పైపుల ద్వారా గ్యాస్ సరఫరాను(పైప్డ్ గ్యాస్) ప్రోత్సహిస్తున్నప్పటికీ, ఇప్పటివరకు 5 లక్షల కొత్త కనెక్షన్లతో కలిపి కేవలం 1.6 కోట్ల గృహాలు మాత్రమే దీనిని వినియోగిస్తున్నాయి.
మరోవైపు దేశంలో 33 కోట్ల ఇళ్లు ఎల్పీజీ పైనే ఆధారపడ్డాయి. అయినప్పటికీ ఎల్పీజీకి సంబంధించి భారత్ వద్ద ఎలాంటి దీర్ఘకాలిక వ్యూహాత్మక నిల్వలు లేకపోవడం గమనార్హం.
న్యూఢిల్లీ: భారతదేశం ప్రస్తుతం ప్రతిరోజూ సుమారు 4 లక్షల(400,000) బ్యారెళ్ల లిక్విఫైడ్ పెట్రోలియం గ్యాస్(ఎల్పీజీ) సరఫరా కొరతను ఎదుర్కొంటోందని ‘నిక్కీ ఆసియా’ నివేదిక వెల్లడించింది.
“ఇరాన్‌పై యుద్ధం కారణంగా పడిపోయిన దిగుమతులను భర్తీ చేయడంలో దేశీయ ఉత్పత్తి విఫలమవుతోంది”అని ఆ నివేదిక పేర్కొంది.
సగానికి పడిపోయిన దిగుమతులు..
డేటా అనలిటిక్స్ సంస్థ ‘కెప్లర్’ గణాంకాలను ఉటంకిస్తూ వచ్చిన ఈ నివేదిక ప్రకారం- ఏప్రిల్‌లో రోజుకు కేవలం 3,77,620 ఎల్పీజీ బ్యారెళ్లు మాత్రమే భారత్‌కు చేరుకున్నాయి.
ఇది ఫిబ్రవరిలో దిగుమతి చేసుకున్న రోజువారీ సగటు(8,51,870 బ్యారెళ్లు)లో సగానికంటే తక్కువ.
ఫిబ్రవరి 28న ఇరాన్‌పై అమెరికా, ఇజ్రాయెల్ దాడుల అనంతరం, హర్ముజ్ జలసంధి పూర్తిగా మూతపడకపోయినా, దాని గుండా రాకపోకలపై తీవ్రమైన ఆంక్షలు విధించారు.
దేశీయంగా ఎల్పీజీ ఉత్పత్తి పెరిగినప్పటికీ, ఆ పెరుగుదల రోజుకు 75,000 బ్యారెల్స్ మాత్రమే కావడం గమనార్హం.
దిగుమతులు పూర్తిగా సాధారణ స్థితికి చేరుకునేంత వరకు ఈ సరఫరా లోటు కొనసాగవచ్చని కెప్లర్ సంస్థకు చెందిన రిఫైనింగ్, సప్లై విభాగపు ప్రధాన విశ్లేషకుడు సుమిత్ రిటోలియా ‘నిక్కీ’కి తెలిపారు.
దేశీయ ఎల్పీజీ సరఫరా ఇప్పటికే గరిష్ట స్థాయికి చేరుకుందని, ఇకపై అది పెరిగే అవకాశం లేదని ఆయన స్పష్టం చేశారు.
నిల్వలపై మంత్రుల భరోసా.. కానీ..
మార్చి నెలలో గృహ వినియోగ ఎల్పీజీ సిలిండర్ ధరను ప్రభుత్వం రూ 60 మేర పెంచింది. భారత్ వద్ద ఎల్పీజీకి సంబంధించి దీర్ఘకాలిక వ్యూహాత్మక నిల్వలు లేవు.
అయితే, గత వారం జరిగిన సీఐఐ(సీఐఐ) వార్షిక వ్యాపార సదస్సులో మంత్రి హర్దీప్ సింగ్ పూరి మాట్లాడుతూ- “ఎలాంటి సంక్షోభం లేదు. మన వద్ద 45 రోజులకు సరిపడా ఎల్పీజీ నిల్వలు, అలాగే 69 రోజులకు సరిపడా ముడిచమురు, సహజ వాయువు నిల్వలు ఉన్నాయి” అని ప్రకటించారు.
పశ్చిమాసియా సంక్షోభం ప్రభావం..
భారత్ తన మొత్తం ఎల్పీజీ అవసరాల్లో మూడింట రెండు వంతులను విదేశాల నుంచే దిగుమతి చేసుకుంటోంది. ఇందులో 80 శాతం దిగుమతులు హర్ముజ్ జలసంధి గుండానే వస్తాయి.
అయితే, హర్ముజ్ జలసంధి అకస్మాత్తుగా తెరుచుకున్నప్పటికీ భారత్ కష్టాలు తీరకపోవచ్చని నిక్కీ నివేదిక పేర్కొంది.
ఎందుకంటే, భారత్‌కు దాదాపు 80% ఎల్పీజీని సరఫరా చేసే యూఏఈ, ఖతార్, కువైట్, సౌదీ అరేబియాల ఇంధన మౌలిక సదుపాయాలపై దాడులు జరిగాయి.
వీటి మరమ్మతులకు కొన్నేళ్ల సమయం పట్టే అవకాశం ఉంది.
ఏప్రిల్‌లో ఈ నాలుగు దేశాల నుంచి భారత్‌కు జరిగిన ఎల్పీజీ దిగుమతులు రోజుకు 1,73,000 బ్యారెళ్లకు పడిపోయాయి. ఇది ఫిబ్రవరి స్థాయి కంటే దాదాపు 75 శాతం తక్కువ.
ప్రత్యామ్నాయ మార్గాల అన్వేషణలో జాప్యం..
ఎల్పీజీ సరఫరా కోసం భారత్ ప్రత్యామ్నాయ మార్గాలను అన్వేషిస్తోంది. ఇందులో భాగంగా ఇరాన్, ఆస్ట్రేలియా, అర్జెంటీనా, చిలీ దేశాల నుంచి కొనుగోళ్లు ప్రారంభించింది.
అయితే గత నెలలో ఈ నాలుగు దేశాల నుంచి రోజుకు 43,000 బ్యారెళ్లు మాత్రమే వచ్చాయి. ఫిబ్రవరిలో పశ్చిమాసియాలోని నాలుగు ప్రధాన దేశాలు సరఫరా చేసిన 6,78,000 బ్యారెళ్లతో పోలిస్తే ఇది చాలా తక్కువ.
ఆస్ట్రేలియా నుంచి ఎల్పీజీ భారత్‌కు చేరుకోవడానికి సుమారు 20 రోజులు పడుతుందని, అదే అర్జెంటీనా, అమెరికాల నుంచి రావడానికి 35 నుంచి 45 రోజుల సమయం పడుతుందని రిటోలియా వెల్లడించారు.
అదే హర్ముజ్ జలసంధి గుండా పశ్చిమాసియా నుంచి కేవలం ఐదారు రోజుల్లోనే దిగుమతులు చేరుకుంటాయి.
బ్లాక్ మార్కెట్లో భగ్గుమంటున్న ధరలు..
ప్రభుత్వం ప్రజలను సహజ వాయువు నుంచి లభించే పైప్డ్ గ్యాస్(పైపుల ద్వారా గ్యాస్ సరఫరా) వైపు మళ్లించేందుకు ప్రయత్నిస్తోంది. మార్చిలో భారత్ ఐదు లక్షలకు పైగా కొత్త పైప్డ్ గ్యాస్ కనెక్షన్లను ఇచ్చింది. అయినప్పటికీ, ఇది కేవలం 1.6 కోట్ల గృహాలకు మాత్రమే చేరువైంది. మరోవైపు 33 కోట్ల ఇళ్లలో ఎల్పీజీ సిలిండర్లనే ఉపయోగిస్తున్నారు.
ఈ సరఫరా సంక్షోభం గ్రే, బ్లాక్ మార్కెట్లలో ఎల్పీజీ ధరలు అమాంతం పెరగడానికి దారితీసింది. దీంతో ఈ నెల ప్రారంభంలోనే ఎల్పీజీ ధర రూ 993 మేర భారీగా పెరిగింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
