు.
యూరప్‌లో అమెరికా సైనిక దళాల తగ్గింపును నాటో మిత్రదేశాలతో మరింత సమన్వయంతో నిర్వహించాలని ఎస్టోనియా కోరారు.
అంతేకాకుండా, రష్యాపై నాటో నియంత్రణ బలహీనపడకుండా చూడాల్సిన అవసరం ఉందని పేర్కొన్నారు.
ఈ నేపథ్యంలో జరుగనున్న ఒక సమావేశంలో యూరోపియన్ దేశాలు అమెరికా విదేశాంగ మంత్రి మార్కో రూబియోను స్పష్టమైన ప్రణాళిక ఇవ్వాలని కోరనున్నాయి.
ఎస్టోనియా విదేశాంగ మంత్రి మార్గస్ త్సాహ్క్నా ఫైనాన్షియల్ టైమ్స్‌తో మాట్లాడుతూ- జర్మనీ, పోలాండ్లలో అమెరికా సైనిక నియామకాల తగ్గింపు, మార్పులపై వచ్చిన అనేక తాత్కాలిక ప్రకటనల కారణంగా యూరప్ తన రక్షణపై మరింత ఖర్చు చేయాల్సిన అవసరం ఏర్పడిందన్నారు.
అయితే “పథకాలు ఏమిటో మాకు ముందుగానే తెలియాలి” అని పేర్కొన్నారు.
రక్షణ పరిస్థితిపై సమీక్ష..
హెల్సింకిలో ప్రారంభమయ్యే నాటో విదేశాంగ మంత్రుల సమావేశంలో యూరోపియన్ దేశాలు రూబియో వద్ద నుంచి స్పష్టత కోరనున్నాయని దౌత్యవేత్తలు తెలిపారు.
ట్రంప్ పరిపాలన “రక్షణ పరిస్థితిపై సమీక్ష” పదేపదే వాయిదా పడటంతో నాటో దేశాలు అసహనం వ్యక్తం చేస్తున్నాయి. యూరప్‌లోని అమెరికా సైనిక శక్తుల కోత ఎంత ఉంటుందో, ఎప్పుడు అమలు చేస్తారో స్పష్టత లేకపోవడం వల్ల ఈ పరిస్థితి ఏర్పడిందని వారు అన్నారు.
ముఖ్యంగా జర్మనీ, పోలాండ్‌కు సంబంధించిన నిర్ణయాలు ఆవశ్యకతను ముందుకు తెచ్చాయని తెలిపారు.
కేటాయింపుల రద్దులు..
గత వారం పెంటగాన్ పోలాండ్‌కు తాత్కాలిక రోటేషన్లో పంపాల్సిన 4,000 మంది అమెరికా సైనికుల కేటాయింపును రద్దు చేసింది. రెండు వారాల ముందే వాషింగ్టన్ జర్మనీ నుంచి 5,000 మంది సైనికులను తగ్గిస్తామని ప్రకటించింది. అలాగే జర్మనీలో నేలమీద నుంచి ప్రయోగించే తోమహాక్ క్షిపణులతో కూడిన బెటాలియన్‌ను పంపే ప్రణాళికను కూడా రద్దు చేసినట్లు పెంటగాన్ అధికారి తెలిపారు.
ఉక్రెయిన్‌పై రష్యా పూర్తి స్థాయి దాడికి ముందు ఉన్న విధంగా యూరప్‌లోని అమెరికా సైనికుల సంఖ్యను తగ్గించనున్నట్టు మంగళవారం పెంటగాన్ చేసిన తెలిపింది.
యూరప్‌లోని బ్రిగేడ్ల సంఖ్యను నాలుగు నుంచి మూడుకు తగ్గించనున్నట్టు పేర్కొంది.
పెంటగాన్ ప్రతినిధి షాన్ పార్నెల్ మాట్లాడుతూ- వాయిదా వేసిన పోలాండ్‌కు సైనిక మోహరింపు తాత్కాలికమేనని, అమెరికా వ్యూహాత్మక అవసరాలు యూరప్ భద్రతకు మిత్ర దేశాల సహకారంవంటి అంశాలను పరిశీలించిన తర్వాత తుది నిర్ణయం తీసుకుంటామని చెప్పారు.
అమెరికా ఉపాధ్యక్షుడు జేడీ వాన్స్ మాట్లాడుతూ- ఆ 4,000 సైనికులను పోలాండ్‌కు పంపాలా వద్దా అనే విషయంపై ఇంకా నిర్ణయం తీసుకోలేదన్నారు.
“ఆ దళాలు యూరప్‌లోనే ఎక్కడైనా ఉండవచ్చు. లేదా వేరే ప్రాంతాలకు పంపించవచ్చు” అని తెలిపారు.
సైనిక మార్పులు నాటోలో సామర్థ్య లోటు..
రష్యా 2014లో క్రిమియాను ఆక్రమించిన తర్వాత, అలాగే 2022లో ఉక్రెయిన్‌పై పూర్తి స్థాయి దాడి ప్రారంభించిన తర్వాత అమెరికా యూరప్‌కు అదనపు దళాలను పంపింది.
దూరప్రాంతాలపై దాడి చేయగల దళాల రద్దు, ఇతర సైనిక మార్పులు నాటోలో సామర్థ్య లోటును కలిగించవచ్చని యూరోపియన్ అధికారులు, నిపుణులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
యూరోపియన్ సైన్యాల వద్ద 1,600 కిలోమీటర్ల పరిధి గల భూభాగ ఆధారిత క్షిపణులు లేవు. అయితే ఫ్రాన్స్, యూకే సముద్ర ఆధారిత ప్రయోగ క్షిపణులను కలిగి ఉన్నాయి.
త్సాహ్క్నా మాట్లాడుతూ “పోలాండ్- బాల్టిక్ దేశాల పట్ల అమెరికా కట్టుబాటు కొనసాగుతుందని మాకు ముందే హామీ ఇచ్చారు. ఇప్పుడు ప్రకటించిన మార్పులపై సైన్యాల మద్య జరిగే చర్చల ద్వారా స్పష్టత కోసం ఎదురుచూస్తున్నాం” అన్నారు.
“మాకు ఇప్పటివరకు ఎలాంటి వివరాలు అందలేదు.కానీ పోలాండ్ మా రక్షణ వలయంలో భాగమే” అని ఆయన చెప్పారు.
“ఇది ఏ ఒక్క సభ్య దేశానికి సంబంధించిన విషయం మాత్రమే కాదు. ఇది మొత్తం నాటో రక్షణ వ్యవస్థకు సంబంధించిన అంశం” అని పేర్కొన్నారు.
సైనిక కట్టుబాట్లపై సమన్వయం..
యూరోపియన్ అధికారులు ప్రస్తుతం నాటో సుప్రీం అలైడ్ కమాండర్ యూరప్ జనరల్ అలెక్సస్ గ్రింకెవిచ్పై ఆధారపడుతున్నారు.
అమెరికా యూరప్‌కు ఇస్తున్న సైనిక కట్టుబాట్లపై పెంటగాన్‌తో సమన్వయం చేయాలని ఆయనను కోరుతున్నారు.
అమెరికా తన ప్రణాళికలను వివిధ సమావేశాల్లో, ముఖ్యంగా జూలైలో జరిగే నాటో వార్షిక శిఖరాగ్ర సమావేశంలో వెల్లడించాలని నాటో దౌత్యవేత్తలు కోరుతున్నారు. అయితే అలా జరుగుతుందనే హామీ లేదు.
ఒక సీనియర్ నాటో దౌత్యవేత్త మాట్లాడుతూ, “సైనిక దళాల సంఖ్యలో తగ్గింపు పెద్ద సమస్య కాదు. అమెరికా యూరప్‌లో బలమైన ఉనికిని కొనసాగిస్తే, ఎదిరించేశక్తి కూడా బలంగానే ఉంటుంది” అన్నారు.
“సమస్య ఏమిటంటే ఇది చాలా అనూహ్యంగా జరుగుతోంది. ముఖ్యంగా జర్మనీ విషయంలో ఇది శిక్షలా కనిపిస్తోంది” అని మరో సీనియర్ దౌత్యవేత్త అన్నారు.
“యూరోపియన్లు అమెరికాకు చెప్పదలిచింది ఒక్కటే. దయచేసి ఆకస్మిక నిర్ణయాలు తీసుకోవద్దు. నాటో సామర్థ్యాలకు నష్టం కలిగించవద్దు” అని తెలియజేశారు.
స్పష్టమైన ప్రణాళిక..
నాటో దేశాలు దీర్ఘకాలంలో సంప్రదాయ రక్షణ సామర్థ్యాలను యూరోపియన్ సైన్యాలకు బదిలీ చేయడానికి సిద్ధంగా ఉన్నాయని తెలిపారు.
ప్రస్తుతం ఈ సామర్థ్యాలలో వైమానిక, క్షిపణి రక్షణ వ్యవస్థలు, దీర్ఘశ్రేణి క్షిపణులు, ఉపగ్రహాల ద్వారా నిఘా వంటి అంశాలు ఉన్నాయి.
అయితే ఏ అంశాలకు ప్రాధాన్యం ఇవ్వాలి, ఏ కాలక్రమంలో అమలు చేయాలి అన్నదానిపై స్పష్టమైన ప్రణాళిక అవసరమని చెప్పారు.
త్సాహ్క్నా మాట్లాడుతూ, “ఇదే మాకు అవసరం. యూరప్‌లో అమెరికా దళాలు రష్యాను నిలువరించే శక్తిగా ఉన్నాయి. కానీ ఎస్టోనియాలో మేము వాస్తవికంగా ఆలోచిస్తాం. ఎలాంటి ప్రమాదాన్నీ తేలికగా తీసుకోం” అన్నారు.
అమెరికా ఆయుధ నిల్వలు ఇరాన్ యుద్ధ సమయంలో తగ్గిపోవడం వల్ల ఆలస్యం అయిన HIMARS క్షిపణి వ్యవస్థల సరఫరాపై కూడా ఎస్టోనియా వాషింగ్టన్ నుంచి మరింత సమాచారం కోసం ఎదురుచూస్తున్నారు.
“త్వరలో స్పష్టత వస్తుందని ఆశిస్తున్నాం” అని త్సాహ్క్నా చెప్పారు. అవసరమైతే ప్రత్యామ్నాయ సరఫరాదారులను కూడా పరిశీలిస్తామని టాలిన్ తెలిపింది.
ఎస్టోనియా రక్షణ మంత్రి హన్నో పెవ్కూర్ మాట్లాడుతూ, నాటో ప్రస్తుతం “పర్ఫెక్ట్ స్టోర్మ్” పరిస్థితిని ఎదుర్కొంటోందన్నారు.
యూకే రాజకీయ అస్థిరత, ఫ్రాన్స్ అధ్యక్ష ఎన్నికల్లో రైటిస్ట్ అభ్యర్థి విజయం సాధించే అవకాశాలు, అలాగే యూరప్‌లో అమెరికా సైనిక విధాన మార్పులు కలిసి ఈ పరిస్థితిని సృష్టిస్తున్నాయని తెలిపారు.
ఫైనాన్షియల్ టైమ్స్ యూరప్ కథనం ఆధారంగా ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
స్వేచ్ఛానువాదం: డి వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
