భారతదేశ స్వాతంత్ర్య ఉద్యమ చరిత్ర, కార్మికోద్యమ చరిత్ర, కమ్యూనిస్టు ఉద్యమం గురించి తెలుసుకోతగిన ముఖ్య నాయకులలో శ్రీపాద అమృత్ డాంగే ఒకరు.
బ్రిటిష్ వలస పాలన కాలంలో భారత కార్మిక వర్గాన్ని సంఘటితం చేయడానికి, పెట్టుబడిదారీ దోపిడీకి వ్యతిరేకంగా పోరాడే చైతన్యాన్ని పెంపొందించడానికి, మార్క్సిస్టు భావజాలాన్ని పరిచయం చేయడానికి కృషి చేసిన ప్రముఖ నాయకులలో డాంగే ఒకరు. అక్టోబర్ 10 వారి జయంతి.
డాంగే జీవితం కేవలం ఒక రాజకీయ నాయకుడి జీవిత చరిత్ర మాత్రమే కాదు. భారతదేశంలో పారిశ్రామిక కార్మికవర్గం ఎలా ఎదిగింది?
కార్మిక సంఘాలు ఎందుకు ఏర్పడ్డాయి? ఎనిమిది గంటల పని దినం, మెరుగైన వేతనాలు, ఉద్యోగ భద్రత, సామాజిక న్యాయం వంటి హక్కుల కోసం కార్మికులు ఎలా పోరాడారు?
స్వాతంత్ర్య ఉద్యమం, సోషలిస్టు ఆలోచనలు, కమ్యూనిస్టు ఉద్యమాలు పరస్పరం ఎలా ప్రభావితం చేసుకున్నాయి? అనే ప్రశ్నలకు డాంగే జీవితం కూడా ఒక ముఖ్యమైన చారిత్రక ఆధారం.
1899 అక్టోబర్ 10న జన్మించిన డాంగే, 1991 మే 22న మరణించారు. దాదాపు తొమ్మిది దశాబ్దాల ఆయన జీవితకాలంలో భారతదేశం బ్రిటిష్ పాలన నుంచి స్వాతంత్ర్యం సాధించడం, రాజ్యాంగ ప్రజాస్వామ్యాన్ని స్థాపించడం, పారిశ్రామికీకరణ, కార్మిక సంఘాల విస్తరణ, అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు వంటి అనేక కీలక పరిణామాలు చోటుచేసుకున్నాయి.
భారత కమ్యూనిస్టు పార్టీ తొలి తరం నాయకుల్లో ప్రముఖుడైన డాంగే, ముఖ్యంగా బొంబాయి వస్త్ర పరిశ్రమ కార్మికులను సంఘటితం చేయడంలో విశేష పాత్ర పోషించారు.
బాల్యం, విద్యాభ్యాసం, సామాజిక పరిస్థితులు
శ్రీపాద అమృత్ డాంగే 1899 అక్టోబర్ 10న అప్పటి బొంబాయి ప్రెసిడెన్సీ పరిధి ప్రాంతంలో జన్మించారు. ఆయన పెరిగిన కాలం భారతదేశంలో బ్రిటిష్ వలస పాలన కొనసాగుతున్న కాలం.
మరో వైపు జాతీయోద్యమం విస్తరిస్తూ, స్వదేశీ ఉద్యమం, సామాజిక సంస్కరణ ఉద్యమాలు, కార్మిక సంఘాల ప్రారంభ ప్రయత్నాలు బలపడుతున్నాయి. ఆ కాలంలో భారతదేశంలోని పారిశ్రామిక కేంద్రాల్లో బొంబాయి ఒక ప్రముఖ నగరం.
పత్తి, వస్త్ర మిల్లులు పెద్ద సంఖ్యలో ఉండేవి. గ్రామీణ ప్రాంతాల నుంచి ఉపాధి కోసం వచ్చిన వేలాది మంది కార్మికులు ఈ మిల్లులలో పనిచేసేవారు.
తక్కువ వేతనాలు, ఎక్కువ పని గంటలు, ప్రమాదకరమైన పని పరిస్థితులు, సరైన నివాస సదుపాయాలు లేకపోవడం వంటి సమస్యలతో కార్మికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.
ఈ పరిస్థితులు డాంగే వంటి యువకుల్లో సామాజిక అసమానతలపై ప్రశ్నలు రేకెత్తించాయి. భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యం రావడం మాత్రమే సరిపోతుందా?
ఆర్థికంగా బలహీనంగా ఉన్న కార్మికులు, రైతులు, పేద ప్రజలకు కూడా స్వేచ్ఛ, గౌరవం, సమాన అవకాశాలు లభించాలా? అనే ప్రశ్నలు ఆయన రాజకీయ ఆలోచనలకు పునాది వేశాయి.
జాతీయోద్యమ ప్రభావం – మార్క్సిజం వైపు ప్రయాణం
డాంగే రాజకీయ చైతన్యంపై భారత స్వాతంత్య్రోద్యమం, ముఖ్యంగా బాలగంగాధర తిలక్ వంటి జాతీయవాద నాయకుల ప్రభావం కనిపిస్తుంది.
బ్రిటిష్ పాలన నుంచి దేశాన్ని విముక్తి చేయాలనే లక్ష్యంతో పాటు, సమాజంలోని ఆర్థిక అసమానతలను తొలగించాల్సిన అవసరాన్ని కూడా ఆయన గుర్తించారు.
1917లో రష్యాలో జరిగిన విప్లవం ప్రపంచ రాజకీయ చరిత్రను ప్రభావితం చేసింది. కార్మికులు, రైతుల పేరుతో అధికారంలోకి వచ్చిన విప్లవ ప్రభుత్వం, సామాజిక ఉత్పత్తి సాధనాలపై యాజమాన్యం, వర్గ సంబంధాలు, ఆర్థిక సమానత్వం వంటి అంశాలపై అంతర్జాతీయ చర్చకు దారితీసింది.
ఈ విప్లవం భారతదేశ యువకులు, సోషలిస్టులు, కార్మిక నాయకులను కూడా ప్రభావితం చేసింది. డాంగే మార్క్సిస్టు భావజాలం వైపు ఆకర్షితులై, భారతదేశంలో స్వాతంత్ర్య పోరాటాన్ని కార్మికవర్గ సమస్యలతో కలిపి చూడాల్సిన అవసరాన్ని నొక్కి చెప్పారు.
1921లో ఆయన రచించిన గాంధీ వర్సెస్ లెనిన్ అనే గ్రంథం ఈ ఆలోచనా ప్రయాణంలో ముఖ్యమైన రచన. మహాత్మా గాంధీ రాజకీయ పద్ధతులు, లెనిన్ విప్లవ సిద్ధాంతాల మధ్య ఉన్న తేడాలను చర్చిస్తూ, భారత స్వాతంత్ర్య ఉద్యమానికి సంబంధించిన వ్యూహాత్మక అంశాలను ఆయన ప్రస్తావించారు.
ఈ రచన ద్వారా డాంగే అప్పటి రాజకీయ చర్చల్లో గుర్తింపు పొందారు. భారత జాతీయోద్యమం, వర్గపోరాటం, సామాజిక మార్పు మధ్య సంబంధం ఏమిటన్నది ఆయన ఆలోచనల్లో ప్రధానమైన అంశంగా మారింది.
ది సోషలిస్ట్ – కమ్యూనిస్టు భావజాల ప్రచారానికి తొలి వేదిక
1922లో డాంగే “ది సోషలిస్ట్” అనే పత్రికను ప్రారంభించడం భారత కమ్యూనిస్టు ఉద్యమ చరిత్రలో ముఖ్యమైన పరిణామం.
కార్మికవర్గ సమస్యలను, మార్క్సిస్టు సిద్ధాంతాలను, సామాజిక అసమానతలను, వలస పాలన స్వభావాన్ని ప్రజల ముందుకు తీసుకురావడంలో ఈ పత్రిక మంచి పాత్ర పోషించింది. ఆ కాలంలో కమ్యూనిస్టు భావజాలాన్ని ప్రచారం చేయడం అంత సులభమైన పని కాదు.
బ్రిటిష్ ప్రభుత్వం విప్లవ భావజాలం వ్యాప్తిని అడుగడుగునా అడ్డుకునే ప్రయత్నం చేసింది. కార్మికులు సమ్మెలు చేయడం, తమ హక్కుల కోసం సంఘటితం కావడం, వలస పాలనను ప్రశ్నించడం నేరంగా బ్రిటిష్ ప్రభుత్వం భావించింది.
పత్రికలు, కరపత్రాలు, బహిరంగ సభలు, కార్మిక సమావేశాలు అప్పట్లో రాజకీయ చైతన్యాన్ని వ్యాప్తి చేయడానికి ప్రధాన సాధనాలుగా ఉండేవి.
డాంగే రచనలు, ప్రచురణ కార్యకలాపాలు యువతలో మార్క్సిస్టు ఆలోచనలపై ఆసక్తి పెరగడానికి తోడ్పడ్డాయి.
మార్క్సిజం ఆయన దృష్టిలో కేవలం ఒక సిద్ధాంత గ్రంథం కాదు. ఉత్పత్తి చేసే కార్మికుడికి తన శ్రమ ఫలితంలో తగిన వాటా ఎందుకు లభించడం లేదు?
ఒక వైపు అపారమైన సంపద ఎందుకు కేంద్రీకృతం అవుతున్నది? మరో వైపు కార్మిక కుటుంబాలు ఎందుకు పేదరికంలో జీవిస్తున్నాయి? అనే సామాజిక ప్రశ్నలకు సమాధానాలు వెతికే ప్రయత్నం డాంగే చేశారు.
భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణంలో డాంగే పాత్ర
భారతదేశంలో కమ్యూనిస్టు ఉద్యమం ఒక్క రోజులో ఏర్పడలేదు. వివిధ ప్రాంతాల్లో మార్క్సిస్టు భావజాలంతో ప్రభావితమైన వ్యక్తులు, చిన్న బృందాలు పనిచేశాయి.
బొంబాయి, కలకత్తా, మద్రాసు, కాన్పూర్ వంటి పారిశ్రామిక, రాజకీయ కేంద్రాల్లో కమ్యూనిస్టు ఆలోచనలతో కూడిన గ్రూపులు ఏర్పడి పని చేస్తున్నాయి.
1925 డిసెంబరులో కాన్పూర్లో జరిగిన కమ్యూనిస్టు సమావేశం భారత కమ్యూనిస్టు పార్టీ నిర్మాణ చరిత్రలో ఒక ముఖ్యమైన మైలురాయి. ఆ సమావేశానికి ఎం సింగారవేలు అధ్యక్షత వహించగా, డాంగే, ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ తదితరులు కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో పాల్గొన్నారు.
మార్క్సిస్టు సిద్ధాంతాన్ని ప్రచారం చేయడంతో ఆగకుండా, దానిని కార్మిక సంఘాల నిర్మాణంతో అనుసంధానించడానికి డాంగే ప్రయత్నించారు.
కార్మికుల ఆర్థిక డిమాండ్లను రాజకీయ హక్కులతో ముడిపెట్టి కార్మికులకు వివరించేవాడు. వేతనాల పెంపు, పని గంటల తగ్గింపు, ఉద్యోగ భద్రత, కార్మికుల సంఘటిత హక్కులు వంటి సమస్యలు కేవలం ఒక మిల్లు లేదా ఒక పరిశ్రమకు సంబంధించిన సమస్యలు కావని, అవి విస్తృతమైన సామాజిక, ఆర్థిక వ్యవస్థతో సంబంధం కలిగి ఉన్నాయని ఆయన భావించారు.
భారత కమ్యూనిస్టు పార్టీకి కేంద్ర నాయకత్వం, స్థిరమైన అఖిల భారత నిర్మాణం ఏర్పడటం అనేక దశల్లో జరిగింది.
డాంగే కూడా భారత కమ్యూనిస్టు ఉద్యమ నిర్మాణంలో కీలక పాత్ర పోషించిన వ్యవస్థాపక తరం నాయకుల్లో ఒకరు.
కార్మికోద్యమంలో ప్రవేశం — మిల్లు కార్మికుల జీవితాలతో అనుబంధం
డాంగే రాజకీయ జీవితంలో ఆయన కార్మికోద్యమంలో పోషించిన పాత్ర అత్యంత ప్రాధాన్యం కలిగిన అంశం. ఇరవయ్యో శతాబ్దం ప్రారంభంలో బొంబాయి పత్తి, వస్త్ర పరిశ్రమ భారతదేశంలోని అతిపెద్ద పారిశ్రామిక రంగాల్లో ఒకటి.
మిల్లుల్లో వేలాది మంది కార్మికులు పనిచేసేవారు. పని గంటలు ఎక్కువగా ఉండేవి, వేతనాలు అతి తక్కువగా ఉండేవి.
నివాసాలు ఇరుకుగా ఉండేవి. కార్మిక కుటుంబాలకు విద్య, వైద్యం, పారిశుద్ధ్యం వంటి సదుపాయాలు నామమాత్రంగా ఉండేవి. కార్మికులు తమ సమస్యలను యాజమాన్యం ముందు పెట్టాలంటే వ్యక్తిగతంగా సాధ్యం కాదు. ఇది కార్మిక సంఘాల ఏర్పాటుకు దారితీసింది.
1920లో అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్(ఏఐటీయూసీ) ఏర్పడింది. భారత కార్మికుల ప్రయోజనాలను జాతీయ స్థాయిలో ప్రాతినిధ్యం వహించే సంస్థగా ఇది అభివృద్ధి చెందింది. డాంగే ఈ సంస్థ కార్యకలాపాల్లో ప్రముఖ నాయకుడిగా ఎదిగారు.
1928 బొంబాయి వస్త్ర కార్మికుల సమ్మె
1928లో బొంబాయి వస్త్ర మిల్లుల కార్మికుల సమ్మె పెద్ద ఎత్తున జరిగింది. వేతనాలు, పని పరిస్థితులు, యాజమాన్య విధానాలు, కార్మిక సంఘాల గుర్తింపు వంటి అంశాలపై కార్మికుల్లో పెరిగిన అసంతృప్తి సమ్మెకు దారి తీసింది.
ఈ సమ్మెలో డాంగే కీలక పాత్ర పోషించారు. “గిర్ని కామ్గార్” అనే వస్త్ర కార్మికుల సంఘం ద్వారా కార్మికులను సంఘటితం చేయడంలో ఆయన ముందున్నారు.
సమ్మె కారణంగా కార్మికుల సమస్యలు జాతీయ రాజకీయ చర్చల్లోకి వచ్చాయి.
కార్మిక సంఘం కేవలం సభ్యత్వ రుసుములు వసూలు చేసే సంస్థ కాదు. కార్మికులకు వారి హక్కులపై అవగాహన కల్పించడం, సమిష్టి చర్చల ద్వారా పరిష్కారాలు సాధించడం, యాజమాన్య నిర్ణయాలను ప్రశ్నించడం, చట్టబద్ధమైన పోరాటాలకు నాయకత్వం వహించడం దాని ప్రాథమిక బాధ్యతలు.
అయితే ప్రతి సమ్మె తక్షణమే అన్ని డిమాండ్లను సాధించదు. సమ్మెల వల్ల కార్మిక కుటుంబాలకు ఆర్థిక ఇబ్బందులు ఎదురవుతాయి.
యాజమాన్యాల నుంచి ప్రతిఘటన ఎదురవుతుంది. ప్రభుత్వ జోక్యం, పోలీసు చర్యలు ఉంటాయి. అయినప్పటికీ, సంఘటిత పోరాటాల ద్వారా కార్మికుల సమస్యలు సమాజం దృష్టికి వస్తాయి.
యాజమాన్యాలు, ప్రభుత్వంపై ఒత్తిడి పెరుగుతుంది. డాంగే రాజకీయ జీవితంలో కార్మిక సంఘాల నిర్మాణం, సమ్మెల నిర్వహణ, కార్మికుల రాజకీయ చైతన్యం అంశాలు ప్రధానంగా కనిపిస్తాయి.
కాన్పూర్ కుట్ర కేసు – బ్రిటిష్ ప్రభుత్వ నిర్బంధం
భారతదేశంలో కమ్యూనిస్టు భావజాలం వ్యాప్తి చెందుతున్న కొద్దీ బ్రిటిష్ ప్రభుత్వం దానిని అణచివేయడానికి ప్రయత్నించింది.
కమ్యూనిస్టు నాయకులపై కుట్ర కేసులు నమోదు చేసింది. ప్రచురణలపై నిఘా పెట్టి, రాజకీయ కార్యకలాపాలను అణచివేసే చర్యలు చేపట్టింది.
1924 కాన్పూర్ కుట్ర కేసులో డాంగే సహా పలువురు కమ్యూనిస్టు నాయకులను బ్రిటిష్ ప్రభుత్వం నిందితులుగా ఇరికించింది.
బ్రిటిష్ పాలనను కూలదోయడానికి విప్లవ కుట్ర పన్నారని ప్రభుత్వం ఆరోపించింది. ఈ కేసులోని రెండు అంశాలను వేరుగా చూడాలి. ఒకటి బ్రిటిష్ ప్రభుత్వం మోపిన నేరారోపణలు, రెండు కమ్యూనిస్టు ఉద్యమం వలస పాలనకు వ్యతిరేకంగా సాగించిన రాజకీయ ప్రచారం, కార్మిక సంఘాల నిర్మాణం.
వలస పాలనలో ప్రభుత్వాన్ని రాజకీయంగా వ్యతిరేకించడం, కార్మికులను సంఘటితం చేయడం, విప్లవ సిద్ధాంతాలను ప్రచారం చేయడాన్ని బ్రిటిష్ ప్రభుత్వం భద్రతా సమస్యగా పరిగణించింది.
ఈ కేసుల ద్వారా కమ్యూనిస్టు నాయకులను జైళ్లలో పెట్టి వారి రాజకీయ కార్యకలాపాలపై ప్రభుత్వ నియంత్రణను పెంచింది.
మీరట్ కుట్ర కేసు (1929–1933) – కార్మిక ఉద్యమం అణచివేత
డాంగే జీవితంలో అత్యంత కీలకమైన సంఘటనల్లో మీరట్ కుట్ర కేసు ఒకటి. 1929 మార్చిలో డాంగేతో సహా అనేక మంది కమ్యూనిస్టు నాయకులు, కార్మిక సంఘ కార్యకర్తలను బ్రిటిష్ ప్రభుత్వం అరెస్టు చేసింది.
వారిపై బ్రిటిష్ భారత ప్రభుత్వ సార్వభౌమాధికారాన్ని దెబ్బతీయడానికి కుట్ర పన్నారనే ఆరోపణలు మోపింది.
ఈ కేసులో ముజఫర్ అహ్మద్, షౌకత్ ఉస్మానీ తదితర నాయకులు కూడా నిందితులుగా ఉన్నారు. ఈ విచారణ సుదీర్ఘకాలం కొనసాగింది.
1933లో కోర్టు శిక్షలు విధించింది. డాంగేకు మొదట పన్నెండేళ్ల శిక్ష విధించగా, అప్పీలులో దాన్ని తగ్గించారు. కేసులోని ఇతరులకు కూడా శిక్షలు విధించబడ్డాయి.
మీరట్ కేసు కేవలం నాయకుల అరెస్టుతో ముగియలేదు. కార్మికోద్యమం, కమ్యూనిస్టు రాజకీయాలు, వలస పాలన మధ్య ఉన్న ఘర్షణను అది దేశవ్యాప్త చర్చగా మార్చింది.
విచారణ సమయంలో నిందితులు తమ రాజకీయ సిద్ధాంతాలను, కార్మికుల హక్కుల అవసరాన్ని వివరించడానికి కోర్టును కూడా వేదికగా ఉపయోగించుకున్నారు.
కమ్యూనిస్టు కార్యకలాపాలను అణచివేయాలనే ఉద్దేశంతో కేసు విచారణ ప్రారంభమైనప్పటికీ, దాని ద్వారా కమ్యూనిస్టు ఉద్యమం ప్రజల దృష్టిని ఆకర్షించింది.
డాంగే జీవితంలో జైలు శిక్షలు వ్యక్తిగత స్వేచ్ఛను హరించి, కుటుంబ జీవితానికి నష్టం కలిగించాయి. రాజకీయ కార్యకలాపాలకు ఆటంకం కలిగించాయి. అయినప్పటికీ, ఆయన భారత కార్మికోద్యమంలో తన స్థానాన్ని కొనసాగించారు.
శిక్ష అనుభవించిన నాయకుల జీవితాలను అర్థం చేసుకోవడం అంటే వారు ఎదుర్కొన్న ఇబ్బందులు, వారి త్యాగాలను గురించి తెలుసుకోవడమే. వారిపై మోపిన ఆరోపణలు, వారి రాజకీయ వ్యూహాలు, వారి ఆలోచనల ప్రభావాలను చారిత్రక ఆధారాలతో పరిశీలించడం కూడా అంతే అవసరం.
స్వాతంత్ర్య ఉద్యమంలో డాంగే పాత్ర
డాంగేను కేవలం కమ్యూనిస్టు నాయకుడిగా మాత్రమే చూడకూడదు. బ్రిటిష్ వలస పాలనకు వ్యతిరేకంగా సాగిన భారత జాతీయోద్యమంలో ఆయన పాల్గొన్నారు.
ప్రారంభంలో లోకమాన్య తిలక్ ప్రభావం, ఆ తరువాత గాంధీజీ ప్రారంభించిన సహాయ నిరాకరణ ఉద్యమం ఆయన రాజకీయ ప్రయాణాన్ని ప్రభావితం చేశాయి.
కాలక్రమంలో మార్క్సిజం వైపు మొగ్గు చూపినప్పటికీ, భారతదేశానికి స్వాతంత్ర్యం సాధించాలనే లక్ష్యాన్ని కార్మికవర్గ ప్రయోజనాలతో మేళవించి చూడాలనే అభిప్రాయాన్ని ఆయన వ్యక్తం చేశారు.
కమ్యూనిస్టులందరూ జాతీయోద్యమాన్ని ఒకే విధంగా అర్థం చేసుకోలేదు. వలస పాలనకు వ్యతిరేకంగా జాతీయవాద శక్తులతో కలిసి పనిచేయాలా? కార్మికవర్గ స్వతంత్ర రాజకీయ శక్తిని నిర్మించాలా? బూర్జువా నాయకత్వంలోని జాతీయోద్యమంతో ఎలాంటి సంబంధం ఉండాలి? వంటి ప్రశ్నలపై కమ్యూనిస్టు నాయకుల మధ్య చర్చలు జరిగాయి.
డాంగే భారతదేశంలోని పరిస్థితులకు అనుగుణంగా కమ్యూనిస్టు ఉద్యమం అభివృద్ధి చెందాలని భావించిన నాయకుల్లో ఒకరు.
విదేశీ నమూనాలను యథాతథంగా అనుసరించడం కంటే భారత దేశ చరిత్ర, సంస్కృతి, సామాజిక పరిస్థితులను అర్థం చేసుకోవడం అవసరమని ఆయన భావించారు.
1946 ఫిబ్రవరిలో బొంబాయిలో ప్రారంభమైన రాయల్ ఇండియన్ నేవీ తిరుగుబాటు బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా జరిగిన ముఖ్యమైన సైనిక తిరుగుబాటు.
నావికులపై వివక్ష, నాసిరకం ఆహారం, తక్కువ వేతనాలు, బ్రిటిష్ అధికారుల దురుసు ప్రవర్తన వంటి అంశాలు దీనికి ప్రధాన కారణాలు.
కమ్యూనిస్టు నాయకుడు శ్రీపాద అమృత్ డాంగే, బొంబాయిలోని కార్మికోద్యమ నాయకుల్లో ఒకరిగా, నావికా తిరుగుబాటుకు సంఘీభావంగా కార్మికులను సమీకరించారు.
స్వాతంత్ర్యం – కార్మికోద్యమం – పార్లమెంటరీ రాజకీయాలు
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత డాంగే రాజకీయ జీవితం కొత్త దశలోకి ప్రవేశించింది. వలస పాలనకు వ్యతిరేకంగా పోరాడిన కమ్యూనిస్టు నాయకులు, ఇప్పుడు స్వతంత్ర భారతదేశంలో కార్మికుల హక్కులు, ఆర్థిక విధానాలు, పారిశ్రామిక అభివృద్ధి, సామాజిక సమానత్వం వంటి అంశాలపై తమ రాజకీయ కార్యక్రమాలను కొనసాగించారు.
డాంగే అఖిల భారత ట్రేడ్ యూనియన్ కాంగ్రెస్లో ప్రముఖ నాయకుడిగా పనిచేశారు. కార్మికుల సమస్యలను జాతీయ స్థాయిలో ప్రస్తావించడంలో, పారిశ్రామిక కార్మికుల సంఘటిత శక్తిని అభివృద్ధి చేయడంలో ఆయన దీర్ఘకాలం కృషి చేశారు.
అంతర్జాతీయ కార్మిక సంఘాల వ్యవహారాల్లో పాల్గొన్నారు. ప్రపంచ ట్రేడ్ యూనియన్ సమాఖ్యలో ఉపాధ్యక్షుడిగా, కార్యనిర్వాహక నాయకత్వంలో సభ్యుడిగా బాధ్యతలు నిర్వహించారు.
స్వాతంత్ర్యం వచ్చినంత మాత్రాన కార్మికుల సమస్యలన్నీ పరిష్కారం కావని అనుభవం రుజువు చేసింది. స్వతంత్ర దేశంలో కూడా కార్మికులు తమ వేతనాలు, పని పరిస్థితులు, సామాజిక భద్రత, జీవన ప్రమాణాల కోసం సంఘటితంగా పనిచేయాల్సిన అవసరం ఉందని తేలింది.
ప్రధానంగా వేతనాలు, పెరుగుతున్న జీవన వ్యయానికి అనుగుణంగా వేతనాలు ఉండాలి. కార్మికుల శారీరక, మానసిక ఆరోగ్యాన్ని కాపాడే విధంగా పని గంటలు నిర్ణయించాలి.
అక్రమ తొలగింపులు, కాంట్రాక్టు విధానాలు, అనిశ్చిత ఉపాధి వంటి సమస్యల నుండి ఉద్యోగ భద్రత అవసరం. పెన్షన్, వైద్యం, ప్రమాద పరిహారం, కుటుంబ సంక్షేమం వంటి సామాజిక భద్రత అంశాలు కార్మికుల జీవనంలో కీలకం.
కార్మిక సంఘాలను ఏర్పాటు చేసుకోవడం, సమిష్టి చర్చలు జరపడం, చట్టబద్ధంగా తమ డిమాండ్లను పరిష్కరించుకునే హక్కులు అవసరం. ఈ సమస్యలు డాంగే కాలానికే పరిమితమైనవి కావు.
పారిశ్రామిక రంగంలోనూ, సేవారంగంలోనూ, అసంఘటిత రంగంలోనూ నేటికీ వివిధ రూపాల్లో ఈ సమస్యలు కార్మికులను వేధిస్తున్నాయి.
పార్లమెంటులో డాంగే
కార్మిక సంఘాల కార్యకలాపాలతో పాటు డాంగే పార్లమెంటరీ రాజకీయాల్లో కూడా పాల్గొన్నారు. 1957లో బొంబాయి దక్షిణ నియోజకవర్గం నుంచి లోక్సభకు ఎన్నికయ్యారు.
పార్లమెంటు ఒక వైపు చట్టాల రూపకల్పనకు, మరో వైపు ప్రజల సమస్యలను అధికారికంగా ప్రస్తావించడానికి వేదిక. కార్మికవర్గానికి సంబంధించిన సమస్యలను రాజకీయ చర్చల్లోకి తీసుకురావడంలో కార్మిక నాయకులు పార్లమెంటరీ వ్యవస్థను కూడా ఉపయోగించుకున్నారు.
డాంగే రాజకీయ జీవితంలో కార్మిక సంఘాల బయట ఎన్నికల రాజకీయాలు, పార్లమెంటరీ చర్చలు, జాతీయ ఆర్థిక విధానాలపై అభిప్రాయాలు వ్యక్తం చేయడం కూడా భాగంగా ఉన్నాయి. అయితే పార్లమెంటరీ మార్గం, సమ్మెలు, ప్రజా ఉద్యమాలు ఈ మూడు పద్ధతుల మధ్య సమన్వయం ఎలా ఉండాలి అన్న ప్రశ్న కమ్యూనిస్టు ఉద్యమంలో ఎప్పుడూ చర్చనీయాంశంగానే ఉంది.
భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విభేదాలు
భారత కమ్యూనిస్టు ఉద్యమం చరిత్రలో డాంగే పాత్రను తెలుసుకునేటప్పుడు, పార్టీ అంతర్గత విభేదాలను కూడా అర్థం చేసుకోవాలి. అంతర్జాతీయ కమ్యూనిస్టు ఉద్యమంలో వచ్చిన విభేదాలు భారత కమ్యూనిస్టు పార్టీపైనా ప్రభావం చూపాయి.
భారతదేశంలో కాంగ్రెస్ ప్రభుత్వంతో సంబంధాలు, జాతీయ ప్రజాస్వామ్య వ్యవస్థ పట్ల వైఖరి, వర్గపోరాట వ్యూహాలు వంటి అంశాలపై పార్టీ నాయకుల మధ్య భిన్నాభిప్రాయాలు ఏర్పడ్డాయి. 1964లో కమ్యూనిస్టు పార్టీ చీలి సీపీఐ, సీపీఐ (ఎం) వేర్వేరు సంస్థలుగా పని చేయడం మొదలైంది.
డాంగే సీపీఐలో కొనసాగారు. అయితే తరువాతి సంవత్సరాల్లో ఆయన రాజకీయ వైఖరి, ఇతర పార్టీలతో సహకారం, కాంగ్రెస్తో సంబంధాలపై పార్టీలో తీవ్ర చర్చలు జరిగాయి.
1981లో సీపీఐ నుంచి ఆయనను బహిష్కరించారు. అనంతరం ఆయన సీపీఐ నుంచి విడిపోయిన వర్గాలతో ఏర్పడిన రాజకీయ గ్రూపులలో పనిచేశారు. తరువాత యునైటెడ్ కమ్యూనిస్టు పార్టీ ఆఫ్ ఇండియా ఏర్పాటుతో భాగమైనారు.
ఒక ఉద్యమ నాయకుడి జీవితాన్ని తెలుసుకోవడం అంటే ఆయన చేసిన సేవలను మాత్రమే ప్రశంసించడం కాదు. ఆయన వ్యూహాల పరిమితులు, విభేదాలకు కారణాలు, రాజకీయ నిర్ణయాల పరిణామాలను కూడా అధ్యయనం చేయాలి.
సాహిత్యం, చరిత్ర, సిద్ధాంత పరమైన కృషి
డాంగే కార్మిక సంఘాల నాయకుడిగా మాత్రమే కాకుండా రచయితగా, రాజకీయ సిద్ధాంత కర్తగా కూడా గుర్తింపు పొందారు. ఆయన రచనల్లో గాంధీ వర్సెస్ లెనిన్తో పాటు భారతదేశ చరిత్ర, బ్రిటిష్ ఎన్నికలు, కార్మిక విధానాలు, మార్క్సిస్టు విశ్లేషణకు సంబంధించిన రచనలు ఉన్నాయి.
1971లో ప్రచురితమైన ఇండియా: ఫ్రమ్ ప్రిమిటివ్ కమ్యూనిజం టు స్లేవరీ ఆయన చరిత్రపై మార్క్సిస్టు దృక్పథాన్ని ప్రతిబింబించే రచనల్లో ఒకటి.
భారతదేశ గతాన్ని అర్థం చేసుకోవడానికి కేవలం రాజుల పాలన, యుద్ధాలు, రాజకీయ అధికార మార్పులనే పరిశీలించడం సరిపోదని మార్క్సిస్టు చరిత్రకారులు భావించారు.
ఉత్పత్తి పద్ధతులు, భూమిపై యాజమాన్యం, శ్రమ విభజన, వర్గ సంబంధాలు, సంపద పంపిణీ వంటి అంశాలను కూడా అధ్యయనం చేయాలని వారు ప్రతిపాదించారు.
ఈ దృక్పథం భారతీయ చరిత్ర పరిశోధనలో ఒక ముఖ్యమైన మేధో సంప్రదాయంగా అభివృద్ధి చెందింది. అయితే చరిత్రలోని అన్ని పరిణామాలను ఒకే వర్గపోరాట నమూనాతో వివరించడం సరైనదా అనే ప్రశ్నపై చరిత్రకారుల మధ్య విభిన్న అభిప్రాయాలు ఉన్నాయి.
డాంగే రచనలను అధ్యయనం చేసేటప్పుడు ఆయన కాలంలోని రాజకీయ పరిస్థితులు, అందుబాటులో ఉన్న చారిత్రక సమాచారం, మార్క్సిస్టు సిద్ధాంతాల ప్రభావం వంటి అంశాలను దృష్టిలో ఉంచుకోవాలి.
డాంగే జీవితంలోని చివరి దశ
దాదాపు ఆరు దశాబ్దాలకు పైగా భారత రాజకీయ, కార్మికోద్యమ రంగాల్లో చురుకుగా ఉన్న డాంగే జీవితపు చివరి దశలో కమ్యూనిస్టు ఉద్యమంలో ఆయన ప్రభావం క్రమంగా తగ్గింది.
ఒకప్పుడు కార్మిక సంఘాల నిర్మాణంలో, కమ్యూనిస్టు పార్టీ అభివృద్ధిలో కీలక పాత్ర పోషించిన నాయకుడు, తరువాత పార్టీ నుంచి బహిష్కరణకు గురై, కొత్త రాజకీయ గ్రూపులతో పనిచేయడం ఆయన జీవితంలో గమనించదగిన పరిణామం.
1991 మే 22న ముంబైలో ఆయన మరణించారు. అప్పటికి ఆయన వయస్సు 91 సంవత్సరాలు. మహారాష్ట్ర ప్రభుత్వం ఆయనకు రాష్ట్ర లాంఛనాలతో అంత్యక్రియలు నిర్వహించింది. డాంగే మరణించిన సంవత్సరం భారతదేశ చరిత్రలో మరో కీలకమైన మలుపు కూడా.
1991లో దేశం ఆర్థిక సంక్షోభం నుండి బయట పడాలనే పేరుతో సరళీకృత ఆర్ధిక విధానాల దిశగా అడుగులు వేసింది.
కార్మికోద్యమ చరిత్రలో చెరగని ముద్ర
శ్రీపాద అమృత్ డాంగే జీవితం భారతదేశంలో కమ్యూనిస్టు భావజాలం ఎలా అభివృద్ధి చెందింది, కార్మిక సంఘాలు ఎలా బలపడ్డాయి, బ్రిటిష్ వలస పాలన రాజకీయ ఉద్యమాలను ఎలా అణచివేయడానికి ప్రయత్నించింది అనే అంశాలను అర్థం చేసుకోవడానికి ఒక ముఖ్యమైన పాఠ్యం. ఆయన రచనలు, కార్మిక సంఘాల నిర్మాణం, బొంబాయి వస్త్ర కార్మికుల సమ్మెల్లో నాయకత్వం, కాన్పూర్, మీరట్ కుట్ర కేసుల్లో ఎదుర్కొన్న నిర్బంధం, పార్లమెంటరీ రాజకీయాలు ఇవన్నీ ఆయన సుదీర్ఘ రాజకీయ జీవితంలోని ప్రధాన ఘట్టాలు.
అదే సమయంలో, కమ్యూనిస్టు ఉద్యమంలోని విభేదాలు, కాంగ్రెస్తో సంబంధాలపై వివాదాలు, సీపీఐ నుంచి బహిష్కరణ వంటి పరిణామాలు ఆయన రాజకీయ జీవితాన్ని సంక్లిష్టంగా మార్చాయి. ఈ అంశాలను దాచిపెట్టకుండా పరిశీలించడం చరిత్రను సక్రమంగా అర్థం చేసుకోవడానికి సహాయపడుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
