ఒక మహిళపై పోలీసు సిబ్బంది లైంగికంగా దాడి చేస్తున్నట్లు ఏఐ ఆధారంగా పోస్టర్‌ను సృష్టించి పంపిణీ చేసిన కారణంగా హర్యానాకు చెందిన ఒక వ్యక్తిని అక్టోబర్ 6న ఢిల్లీ పోలీసులు అరెస్టు చేశారు.
న్యూఢిల్లీ: రాజధానిలో అక్టోబర్ 3న నిరసన సందర్భంగా ముగ్గురు మహిళా జర్నలిస్టులపై ఢిల్లీ పోలీసు సిబ్బంది లైంగిక వేధింపులకు పాల్పడినట్లు వచ్చిన మీడియా కథనాలపై విచారణ చేపట్టనున్నట్లు అక్టోబర్ 8న జాతీయ మానవ హక్కుల సంఘం(ఎన్హెచ్ఆర్సీ) తెలియజేసింది.
ఈ అంశంపై రెండు వారాల్లోగా పూర్తి వివరాలతో నివేదికను అందజేయాలని కోరుతూ ఢిల్లీ పోలీసు కమిషనర్‌కు నోటీసు జారీ చేసినట్లు ఒక ప్రకటనలో అది తెలియజేసింది.
“ఆరోపించబడిన సంఘటనల గురించి న్యూఢిల్లీ జిల్లా పోలీసు ఫిర్యాదులను స్వీకరించిందని, విచారణ నిమిత్తం వాటిని ఢిల్లీ పోలీసు క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేసినట్లు అక్టోబర్ 5న మీడియా కథనాలు పేర్కొన్నాయి” అని ఆ ప్రకటన వెల్లడించింది.
పార్లమెంట్ హౌస్ పోలీసు స్టేషన్ ఎదుట అక్టోబర్ 3వ తేదీ సాయంత్రం, ఆ మరుసటి రోజు జర్నలిస్టులు ధర్నా చేశారు.
ఓటర్ల జాబితాలో సర్(స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్)కు వ్యతిరేకంగా, ప్రధాన ఎన్నికల అధికారి జ్ఞానేష్ కుమార్ రాజీనామా కోరుతూ అక్టోబర్ 4న ఆ ప్రాంతం అంతటా నిరసనలు సాగాయి.
విద్యార్థులు, జర్నలిస్టుల అరెస్టు
పోలీసు స్టేషన్ వద్ద ధర్నా సందర్భంగా 17 మంది విద్యార్థులు, ఒక స్వతంత్ర జర్నలిస్టును పోలీసులు అరెస్టు చేశారు.
ఒక జర్నలిస్టుపై చేయి చేసుకున్నారని ఆరోపణలు ఎదుర్కొంటున్న ఏసీపీ వివేక్ భగత్‌పై ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని విద్యార్థులు, ఇతరులు డిమాండ్ చేశారు.
అరెస్టయిన 17 మందికి పటియాలా హౌస్ కోర్టు అక్టోబర్ 5న రాత్రి బెయిల్ మంజూరు చేసింది. నిరసనకారులపై పోలీసు స్టేషన్లో జరిగిన దాడికి సంబంధించిన ఆరోపణలపై నివేదిక అందజేయాలని, పార్లమెంటు స్ట్రీట్ స్టేషన్ నుంచి సీసీటీవీ ఫుటేజీలను భద్రపరచాలని డిప్యూటీ కమిషనర్, ఢిల్లీ పోలీసులను కోర్టు ఆదేశించినట్లు అరెస్టులకు గురైన నిరసనకారులకు ప్రాతినిధ్యం వహిస్తున్న న్యాయవాది సైమన్ ఫారూఖీ చెప్పారు.
సోషల్ మీడియా వేదికగా పోలీసుల స్పందన
జర్నలిస్టుల ధర్నా రాత్రి వరకు కొనసాగింది. మరుసటి ఉదయం మహిళల ఫిర్యాదులను ఢిల్లీ పోలీసులు పరిగణనలోకి తీసుకున్నారు.
“న్యూఢిల్లీ జిల్లా వారి ఫిర్యాదులను స్వీకరించింది. న్యాయబద్ధంగా, నిష్పాక్షిక విచారణ కొరకు వాటిని క్రైమ్ బ్రాంచ్‌కు బదిలీ చేశాం” అని పోలీసులు మరుసటి ఉదయం తమ ఎక్స్ ఖాతాలో పోస్ట్ చేశారు.
రాహుల్, ప్రియాంక గాంధీ మద్దతు
ఫిర్యాదు చేసిన మహిళలకు కాక్రోచ్ జనతా పార్టీ(సీజేపీ)తో పాటు కాంగ్రెస్ పార్టీ ఎంపీ, లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ మద్దతు తెలుపుతూ.. ఎఫ్ఐఆర్ నమోదు చేసుకోవడం పోలీసుల అత్యంత మౌలిక విధి అని, కానీ ఈ కేసులో వారు ఆ పని చేయడంలేదని విమర్శించారు.
“మహిళలకు భద్రత కల్పించాల్సిన పోలీసులే వారిలో భయాందోళనలు సృష్టిస్తున్నారు. కాలేజీ విద్యార్థుల నుంచి జర్నలిస్టుల వరకు మహిళలు ప్రతి చోటా అభద్రతను ఎదుర్కొంటున్నారు. నరేంద్ర మోదీ, అమిత్ షా.. మహిళల పట్ల వ్యవహరించే పద్ధతి ఇలాగే ఉంటుందా? అలా కాకపోతే మీరెందుకు వీటిని పరిగణనలోకి తీసుకోరు?” అని కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ ఎక్స్ ఖాతాలో రాశారు.
లైంగిక వేధింపుల ఆరోపణలు
నేరస్థుడిగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఢిల్లీ పోలీసు ఏసీపీని అరెస్టు చేయాలని సీజేపీ నేత అభిజీత్ దిప్కే డిమాండ్ చేశారు.
నిరసన సందర్భంగా భగత్ లైంగికంగా వేధిస్తూ తనపై చేయి వేశాడని ఫిర్యాదు చేసిన వారిలో ఒకరు ప్రత్యేకంగా ఆరోపించారు.
ఆల్ ఇండియా స్టూడెంట్స్ అసోసియేషన్ అధ్యక్షురాలు నేహా బోరా నిర్బంధాన్ని రికార్డు చేస్తుండగా ఈ సంఘటన చోటు చేసుకుందని ఫిర్యాదు చేసిన స్వతంత్ర జర్నలిస్టు వివరించారు.
ముగ్గురు ఫిర్యాదుదారులతో సహా అనేక మందిని అక్టోబర్ 5న నిర్బంధించారని సీజేపీ కూడా ఆరోపించింది.
బాధితురాలు, ఇతరులకు వ్యతిరేకంగా ఢిల్లీ పోలీసులు ఎఫ్ఐఆర్ నమోదు చేసి, వారి ఫోన్లను స్వాధీనపరుచుకోవడాన్ని కూడా పరిశీలిస్తున్నారని సీజేపీ న్యాయ వ్యవహారాల ముఖ్యురాలు రత్నా సింగ్ ఎక్స్‌లో చెప్పారు.
ఏఐ వీడియో సృష్టికర్త అరెస్టు
ఇదిలా ఉండగా, ప్రజాగ్రహం వ్యక్తమవుతున్నప్పటికీ భగత్‌కు వ్యతిరేకంగా ఫిర్యాదులు పెండింగ్‌లోనే ఉంచారు. కానీ ఒక మహిళపై భగత్ లైంగిక దాడి చేస్తున్నట్లు ఏఐ ఆధారిత ఫేక్ వీడియోను సృష్టించి పంపిణీ చేసిన ఒక వ్యక్తిని ఢిల్లీ పోలీసులు అక్టోబర్ 6న అరెస్టు చేశారు.
ఆ వ్యక్తి నదీమ్ అహ్మద్ అమీన్ అనే జర్నలిస్టుగా పోలీసులు గుర్తించారు. సామాజిక మాధ్యమ వార్తా ఛానల్ ‘న్యూస్ ఐనా టుడే’తో అనుసంధానమై ఉన్న ఇన్స్టాగ్రామ్ అకౌంట్ నుంచి వీడియోను పోస్ట్ చేసినట్లు పోలీసులు ఆరోపించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
