భారతదేశ రాజకీయ చరిత్రలో కొందరు నాయకులు అధికారాన్ని సంపాదించడం ద్వారా ప్రసిద్ధులైతే, మరికొందరు అధికారాన్ని త్యజించడం ద్వారా ప్రజల హృదయాల్లో శాశ్వత స్థానాన్ని సంపాదించుకున్నారు. అలాంటి అరుదైన నాయకుల్లో లోక నాయక్ జయప్రకాశ్ నారాయణ్(జేపీ) ఒకరు.
స్వాతంత్ర్యం కోసం పోరాడిన విప్లవకారుడు, సామాజిక అసమానతలకు వ్యతిరేకంగా నిలిచిన సామాజిక వాది, ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం ఉద్యమించిన ప్రజానాయకుడు, రాజకీయ మార్పుతోపాటు సమాజంలోని అన్ని రంగాల్లో పరివర్తన రావాలని ఆకాంక్షించిన దార్శనికుడు ఆయన. అక్టోబర్ పదకొండు ఆయన జయంతి.
జీవితంలో ఎన్నో కీలక సందర్భాల్లో పదవులకంటే ప్రజాసేవకు, అధికారానికంటే విలువలకు, వ్యక్తిగత ప్రయోజనాలకంటే సామాజిక న్యాయానికి ప్రాధాన్యం ఇచ్చారు. అందుకే ఆయనను ప్రజలు ప్రేమతో “లోక నాయక్” అని పిలిచారు.
బాల్యం, కుటుంబ నేపథ్యం, విద్యాభ్యాసం
జయప్రకాశ్ నారాయణ్ 1902 అక్టోబర్ 11న అప్పటి బ్రిటిష్ భారతదేశంలోని సారణ్ ప్రాంతంలో ఉన్న సితాబ్ దియారా గ్రామంలో జన్మించారు.
ఈ గ్రామం ప్రస్తుత బీహార్-ఉత్తరప్రదేశ్ సరిహద్దు ప్రాంతానికి సమీపంలో ఉంది. ఆయన తండ్రి హర్సు దయాళ్, తల్లి ఫూల్ రాణీ దేవి.
గ్రామీణ వాతావరణంలో పెరిగిన ఆయనకు చిన్నతనం నుంచే సమాజంలోని ఆర్థిక, సామాజిక అసమానతలను గమనించే అవకాశం కలిగింది.
విద్యపై ఆసక్తి, దేశం పట్ల బాధ్యత, సమాజంలో మార్పు తీసుకురావాలనే తపన ఆయన వ్యక్తిత్వాన్ని తీర్చిదిద్దాయి.
పాఠశాల విద్య అనంతరం ఉన్నత విద్య కోసం అమెరికాకు వెళ్లారు. అక్కడ జీవనోపాధి కోసం వివిధ పనులు చేస్తూనే చదువును కొనసాగించారు.
అమెరికాలో ఉన్న కాలంలో సామాజిక వాదం, మార్క్సిజం, కార్మిక ఉద్యమాలు, పెట్టుబడిదారీ వ్యవస్థలోని అసమానతల గురించి విస్తృతంగా అధ్యయనం చేశారు. అక్కడి అనుభవాలు ఆయన ఆలోచనా విధానంపై గాఢమైన ప్రభావం చూపాయి.
పేదరికం వ్యక్తిగత వైఫల్యం కాదని, ఆర్థిక వ్యవస్థలో అంతర్భాగంగా ఉన్న అసమానతలే ప్రధాన కారణమని ఆయన అర్థం చేసుకున్నారు.
అమెరికాలో విద్యాభ్యాసం పూర్తి చేసి భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత దేశ స్వాతంత్ర్యోద్యమంలో చురుకుగా పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
గాంధీజీ ప్రభావం – స్వాతంత్య్రోద్యమంలో ప్రవేశం
భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత జయప్రకాశ్ నారాయణ్ మహాత్మా గాంధీ నాయకత్వంలోని జాతీయోద్యమంతో సన్నిహిత సంబంధాలు ఏర్పరచుకున్నారు. గాంధీజీ ప్రతిపాదించిన అహింస, ప్రజా భాగస్వామ్యం, నైతిక రాజకీయాలు ఆయనను ప్రభావితం చేశాయి.
అదే సమయంలో, అమెరికాలో అధ్యయనం చేసిన సామాజిక వాద భావజాలం ఆయన ఆలోచనల్లో బలంగా కొనసాగింది.
ఈ రెండు ప్రభావాల కలయికతో ఆయన భారతదేశానికి రాజకీయ స్వాతంత్ర్యంతోపాటు సామాజిక, ఆర్థిక సమానత్వం కూడా అవసరమని భావించారు.
బ్రిటిష్ పాలన అంతం కావడం మాత్రమే నిజమైన స్వాతంత్ర్యం కాదని, ప్రజలకు ఆర్థిక భద్రత, విద్య, ఉపాధి, గౌరవప్రదమైన జీవితం అందినప్పుడే స్వాతంత్ర్యానికి అర్థం ఉంటుందని ఆయన విశ్వసించారు. ఈ దృక్పథమే తరువాత ఆయన సామాజికవాద రాజకీయాలకు పునాది అయింది.
కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ స్థాపన
1930వ దశకంలో భారత జాతీయ కాంగ్రెస్‌లో స్వాతంత్ర్య పోరాటం తీవ్రతరమవుతున్న సమయంలో, దేశానికి రాజకీయ స్వాతంత్ర్యం మాత్రమే కాకుండా సామాజిక, ఆర్థిక వ్యవస్థలోనూ సమూల మార్పులు అవసరమని భావించిన యువ నాయకుల్లో జయప్రకాశ్ నారాయణ్ ముఖ్యులు.
1934లో ఆచార్య నరేంద్ర దేవ్, రామ్ మనోహర్ లోహియా, అచ్యుత్ పట్వర్ధన్, అశోక్ మెహతా వంటి నాయకులతో కలిసి కాంగ్రెస్ సోషలిస్టు పార్టీ(సీఎస్పీ) స్థాపనలో ఆయన కీలక పాత్ర పోషించారు.
ఈ పార్టీ కాంగ్రెస్‌లోనే సామాజిక వాద భావజాలానికి ప్రాతినిధ్యం వహించిన వర్గంగా ఉండేది. జయప్రకాశ్ నారాయణ్ దానికి ప్రధాన కార్యదర్శిగా పనిచేశారు.
స్వాతంత్ర్యం తరువాత దేశ సంపద కొద్దిమంది చేతుల్లోనే కేంద్రీకృతమైతే, పేదరికం, నిరుద్యోగం, దోపిడీ కొనసాగుతాయి. అందువల్ల స్వాతంత్య్రోమంలో రైతులు, కార్మికులు, యువకులు, పేద ప్రజలు కేవలం పాల్గొనే వారిగా మాత్రమే కాకుండా, దేశ భవిష్యత్తును నిర్ణయించే శక్తులుగా ఎదగాలని ఆయన అభిప్రాయం.
ప్రధాన పరిశ్రమలు, కీలక ఆర్థిక రంగాలపై ప్రజా ప్రయోజనాలకు అనుగుణమైన నియంత్రణ, భూస్వామ్య వ్యవస్థలోని అసమానతలను తొలగించి, భూమిని సాగు చేసే రైతులకు న్యాయం చేయడం, కార్మిక సంఘాల హక్కులను గుర్తించడం, కార్మికుల జీవన ప్రమాణాలను పెంచడం, సంపద, అవకాశాలు కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతం కాకుండా చూడడం ఆయన లక్ష్యాలు.
స్వాతంత్ర్యం అనంతరం అభివృద్ధిలో పేదలు, రైతులు, కార్మికులకు తగిన స్థానం కల్పించడం ఆయన ప్రతిపాదించిన ముఖ్యమైన ఆర్థిక, సామాజిక లక్ష్యాలు.
సామాజిక వాదంపై తన దృక్పథాన్ని వివరిస్తూ ఆయన రచించిన “వై సోషలిజం” అనే ముఖ్యమైన గ్రంథం 1936లో ప్రచురితమైంది.
సామాజిక వాదంపై ఆయన దృక్పథం
జయప్రకాశ్ నారాయణ్ దృష్టిలో సామాజిక వాదం అనేది కేవలం ఒక రాజకీయ పార్టీ సిద్ధాంతం కాదు. అది ఆర్థిక దోపిడీని తగ్గించి, సమాజంలోని అట్టడుగు వర్గాలకు గౌరవప్రదమైన జీవితం కల్పించడానికి ఉపయోగపడే వ్యవస్థగా ఉండాలి.
నేటి భారతదేశంలో కార్మికుల వేతనాలు, కాంట్రాక్టు ఉద్యోగాలు, వ్యవసాయ సంక్షోభం, నిరుద్యోగం, కార్పొరేట్ సంస్థల వద్ద సంపద కేంద్రీకరణ వంటి అంశాలను పరిశీలించినప్పుడు ఆయన చెప్పిన అంశాల ప్రాధాన్యత అర్థమవుతుంది.
అయితే ఆయన ఆలోచనలు కాలక్రమేణా మారాయి. ఒక దశలో మార్క్సిజం, సామాజిక వాదం పట్ల ఆకర్షితులైన ఆయన, తరువాత గాంధేయ సర్వోదయ ఉద్యమం, వికేంద్రీకృత ప్రజాస్వామ్యం వైపు పయనించారు.
1942 క్విట్ ఇండియా ఉద్యమం
జయప్రకాశ్ నారాయణ్ జీవితంలో అత్యంత సాహసోపేతమైన ఘట్టం 1942 క్విట్ ఇండియా ఉద్యమం. రెండవ ప్రపంచ యుద్ధం జరుగుతున్న సమయంలో బ్రిటిష్ ప్రభుత్వం భారత ప్రజల అనుమతి లేకుండానే దేశాన్ని యుద్ధంలో భాగస్వామిని చేసింది.
భారతదేశానికి తక్షణ స్వాతంత్ర్యం ఇవ్వాలనే డిమాండ్‌తో మహాత్మా గాంధీ నాయకత్వంలో 1942 ఆగస్టు 8న బొంబాయిలో జరిగిన కాంగ్రెస్ సమావేశం “క్విట్ ఇండియా” తీర్మానాన్ని ఆమోదించింది.
ఆ తరువాత బ్రిటిష్ ప్రభుత్వం గాంధీజీ, జవహర్లాల్ నెహ్రూ, సర్దార్ పటేల్ సహా పలువురు ప్రముఖ నాయకులను అరెస్టు చేసింది.
దేశవ్యాప్తంగా నిరసనలు, సమ్మెలు, ప్రజా ఉద్యమాలు చెలరేగాయి. జయప్రకాశ్ నారాయణ్ అప్పటికే బ్రిటిష్ పాలనకు వ్యతిరేక కార్యకలాపాల కారణంగా జైలులో ఉన్నారు. ఆయనను హజారీబాగ్ కేంద్ర కారాగారంలో నిర్బంధించారు.
1942 నవంబర్ 9న దీపావళి సందర్భంగా జయప్రకాశ్ నారాయణ్‌తో పాటు మరికొందరు సహచరులు హజారీబాగ్ జైలు గోడ దాటి తప్పించుకున్నారు.
బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా భూగర్భ ఉద్యమాన్ని కొనసాగించాలనే ఉద్దేశంతో వారు ఆ విధంగా జైలు నుంచి తప్పించుకున్నారు.
జైలు నుంచి బయటపడిన తరువాత ఆయన రహస్యంగా వివిధ ప్రాంతాల్లో సంచరిస్తూ స్వాతంత్ర్యోద్యమాన్ని పునరుద్ధరించడానికి కృషి చేశారు.
నేపాల్ ప్రాంతం నుంచి పనిచేసిన “ఆజాద్ దస్తా” అనే ప్రతిఘటన బృందాన్ని ఏర్పాటు చేయడంలో ముఖ్య పాత్ర పోషించారు.
1943లో ఆయన తిరిగి బ్రిటిష్ అధికారులకు చిక్కారు. అనంతరం బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను లాహోర్ కోటతో సహా వివిధ నిర్బంధ కేంద్రాల్లో ఉంచింది. 1946లో విడుదలయ్యారు.
ఈ ఘటన చారిత్రక ప్రాధాన్యం
క్విట్ ఇండియా ఉద్యమంలో జయప్రకాశ్ నారాయణ్ పాత్ర మూడు కారణాల వల్ల విశేషమైనది. ధైర్యసాహసాలు, జైలు నుంచి తప్పించుకోవడం ద్వారా బ్రిటిష్ ప్రభుత్వానికి వ్యతిరేకంగా పోరాటం కొనసాగించారు.
అణచివేత పరిస్థితుల్లోనూ స్వాతంత్ర్య లక్ష్యాన్ని వదులుకూడదని ఆయన యువతకు సందేశాన్ని ఇస్తూ స్ఫూర్తిగా నిలిచారు.
నాయకులు నిర్బంధంలో ఉన్న సమయంలో కూడా భూగర్భ నెట్‌వర్క్‌ల ద్వారా ఉద్యమాన్ని కొనసాగించేందుకు ప్రయత్నించారు. ఆయనకు స్వాతంత్య్రోద్యమంలో వచ్చిన ప్రజాదరణ కేవలం ప్రసంగాల వల్ల కాదు, ప్రమాదాన్ని ఎదుర్కొని ఆచరణలో పోరాడినందువల్ల వచ్చింది.
స్వాతంత్ర్యం తరువాత – అధికారాన్ని ఆశించని నాయకుడు
1947లో భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తరువాత జయప్రకాశ్ నారాయణ్ రాజకీయ జీవితంలో ఒక ముఖ్యమైన మలుపు వచ్చింది.
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్న అనేక మంది నాయకులు ప్రభుత్వ పదవులు చేపట్టి దేశ నిర్మాణంలో భాగమయ్యారు. కానీ జయప్రకాశ్ నారాయణ్ మాత్రం అధికార పదవులకంటే సామాజిక మార్పుకు ప్రాధాన్యం ఇచ్చారు.
1948లో కాంగ్రెస్‌తో సామాజిక వాదుల సంబంధాలు తెగిపోవడంతో, ఆయన స్వతంత్ర సామాజికవాద రాజకీయాల్లో కొనసాగారు.
తరువాత కిసాన్ మజ్దూర్ ప్రజా పార్టీతో కలిసి ప్రజా సోషలిస్టు పార్టీ ఏర్పాటులో కూడా ముఖ్య పాత్ర పోషించారు.
అయితే ఎన్నికల రాజకీయాల ద్వారా మాత్రమే సమాజంలోని లోతైన సమస్యలను పరిష్కరించడం సాధ్యమా అనే ప్రశ్న ఆయనను వెంటాడింది.
జవహర్లాల్ నెహ్రూతో ఆయనకు వ్యక్తిగతంగా సాన్నిహిత్యం ఉన్నప్పటికీ, ఆర్థిక విధానాలు, రాజకీయ వ్యవస్థ, సామాజిక మార్పుల విషయంలో ఇద్దరి మధ్య అభిప్రాయ భేదాలు ఉండేవి.
జయప్రకాశ్ నారాయణ్ దృష్టిలో ప్రభుత్వ మార్పు ఒక్కటే సరిపోదు, సమాజంలోని అధికార సంబంధాలు, ఆర్థిక అసమానతలు, ప్రజల రాజకీయ భాగస్వామ్యంలోనూ మార్పు రావాలి.
ఈ ఆలోచనలే ఆయన క్రమంగా పార్టీ రాజకీయాల నుంచి దూరంగా ఉండటానికి కారణమయ్యాయి.
సర్వోదయ ఉద్యమం, భూదాన ఉద్యమం
1950వ దశకంలో జయప్రకాశ్ నారాయణ్ ఆలోచనల్లో మరో పరిణామం చోటుచేసుకుంది. గాంధేయవాది వినోబా భావే చేపట్టిన భూదాన ఉద్యమం, సర్వోదయ భావజాలం ఆయనను బాగా ఆకర్షించాయి.
భూదాన ఉద్యమం ప్రధాన ఉద్దేశం భూమి లేని పేదలకు భూస్వాములు స్వచ్ఛందంగా భూమిని దానం చేయడం ద్వారా భూ అసమానతలను తగ్గించడం.
ఈ ఉద్యమం ద్వారా గ్రామీణ సమాజంలో స్వచ్ఛంద సహకారం, నైతిక బాధ్యత, అహింసాత్మక మార్పుకు అవకాశం ఉందని ఆయన భావించారు.
1954లో బోధ్ గయలో జయప్రకాశ్ నారాయణ్ తన జీవితాన్ని సర్వోదయ ఉద్యమానికి అంకితం చేస్తున్నట్లు ప్రకటించారు. దీనిని సాధారణంగా “జీవన్ దాన్” నిర్ణయంగా పేర్కొంటారు.
సర్వోదయం అంటే అందరి అభ్యున్నతి. సమాజంలో ఒక వర్గం మాత్రమే అభివృద్ధి చెందడం కాకుండా, పేదలు, భూమి లేని రైతులు, కార్మికులు, అణగారిన వర్గాలు సహా ప్రతి ఒక్కరికీ మెరుగైన జీవితం అందాలి.
గ్రామ స్వరాజ్యం, స్థానిక స్వపరిపాలన, ప్రజల ప్రత్యక్ష భాగస్వామ్యంతో అభివృద్ధి, స్వచ్ఛంద సహకారం, సామాజిక బాధ్యత, కేంద్రీకృత అధికారానికి బదులుగా అధికార వికేంద్రీకరణ, రాజకీయ అధికారంతోపాటు వ్యక్తి, సమాజ నైతిక పరివర్తన ఆయన ప్రాధాన్యం ఇచ్చిన అంశాలు.
అయితే భూదాన ఉద్యమానికి పరిమితులు కూడా ఉన్నాయి. దానం చేసిన భూమిలో కొంత భూమి సాగుకు అనుకూలంగా లేకపోవడం, భూమి బదిలీల అమలులో సమస్యలు, గ్రామీణ అధికార సంబంధాలను పూర్తిగా మార్చలేకపోవడం వంటి విమర్శలు ఉన్నాయి.
ఈ పరిమితులను గుర్తించినప్పటికీ, భూ సమస్యను శాంతియుత మార్గంలో పరిష్కరించడానికి చేసిన ప్రయత్నంగా ఈ ఉద్యమానికి చారిత్రక ప్రాధాన్యం ఉంది.
1974 బీహార్ విద్యార్థి ఉద్యమం
1970వ దశకం ప్రారంభంలో భారతదేశం అనేక ఆర్థిక, రాజకీయ సమస్యలను ఎదుర్కొంది. అంతర్జాతీయ చమురు సంక్షోభం, ధరల పెరుగుదల, నిరుద్యోగం, ఆహార కొరత, ప్రభుత్వ వ్యవస్థల్లో అవినీతి ఆరోపణలు ప్రజల్లో అసంతృప్తిని పెంచాయి.
గుజరాత్లో విద్యార్థులు ప్రారంభించిన నవ నిర్మాణ్ ఉద్యమం తరువాత బీహార్‌లోనూ విద్యార్థి ఉద్యమం బలపడింది.
పరీక్షల్లో అక్రమాలు, విద్యా సమస్యలు, ధరల పెరుగుదల, నిరుద్యోగం, అవినీతికి వ్యతిరేకంగా విద్యార్థులు ఉద్యమించారు.
ఈ పరిస్థితుల్లో విద్యార్థి నాయకులు జయప్రకాశ్ నారాయణ్‌ను తమ ఉద్యమానికి నాయకత్వం వహించమని కోరారు. తొలుత ఆయన సంకోచించినప్పటికీ, ఉద్యమం అహింసాత్మకంగా సాగాలని షరతు పెట్టి నాయకత్వం స్వీకరించారు.
1974లో బీహార్ ఉద్యమం క్రమంగా రాష్ట్ర ప్రభుత్వానికి వ్యతిరేకమైన నిరసనను దాటి జాతీయ రాజకీయాల్లో ముఖ్యమైన పరిణామంగా మారింది.
సంపూర్ణ క్రాంతి పిలుపు
1974 జూన్ 5న పాట్నాలోని గాంధీ మైదానంలో జరిగిన భారీ బహిరంగ సభలో జయప్రకాశ్ నారాయణ్ “సంపూర్ణ క్రాంతి”(టోటల్ రివల్యూషన్)కి పిలుపునిచ్చారు. ఆయన దృష్టిలో దేశ సమస్యలకు పరిష్కారం కేవలం ఒక ప్రభుత్వాన్ని తొలగించి మరో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయడం కాదు. సమాజాన్ని నడిపించే వ్యవస్థలు, విలువలు, సంస్థలు, వ్యక్తుల ప్రవర్తనలో సమగ్ర మార్పు రావాలి.
పరివర్తనలో భాగంగా ఆయన ముఖ్యంగా ఏడు అంశాలను ప్రతిపాదించారు. 1) రాజకీయ పరివర్తన-అవినీతిని తగ్గించడం, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేయడం, ప్రజాప్రతినిధుల జవాబుదారీతనాన్ని పెంచడం. 2) ఆర్థిక పరివర్తన-పేదరికం, ఆర్థిక అసమానతలను తగ్గించడం, అందరికీ ఉపాధి అవకాశాలు కల్పించడం. 3) సామాజిక పరివర్తన-కుల వివక్ష, అంటరానితనం, సామాజిక అణచివేతను నిర్మూలించడం. 4) విద్యా పరివర్తన-విద్యను ఉద్యోగ సాధనంగా మాత్రమే కాకుండా, బాధ్యతాయుతమైన పౌరులను తీర్చిదిద్దే సాధనంగా మార్చడం. 5) సాంస్కృతిక పరివర్తన-మానవ గౌరవం, సహనం, సమానత్వం వంటి విలువలను పెంపొందించడం. 6) మేధో పరివర్తన-మూఢనమ్మకాలకు బదులు శాస్త్రీయ దృక్పథం, స్వతంత్ర ఆలోచనలను ప్రోత్సహించడం. 7) నైతిక పరివర్తన-వ్యక్తిగత జీవితంలో నిజాయితీ, బాధ్యత, సేవాభావాన్ని పెంపొందించడం.
ఈ అంశాలను వేర్వేరు రంగాలుగా వివరించినప్పటికీ, సంపూర్ణ క్రాంతి భావనలో ఇవన్నీ పరస్పరం సంబంధం కలిగినవే.
రాజకీయ వ్యవస్థ మారినా వ్యక్తుల ప్రవర్తన మారకపోతే అవినీతి కొనసాగవచ్చని, ఆర్థికాభివృద్ధి జరిగినా సామాజిక వివక్ష తొలగకపోతే సమానత్వం సాధ్యం కాదని ఆయన భావించారు.
ఈ ఉద్యమం యువతను దేశ రాజకీయాల్లో చురుకైన భాగస్వాములుగా మార్చింది. అవినీతి, ప్రభుత్వ జవాబుదారీతనం, ప్రజాస్వామ్య సంస్థల పనితీరుపై దేశవ్యాప్త చర్చకు దారితీసింది.
అయితే ఉద్యమానికి మద్దతు ఇచ్చిన విభిన్న రాజకీయ శక్తుల మధ్య ఆర్థిక విధానాలు, సామాజిక న్యాయం, కుల సంబంధాలు వంటి అంశాల్లో అభిప్రాయ భేదాలు ఉండేవి. అందువల్ల సంపూర్ణ క్రాంతి కార్యక్రమం తన అన్ని లక్ష్యాలను ఒకే విధంగా అమలు జరగలేదు. దాని చారిత్రక ప్రాధాన్యం మాత్రం ప్రజల అసంతృప్తిని జాతీయ ప్రజాస్వామ్య చర్చగా మలచడంలో, అధికారాన్ని ప్రశ్నించే పౌర ఉద్యమానికి బలమైన నాయకత్వం అందించడంలో ఉంది.
1975 అత్యవసర పరిస్థితి
1975 జూన్ 12న అలహాబాద్ హైకోర్టు అప్పటి ప్రధానమంత్రి ఇందిరా గాంధీ ఎన్నికకు సంబంధించిన కేసులో ఆమె ఎన్నిక చెల్లదని ప్రకటించింది. ఆ తీర్పు తరువాత దేశ రాజకీయాల్లో ఉద్రిక్తత పెరిగింది.
జూన్ 25, 1975న దేశంలో అత్యవసర పరిస్థితి ప్రకటించబడింది.
అత్యవసర పరిస్థితి కాలంలో పౌర స్వేచ్ఛలు నియంత్రించబడ్డాయి. ప్రతిపక్ష నాయకులను అరెస్ట్ చేశారు. ప్రభుత్వాన్ని విమర్శించే కార్యకలాపాలపై ఆంక్షలు, పత్రికలపై సెన్సార్ విధించబడింది.
జయప్రకాశ్ నారాయణ్ కూడా నిర్బంధించబడ్డారు. ఆయన ఆరోగ్యం క్షీణిస్తున్నప్పటికీ, ప్రజాస్వామ్య హక్కుల పరిరక్షణకు తన మద్దతును కొనసాగించారు.
ప్రజాస్వామ్య పరిరక్షణలో జయప్రకాశ్ నారాయణ్ పాత్ర
ఎన్నికైన ప్రభుత్వాన్ని ప్రశ్నించడం మాత్రమే నాటి ఉద్యమ లక్ష్యం కాదు. రాజ్యాంగ పరిమితులు, పౌర స్వేచ్ఛలు, చట్టబద్ధమైన పరిపాలనకు సంబంధించిన ప్రశ్నలను ఆ ఉద్యమం ముందుకు తెచ్చింది.
అత్యవసర పరిస్థితి సమయంలో ప్రజాస్వామ్యాన్ని కాపాడేందుకు విభిన్న ప్రతిపక్ష పార్టీలు ఒకే వేదిక పైకి రావడానికి జయప్రకాశ్ నారాయణ్ కృషి చేశారు.
అయితే ఆయన ఇచ్చిన కొన్ని పిలుపులు కొంత గందరగోళానికి దారితీశాయి. ముఖ్యంగా ప్రభుత్వ యంత్రాంగం, పోలీసులు, సైన్యం తమకు అనైతికంగా లేదా రాజ్యాంగవిరుద్ధంగా అనిపించే ఆదేశాలను పాటించకూడదనే పిలుపు. ఆయన ఉద్దేశం రాజ్యాంగ విలువల పరిరక్షణగా వివరించబడినప్పటికీ, అటువంటి పిలుపుల పరిమితులు, ప్రభుత్వ స్థిరత్వంపై వాటి ప్రభావం గురించి భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి.
1977 ఎన్నికలు – ప్రజా తీర్పు, అధికార మార్పు
1977లో అత్యవసర పరిస్థితి ఎత్తివేసిన తరువాత లోక్‌సభ ఎన్నికలు జరిగాయి. జయప్రకాశ్ నారాయణ్ మద్దతుతో వివిధ ప్రతిపక్ష శక్తులు ఏకమై జనతా పార్టీ ఏర్పాటుకు దోహదపడ్డాయి. 1977 ఎన్నికల్లో కాంగ్రెస్ ఓడిపోయి, జనతా పార్టీ కేంద్రంలో ప్రభుత్వం ఏర్పాటు చేసింది.
భారతదేశంలో మొదటిసారి కాంగ్రెసేతర ప్రభుత్వం కేంద్రంలో అధికారంలోకి రావడం ప్రజాస్వామ్య చరిత్రలో ముఖ్యమైన మలుపుగా నిలిచింది.
జయప్రకాశ్ నారాయణ్ ప్రభుత్వ పదవిని స్వీకరించలేదు. ఆయన పాత్ర ప్రధానంగా ప్రతిపక్ష ఐక్యతకు, ప్రజాస్వామ్య పునరుద్ధరణకు మద్దతు ఇవ్వడం వరకే పరిమితం.
అయితే జనతా పార్టీ ప్రభుత్వం అంతర్గత విభేదాలను ఎదుర్కొని 1979లో కూలిపోయింది. ఈ పరిణామం ఒక ముఖ్యమైన గుణపాఠం అయింది.
ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం వివిధ శక్తులు ఏకమవడం అవసరమే అయినప్పటికీ, దీర్ఘకాలిక పాలన కోసం ఉమ్మడి విధానాలు, అంతర్గత ప్రజాస్వామ్యం, సామాజిక-ఆర్థిక సంబంధాలపై స్పష్టత కూడా అవసరం.
వ్యక్తిగత జీవితం, చివరి రోజులు
జయప్రకాశ్ నారాయణ్ భార్య ప్రభావతి దేవి కూడా గాంధేయ భావజాలంతో ప్రభావితమైన సామాజిక కార్యకర్తగా పనిచేశారు. వారి జీవితంలో ప్రజాసేవ, వ్యక్తిగత త్యాగం, సామాజిక బాధ్యతలకు విశేష ప్రాధాన్యం ఉంది.
జయప్రకాశ్ నారాయణ్ జీవితపు చివరి దశలో తీవ్ర ఆరోగ్య సమస్యలను ఎదుర్కొన్నారు. 1979 అక్టోబర్ 8న పాట్నాలో ఆయన మరణించారు. తన 77వ జన్మదినానికి మూడు రోజుల ముందు ఆయన కన్నుమూశారు.
ఆయనకు 1965లో రామన్ మెగసెసే అవార్డు లభించింది. 1998లో భారత ప్రభుత్వం భారతరత్న పురస్కారాన్ని ప్రకటించింది.
భారతదేశంలో ప్రజాస్వామ్య విలువలు, సామాజిక సేవ, జాతీయోద్యమానికి చేసిన సేవలకు గుర్తుగా ఆయనకు ఈ గౌరవాలు లభించాయి.
జయప్రకాశ్ నారాయణ్‌ను కేవలం ఇందిరా గాంధీ ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఉద్యమించిన నాయకుడిగా మాత్రమే చూడడం పొరపాటు. ఆయన రాజకీయ ప్రయాణం స్వాతంత్ర్యోద్యమం నుంచి సామాజిక వాదం, అక్కడి నుంచి సర్వోదయం, చివరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం సాగిన ఉద్యమం వరకు విస్తరించింది.
జయప్రకాశ్ నారాయణ్ జీవితం భారతదేశ రాజకీయ చరిత్రలో ఒక ప్రత్యేకమైన ప్రయాణం. బ్రిటిష్ పాలనకు వ్యతిరేకంగా పోరాడిన స్వాతంత్ర్య సమరయోధుడిగా ప్రారంభమైన ఆయన ప్రస్థానం, ఆర్థిక సమానత్వం కోసం కృషి చేసిన సామాజిక వాదిగా, గ్రామీణ పునర్నిర్మాణాన్ని సమర్థించిన సర్వోదయ కార్యకర్తగా, చివరకు ప్రజాస్వామ్య పరిరక్షణ కోసం దేశవ్యాప్త ఉద్యమానికి నాయకత్వం వహించిన లోక నాయకుడిగా పరిణామం చెందింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
