ప్రధాన ఎన్నికల కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకుంటున్నారని రితికా చోప్రా పరిశోధనాత్మక వివరాలను ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రిక సెప్టెంబర్ 23న వెల్లడించింది. ఆపాటికి ఎన్నికల ప్రధాన అధికారిపై ఉన్న అనుమానాలు వాస్తవాలని బట్టబయలైంది. ఫలితంగా దేశవ్యాప్తంగా నిరసన వెల్లువలు పెల్లుబికాయి.
ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలి లేదా ప్రభుత్వం ఆయనని ఆ పదవి నుంచి తప్పించాలనే డిమాండ్ ముందుకొచ్చింది. వివిధ వర్గాలు రకరకాల పద్ధతులలో నిరసనలు తెలియజేస్తున్నాయి.
ఆందోళనలకు మరింత బలం
ఈ క్రమంలో ఫారం 6లో జరిగిన మార్పులకు తమకు సంబంధం లేదని, తాము ఆమోదించలేదని సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి స్వయంగా ప్రకటించారు. ఇది ఆందోళనలకు మరింత బలాన్ని చేకూర్చింది. దాంతో ఆందోళనలు తీవ్ర రూపం దాల్చాయి.
ముఖ్యంగా లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీ, రాజ్యసభలో ప్రతిపక్ష నాయకుడు మల్లికార్జున ఖర్గేతో సహా ప్రతిపక్ష పార్టీల ఎంపీలు సుమారు రెండు వందల మందికి పైగా 2026 అక్టోబర్ 6న చీఫ్ ఎలక్షన్ కమిషనర్‌ను కలవడానికి ప్రయత్నం చేశారు. కానీ అందుకు వారిని అనుమతించకుండా పోలీసులు అడ్డుకున్నారు.
ఎనిమిది గంటలకు పైగా ఎంపీలు రోడ్డుపై బైఠాయించిన తర్వాత పోలీసులు వారందరినీ అరెస్టు చేసి తీసుకెళ్లారు.
రెండవ రోజు జంతర్ మంతర్ వద్ద నిరసన కోసం వెళ్తుండగా మరలా పోలీసులు అడ్డుకొని వారందరిని అదుపులోకి తీసుకున్నారు.
మూడవ రోజు గాంధీ స్మృతి చిహ్నమైన రాజ్‌ఘాట్ వద్ద ఎంపీలు నిరసన తెలియజేశారు. సమస్య పరిష్కారమయ్యే దాకా ఈ ఆందోళన కొనసాగుతుందని ప్రతిపక్ష పార్టీలు స్పష్టం చేశాయి.
రాష్ట్రపతి అపాయింట్మెంట్ కోసం యత్నాలు
అదే సందర్భంలో ఈ సమస్యపై రాష్ట్రపతి ద్రౌపది ముర్మును ఇండియా బ్లాక్ నేతలు కలవడానికి అపాయింట్మెంట్ కోసం లేఖ రాశారు. ఎవరెవరు కలవబోతున్నారు, వారి పేర్లు ఇవ్వమని రాష్ట్రపతి కార్యాలయం నుండి సమాధానం వచ్చింది.
వెంటనే పేర్లతో సహా 7, 8, 9 తేదీలలో ఏదో ఒక రోజు అపాయింట్మెంట్ ఇవ్వమని మరలా ఇండియా బ్లాక్ నేతలు రాష్ట్రపతికి లేఖ రాశారు. ఆ రోజు మధ్యాహ్నం పన్నెండు గంటల వరకు రాష్ట్రపతి కార్యాలయం నుండి ఎలాంటి సమాధానం రాలేదు. అపాయింట్మెంట్ ఇవ్వలేదు.
2026 అక్టోబర్ 9న మధ్యాహ్నం మూడు గంటలకు పాత పార్లమెంట్ భవనంలో ప్రతిపక్ష ఎంపీలు సమావేశం అయ్యారు. ఆ తర్వాత ద్రౌపది ముర్మును కలిశారు.
పదో తేదీన జంతర్ మంతర్ వద్ద నిరసన
పదో తేదీన కాక్రోచ్ జనతా పార్టీ, అనేక ఇతర విద్యార్థి సంస్థలు జంతర్ మంతర్ వద్ద నిరసనకు పిలుపునిచ్చాయి. ఎనిమిదో తేదీ నుంచి పోలీసుల నిఘా ఎక్కువైంది.
ప్రభుత్వం ఏడు వేలకు పైగా పారామిలిటరీ దళాలను వివిధ ప్రాంతాల నుంచి ఢిల్లీకి తరలించి పూర్తి పోలీస్ నిర్బంధంలో ఢిల్లీ నగరాన్ని ఉంచింది.
పదవ తేదీ ఢిల్లీలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేయాలని ప్రభుత్వం ఆదేశాలు ఇచ్చింది, అలాగే వివిధ ప్రాంతాల నుండి ఢిల్లీ చేరుకునే పలు రైళ్లను రద్దు చేసింది.
విద్యార్థులు, యువకుల కదలికలు, వారి సోషల్ మీడియా వేదికలపై నిఘా పెట్టింది. ఈ వ్యవహారంపై ఇంత పెద్ద ఎత్తున నిరసనలు, ఆందోళనలు జరగాల్సిన అవసరం ఉందా? అనేది కీలకమైన ప్రశ్న. దీనిపై ప్రజలలో పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్నది.
ఇండియన్ ఎక్స్‌ప్రెస్ పత్రికలో చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకున్నారని ఆధారాలతో సహా బయట పెడుతూ వార్తా కథనం వచ్చిన వెంటనే ప్రభుత్వం కొన్ని చర్యలు తీసుకొని ఉండాల్సింది.
ప్రభుత్వం ఏం చేసి ఉండాల్సింది?
1. అన్ని పార్టీలతో అఖిలపక్ష సమావేశం ఏర్పాటు చేసి అందులో చర్చించి ఉండవచ్చు.
2. జాయింట్ పార్లమెంటరీ కమిటీ నియమించి ఉండవచ్చు.
3. మాజీ చీఫ్ ఎలక్షన్ కమిషనర్ ఎస్ వై ఖురేషి లాంటి సీనియర్ మాజీ ఐఏఎస్ అధికారులతో ఒక స్వతంత్ర విచారణ కమిటీని నియమించి ఉండవచ్చు.
4. సుప్రీంకోర్టులో రిటైర్ అయిన న్యాయమూర్తులతో ఒక కమిటీని నియమించి విచారణకు ఆదేశించి ఉండవచ్చు.
వీటిలో ఏది చేసినా ప్రభుత్వ ప్రతిష్ట పెరిగి ఉండేది. ప్రతిపక్షాల ఆందోళనకు అవకాశాలు సన్నగిల్లేవి. కానీ ప్రభుత్వం ఇందులో ఏవీ చేయలేదు.
వాజ్‌పేయి మంత్రివర్గంలోని మాజీ కేంద్ర మంత్రి, మాజీ ఐఏఎస్ అధికారి యశ్వంత్ సిన్హా కూడా ప్రధాన ఎన్నికల కమిషనర్ వ్యవహార శైలిపైన, ఓటర్ల జాబితా(ఎస్ఐఆర్) అమలు జరుగుతున్న తీరు పైన తీవ్రంగా స్పందించారు.
మదన్ బి లోకుర్తో సహా కొద్దిమంది సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తులు వీటిపై తీవ్రంగా స్పందించారు. ప్రస్తుత సుప్రీంకోర్టు న్యాయమూర్తి ఉజ్జల్ భూయాన్ హైదరాబాద్ నల్సార్ విశ్వవిద్యాలయంలో ఉపన్యాసిస్తూ, “కోట్లాది మంది యువతీ యువకులను ఓటర్ల జాబితా నుండి తొలగించడం తప్పు” అని స్పష్టం చేశారు. అయినా ఇవేవీ ప్రభుత్వానికి పట్టలేదు.
ఆత్మరక్షణలో కేంద్ర ప్రభుత్వం
ఇప్పుడు ఆర్ఎస్ఎస్ భావజాలంతో ఉన్న రిటైర్ అయిన హైకోర్టు, సుప్రీంకోర్టు న్యాయమూర్తులతో దేశంలో జరుగుతున్న ఆందోళనకు వ్యతిరేకంగా ప్రభుత్వం ప్రకటనలు ఇప్పిస్తున్నది. అంటే ప్రభుత్వం ఆత్మరక్షణలో పడిందని రుజువు చేసుకోవడం తప్ప మరొకటి కాదు.
ఒక అధికారి అనుసరించాల్సిన పద్ధతులకు భిన్నంగా వ్యవహరించారని సాక్ష్యాధారాలతో సహా ఆరోపణలు వెలుగులోకి వచ్చిన వెంటనే సదరు అధికారిని కేంద్ర ప్రభుత్వం సస్పెండ్ చేయవచ్చు. లేదా కనీసం ఆ స్థానం నుంచి తప్పించవచ్చు.
ప్రభుత్వ శాఖలు ప్రభుత్వ రంగ సంస్థలలోని చిన్నపాటి ఉద్యోగులపై కూడా ఏ విధమైన ఆరోపణలు వచ్చినా ముందుగా వారిని సస్పెండ్ చేయడం లేదా ఆ స్థానం నుంచి మార్చి విచారణ నిర్వహించడం సర్వసాధారణం. కానీ దేశంలో అత్యున్నత స్థానం, రాజ్యాంగ పరిధిలో ఉన్న సంస్థ అధిపతి అయిన అధికారిపై ఆరోపణలు వచ్చినప్పుడు ప్రభుత్వం మౌనంగా ఉండటం ప్రమాదకర సంకేతం.
గత అనుభవాలు
గతంలో నీలం సంజీవరెడ్డి ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిగా ఉన్న కాలంలో రాష్ట్రంలో బస్సు రూట్ల జాతీయకరణ విషయంలో వివాదం కోర్టుకు వెళ్ళింది.
ప్రభుత్వం అనుసరించిన పద్ధతులపైన కోర్టు కొన్ని వ్యాఖ్యలు చేసింది. అందులో ముఖ్యమంత్రిపై హైకోర్టు ఎలాంటి వ్యాఖ్యలు చేయలేదు. అయినప్పటికీ సంజీవరెడ్డి నైతిక బాధ్యత వహిస్తూ ముఖ్యమంత్రి పదవికి రాజీనామా చేశారు. వారు ఆ తర్వాత భారతదేశ రాష్ట్రపతిగా కూడా పనిచేశారు.
లాల్ బహదూర్ శాస్త్రి రైల్వే శాఖ మంత్రిగా ఉన్న కాలంలో రైల్వే ప్రమాదాలకు నైతిక బాధ్యత వహిస్తూ తన పదవికి రాజీనామా చేశారు. వారు ఆ తర్వాత కాలంలో భారత ప్రధానిగా కూడా పనిచేశారు.
వారి అంతటికంటే ప్రస్తుత చీఫ్ ఎలక్షన్ కమిషనర్ జ్ఞానేశ్ కుమార్ ఉన్నతుడా? రాజ్యాంగానికి అతీతుడా? ఈ ప్రశ్నలకు సమాధానం చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై లేదా? ఇవి నేడు దేశవ్యాప్తంగా జరుగుతున్న చర్చలు.
రానున్న కాలంలో పెద్ద ఎత్తున నిరసన వెల్లువలు తలెత్తేదాకా ప్రభుత్వం మౌనం వహించడం మంచిది కాదు.
ఎప్పటికైనా మొండి పట్టుదల, మౌనం వదిలి ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్‌ను తక్షణం సస్పెండ్ చేయాలి, లేదా ఆ బాధ్యతల నుండి తప్పించాలి.
ఆ తర్వాత ఎలాంటి విచారణ పద్ధతులనైనా అమలు చేయొచ్చు. ఇంతకుమించి ప్రస్తుత సమస్యకు పరిష్కారం లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
