నిరసన హక్కును సమర్థిస్తూనే సుప్రీంకోర్టు నిరసనలు చట్టపరిధిలో ఉండాలని సూచించింది.
సుప్రీంకోర్టులో శుక్రవారం ఢిల్లీలో అనూహ్యంగా మోహరించిన బలగాలు, విధించిన నియంత్రణల విషయం చర్చకు వచ్చింది.
సీనియర్ అడ్వకేట్, రాజ్యసభ సభ్యులు కపిల్ సిబల్ ఢిల్లీలో మెట్రో రైళ్ల రద్దు, భారీ సాయుధ బలగాల మోహరింపు, నిరసనకారులపై నియంత్రణల గురించి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నేతృత్వంలో ఉన్న ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
“అన్ని రైళ్లు రద్దయ్యాయి. మెట్రో స్టేషన్లు బంద్ అయ్యాయి. ఎక్కడికీ వెళ్లలేని పరిస్థితి. నా దేశానికి ఏమవుతుంది? ఇది శాంతియుత నిరసన మాత్రమే కదా” అని కపిల్ సుప్రీంకోర్టు దృష్టికి తెచ్చారు.
రాజధాని దిగ్బంధనంపై ప్రశ్నలు
ఓటర్ల జాబితా ప్రత్యేక సవరణ చట్టబద్ధతపై ప్రశ్నలు వెల్లువెత్తుతున్న నేపథ్యంలో ఎన్నికల సంఘం ప్రధాన కమిషనర్ జ్ఞానేష్ కుమార్ రాజీనామా డిమాండ్‌తో అక్టోబర్ 10వ తేదీన ఢిల్లీ జంతర్ మంతర్‌లో నిరసనకు పిలుపునిచ్చారు.
ఈ నేపథ్యంలో వివిధ రాష్ట్రాల నుంచి ఢిల్లీకి వచ్చే రైళ్లు నిలిపివేశారు. రాజధానిలోని 57 మెట్రో స్టేషన్లను మూసివేశారు.
ధర్నా నిర్వహణకు కాక్రొచ్ జనతా పార్టీ అనుమతి కోసం పెట్టుకున్న అర్జీని ఢిల్లీ పోలీసులు నిరాకరించారు.
సీనియర్ అడ్వకేట్ గోపాల్ శంకర్ నారాయణ్ జోక్యం చేసుకుంటూ మీ వైఫల్యం కోసం రాజధానిని దిగ్బంధనం చేస్తారా అని నిలదీశారు.
విచారణలో భాగంగా అర్జీదారులు సుప్రీంకోర్టుకి సమర్పించిన 16 పేజీల పిటిషన్‌తో పాటు ఢిల్లీ పోలీసులు ఇచ్చిన అడ్వైజరీ, భారతీయ న్యాయ సంహిత (బిఎన్ఎస్) కింద జారీ చేసిన ఆదేశాలు, మీడియా కథనాలు, చివరకు ఉబర్, ర్యాపిడో వంటి కాల్ టాక్సీ సేవలు కూడా రద్దు చేయటం వంటి విషయాలను జత చేశారు.
రాజధానిలో తొలిసారి ప్రదర్శన స్థలాలపై ఆంక్షలతో పాటు నివాస ప్రాంతాలు, హోటళ్లను కూడా నిరసనకారుల కోసం తనిఖీలు చేయటం ఇదే మొదటిసారి.
అనుమతి లేకపోతే పర్యవసానాలు
ఈ పిటిషన్ మీద స్పందిస్తూ సుప్రీంకోర్టు న్యాయమూర్తి జాయ్‌మాల్యా బాగ్చీ నిరసన హక్కును సమర్థిస్తూనే నిరసనలు చట్టపరిధిలో ఉండాలని అభిప్రాయపడ్డారు.
“చట్టపరంగా చూసినపుడు సంఘం పెట్టుకునే హక్కు, సమీకరణ అయ్యే హక్కు సహజ హక్కులే. అయితే ఇవి చట్టం అనుమతించిన పరిధిలో ఉండాలి” అన్నారు.
నిరసన ప్రదర్శనకు అనుమతించాలని పోలీసులను కోరినా వారు తిరస్కరించిన విషయాన్ని న్యాయవాదులు ధర్మాసనం దృష్టికి తెచ్చారు.
ఈ విషయంపై స్పందిస్తూ బాగ్చీ “ముందుగా నిరసనకు సంబంధించిన విషయాలను అర్థం చేసుకుందాం. అనుమతితో నిరసన వ్యక్తం చేస్తే అది చట్టబద్ధమైనది. చట్టాన్ని పాటించడంలో చిన్నచితక పొరపాట్లు దొర్లినా ప్రజలకు అసలు నిరసన తెలియజేసే హక్కు లేదని మాత్రం మేము చెప్పము. అయితే చట్టం అనుమతి లేకుండా నిరసన కార్యక్రమాలు జరిపితే ఎదురయ్యే పర్యవసానాలకు వారే బాధ్యులు అవుతారు” అన్నారు.
సమన్వయం కోసం గడువు
ఆంక్షల గురించి ప్రస్తావిస్తూ ఆంక్షల విషయంలో జోక్యం చేసుకోవాలంటే నిరసనల విషయంలో కూడా జోక్యం చేసుకోవాలి, కానీ నిరసన వారి హక్కు కదా అన్నారు.
ఈ రెండిటినీ సమన్వయం చేయటానికి మా దగ్గర త్రాసు ఏమీ లేదని వ్యాఖ్యానిస్తూ న్యాయస్థానానికి కొంచెం గడువు కావాలన్నారు. ఈ నిరసన కార్యక్రమ నిర్వాహకులు ఎవరు, నిరసనలో ఎంత మంది హాజరయ్యే అవకాశం ఉందో తెలియజేయాలని న్యాయస్థానం కోరింది.
న్యాయస్థానం మరింత వివరణ ఇస్తూ, “మా ముందు రెండు రకాల బృందాలు ఉన్నాయి. తమ ప్రాథమిక హక్కులు తమకు కావాలని కోరుతున్న ప్రజలు ఒక వైపు, నిరసన తెలియజేయాలి అనుకుంటున్న బృందం మరోవైపు ఉన్నాయి. అయితే ఈ నిరసన నిర్వాహకుల వివరాలు తమ వద్ద లేవని న్యాయస్థానం అభిప్రాయపడింది. న్యాయస్థానం కోరిన వివరాలతో తిరిగి వస్తాము” అని పిటిషనర్ల తరఫున న్యాయవాదులు కోర్టుకు తెలియజేశారు.
విచారణలు విన్న తర్వాత సుప్రీంకోర్టు అక్టోబర్ 10వ తేదీ రాజధానిలో అన్ని మెట్రో రైళ్లను రద్దు చేయడం సరైనది కాదని స్పష్టం చేసింది.
అయితే ఈ 57 మెట్రో స్టేషన్ల ద్వారా ప్రయాణించాలనుకున్న నిరసనకారులకు, సాధారణ పౌరులకు ఎటువంటి వెసులుబాటు కల్పించారనే విషయంపై సుప్రీంకోర్టు స్పష్టత ఇవ్వలేదు.
నగరాన్ని నిర్బంధించడం సరికాదు
బార్ అండ్ బెంచ్ కథనం ప్రకారం నిరసనలను నియంత్రించే పేరుతో యావత్ నగరాన్ని నిర్బంధించడం సరైనది కాదని, ఇటువంటి చర్యలు సాధారణ ప్రజానీకానికి పెద్ద ఎత్తున అసౌకర్యం కలిగిస్తాయని సుప్రీంకోర్టు ధర్మాసనం వ్యాఖ్యానించింది.
ప్రభుత్వ నిర్ణయాలపై ప్రచారం అవసరం
కేంద్ర ప్రభుత్వం తరఫున వాదనలు వినిపించిన సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతా, మెట్రో రైళ్లు, సాధారణ రైల్వే స్టేషన్ల మూసివేతకు సంబంధించి ప్రభుత్వ యంత్రాంగం తీసుకున్న నిర్ణయాన్ని పునఃపరిశీలించాల్సిందిగా కోరే ప్రయత్నం చేస్తానని సుప్రీంకోర్టుకు హామీ ఇచ్చారు.
ఈ హామీ నేపథ్యంలో సుప్రీంకోర్టు స్పందిస్తూ మెట్రో రైళ్ల రాకపోకలను పూర్తిగా నిలిపివేయరాదని స్పష్టం చేస్తున్నాము అని తెలిపింది.
మెట్రో రైళ్లు, ఇతర రైళ్ల రాకపోకల నియంత్రణకు సంబంధించిన ప్రభుత్వ నిర్ణయాలను పూర్తిస్థాయిలో ప్రజలకు చేరవేసేలా చర్యలు తీసుకోవాలని, తగినంత ప్రచారం కల్పించాలని, తద్వారా ప్రజలకు కలిగే అసౌకర్యాన్ని తగ్గించవచ్చని సుప్రీంకోర్టు అభిప్రాయపడింది.
ఢిల్లీ పోలీసులు ట్రాఫిక్ అడ్వైజరీని కూడా విడుదల చేయాలని సుప్రీంకోర్టు సూచించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
