ప్రజలు వీధుల్లోకి వస్తున్నారు. తమ గళాన్ని వినిపిస్తున్నారు. సమాజంలో తమ ఉనికిని, ప్రాధాన్యతను చాటుకుంటున్నారు. ఢిల్లీ, ముంబై, శాంతినికేతన్, జైపూర్ నగరాలలో ప్రజలు తీవ్రమైన ఆగ్రహంతో వీధుల్లోకి వస్తున్నారు. అహంకారపూరితంగా వ్యవహరిస్తున్న ప్రభుత్వ వైఖరిపై నిరసన వ్యక్తం చేస్తున్నారు.
నిరాహార దీక్షతో క్షీణించిన సోనమ్ వాంగ్చుక్ను ప్రభుత్వ భద్రతా సిబ్బంది తెల్లటి దుప్పట్లలో చుట్టి, జంతర్ మంతర్ నుంచి బలవంతంగా తరలించిన ఆ దృశ్యం ప్రజల మనోభావాలను తీవ్రంగా కలచివేసింది.
మన విద్యావ్యవస్థ నిర్మాణాత్మక పతనానికి బాధ్యత వహించాలని ప్రభుత్వాన్ని వేడుకుంటూ, శాంతియుతంగా నిరాహారదీక్ష చేస్తున్న ఒక నిస్సహాయ వ్యక్తిపై, రాజ్యం అహంకారపూరితంగా తన అధికారాన్ని ప్రయోగించడాన్ని పౌరులు ఆ క్షణంలో ప్రత్యక్షంగా వీక్షించారు. రోజురోజుకూ ఆయన శరీరం శుష్కించిపోవడాన్ని వారు గమనించారు.
ప్రభుత్వం వహించిన క్రూరమైన మౌనాన్ని భరించారు. చివరకు, ఆయనను అపహరించినట్లుగా తరలించడాన్ని కూడా చూశారు. అధికార వ్యవస్థ తన క్రూరమైన నగ్న స్వరూపాన్ని వారి కళ్ల ముందే ప్రదర్శించింది.
ప్రజల ప్రతిఘటన..
అయితే, ఇది కేవలం సోనమ్ వాంగ్చుక్కు జరిగిన అవమానం మాత్రమే కాదు; ప్రజలు దీనిని తమపై జరిగిన ప్రత్యక్ష దాడిగా భావించారు. ఇది వారిని సుదీర్ఘ నిద్రావస్థ నుంచి ఒక్కసారిగా మేల్కొలిపింది. లేదా బహుశా, ఏళ్ల తరబడి వారి హృదయాల్లో నిశ్శబ్దంగా పేరుకుపోతున్న ఆవేదన చివరకు బద్దలై ఉండవచ్చు.
ఇప్పుడు, తమతో చర్చలు జరపడానికి ప్రభుత్వం ఒక ప్రతినిధిని పంపుతుందా లేదా అన్నది వారికి ముఖ్యం కాదు. వారు వీధుల్లోకి వస్తున్నారు; తమ గళాన్ని వినిపిస్తున్నారు. సమాజంలో తమ ఉనికిని, తమకూ ప్రాధాన్యత ఉందనే విషయాన్ని చాటుకుంటున్నారు.
వాంగ్‌చుక్ కేంద్ర బిందువు కాదా?
ఈ ఉద్యమం తన పరిధిని దాటి విస్తరించిందనే విషయాన్ని సోనమ్ వాంగ్‌చుక్ గుర్తించి ఉండాల్సింది. ఇప్పుడు ఆయన ఇక్కడ ప్రధానాంశం కాదు. ప్రజలు తమ కోల్పోయిన హక్కులను, హరించబడిన స్వయంప్రతిపత్తిని తిరిగి సాధించుకునేందుకు స్వయంగా ముందుకు వచ్చారు.
మౌనాన్ని వీడి వీధుల్లోకి వచ్చినందుకు వారికి కృతజ్ఞతలు తెలుపుతూ, తన నిరాహార దీక్షను విరమించడం ఆయన బాధ్యత. కానీ, ఈ పోరాటం తన చుట్టూనే తిరుగుతోందని, తానే దీనికి కీలకమైన కేంద్ర బిందువునని ఆయన ఇప్పటికీ బలంగా నమ్ముతున్నారు.
వాంగ్‌చుక్ నిరాహార దీక్ష విరమణకు ఒక షరతును, ఆయన భార్య గీతాంజలి ఆంగ్మో నిన్న రాత్రి ప్రకటించారు. ప్రస్తుత పార్లమెంట్ సమావేశాల్లో విద్యా వ్యవస్థపై చర్చ జరిగేలా, రాజకీయ నాయకులు స్వయంగా వచ్చి హామీ ఇవ్వాలని ఆమె కోరారు.
ఆయన ఈ డిమాండును ప్రకటించిన సమయంలో, జంతర్ మంతర్ వద్ద ముగ్గురు విద్యార్థులు తమ నిరాహార దీక్షను కొనసాగిస్తున్నారనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలనే డిమాండ్‌తో వారు 22 రోజులకుపైగా నిరాహార దీక్ష చేస్తున్నారు.
వాంగ్చుక్కు సంఘీభావంగా తాము ఈ దీక్ష చేస్తున్నామని వారు స్పష్టంగా ప్రకటించారు. ఇప్పుడు వాంగ్‌చుక్ పెట్టిన ఈ కొత్త, ఏకపక్ష షరతుకు వారు సమ్మతిస్తున్నారా? ఈ షరతును ప్రపంచానికి ప్రకటించే ముందు కనీసం వారిని సంప్రదించారా? లేక ప్రజాస్వామ్య సంప్రదింపులు, సామూహిక నిర్ణయాల లాంటి సాధారణ బాధ్యతలకు అతీతమైన వ్యక్తిగా ఇప్పుడు వాంగ్చుక్ను భావించాలా?
ఇప్పుడు తమ నిరాహార దీక్షను విరమించడం ద్వారా, ఆ విద్యార్థులు వాంగ్‌చుక్ కంటే ఎక్కువ పరిణితిని ప్రదర్శించారు.
ఏకపక్ష నిర్ణయాలపై విమర్శలు..
మరి అభిజీత్ దిప్కే సంగతి ఏమిటి? వాంగ్‌చుక్ పట్ల ప్రభుత్వం వ్యవహరించిన తీరుపై తీవ్ర ఆగ్రహంతో ఆయన నిరవధిక నిరాహార దీక్ష చేపట్టారు.
వాంగ్‌చుక్ తన దీక్షను విరమించగానే, ఆయన కూడా తన దీక్షను విరమించాలని ఆశించాలా? తన షరతులను ప్రకటించే సమయంలో అభిజీత్ దిప్కే గురించి వాంగ్‌చుక్ ఎందుకు ప్రస్తావించలేదు?
వాంగ్చుక్ను అభిమానించే వారంతా ఇప్పుడు ప్రతిపక్ష నాయకులను ఆయన ఆసుపత్రి గది వెలుపల క్యూలో నిలబడమని కోరాలా? పార్లమెంటరీ హామీలను ఇస్తూ, ఆయన అమూల్యమైన ప్రాణాలను కాపాడమని వేడుకోమని చెప్పాలా? ఒకవేళ ఆ నాయకులు ఈ ప్రహసనంలో పాల్గొనడానికి నిరాకరిస్తే, వారిని స్పందన లేనివారిగా ముద్ర వేస్తారా? పౌర సమాజం తరచూ ప్రాధాన్యత లేనివిగా భావించే రాజకీయ పార్టీలు ఇప్పుడు ఆయన అల్టిమేటమ్‌ను నెరవేర్చడానికి పోటీ పడతాయా? తృణమూల్ కాంగ్రెస్ ఇటీవలి ప్రకటనలు ఇప్పటికే ఈ విధమైన రాజకీయ పోటీని స్పష్టంగా సూచిస్తున్నాయి.
అసలు డిమాండ్ దారిమళ్లిందా?..
వాంగ్‌చుక్ తన నిరాహార దీక్షను ప్రారంభించినప్పుడు, ఆయన డిమాండ్ చాలా స్పష్టంగా, కచ్చితంగా ఉంది: విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలి. భారతీయ విద్యావ్యవస్థలోని నిర్మాణాత్మక పతనానికి బాధ్యులను జవాబుదారీ చేయడమే తన పోరాట లక్ష్యమని, ఆ దిశలో మంత్రి రాజీనామానే రాజీకి తావులేని తొలి అడుగు అని ఆయన నొక్కి చెప్పారు.
కాక్రోచ్ జనతా పార్టీ డిమాండ్ కూడా ఇదే. రాజీనామా లేకపోతే నిరాహార దీక్ష విరమణ లేదనే తన వైఖరిపై వాంగ్‌చుక్ కట్టుబడి ఉన్నారు.
వాంగ్‌చుక్ నిరాహార దీక్ష ప్రారంభించిన 15 రోజుల తర్వాత, ఆయన ఆరోగ్యం క్షీణిస్తోందన్న ఆందోళనతో ఒక శ్రేయోభిలాషి ఢిల్లీ హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. దీంతో కోర్టు ఆయన ఆరోగ్య పరిస్థితిని నిరంతరం పర్యవేక్షించాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. కొద్దికాలానికే ఆయన ఆరోగ్యం మరింత క్షీణిస్తోందన్న వార్తలు వెలువడసాగాయి.
దాదాపు ప్రతిపక్షాలన్నీ సంఘీభావం ప్రకటించాయి. జంతర్ మంతర్‌కు వెళ్లి ఆయనను కలుసుకుని, దీక్షను విరమించవలసిందిగా కోరాయి. అధికార స్వభావాన్ని నిశితంగా గమనించే ఎవరికైనా స్పష్టంగా తెలిసే ఒక విషయాన్నే వారు ఆయనకు చెప్పారు: ఇంతటి క్రూరమైన నిరంకుశ ప్రభుత్వం తన మంత్రిని పదవి నుంచి తొలగించదు, అలాగే చిత్తశుద్ధితో కూడిన చర్చలకూ ముందుకు రాదు.
పశ్చాత్తాపం లేని ఒక పాలక వ్యవస్థ నుండి నైతిక పరివర్తన ఆశించి ఆయన తన ప్రాణాలను పణంగా పెట్టకూడదని వారు సూచించారు.
ఈ సంక్షోభం కేవలం ఒక పరీక్షకో లేదా ఒక మంత్రికో పరిమితం కాదని, ఇది భారత విద్యావ్యవస్థలోని లోతైన నిర్మాణాత్మక సంక్షోభమని తాము కూడా చాలా కాలంగా చెబుతూ, ఇదే అంశాలను లేవనెత్తుతున్నామని కాంగ్రెస్ పార్టీ పేర్కొంది.
ఇది నిరంకుశత్వానికి వ్యతిరేకంగా జరుగుతున్న ఒక పెద్ద పోరాటంలో భాగమని, ఆ విస్తృత పోరాటం కోసమే వాంగ్‌చుక్ తన ప్రాణాలను, శక్తిని కాపాడుకోవాలని విజ్ఞప్తి చేసింది.
వాంగ్‌చుక్ దీనిపై అసహనం వ్యక్తం చేశారు. దీక్షను విరమించాలన్న వారి సూచనను అంగీకరించకుండా, ప్రభుత్వానికి వ్యతిరేకంగా ప్రతి ఒక్కరూ వీధుల్లోకి వచ్చి ఉద్యమించాలని పిలుపునిచ్చారు.
అలాగే, విద్యా వ్యవస్థలో నిర్మాణాత్మక జవాబుదారీతనాన్ని డిమాండ్ చేస్తూ జూలై 20న పార్లమెంట్ మార్చ్‌ను ప్రకటించారు.
పోలీసుల బలప్రయోగం – ప్రజా స్పందన..
అయితే, ఆ రోజు రాకముందే ఢిల్లీ పోలీసులు – హైకోర్టు జారీ చేసిన వైద్యపరమైన ఆదేశాలను అనుకూలమైన సాకుగా ఉపయోగించుకుని – వాంగ్చుక్ను జంతర్ మంతర్ నుంచి బలవంతంగా తరలించి, సఫ్దర్‌జంగ్ ఆసుపత్రిలో ఉంచారు.
ఒక రాజకీయ నిరసనను రాజకీయంగానే ఎదుర్కొనేందుకు నిరాకరించిన రాజ్యం, చివరకు అధికార యంత్రాంగం ద్వారా బలప్రయోగాన్ని ఎంచుకుంది.
అయితే, దీని పరిణామాలు చాలా అసాధారణంగా, ప్రభుత్వం ఊహించిన దానికంటే పూర్తిగా భిన్నంగా మారాయి. వాంగ్‌చుక్ నిరాహార దీక్ష చేసిన 20 రోజులపాటు జంతర్ మంతర్ దాదాపు ప్రశాంతంగానే ఉంది. కానీ ఆయనను బలవంతంగా అక్కడి నుంచి తరలించిన మరుక్షణమే వేలాది మంది యువకులు, పౌరులు అక్కడికి చేరుకున్నారు.
ప్రభుత్వ నిరంకుశ వైఖరికి వ్యతిరేకంగా దేశవ్యాప్తంగా స్వచ్ఛంద నిరసనలు వెల్లువెత్తాయి. తదుపరి పోలీసు చర్యలను అడ్డుకునేందుకు వేలాది మంది జంతర్ మంతర్ వద్ద ఆరుబయట రాత్రంతా గడుపుతూ కాపలా కాశారు.
తమ నైతిక సంఘీభావాన్ని తెలియజేయడానికే అనేక మంది సుదూర ప్రాంతాల నుంచి అక్కడికి చేరుకున్నారు.
పౌర హక్కుల కోసం తిరుగుబాటు..
ఈ ప్రజా స్పందన దేనికి సంకేతమో మనం అర్థం చేసుకోవాలి. ఈ ఉద్యమం ఇప్పుడు విద్యా సంస్కరణల అంశాన్ని దాటి ముందుకు వెళ్లింది. ప్రజలను కదిలించింది విద్యా సమస్య మాత్రమే కాదు; ప్రజాస్వామ్యమని చెప్పుకునే వ్యవస్థలో అధికార అహంకారం, నిరంకుశ వైఖరి.
ఇది పౌరులను వ్యవస్థాగతంగా అవమానించే ధోరణికి వ్యతిరేకంగా జరుగుతున్న తిరుగుబాటు. ఈ ప్రభుత్వం తమను పౌరులుగా కాకుండా కేవలం పాలితులుగా మాత్రమే చూస్తోందనే భావనతోనే ప్రజలు వీధుల్లోకి వచ్చారు. వారు దీనిని అకడమిక్ భాషలో చెప్పకపోవచ్చు. కానీ వారు తిరిగి సాధించుకోవాలని కోరుకుంటున్నది ప్రజాస్వామ్యంలో అత్యంత ప్రాథమికమైన హక్కులు—మాట్లాడే హక్కు, విభేదించే హక్కు, అధికారాన్ని ప్రశ్నించే హక్కు.
ఆ అర్థంలో, ఈ ఉద్యమం ఇప్పుడు సోనమ్ వాంగ్చుక్ను దాటి చాలా పెద్దదిగా మారింది. ఇది ఇకపై ఒక వ్యక్తి ఆరోగ్యం గురించి ఆందోళన చెందే ఉద్యమం మాత్రమే కాదు; ప్రజల సార్వభౌమాధికారాన్ని చాటిచెప్పే ఉద్యమంగా మారింది.
ఇప్పటివరకు రాజ్యం నిశ్శబ్దంగా అపరిమిత అధికారాన్ని తన చేతుల్లోకి తీసుకుంటున్న విషయాన్ని గమనించని వారుకూడా ఇప్పుడు మేల్కొన్నారు.
ప్రభుత్వం ఒక తీవ్రమైన రాజకీయ తప్పిదానికి పాల్పడింది. ప్రజల సమష్టి స్మృతిలో నిలిచిపోయే చిత్రం, ఒక బలహీనంగా ఉన్న ఉద్యమకారుడిని వైద్య సంరక్షణ కోసం తీసుకువెళుతున్న దృశ్యం కాదు.
నిరాయుధుడైన ఒక పౌరుడిని పోలీసులు చుట్టుముట్టి, అణచివేసి, రాజ్యం బలప్రయోగ యంత్రాంగం ద్వారా బలవంతంగా ఈడ్చుకువెళుతున్న దృశ్యమే ప్రజల మనసుల్లో నిలిచిపోతుంది. ఆ ఒక్క ఘటనతో ప్రభుత్వం వాంగ్చుక్ను ప్రజల కంటికి దూరం చేయగలిగింది. కానీ అదే సమయంలో తన క్రూరత్వాన్ని అందరికీ బహిర్గతం చేసుకుంది.
వ్యక్తిగత ఇమేజ్ కాదు.. ప్రజా చైతన్యమే ముఖ్యం..
ఈ చారిత్రక క్షణం ప్రాముఖ్యతను సోనమ్ వాంగ్‌చుక్ గుర్తించాలి. ఇది ఇకపై ఆయన వ్యక్తిగత పోరాటం మాత్రమే కాదు.
చాలా కాలం తర్వాత సమష్టిగా తమ గళాన్ని వినిపించటం ప్రారంభించిన ప్రజల ఉద్యమం ఇది. ప్రజల్లో వచ్చిన ఈ చైతన్యానికి ధన్యవాదాలు తెలియజేసి, ఆయన తన దీక్షను ముగించాలి.
అలా కాకుండా, రాజకీయ వ్యవస్థల కంటే తానే ఉన్నతుడినని భావిస్తూ, తన ప్రాణరక్షణ కోసం రాజకీయ పార్టీలు తన మాటకు తల వంచాలని డిమాండ్ చేయడం ద్వారా ఆయన ఒక ప్రజాస్వామ్య నిరసనకారుడిలా కాకుండా, స్వయం ప్రకటిత ‘మహాత్ముడిలా’ కనిపించే ప్రమాదం ఉంది. ఇది ఆయన గౌరవాన్ని పెంచకపోగా, ఆయన అహాన్ని బహిర్గతం చేస్తుంది.
ఈ కీలక తరుణంలో, వాంగ్‌చుక్ తన నైతిక ఉన్నతిని తానే తగ్గించుకుంటూ ఉండవచ్చు. కానీ ప్రజలు మాత్రం చరిత్ర తమపై ఉంచిన బాధ్యతను నెరవేర్చేందుకు ముందుకు వచ్చారు. వారి ఈ చైతన్యంలోనే అసలైన ఆశ సజీవంగా ఉంది.
అనువాదం: దేవి పోలిన
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
