ఆందోళన చేస్తున్న బంగ్లాదేశ్ వస్త్ర పరిశ్రమ కార్మికులు యాజమాన్యం ఇచ్చిన వేతన సవరణ ప్రతిపాదనలను తిరస్కరించారు.
సమరశీల కార్మిక పోరాటం ఒత్తిడికి తలొగ్గి బంగ్లాదేశ్ ప్రభుత్వం వేతన నిర్ధారణకు ఒక నిపుణుల కమిటీని నియమించింది. ఆ కమిటీకి ఫ్యాక్టరీ యజమానులు ఒక ప్రతిపాదన సమర్పించారు. అయితే కార్మిక ప్రతినిధులు ఈ ప్రతిపాదనను తిరస్కరించారు.
వేతన సవరణ విషయంలో యజమానులు, కార్మిక సంఘాలు, ప్రభుత్వం మధ్య రాజీకి అవకాశం కనిపించకపోవడంతో ఆందోళనలు కొనసాగే సూచనలు ఉన్నాయి.
వేతన కమిటీ చర్చల్లో పాల్గొన్న కార్మిక ప్రతినిధి బాబుల్ అక్తర్ చర్చల తర్వాత విలేకరులతో మాట్లాడుతూ, “కార్మికుల డిమాండ్‌కు, యాజమాన్యం ప్రతిపాదనలకు మధ్య చాలా అంతరం ఉన్నది” అన్నారని ఏఎఫ్‌పీ వార్తా సంస్థ వెల్లడించింది.
యాజమాన్యం ప్రతిపాదించిన వేతన వివరాలను వేతన బోర్డు గోప్యంగా ఉంచినప్పటికీ, యాజమాన్య ప్రతినిధి మాత్రం కార్మికులకు నెలకు 116 డాలర్ల వేతనాన్ని ప్రతిపాదించినట్లు వెల్లడించారు.
కార్మిక ప్రతినిధులు నెలకు 258 డాలర్లు రెగ్యులర్ కార్మికులకు, 241 డాలర్లు అప్రెంటిస్ కార్మికులకు వేతనంగా నిర్ణయించాలని డిమాండ్ చేస్తున్నారు.
ఆర్థిక వ్యవస్థపై తీవ్ర ప్రభావం.. వందలాది ఫ్యాక్టరీల మూసివేత
వస్త్ర పరిశ్రమ కారణంగా ఏటా బంగ్లాదేశ్‌కు 38 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తున్నాయి. ఈ రంగంలో దాదాపు 40 లక్షల మంది కార్మికులు ఉపాధి పొందుతున్నారు.
బంగ్లాదేశ్ విదేశీ వాణిజ్యంలో వస్త్ర పరిశ్రమ ఉత్పత్తులే ఐదింట నాలుగు వంతుల మేర ఉన్నాయి.
ప్రపంచంలో చైనా తర్వాత అత్యధిక వస్త్ర ఉత్పత్తుల ఎగుమతిదారుగా ఉన్న బంగ్లాదేశ్‌లో ఈ సంవత్సరం అక్టోబర్ నుంచి కార్మికుల వేతన పోరాటం సాగుతోంది.
దేశంలో ఉన్న నాలుగు వేల వస్త్ర ఉత్పత్తి కర్మాగారాల్లో ఈ సమ్మెల కారణంగా సుమారు 500కు పైగా కర్మాగారాలు మూతపడ్డాయి. మరికొన్ని వందల కర్మాగారాల్లో ఉత్పత్తికి అంతరాయాలు ఏర్పడ్డాయి.
మరోవైపున పెరుగుతున్న ధరల కారణంగా బతుకులు భారమయ్యాయని, విద్య, వైద్యం, రవాణా ఖర్చులు వంటి కనీస అవసరాలు తీర్చుకునే పరిస్థితి లేదని కార్మికులు వాపోతున్నారు.
బంగ్లాదేశ్ వస్త్ర ఉత్పత్తిదారులు, ఎగుమతిదారుల సంఘం అంచనాల ప్రకారం ఈ సమ్మెల కారణంగా నవంబర్ 1 నుంచి 18వ తేదీ నడుమ దేశంలోని 317 ఫ్యాక్టరీలకు 428 మిలియన్ డాలర్ల మేర నష్టం వాటిల్లింది.
‘పనిచేయకపోతే వేతనం లేదు’ అంటున్న యాజమాన్యాలు
2023లో వేతన సవరణ జరిగినప్పుడు కార్మిక సంఘాలు చేసిన పోరాటం కారణంగా వస్త్ర పరిశ్రమ కార్మికుల కనీస వేతనం నెలకు 185 డాలర్లుగా నిర్ణయమైంది.
ఈ కాలంలో సుమారు 500 ఫ్యాక్టరీలు మూతపడటంతో కార్మికుల పట్టుదల మరింత పెరిగింది.
‘పనిచేయకపోతే వేతనం లేదు’ అనే నిబంధన కారణంగా సమ్మె కాలంలో వేతనం ఇవ్వడానికి యాజమాన్యాలు తిరస్కరిస్తున్నాయి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
