భారతదేశంలో ఐదారు ముఖ్యమైన మతాలున్నాయి. వీటిలో అదేమిటో కేవలం హిందూ ధర్మమే ప్రమాదంలో ఉంది అని చెపుతూ ఉందొక పార్టీ. మిగితా ధర్మాలకు జెడ్ ప్లస్ రక్షణ ఉందా? ఉంటే ఎవరిచ్చారు? “హిందువులారా మేల్కొనండి” అని కొందరు పిలుపునిస్తుంటే నవ్వొస్తుంది.
అసలైతే హిందువుల్ని మేలుకొల్పే పని లేదు. ముస్లింలను మేల్కొలిపే పనిలేదు. ఆ మాటకొస్తే ఏ మతస్తుల్నీ మేలు కొల్పాల్సిన పని లేదు. అందరూ కలిసి “మనం మనుషులం” అని గుర్తించుకుని, మానవత్వాన్ని మేలుకొల్పాల్సి ఉంది. ఇది ఏ ఒక్క దేశానికో కూడా పరిమితం కాదు. విశ్వ వ్యాప్తంగా మానవాళి చేయాల్సిన పని అదే.
కర్బలా మైదానంలో జరిగిన యుద్ధానికి ఏ హిందువూ కారణం కాలేదు. అలాగే మహాభారత యుద్ధానికి ముస్లిమూ కారణం కాలేదు. అందువల్ల ఇతరులను నిందించడం, దూషించడం వల్ల లాభం లేదు. ఎవరికి వారు మత విధ్వంసకులెవరో గుర్తించుకుని, వారిని మనుషులుగా మార్చుకుంటే చాలు.
మన దేశ నాయకులు ఎలాంటి హిందుస్థాన్‌ను తయారు చేశారంటే నాలుక లేని పురాతన కట్టడాల్ని కూడా ప్రాణమున్న మనుషుల్లాగా హిందూ ముస్లింలని చేసేశారు.
ఇందోర్‌లో రెండు వేల ఆవు చర్మాలతో నిండి ఉన్న పెద్ద వాహనం దొరికింది. పోలీసులు వాటి పూర్వాపరాలు శోధిస్తే, కొందరు మౌలానాల పేర్లు లభించాయి. అవి 1. రామ్ భజన్ ఉపాధ్యాయ, 2. ఉమేశ్ మిశ్రా, 3. రవి శర్మ.. ఇలా ముస్లిం పేర్లతో కంపెనీలు తెరచి, ప్రపంచవ్యాప్తంగా గొడ్డు మాంసం ఎగుమతి చేసేది అధికార పార్టీ నాయకులేనన్నది మరోసారి రుజువైంది.
మాటల గారడీ – పాలకుల తీరు
ఈ దేశంలో ఒక మనిషికి ఐదు లక్షణాలున్నాయట. వాటిని బట్టి జనం ఆయనకు ఐదు పేర్లు పెట్టుకున్నారు. 1. ఝూటేశ్వర్, 2. లూటేశ్వర్, 3. జుమ్లేశ్వర్, 4. ఠగేశ్వర్, 5. డాకేశ్వర్. ఆయన ఎవరన్నది అందరికీ తెలుసు. కానీ, ఎందుకు లేనిపోని గొడవ అని ఎవరూ నోరు విప్పరు.
“మైలుమైలుకూ మాటను మార్చి, పూటకో డ్రెస్సులు మార్చి, ఎక్కడికక్కడ ప్రతి రాష్ట్రంలో గ్యాస్ వదులుతూ కోతలు కోసే ప్రాణి ఏదయ్యా ఈ దేశంలో?” అని ఎవరైనా అడిగితే పెద్దగా శ్రమ పడాల్సిన పని లేదు. అందరికీ సులభంగానే ఠకీమని గుర్తుకొస్తుంది.
“ప్రతి ఒక్కరికీ భార్య ఉండడం తప్పనిసరి. ఎవరికైతే భార్య వేధింపులు ఉండవో అతను మొత్తం దేశాన్ని వేధిస్తుంటాడు” అని ఒక అనుభవజ్ఞుడు ఈ విషయం చెప్పాడు. ఆలోచిస్తే నిజమేననిపించింది.
ఛాతీ ఎన్ని అంగుళాలున్నదన్న దానితో, నోరు ఎంత పెద్దదన్న దానితో దేశాన్ని ఎవరూ నడిపించలేరు. హృదయ వైశాల్యంతో, నీతి నిజాయితీలతో, నిబద్ధతతో మాత్రమే ఎవరైనా పరిపాలన చేయగలరు.
అధికార పార్టీకి సంబంధించిన ప్రతినిధి కనబడగానే ఒక అమాయక విలేకరి వెళ్లి ఓ ప్రశ్న అడిగాడు. “భారత్‌లో నిరుద్యోగానికీ, రూపాయి విలువ పడిపోవడానికీ, ప్రపంచ ఆకలి సూచీలో దేశం అట్టడుగున చేరడానికీ కారణాలు ఏవని మీరనుకుంటున్నారు?” అని అడిగాడు.
ఆ అధికార పార్టీ ప్రతినిధి గుడ్లురిమి చూశాడు. “చూడండి మీరు దృష్టి మళ్లించే రాజకీయాలకు సంబంధించిన ప్రశ్న అడుగుతున్నారు. నేరుగా అసలు విషయంలోకి వచ్చి హిందూ ముస్లింల గురించి ప్రశ్నించండి బావుంటుంది” అని అన్నాడు ముఖాన్ని కమలంలా ముడుచుకుని.
హామీలు గాలికి – విదేశీ పర్యటనలు
మీరు మీ చాయ్‌లో బిస్కెట్ ముంచుకుని తింటారేమో ఇక్కడ మా దేశంలో ఒకాయనున్నాడు అతను చాయ్‌లో దేశాన్నే ముంచుకు తింటున్నాడు. ఆయనే తనను తాను చాయ్‌వాలాగా చెప్పుకుంటుంటాడు. ఆయన ఎదురుపడితే మీరిలా అడిగి చూడండి. “మహాశయా తమరు మరొక్కమారు సెలవివ్వండి.
విదేశీ బ్యాంకుల్లో నల్ల డబ్బు, అచ్ఛేదిన్, గుజరాత్ మోడల్, రెండు కోట్ల ఉద్యోగాలు, మా ఖాతాలో పదిహేను లక్షలూ, తక్కువ ధరకే పెట్రోల్, డిజిల్, తగ్గించిన ధరకే వంటగ్యాస్ వగైరా వగైరా అంతే”. ఆయన ఉన్న పళంగా విదేశాలకు ఎగిరిపోతారు.
అసలు మనకు ఉన్నది పూర్తి స్థాయి ప్రధానా? లేక పాక్షిక స్థాయి ప్రధానా? పక్కన ఉన్న మణిపూర్ వెళ్లి రాలేడు. కానీ, విదేశాలన్నీ తిరిగొస్తుంటాడు. నిలకడగా దేశంలో ఉండి, దేశ సమస్యల మీద దృష్టి పెట్టిన రోజులెన్ని అన్నది ఏ సంస్థ వారైనా లెక్కలు తీస్తే బావుణ్ణు.
నిజమే మద్యంతో కొన్ని కుటుంబాలే చితికిపోయాయి. కానీ, చాయ్‌వాలా చాయ్‌తో ఏమయ్యిందీ? మొత్తం దేశమే నీరుగారిపోయింది.
ఈ ప్రభుత్వంలో వరుసగా అందరూ వస్తారు. తొందరెందుకూ? అగ్నివీర్, శిక్షావీర్, చికిత్సావీర్, రైల్వేవీర్, బ్యాంక్ వీర్ చివరకు అన్నింటి కన్నా ముఖ్యమైన పెద్ద పథకం ఫకీర్.
గతంలో బతుకుతూ ప్రగతి నినాదాలు
పులిని పెంచి పోషించడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. ఎందుకంటే, పులి పులిలాగే ఉంటుంది గనక. ఎటొచ్చీ, రంగులు పూసిన గాడిదను పులిలా నిలబెట్టాలనుకోవడమే కష్టం. ముందు ఆ రంగు నిలవదు. పైగా, గాడిద పులిలా ప్రవర్తించదు.
బింకంగా పులిలా ఫోజులు కొడుతూ తిరిగొస్తున్న గాడిదకు తెలియదా తను గాడిదననీ. ప్రపంచం అంతరిక్షంలోకి రాకెట్లు పంపుతూ ఉంటే, అంతరిక్షంలో కొన్ని నెలలు గడిపిన వాళ్లను వెనక్కి తీసుకొస్తుంటే ఇక్కడ ఈ దేశంలో మూడు వందల ఏళ్లు వెనక్కి వెళ్లి ఇక్కడి ప్రభుత్వం సమాధులు తవ్వుతూ ఉంది.
ఎంత గొప్ప దార్శనికతా? ఎంత గొప్ప పరిపాలనో కదా. సముద్రంలో కొట్టుకుపోయిన ఏ వస్తువైనా దొరుకుతుందేమో గానీ ఓ ఫలానా వ్యక్తి ఉన్నాడు చూశారూ ఆయన డిగ్రీ మాత్రం దొరకదు.
“ఏ దేశపు ప్రభుత్వం అవినీతిలో కూరుకుపోయి, భ్రష్టుపట్టి పోతుందో, ఆ దేశపు కరెన్సీ విలువ ప్రపంచ మార్కెట్లో అంతగా దిగజారిపోతుంది” ఇది మనం అనుకుంటున్న మాట కాదు, స్వయంగా మోదీ 2014లో చెప్పిన మాట. మరి తన హయాంలో 2024లో రూపాయి విలువ ఎక్కడుందో చెక్ చేసుకున్నాడో లేదో.
ఇక్కడ మనం మరో ముఖ్యమైన విషయం చెప్పుకోవాలి. మన దేశంలో బ్యాంకులు దోపిడీ చేసి, విదేశాలకు పారిపోయిన ఘనుల జాబితా వెలువడింది. ఆ జాబితాలో 32 మంది ఉన్నారు. అందులో కనీసం ఒక్కడంటే ఒక్కడు ముస్లిం లేడు.
మరి అదేమిటో, దేశానికి ముస్లింల వల్ల ప్రమాదముందని చెపుతుంటారు. మనం కొంచెం ఆలోచించాలి కదా.
“సారే జహా సే అచ్ఛా” అనే గీతం ఒక ముస్లిం కవి రాసినప్పుడు మక్కా మదీనా గురించి రాయలేదు. హిందుస్థాన్ హమారా అని రాశాడు కదా. ఇప్పుడు మీరు వారి నుండే ప్రమాణ పత్రాలు, సాక్ష్యాలు అడుగుతున్నారు. ఈ విషయంలో న్యాయం ఎక్కడ దాక్కుందో తెలిసిందా?
విద్యావంతుల విలువ – అంధానుకరణ
సజీవంగా ఉన్న మనుషులతో కాకుండా, మిమ్మల్ని చనిపోయినవారితోనూ, సమాధులతోనూ పోట్లాడాలని బోధించే రాజకీయ పార్టీ విధానం ఎలాంటిదో, అది ఈ దేశానికి ఎలాంటి భవిష్యత్తునివ్వగలుగుతుందో బాధ్యత గల పౌరులుగా ఎవరికివారు ఆలోచించుకోవాలి.
మన పక్క దేశం చైనా భవిష్యత్తులో బతుకుతోంది. మన దేశ నాయకులు మనల్ని గతంలో బతకమని చెపుతున్నారు. వికాసం వికాసం అని ఊదరగొడుతున్న మన నాయకులు చైనా ప్రగతితో పోటీ పడగలరా?
అసలు ఊహించుకోవడమే కష్టంగా ఉంది కదా. అంత వికాసం సాధించిన వారైతే, సర్దార్ వల్లభాయ్ పటేల్ విగ్రహం తయారీకి లక్షల కోట్ల కాంట్రాక్టు చైనాకెందుకిస్తారు? ఇది గమనించుకోవాల్సిన విషయమే.
“ఈ మధ్య కాలంలో అందరికీ అంబేద్కర్ అంబేద్కర్ అనడం ఫ్యాషనైపోయింది” అని ఈ దేశపు హోంమంత్రి పార్లమెంట్లో వెకిలి కామెంట్ చేశాడు.
అంబేద్కర్ ఈ దేశానికి రాజ్యాంగాన్ని అందించిన వాడు. ఆయనకు ముప్పయి రెండు డిగ్రీలున్నాయి. తొమ్మిది భాషల పరిజ్ఞానం ఉంది. ప్రపంచం ఆయనను జ్ఞాన ప్రతీకగా గుర్తించింది. ఇప్పుడీ చదువురాని మన దేశ నాయకులు రాజ్యాంగంలో తప్పులెంచుతున్నారు.
విలువలు లేని వారికీ, విలువ తెలుసుకోని వారికీ ఏది ఏమిటన్నది ఎలా తెలుస్తుంది? వారికి అంతా ఒకటే అనిపిస్తుంది.
దేశ పరిస్థితి గమనించి, “చదువు మధ్యలో ఆగిపోయింది. హైవేలు మధ్యలో కుంటుపడ్డాయి. కానీ కోతలు కోయడంలో ఎప్పుడూ ఎక్కడా మధ్యలో తగ్గేదేలే పూర్ణం, పూర్ణం సంపూర్ణం” అని ఒక అనుభవశాలి అన్నాడు.
కుతంత్రాలను తిప్పికొట్టే సమయం
మిత్రులంతా కలిసి పిచ్చాపాటి మాట్లాడుతూ ఉంటే, “బూట్లు అరిగే దాకా తిరుగుతూ, చమటోడ్చి, కష్టపడి తెచ్చుకునే గుర్తింపుకూ, బూట్లు నాకి తెచ్చుకునే గుర్తింపుకూ భూమికీ ఆకాశానికీ ఉన్నంత తేడా ఉంటుంది” అని ఒకతను అన్నాడు.
“అతను సావర్కర్ గురించి ఏమైనా చెప్పాడా” అని అనుకున్నారు మిత్రులు. ఇంతలో ఊరి నుంచి కొత్తగా నగరానికొచ్చిన వ్యక్తి ఇలా అన్నాడు.
“భార్యను వదిలేసినోడికి మా ఊర్లోనయితే ఇల్లే అద్దెకివ్వరు మహాశయులారా. మీరేమో అలాంటివాడికి దేశాన్ని అప్పగించి కూర్చున్నారు. ఇంకేం చేస్తారు బాగా అనుభవించండి” అంటూ గబుక్కున లేచి వెళ్లిపోయాడు. ఈ మధ్య ఎక్కడ ఏ నలుగురు కలిసినా, ఇలాంటి సంభాషణే.
అన్నం తినేప్పుడు మోదీ అకస్మాత్తుగా అడిగాడట “నా చెంచా ఏదీ” అని. అంతే బయట కూర్చున్న సంబిత్ పాత్ర, బీజేపీ అధికార ప్రతినిధిలోనికి పరిగెత్తుకొచ్చి నిలబడ్డాడు. “ఇదిగోనండి నేనిక్కడే ఉన్నాను” అన్నాడు.
మరొక సందర్భంలో ఆయన మరొక విషయం చెప్పాడు “మహారాణి ఝాన్సీ లక్ష్మీబాయి చిత్రపటం చాలా మంది చూసే ఉంటారు కదా. ఆమె వీపు మీద ఒక బాలుడు ఉంటాడు. ఆ బాలుడు ఎవరో కాదు చాలా మందికి తెలియకపోవచ్చు ఆ బాలుడు మన బాల నరేంద్రే. అంటే, మన నరేంద్ర మోడీనే” అని ఆ రహస్యాన్ని విప్పి చెప్పింది కూడా బీజేపీ ప్రతినిధి సంబిత్ పాత్రానే. ఆయన చెంచాగిరి ఆ రేంజ్లో ఉంటుందన్న మాట.
అంతకు ముందున్న పన్నులన్నీ తొలగించి, దేశవ్యాప్తంగా ఎలాగైతే ఒకే ఒక్క వస్తు సేవల పన్నును(జీఎస్టీ) పెట్టారో అలాగే అంతకు ముందున్న కుల, మత, జాతి, ప్రాంత విభేదాల్నీ తొలగించి ఒకే ఒక్క భారతీయత అనేది వాడుకలోకి తేవొచ్చు కదా? అందుకు మనం సామాన్య పౌరులం పూనుకోవచ్చు కదా?
మనలో మనం భేదాల్ని పెంచి పోషించుకోవడం ఎందుకూ ఆలోచించి చూడండి. ఆ విధంగా అధికారంలో ఉన్నవారి కుతంత్రాల్ని తిప్పికొట్టే అవకాశం ఉంది కదా.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
