2018లో వికాస్ సంస్కృత్యాయన్ అలియాస్ వికాస్ పాండేకు భారతీయ జనతా పార్టీ ఐటీ విభాగం లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని రాఠీ ఆరోపించిన వీడియోపై కేసు నమోదైంది.
న్యూఢిల్లీ: 2018 నాటి పరువు నష్టం కేసులో యూట్యూబర్ ధ్రువ్ రాఠీకి వ్యతిరేకంగా ఢిల్లీ కోర్టు నవంబర్ 23న నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసింది.
జ్యుడీషియల్ మెజిస్ట్రేట్ ఫస్ట్ క్లాస్ అనామ్ రయీస్ ఖాన్ ఈ ఉత్తర్వులు జారీ చేశారని, ఈ కేసుపై తదుపరి విచారణ డిసెంబర్ 3న జరగనుందని ‘బార్ అండ్ బెంచ్’ నివేదించింది.
2018లో రాఠీ రూపొందించిన ఒక వీడియోలో వికాస్ సంస్కృత్యాయన్ అలియాస్ వికాస్ పాండేకు భారతీయ జనతా పార్టీ (బీజేపీ) సమాచార సాంకేతిక (ఐటీ) విభాగం లంచం ఇవ్వడానికి ప్రయత్నించిందని పేర్కొన్నారు. ఈ వ్యాఖ్యలపైనే ఈ కేసు నమోదైంది.
ఇతర వార్తా కథనాల ప్రకారం పాండే ‘ఐ సపోర్ట్ నరేంద్ర మోదీ’ అనే ఫేస్బుక్ పేజీ వ్యవస్థాపకుడు.
విదేశాల్లో ఉండటంతో సమన్లు అందలేదని వాదన
ఆ వీడియోను ఆమ్ ఆద్మీ పార్టీ కన్వీనర్, ఢిల్లీ మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్ రీట్వీట్ చేశారు. దాంతో పాండే రాఠీతో పాటు కేజ్రీవాల్పైనా పరువు నష్టం కేసులు దాఖలు చేశారు.
రాఠీ విదేశాల్లో నివసిస్తున్నందున అనేక ఏళ్లుగా ఆయనకు సమన్లు అందలేదని ఫిర్యాదుదారు తరఫు న్యాయవాది వాదించడంతో కోర్టు ఈ నాన్-బెయిలబుల్ వారెంట్ జారీ చేసిందని ఆ నివేదిక పేర్కొంది.
అక్టోబర్లో భారత్ పర్యటన.. పోలీసుల నిర్బంధం
ఓటర్ల జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా కాక్రోచ్ జనతా పార్టీ పిలుపునిచ్చిన నిరసనల్లో పాల్గొనేందుకు రాఠీ ఈ ఏడాది అక్టోబర్లో భారత్కు వచ్చారు. ఆ సమయంలో ఢిల్లీలో పోలీసులు ఆయనను అదుపులోకి తీసుకున్నారు.
ఈ నిరసనల సందర్భంగా వేలాది మందిని నిర్బంధించిన సమయంలో పోలీసులు స్వాధీనం చేసుకున్న ఫోన్ల యజమానుల డిజిటల్ హక్కులతో పాటు ఇతర అంశాలపై రాఠీ గళం వినిపిస్తున్నారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
