New Zealand General Election Results: The Current Situation
న్యూజిలాండ్‌లో సాధారణ ఎన్నికలు నవంబర్ 7వ తేదీన జరిగాయి ప్రాథమిక ఫలితాలలో ఏ పార్టీకి పూర్తి మెజారిటీ రాలేదు పోస్టల్ బ్యాలెట్లు విదేశాలలో ఉన్నవారు వేసిన ఓట్లు కూడా లెక్కించి నవంబర్ 27న తుది ఫలితాలు ప్రకటించారు.
న్యూజిలాండ్ రాజకీయ వ్యవస్థ – ఎన్నికల విధానం:
న్యూజిలాండ్‌లో Mixed Member Proportional (MMP) అనే దామాషా ప్రాతినిధ్య ఎన్నికల విధానం అమలులో ఉంది. ఈ విధానంలో ఓటర్లకు రెండు ఓట్లు ఉంటాయి. ఒకటి తమ నియోజకవర్గం నుంచి పోటీ చేసే అభ్యర్థికి. రెండవది తాము మద్దతు ఇచ్చే రాజకీయ పార్టీకి.
పార్లమెంటులో పార్టీలకు లభించే మొత్తం స్థానాలు ప్రధానంగా పార్టీకి వచ్చిన ఓట్ల శాతాన్ని అనుసరించి నిర్ణయిస్తారు. నియోజకవర్గ స్థానాలతోపాటు పార్టీ జాబితా ద్వారా కూడా సభ్యులు ఎన్నిక అవుతారు. ఈ విధానం వల్ల చిన్న పార్టీలకు కూడా పార్లమెంటులో ప్రాతినిధ్యం పొందే అవకాశం ఉంటుంది. ఒక పార్టీకి పూర్తి మెజారిటీ రాకపోతే ఇతర పార్టీలతో కలిసి సంకీర్ణ ప్రభుత్వం ఏర్పాటు చేయాల్సి ఉంటుంది.
దక్షిణ పసిఫిక్ మహాసముద్ర ప్రాంతంలో ఉన్న న్యూజిలాండ్ ఒక పార్లమెంటరీ ప్రజాస్వామ్య దేశం. ఇక్కడ ఎన్నికల ద్వారా పార్లమెంటు సభ్యులను ఎన్నుకుంటారు. ఆ పార్లమెంటులో మెజారిటీ మద్దతు పొందిన పార్టీ లేదా పార్టీల కూటమి ప్రభుత్వం ఏర్పాటు చేస్తుంది. 2026 నవంబర్ 7న న్యూజిలాండ్‌లో సాధారణ ఎన్నికలు జరిగాయి. నవంబర్ 7న వెలువడిన ప్రాథమిక ఫలితాలకు, నవంబర్ 27న ప్రకటించిన తుది అధికారిక ఫలితాలకు మధ్య గణనీయమైన మార్పు వచ్చింది.
తుది ఫలితాల్లో అధికారంలో ఉన్న క్రిస్టోఫర్ లక్సన్ నేతృత్వంలోని నేషనల్ పార్టీ కూటమికి ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన మెజారిటీ లభించలేదు. దీంతో కొత్తగా పార్లమెంటులోకి వచ్చిన ఆపర్చునిటీ పార్టీ కీలక పాత్రలోకి వచ్చింది. ప్రస్తుతం ప్రభుత్వం ఏర్పాటు కోసం రాజకీయ చర్చలు జరుగుతున్నాయి.
ఎన్నికల పూర్వ రంగం-ప్రధాన రాజకీయ పరిస్థితులు:
2023 ఎన్నికల్లో నేషనల్ పార్టీ నేతృత్వంలోని కూటమి అధికారంలోకి వచ్చింది. క్రిస్టోఫర్ లక్సన్ ప్రధానమంత్రి అయ్యారు. ACT, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీలతో కలిసి ప్రభుత్వం ఏర్పాటు చేశారు. 2026 ఎన్నికల సమయానికి ఆ ప్రభుత్వ పాలనపై అనేక అంశాల్లో ప్రజల్లో చర్చ జరిగింది.
ఆర్థిక పరిస్థితి, జీవన వ్యయం:
నిత్యావసర సరుకుల ధరలు, ఇళ్లు, అద్దెలు, విద్యుత్, రవాణా వంటి ఖర్చులు సాధారణ కుటుంబాలపై భారంగా మారాయి. ద్రవ్యోల్బణం, ఆర్థిక మందగమనం, ఉద్యోగావకాశాలు సమస్యలు ఎన్నికల్లో ప్రధాన చర్చనీయాంశాలుగా నిలిచాయి. ఉద్యోగ భద్రత, వేతనాల పెరుగుదల, యువతకు ఉద్యోగావకాశాలు, కార్మికుల జీవన ప్రమాణాలు వంటి అంశాలు ఓటర్ల చర్చల్లో చోటు చేసుకున్నాయి.
ఆరోగ్యం, విద్య, సంక్షేమం-ప్రభుత్వ వైద్య సేవలు, ఆసుపత్రుల్లో అందుబాటులో ఉన్న సదుపాయాలు, విద్యా రంగంలో ప్రభుత్వ బాధ్యత, సామాజిక సంక్షేమ పథకాలపై ప్రధాన పార్టీల మధ్య విధానపరమైన చర్చ జరిగింది. పర్యావరణం, వాతావరణ మార్పులు-పర్యావరణ పరిరక్షణ, సముద్ర వనరులు, మత్స్య సంపద, వాతావరణ మార్పుల ప్రభావం వంటి అంశాలు ముఖ్యంగా గ్రీన్ పార్టీ, ఆపర్చునిటీ పార్టీ విధానాల్లో ప్రాధాన్యత పొందాయి.
ప్రభుత్వ పాలనపై ప్రజల అభిప్రాయం:
అధికార కూటమి ఆర్థిక విధానాలు, ప్రభుత్వ ఖర్చుల నియంత్రణ, సంక్షేమ విధానాల మార్పులు, ప్రజా సేవల నిర్వహణపై ఎన్నికల సమయంలో చర్చ సాగింది.ఈ నేపథ్యంలో ప్రజలు రెండు ప్రధాన పార్టీలతోపాటు చిన్న పార్టీలకు కూడా గణనీయమైన ఓట్లు వేశారు. ప్రధాన పార్టీలకు 30 శాతం కంటే తక్కువ ఓట్లు రావడం ఈ ఎన్నికల్లో గమనించాల్సిన అంశం.
2026 నవంబర్ 7 ఎన్నికల ఫలితాలు-తుది అధికారిక గణాంకాలు:
న్యూజిలాండ్ ఎన్నికల కమిషన్ నవంబర్ 27 న ప్రకటించిన అధికారిక ఫలితాల ప్రకారం పార్లమెంటులో మొత్తం 130 స్థానాలు ఉన్నాయి. లేబర్ పార్టీకి 29.8%ఓట్లు 36 స్థానాలు, నేషనల్ పార్టీ(అధికార పార్టీ) 28.35% ఓట్లు,40 స్థానాలు, గ్రీన్ పార్టీ 14.06% ఓట్లు,17 స్థానాలు, ACT పార్టీ 10.54%ఓట్లు 13 స్థానాలు, న్యూజిలాండ్ ఫస్ట్ 9.60% ఓట్లు 12 స్థానాలు, ఆపర్చునిటీ పార్టీ6.06% ఓట్లు 7 స్థానాలు, తే పాటి మావోరి0.63% ఓట్లు 5 స్థానాలు సాధించాయి.
ఈ ఫలితాల్లోని ప్రత్యేక అంశాలు:
లేబర్ పార్టీకి అత్యధిక పార్టీ ఓట్లు వచ్చాయి. కానీ నియోజకవర్గ, జాబితా స్థానాల కలయికలో నేషనల్ పార్టీకి 40 స్థానాలు, లేబర్ పార్టీకి 36 స్థానాలు వచ్చాయి. నేషనల్ పార్టీ 40 స్థానాలతో అతిపెద్ద పార్లమెంటరీ పార్టీగా నిలిచింది. గ్రీన్ పార్టీ 17 స్థానాలు సాధించింది. ACT పార్టీకి 13, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీకి 12 స్థానాలు వచ్చాయి. ఆపర్చునిటీ పార్టీ తొలిసారిగా ఏడు స్థానాలతో పార్లమెంటులోకి ప్రవేశించింది. తే పాటి మావోరి పార్టీకి ఐదు స్థానాలు లభించాయి. మొత్తం 2,931,604 ఓట్లు నమోదయ్యాయి. ఓటు హక్కు కోసం నమోదు చేసుకున్నవారిలో 77.2 శాతం మంది ఓటు వేశారు.
ప్రాథమిక ఫలితాలకు, తుది ఫలితాలకు మధ్య మార్పు ముఖ్యమైనది:
నవంబర్ 7న వెలువడిన ప్రాథమిక ఫలితాల్లో నేషనల్ పార్టీకి 42 స్థానాలు వచ్చాయి. దాని మిత్రపక్షాలైన ACT, న్యూజిలాండ్ ఫస్ట్‌కు కలిపి 67 స్థానాలు లభించాయి. 131 స్థానాలుగా అంచనా వేసిన పార్లమెంటులో 66 స్థానాలు మెజారిటీకి అవసరం అయ్యాయి. అయితే విదేశాల్లో ఉన్నవారు, తమ నియోజకవర్గం వెలుపల ఓటు వేసినవారు తదితర ప్రత్యేక ఓట్లను లెక్కించిన తరువాత పరిస్థితి మారింది.
నవంబర్ 27న తుది ఫలితాలు ప్రకటించగా నేషనల్ పార్టీ స్థానాలు 42 నుంచి 40కి తగ్గాయి. గ్రీన్ పార్టీ స్థానాలు 16 నుంచి 17కి పెరిగాయి. పార్లమెంటు మొత్తం స్థానాలు 130గా ఖరారు అయినాయి. నేషనల్–ACT–న్యూజిలాండ్ ఫస్ట్ కూటమికి కలిపి 65 స్థానాలే వచ్చాయి. ప్రభుత్వ ఏర్పాటుకు 130 స్థానాల్లో కనీసం 66 స్థానాలు అవసరం. అంటే అధికార కూటమికి ఒక స్థానం తక్కువైంది.
ఆపర్చునిటీ పార్టీ-ప్రభుత్వ ఏర్పాటులో కీలక పాత్ర:
ఈ ఎన్నికల్లో అందరి దృష్టిని ఆకర్షించిన కొత్త రాజకీయ శక్తి ఆపర్చునిటీ పార్టీ. ఈ పార్టీకి క్యూలే వాంగ్ నాయకత్వం వహిస్తున్నారు. గతంలో పలు మార్లు పార్లమెంటులో ప్రవేశించడానికి ప్రయత్నించిన ఈ పార్టీ 2026 ఎన్నికల్లో ఏడు స్థానాలు సాధించి తొలిసారిగా పార్లమెంటులోకి వచ్చింది. ఈ పార్టీకి 6.06 శాతం పార్టీ ఓట్లు లభించాయి. ఈ పార్టీకి వచ్చిన ఏడు స్థానాల మద్దతు లభిస్తే అధికార కూటమికి 72 స్థానాల మద్దతు లభించే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ ఏర్పాటుకు ప్రయత్నాలు:
2026 నవంబర్ 27 నాటికి అందుబాటులో ఉన్న సమాచారం ప్రకారం క్రిస్టోఫర్ లక్సన్(అధికార కూటమి) తన కూటమిని కొనసాగించేందుకు ఆపర్చునిటీ పార్టీతో చర్చలు ప్రారంభించాలని నిర్ణయించారు. ఇప్పటికే నేషనల్, ACT, న్యూజిలాండ్ ఫస్ట్ పార్టీల మధ్య ఉన్న రాజకీయ అవగాహనకు ఆపర్చునిటీ పార్టీ మద్దతు అవసరం ఏర్పడింది. ఆపర్చునిటీ పార్టీ నాయకురాలు క్యూలే వాంగ్, అత్యధిక స్థానాలు పొందిన పార్టీతో ముందుగా చర్చలు జరుపుతామని ప్రకటించారు. పర్యావరణ విధానాలు, సముద్ర వనరుల పరిరక్షణ, రాజకీయ విరాళాల నియంత్రణ వంటి అంశాలను తమ పార్టీ ప్రధాన షరతులుగా పేర్కొన్నారు.
లేబర్ పార్టీ నాయకుడు క్రిస్ హిప్కిన్స్ కూడా ప్రస్తుత సంఖ్యాబలంతో తమ పక్షం ప్రభుత్వం ఏర్పాటు చేయలేదని అంగీకరించారు. ప్రభుత్వ ఏర్పాటుపై చర్చలు సంక్లిష్టంగా ఉండవచ్చని, అవి కొంతకాలం కొనసాగవచ్చని లక్సన్ పేర్కొన్నారు. చర్చలు విఫలమైతే మరో ఎన్నిక జరిగే అవకాశాన్ని కూడా పూర్తిగా తోసిపుచ్చ లేమని వార్తా నివేదికలు పేర్కొంటున్నాయి.
ఎన్నికల ఫలితాలపై రాజకీయ విశ్లేషణ:
ఈ ఎన్నికలను పరిశీలించినప్పుడు కొన్ని ముఖ్యమైన రాజకీయ అంశాలు కనిపిస్తున్నాయి. మొదటిది – ప్రధాన పార్టీలపై ప్రజల అసంతృప్తి. నేషనల్, లేబర్ అనే రెండు ప్రధాన పార్టీలకు కలిపి 58.23 శాతం ఓట్లు వచ్చాయి. అంటే దాదాపు 42 శాతం ఓట్లు ఇతర పార్టీలకు వెళ్లాయి. రెండు ప్రధాన పార్టీల్లో ఏ ఒక్కటీ 30 శాతం ఓట్లను కూడా దాటలేక పోయింది.
రెండవది – చిన్న పార్టీల ప్రాధాన్యత పెరగడం గ్రీన్, ACT, న్యూజిలాండ్ ఫస్ట్, ఆపర్చునిటీ వంటి పార్టీలకు గణనీయమైన ప్రాతినిధ్యం లభించింది. ఇది న్యూజిలాండ్ రాజకీయాల్లో విభిన్న విధానాలకు ప్రజలు మద్దతు తెలుపుతున్నారని సూచిస్తుంది. మూడవది ఆర్థిక సమస్యల ప్రభావం-జీవన వ్యయం, ఉద్యోగాలు, గృహ నిర్మాణం, ప్రజా సేవలు వంటి అంశాలు ఎన్నికల రాజకీయాలను ప్రభావితం చేశాయి. ఎన్నికల ఫలితాలను కేవలం పార్టీల సిద్ధాంతాల ఆధారంగా కాకుండా ప్రజల ఆర్థిక పరిస్థితులతో అనుసంధానించి చూడాల్సిన అవసరం ఉంది. నాలుగవది సంకీర్ణ రాజకీయాల ప్రాధాన్యత-దామాషా ప్రాతినిధ్య విధానంలో చిన్న పార్టీలకు కూడా ప్రభుత్వ ఏర్పాటులో నిర్ణయాత్మక పాత్ర లభించ వచ్చని ఈ ఎన్నిక మరోసారి నిరూపించింది.
న్యూజిలాండ్ భవిష్యత్తు రాజకీయ పరిణామాలు:
ప్రస్తుత పరిస్థితుల్లో మూడు అంశాలు పరిశీలించాల్సి ఉంది. నేషనల్ పార్టీ ఆపర్చునిటీ పార్టీ మద్దతుతో ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయగలదా? ప్రభుత్వ కార్యక్రమాల్లో ఆపర్చునిటీ పార్టీ పర్యావరణ, ఆర్థిక విధానాలకు ఎంత ప్రాధాన్యత లభిస్తుంది? అధికార కూటమి కొనసాగితే ప్రజల జీవన వ్యయం, ఉపాధి, ఆరోగ్యం, విద్య వంటి సమస్యల పరిష్కారానికి ఎలాంటి విధానాలు అనుసరిస్తుంది?
ప్రత్యేకంగా గమనించాల్సిన విషయం ఏమిటంటే, ప్రభుత్వ ఏర్పాటులో రాజకీయ పార్టీల మధ్య కుదిరే ఒప్పందం కేవలం పదవుల పంపకాలకే పరిమితం కాకుండా విధానపరమైన అంశాలను కూడా కలిగి ఉండాలి. ప్రజలు ఓటు వేసింది తమ జీవన పరిస్థితుల్లో మార్పు కోసం. ఆ ఆశలను కొత్త ప్రభుత్వం ఏ మేరకు నెరవేరుస్తుంది అనేది కీలకం.
ముగింపు:
న్యూజిలాండ్ 2026 ఎన్నికలు ఆ దేశ రాజకీయాల్లో ఒక ముఖ్యమైన మలుపు. అధికారంలో ఉన్న నేషనల్ పార్టీ కూటమి తిరిగి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, తుది ఫలితాలు దానికి స్పష్టమైన మెజారిటీని ఇవ్వలేదు.
ప్రధాన ప్రతిపక్షమైన లేబర్ పార్టీకి అత్యధిక పార్టీ ఓట్లు వచ్చినా, ప్రభుత్వ ఏర్పాటుకు అవసరమైన సంఖ్యాబలం లభించలేదు. మరో వైపు కొత్తగా పార్లమెంటులోకి వచ్చిన ఆపర్చునిటీ పార్టీ ప్రభుత్వ ఏర్పాటులో కీలక స్థానాన్ని సంపాదించింది. ఈ ఎన్నికలు ప్రజాస్వామ్యంలో ఓటర్ల తీర్పు ఎంత ముఖ్యమో, దామాషా ప్రాతినిధ్య వ్యవస్థలో చిన్న పార్టీలకు కూడా ఎంత ప్రాధాన్యత ఉంటుందో తెలియజేస్తున్నాయి.
ఆర్. లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
