సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి నిరుద్యోగ యువకులను ఉద్దేశించి చేసిన ఒక వ్యాఖ్య పెద్ద సంచలనాన్ని సృష్టించింది.
అది భారత రాజకీయాల్లో ఒక అసాధారణమైన, వినూత్నమైన రాజకీయ పార్టీ “బొద్దింక జనతా పార్టీ” ఆన్లైన్ వేదికగా ఏర్పాటుకు దారితీసింది. దీనిపై ఇప్పుడు విస్తృత చర్చలు జరుగుతున్నాయి.
నిరంతరం అన్ని ఇళ్లలో చికాకు కలిగించే కీటకాల(బొద్దింకల) నుంచి ప్రేరణ పొందిన ఒక వ్యంగ్య బృందం, వారం రోజులలోపే లక్షలాది ఆన్లైన్ అనుచరులను, ప్రధాన స్రవంతి మీడియా దృష్టిని ఆకర్షించి, అనుభవజ్ఞులైన రాజకీయ నాయకులను సైతం నివ్వెరపరిచింది.
ప్రధాన న్యాయమూర్తి వ్యాఖ్యల నుంచి పుట్టిన ఆలోచన..
భారత ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్ చేసిన వివాదాస్పద వ్యాఖ్యల తర్వాత గత వారం బొద్దింక వార్తల్లోకి వచ్చింది.
ఒక విచారణ సందర్భంగా, జర్నలిజం, క్రియాశీలత వైపు మళ్లుతున్న నిరుద్యోగ యువతను ఆయన బొద్దింకలు, పరాన్నజీవులతో పోల్చారనే ఆరోపణలు ఉన్నాయి.
తాను ప్రత్యేకంగా ‘నకిలీ, బూటకపు డిగ్రీలు’ ఉన్న వ్యక్తులను ఉద్దేశించి మాత్రమే మాట్లాడానని, అంతేగానీ మొత్తం భారతదేశ యువతను కాదని ఆయన తర్వాత స్పష్టం చేశారు.
అయితే, అప్పటికే ఆ వ్యాఖ్యలు ఆన్లైన్లో విస్తృతంగా వ్యాపించి ఆగ్రహానికి, జోకులకు దారితీశాయి.
అంతేకాకుండా ‘బొద్దింక జనతా పార్టీ'(సీజేపీ) అనే ఒక హాస్యభరితమైన రాజకీయ భావన కూడా పుట్టుకొచ్చింది. 2014 నుంచి అధికారంలో ఉన్న భారత ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి చెందిన భారతీయ జనతా పార్టీకి(బీజేపీ) ఇది ఒక పేరడీ.
అప్పటి నుంచి పత్రికా స్వేచ్ఛ, పౌర హక్కులు క్షీణించాయని విమర్శకులు, హక్కుల సంఘాలు ఆరోపించగా, బీజేపీ దీనిని ఖండించింది.
సీజేపీ అంటే ఏమిటి? ఎవరు స్థాపించారు?..
సీజేపీ ఒక అధికారిక రాజకీయ పార్టీ కాదు. ఇది రాజకీయ వ్యంగ్యం ఆధారంగా రూపుదిద్దుకున్న ఒక ఆన్లైన్ ఉద్యమం.
దీని హాస్యభరితమైన సభ్యత్వ ప్రమాణాలలో నిరుద్యోగిగా ఉండటం, సోమరిగా ఉండటం, నిరంతరం ఆన్లైన్లో ఉండటంతో పాటు “వృత్తిపరంగా విమర్శించగల సామర్థ్యం” కలిగి ఉండటం వంటివి ఉన్నాయి.
దీనిని బోస్టన్ విశ్వవిద్యాలయంలో విద్యార్థి, రాజకీయ ప్రచార వ్యూహకర్త అయిన 30 ఏళ్ల అభిజీత్ దీప్కే సృష్టించారు.
ఈ ఆలోచన కేవలం ఒక తమాషాగా పుట్టిందని ఆయన చెబుతున్నారు.
అమెరికాకు వెళ్లడానికి ముందు ఆయన దశాబ్దానికి పైగా, భారతదేశంలో అవినీతి వ్యతిరేక ఉద్యమం నుంచి ఉద్భవించి, బలమైన సోషల్ మీడియా ఉనికికి పేరుగాంచిన ఆమ్ ఆద్మీ పార్టీ(ఆప్)తో కలిసి పనిచేశారు.
“మనమందరం కలిసికట్టుగా ఉండి, బహుశా ఒక వేదికను ప్రారంభించాలని నేను అనుకున్నాను” అని ఆయన బీబీసీ మరాఠీతో అన్నారు. ఆ తర్వాత అతను ఊహించిన దానికంటే అది చాలా పెద్ద సంచలనం సృష్టించింది.
ఆన్లైన్ నుంచి ఆఫ్‌లైన్ దాకా.. సోషల్ మీడియాలో రికార్డులు..
కొద్ది రోజుల్లోనే, సీజేపీ గూగుల్ ప్లాట్‌ఫామ్ ద్వారా వేల కొద్దీ సైన్-అప్‌లను సేకరించింది. “నేను కూడా బొద్దింకనే” అనే హ్యాష్‌ట్యాగ్ ద్వారా ప్రతిపక్ష నాయకుల నుంచి మద్దతు పొందింది.
బుధవారం ప్రతిపక్ష నాయకుడు అఖిలేష్ యాదవ్(ఎస్పీ) ‘ఎక్స్’లో ‘బీజేపీ వర్సెస్ సీజేపీ’ అని పోస్ట్ చేశారు.
ఈ చర్చ ఆఫ్‌లైన్‌కు కూడా వ్యాపించింది. యువ వాలంటీర్లు బొద్దింకల వేషధారణలో క్లీన్-అప్ డ్రైవ్‌లు, నిరసనలలో పాల్గొన్నారు. ఈ లేబుల్‌ను వారు నాటకీయంగా స్వీకరించారు.
గురువారం నాటికి సీజేపీ ఇన్స్టాగ్రామ్ ఖాతా 10 మిలియన్ల(కోటి) మంది ఫాలోవర్లను దాటింది.
ప్రపంచంలోనే అతిపెద్ద రాజకీయ పార్టీగా విస్తృతంగా గుర్తింపు పొందిన, దాదాపు 8.7 మిలియన్ల ఇన్స్టాగ్రామ్ ఫాలోవర్లు ఉన్న బీజేపీ అధికారిక ఖాతాను సైతం ఇది అధిగమించింది.
అయితే 2,00,000 కంటే ఎక్కువ మంది ఫాలోవర్లు ఉన్న సీజేపీ “ఎక్స్” ఖాతా ప్రస్తుతం భారతదేశంలో కనిపించడం లేదు.
దానిని వీక్షించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తులకు “చట్టపరమైన డిమాండ్‌కు ప్రతిస్పందనగా ఖాతా నిలిపివేయబడింది” అని సందేశం వస్తోంది.
సీజేపీ ఎదుగుదల వేగం, స్థాయి చాలా మందిని ఆశ్చర్యపరిచింది. అయితే ఇది భారతదేశంలో క్షేత్రస్థాయిలో రాజకీయ మార్పుగా పరిణమిస్తుందనడానికి ఇప్పటివరకు ఆధారాలు తక్కువగానే ఉన్నాయి.
సీజేపీ సోషల్ మీడియాలో రాజకీయ పార్టీలను అధిగమించినప్పటికీ, బీజేపీ, ప్రతిపక్ష కాంగ్రెస్‌లు నేటికీ దేశంలో ఆధిపత్య రాజకీయ శక్తులుగా కొనసాగుతున్నాయి.
వీరికి దేశవ్యాప్తంగా లక్షలాది మంది క్రియాశీల సభ్యులు ఉన్నారు.
అయినప్పటికీ సీజేపీ ఊపు పెరుగుతూనే ఉంది. పార్టీకి సభ్యత్వం కోసం గూగుల్ ఫారమ్‌తో కూడిన ఒక వెబ్సైట్ కూడా ఉంది.
యువతలో విస్తృతంగా పెరుగుతున్న అసమ్మతి పట్ల విరోధంగా భావించే ప్రస్తుత రాజకీయ సంస్కృతిలో, సీజేపీ ఒక “తాజా గాలి”(బ్రీత్ ఆఫ్ ఫ్రెష్ ఎయిర్) లాంటిదని ఒక అభిమాని వ్యాఖ్యానించారు.
సీజేపీకి మద్దతు పలికిన వారిలో మహువా మోయిత్రా, కీర్తి ఆజాద్ వంటి ప్రతిపక్ష రాజకీయ నాయకులు, సీనియర్ న్యాయవాది ప్రశాంత్ భూషణ్ కూడా ఉన్నారు.
విమర్శకులు మాత్రం దీనిని ప్రతిపక్షానికి సంబంధించిన ఆన్లైన్ రాజకీయ నాటకంగా కొట్టిపారేశారు.
దీప్కేకి ఆప్‌తో ఉన్న మునుపటి అనుబంధాన్ని ఎత్తిచూపుతూ, ఇది జాగ్రత్తగా ప్యాక్ చేయబడిన డిజిటల్ రాజకీయం మాత్రమేనని, ఆకస్మికంగా పుట్టుకొచ్చిన తిరుగుబాటు ఏమీ కాదని వ్యాఖ్యానించారు.
యువతలో అసంతృప్తికి ప్రతీక..
తక్షణ ప్రతిచర్యలకు అతీతంగా, సీజేపీ అనేక మంది యువ భారతీయుల్లో పేరుకుపోయిన తరాల అలసటకు ఒక సూచికగా మారింది.
తాము నిరంతరం ఆన్లైన్లో రాజకీయాలకు గురవుతున్నామని, కానీ అందులో తమకు లభిస్తున్న ప్రాతినిధ్యం చాలా తక్కువ అని వారు భావిస్తున్నారు.
ప్రపంచంలోనే అత్యధిక యువ జనాభా ఉన్న దేశాలలో భారతదేశం ఒకటి. ఇక్కడి 140 కోట్ల జనాభాలో దాదాపు సగం మంది 30 ఏళ్లలోపు వారే.
అయినప్పటికీ, అధికారిక రాజకీయాల్లో వారి భాగస్వామ్యం పరిమితంగానే ఉంది.
ఇటీవలి ఒక సర్వేలో 29 శాతం మంది యువ భారతీయులు రాజకీయాలకు పూర్తిగా దూరంగా ఉన్నారని, కేవలం 11 శాతం మంది మాత్రమే ఏదైనా రాజకీయ పార్టీలో సభ్యులుగా ఉన్నారని తేలింది.
“తమ మాట ఎవరూ వినడం లేదని, తమకు సరైన ప్రాతినిధ్యం దక్కడం లేదని భావించడం వల్లే ప్రజలు నిరాశ చెందుతున్నారు” అని దీప్కే అన్నారు.
దక్షిణాసియా అంతటా, ఇటీవలి సంవత్సరాలలో నిరుద్యోగం, ధరల పెరుగుదల, స్తంభించిపోయిన భవిష్యత్తుపై ఆగ్రహంతో యువత నేతృత్వంలో నిరసనల వెల్లువ మొదలైంది.
ఇది శ్రీలంక, నేపాల్, బంగ్లాదేశ్‌లలో ప్రభుత్వాలను సైతం కూలదోసింది. భారతదేశంలో ఇప్పటివరకు అలాంటిదేమీ జరగలేదు. కానీ ఇక్కడి పరిస్థితులు, ఒత్తిళ్లు కూడా వాటికి సుపరిచితమైనవే. వేగంగా అభివృద్ధి చెందుతున్న ఆర్థిక వ్యవస్థగా ప్రచారం జరుగుతున్నప్పటికీ పని, అసమానతలు, పెరుగుతున్న జీవన ఖర్చుల గురించిన ఆందోళనలు మాత్రం పెరుగుతూనే ఉన్నాయి.
యుక్తవయస్సులోకి అడుగుపెడుతున్న చాలామందికి, విద్య అనేది ఇకపై స్థిరమైన ఉపాధికి హామీ ఇవ్వడం లేదు. ఉన్నత స్థాయికి ఎదుగుతామనే ఆశ సైతం అంతకంతకూ అడుగంటిపోతోంది.
భారతదేశ పరిస్థితి భిన్నంగా ఉందని చెబుతూ, నేపాల్, శ్రీలంకలోని అల్లర్లతో పోలికలను దీప్కే తిరస్కరించినప్పటికీ, యువతలో పెరుగుతున్న నిరాశ వాస్తవమేనని, అది కేవలం ఆన్లైన్ మార్గాల్లో వ్యక్తమవుతోందని ఆయన అన్నారు.
“జెన్ జెడ్ యువత సాంప్రదాయ రాజకీయ పార్టీలపై ఆశ వదులుకున్నారు. తమకు అర్థమయ్యే భాషలో సొంత రాజకీయ వేదికను సృష్టించుకోవాలని వారు కోరుకుంటున్నారు” అని ఆయన అన్నారు.
వ్యంగ్యం వెనుక దాగిన రాజకీయ వాస్తవికత..
సీజేపీ వెబ్సైట్ ఈ దృక్పథాన్ని ప్రతిబింబిస్తుంది. అది ఒక రాజకీయ ప్రణాళికలా కాకుండా, ఇంటర్నెట్ సంస్కృతిలో రూపుదిద్దుకున్న వేదికలా కనిపిస్తుంది. ఇది తమను తాము “సోమరులు, నిరుద్యోగుల గొంతుక”గా అభివర్ణించుకుంటూనే, “సున్నా స్పాన్సర్లు”, “ఒక మొండి మూక” అని చెప్పుకుంటూ, “అంతా బాగానే ఉందని నటిస్తూ విసిగిపోయిన” ప్రజలను ఉద్యమంలో చేరమని ఆహ్వానిస్తోంది.
ఇందులో నకిలీ ఫారాలు, ఉద్దేశపూర్వకంగానే గరుకుగా ఉండే అంచులు, ఒక సంస్థలా కాకుండా ఒక అంతర్గత పరిహాసంలా అనిపించే దృశ్య భాష ఉన్నాయి.
అయినప్పటికీ, ఆ హాస్యంలో జవాబుదారీతనం, మీడియా సంస్కరణలు, ఎన్నికల పారదర్శకత, మహిళలకు విస్తృత ప్రాతినిధ్యం వంటి సుపరిచితమైన రాజకీయ వాదనలు దాగి ఉన్నాయి. వాటితో పాటుగా, నిరాశాజనకమైన వార్తలను చదవడం, నిరుద్యోగం, సాధారణ రాజకీయ అలసట వంటి వాటిపై స్వీయ నిందతో కూడిన జోకులు కూడా ఉన్నాయి.
వ్యంగ్యానికీ, నిష్కపటానికీ మధ్య ఉండే దాని ధోరణియే దాని ఆకర్షణలో ఒక భాగం. నిరుద్యోగం, అసమానతలు, అవినీతి, రాజకీయ ఒంటరితనం వంటి వాటి వెనుక ఉన్న అసంతృప్తులు మనకు సుపరిచితమైనవే కాబట్టి ఆ జోకులు బాగా పేలుతున్నాయి.
బొద్దింకనే ఎందుకు ఎంచుకున్నారు?..
చిహ్నం ఎంపిక కూడా సరైనదేనని చాలామంది అభిప్రాయపడ్డారు. బొద్దింక వీరోచితమైనది, ఆదర్శప్రాయమైనదీ కాదు. కానీ మరింత ప్రాథమికమైనది. అది దృఢమైనది. పరిస్థితులకు అనుగుణంగా మారగలది. చాలా తక్కువ అంచనాలతో ప్రతికూల పరిస్థితులలో కూడా జీవించగల సామర్థ్యం దానికి ఉంది.
వాస్తవానికి, హాస్యం, రాజకీయాలు ఇలా కలగలిసిపోవడం కొత్తేమీ కాదు. ఇటలీలో హాస్యనటుడు బెప్పె గ్రిల్లో వ్యవస్థపై ఉన్న వ్యతిరేక హాస్యాన్ని ‘ఫైవ్ స్టార్ మూవ్మెంట్’గా మళ్లించగా, ఉక్రెయిన్‌లో వోలోడిమిర్ జెలెన్స్కీ టెలివిజన్‌లో ఒక కల్పిత అధ్యక్షుడి పాత్ర నుండి ఏకంగా నిజమైన అధ్యక్షుడిగా మారారు.
అమెరికాలో డొనాల్డ్ ట్రంప్ శకం, ఇప్పటికే ఒక పేరడీలా అనిపించే రాజకీయ వాస్తవికత కింద వ్యంగ్యమే కుప్పకూలడం ప్రారంభించిందా అనే దానిపై పదేపదే వాదనలను రేకెత్తించింది.
భారతదేశపు వెర్షన్ మరింతగా ఆన్లైన్ రూపంలో ఉంది. హ్యాష్‌ట్యాగ్‌లు, మానసిక అలసట, వ్యంగ్య నిరాశలచే రూపుదిద్దుకున్న, మీమ్‌ల ఆధారిత కీటకాల నేపథ్య ఉద్యమం ఇది.
తొలిచూపులో ఇది అసాధారణంగా అనిపిస్తుంది. కానీ భారత రాజకీయాల్లో ఇది పూర్తిగా అసందర్భమైనదేమీ కాదు. హిమాలయ గుహలలో ధ్యానం చేయడం నుంచి, పార్టీలు మారే క్రమంలో శాసనసభ్యులను బస్సుల్లోకి బలవంతంగా ఎక్కించడం, హోటళ్లలో నిర్బంధించడం వంటి దృశ్యాల వరకు ఇక్కడి రాజకీయ నాయకులు ఎప్పటినుంచో ఆర్భాటపు శక్తిని అందిపుచ్చుకున్నారు.
మీమ్ పార్టీలు.. భవిష్యత్తుకు మార్గదర్శకాలా?..
ఆన్లైన్ ప్రచారాలు గరిష్ట రీచ్ కోసం జాగ్రత్తగా రూపొందించిన వైరల్ వీడియోలు, ఆకట్టుకునే నినాదాలపై ఆధారపడి ఉంటాయి.
ఈ నేపథ్యంలో, కీటకాల ఇతివృత్తంతో కూడిన రాజకీయ సమూహం వింతగానే ఉన్నా ఆచరణీయంగా అనిపిస్తుంది. ఇది ఇంత వేగంగా ఎందుకు వ్యాపించిందో వివరించడానికి కూడా ఇది సహాయపడుతుంది. యువ భారతీయులు మరో రాజకీయ పార్టీని కోరుకుంటున్నందు వల్ల ఇది జరగలేదు, చాలామంది తమ నిరాశను వ్యక్తం చేయడానికి ఒక భాష కోసం వెతుకుతున్నందువల్ల ఇది జరిగింది.
“సీజేపీ కేవలం ఒక ఆరంభం మాత్రమేనని నేను భావిస్తున్నాను” అని దీప్కే అన్నారు. “యువత ప్రస్తుత రాజకీయ వ్యవస్థతో విసిగిపోయారు. మున్ముందు మరిన్ని యువజన సంఘాలు ముందుకు వస్తాయి.” అయితే, ఆ పార్టీ ఎంత వేగంగా ఆవిర్భవించిందో అంతే వేగంగా కనుమరుగయ్యే అవకాశం ఉందని కొందరు అంటున్నారు.
ఏది ఏమైనప్పటికీ, సీజేపీ ఇప్పటికే భారత రాజకీయాల్లో ఒక అసాధారణమైన పని చేసింది. కొంతమంది యువతకు తాత్కాలికంగానైనా తాము గుర్తించబడ్డామనే భావనను కలిగించింది.
గత కాలాల్లో, యువత రాజకీయ ఆగ్రహం మేనిఫెస్టోలను సృష్టించింది. కానీ 2026లో అది కీటకాల మస్కట్లతో మీమ్ పార్టీలను సృష్టిస్తోంది.
బీబీసీ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని ది వైర్ తెలుగు పాఠకులకు అందిస్తున్నాము.
స్వేచ్ఛానువాదం: ఆర్ లక్ష్మయ్య
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
