“పోలవరం, ఇతర ఇరిగేషన్ ప్రాజెక్టులు – 2 ఏళ్ల ప్రగతి నివేదిక”ను, “ఇరిగేషన్ క్యాలెండర్ – ప్రాజెక్టుల వారీగా శంకుస్థాపన/పూర్తికి షెడ్యూల్” అంటూ 36 పనుల జాబితాను మీరు వెల్లడించారు.
2028 డిసెంబర్ నాటికి రూ 35,555 కోట్ల అంచనా వ్యయంతో 36 భారీ సాగునీటి ప్రాజెక్టులను పూర్తి చేయాలన్న సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం ఉన్నట్లు ప్రకటించారు.
ప్రభుత్వాల విశ్వసనీయతను మీ జాబితాలోని ప్రాజెక్టులే ప్రశ్నిస్తున్నాయి. గత ప్రభుత్వ కాలంలో వరదలకు కొట్టుకుపోయిన ప్రాజెక్టుల గేట్లు, పనికి రాకుండా దెబ్బతిన్న పోలవరం డయాఫ్రమ్ వాల్ ఉదంతాలు, జీవోలకే పరిమితమైన భారీ సాగునీటి పారుదల పథకాలపై ప్రస్తావించడానికి చాలానే ఉంది.
కూటమి ప్రభుత్వం ఈ రంగంపై కొంతమేరకు దృష్టి సారించింది. కానీ, సమగ్ర దృష్టి లోపించింది.
ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లను గాలికి వదిలేసింది. నేను ఇంజనీరును కాదు.
అంతర్రాష్ట్ర నదీ జలాల వినియోగం – ట్రిబ్యునల్స్ తీర్పులు – సమస్యల పట్ల అవగాహన పెంచుకోవాలన్న ఆసక్తి, ప్రాజెక్టుల సాధన కోసం దశాబ్దాలుగా పోరాడుతున్న ఒక ఉద్యమకారుడిగా ప్రాజెక్టుల నివేదికలను కాస్త అధ్యయనం చేశాను. ఈ రంగానికి సంబంధించి కాస్తో కూస్తో జ్ఞానాన్ని ఆర్జించుకున్నాను.
ప్రాజెక్టుల సాధన కోసం 1977 నుంచి ఒక ఉద్యమకారుడిగా ఉద్యమాల్లో పాల్గొన్న, నేతృత్వం కూడా వహించిన అనుభవం ఉంది.
ఇప్పుడు నన్ను వెంటాడుతున్న ప్రశ్న; ఆంధ్రప్రదేశ్లో నిర్మాణంలో ఉన్న 36 భారీ నీటి పారుదల ప్రాజెక్టులు ఏవి? వాటి పేర్లు తెలుసుకోవాలి? వీటికి సమాధానం చెప్పగల వారు మీరేనని భావించి, మీకే ఈ బహిరంగ లేఖ రాస్తున్నా.
సమాచారం ఇవ్వాల్సిన బాధ్యత మీదే..
మిమ్మల్నే ఎందుకు అడుగుతున్నానంటే, మీరు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర జలవనరుల శాఖా మంత్రి, ప్రగతి నివేదికను మీరే విడుదల చేశారు కాబట్టి.
సాగునీటి పారుదల రంగం శాఖాధికారులు మీకు అందుబాటులో ఉన్నారు. మీ వద్ద లేని సమాచారాన్ని కూడా చిటికెలో తెప్పించుకోగలరు. మీతో నాకు కొద్దిపాటి పరిచయం మాత్రమే ఉన్నది.
మీరు గత ప్రభుత్వ కాలంలో ప్రతిపక్ష శాసన సభ్యుడిగా ఉన్నప్పుడు పోలవరం ప్రాజెక్టు నిర్మాణంలో తలెత్తిన సంక్షోభంపై ఏలూరులో సీపీఐ నిర్వహించిన సభలో ఇరువురం పాల్గొన్నాం.
ఈ మధ్య కాలంలో ఒక ప్రతినిధివర్గంలో సభ్యుడిగా మిమ్ములను కలిసిన సందర్భంలో నదీ జలాల వినియోగం – అంతర్రాష్ట్ర సమస్యలు, అనాలోచితమైన పోలవరం – బనకచెర్ల భారీ ఎత్తిపోతల పథకం, నిర్మాణంలో ఉన్న పెండింగ్ ప్రాజెక్టుల సత్వర నిర్మాణం, తదితర అంశాలపై గంటకుపైగా మీ సమయాన్ని తీసుకుని కాస్త సవివరంగానే మాట్లాడుకున్నాం.
మా ప్రతినిధివర్గం అభిప్రాయాలు మేం చెప్పాం. ప్రభుత్వ ఆలోచనలను మీరు తెలియజేశారు.
మీరు ఇటీవలి కాలంలో వెలిగొండ ప్రాజెక్టు నిర్మాణ పనుల పట్ల కొంత శ్రద్ధ పెట్టడమే కాకుండా క్షేత్రస్థాయికి వెళ్ళి పనులను పర్యవేక్షించారు.
ఆ వార్తలు, దృశ్యాలు మీ పనితీరు పట్ల కాస్త సదభిప్రాయాన్ని కలిగించాయి. అందుకే మిమ్ములను నిర్మొహమాటంగా అడిగితే సానుకూలంగా స్పందిస్తారేమోనన్న కొద్దిపాటి ఆశాభావం.
మన రాష్ట్రంలో ఎన్ని భారీ నీటి పారుదల ప్రాజెక్టులు నిర్మాణంలో ఉన్నాయి? నిర్మాణంలో ఉన్న ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిపీఆర్)లను అధ్యయనం చేశారా? ఆయా ప్రాజెక్టుల వారీగా ప్రస్తుత అంచనా వ్యయం ఎంత? ఇప్పటి వరకు ఎంత ఖర్చు చేశారు? ఇంకెంత వ్యయం చేయాల్సి ఉంది? ఏ ప్రాజెక్టు నిర్మాణాన్ని ఎప్పుడు మొదలు పెట్టారు? ఎప్పటికి పూర్తి చేస్తారు? పూర్తిగా లేదా పాక్షికంగా పూర్తి చేసినట్లు చెబుతున్న ప్రాజెక్టుల కింద డిపీఆర్ లో పేర్కొన్న ఆయకట్టులో ఎన్ని ఎకరాలకు సాగునీరు అందుతున్నది? తద్వారా రాష్ట్రానికి ఒనగూడిన ప్రయోజనాలపై రాష్ట్ర ప్రభుత్వ అంచనాపై ప్రగతి నివేదికలో సవివరంగా పేర్కొని ఉంటే నాలాంటి వారికి కూడా అర్థమయ్యేది. శభాష్.. అని అభినందనలు అందుకునే వారు.
ఇప్పటికైనా మించిపోయింది లేదు. నేను లేవనెత్తిన అంశాలపై వివరంగా మరొక నివేదికను విడుదల చేయమని విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ వివరాలను 2026-27 వార్షిక బడ్జెట్లో ప్రస్తావించమని గతంలో మిమ్ములను కలిసినప్పుడు కోరాను. మీరు నా విజ్ఞప్తిని పరిగణనలోకి తీసుకోలేదు.
పోలవరం ఎత్తుపై మంత్రుల దాటవేత..
గత ప్రభుత్వ కాలంలో ఇద్దరు జలవనరుల శాఖా మంత్రులుగా పని చేశారు.
బహుళార్థ సాధక ప్రాజెక్టు, జాతీయ ప్రాజెక్టుగా నిర్మాణంలో ఉన్న పోలవరం నిర్మాణాన్ని, గత ప్రభుత్వం 2 దశల నిర్మాణంగా విడగొట్టి, మొదటి దశలో 41.15 మీటర్ల కాంటూర్ వరకు, రెండవ దశలో 45.72 మీటర్ల వరకు నిర్మాణం అంటూ నివేదిక తయారు చేసి, వాటి వ్యయ అంచనాలు కూడా పొందుపరచి కేంద్ర ప్రభుత్వానికి ఉత్తరం రాసింది.
ఈ నేపథ్యంలో నాలాంటి వాళ్ళం గోదావరి జల వివాద పరిష్కార ట్రిబ్యునల్ తీర్పు, కేంద్ర జలసంఘం ఆమోదించిన పోలవరం డిపీఆర్ ప్రకారం 45.72 మీటర్ల (150 అడుగులు) ఎత్తు వరకు నిర్మాణాన్ని పూర్తి చేసి, గరిష్టంగా 164 టీఎంసీలను నిల్వ చేయకపోతే అది నిరర్థక ప్రాజెక్టు (41.15 మీటర్ల కాంటూర్ అంటే ప్రాజెక్టు ఎండీడీఎల్)గా మిగిలిపోతుందన్న ఆందోళనను పలు టీవీ చర్చల్లోను, సభల్లోను వ్యక్తం చేశాం.
నాటి మంత్రి అనిల్ కుమార్ యాదవ్ “టేపు తెచ్చుకోండి కొలుచుకోవడానికి” అని వెటకారంగా మాట్లాడారు.
ఆయన తర్వాత మంత్రి అయిన అంబటి రాంబాబును దెబ్బతిన్న డయాఫ్రమ్ వాల్ సమస్యపై మీడియా ప్రతినిధులు ప్రశ్నిస్తే, దాని గురించి తనకు తెలియదని సమాధానం చెప్పారు.
అలాంటి సమాధానాలు కూటమి ప్రభుత్వంలో జలవనరుల మంత్రిగా ఉన్న నిమ్మల రామానాయుడు గారి నుంచి నేను ఆశించడం లేదు.
విజ్ఞతతో, ప్రజలకు జవాబుదారీతనంతో, బాధ్యతాయుతమైన సమాధానాలు ఇస్తారన్న భావన ఎక్కడో ఇంకా కొంత మిగిలి ఉండబట్టే ఈ బహిరంగ లేఖ రాస్తున్నా.
ఒకే ప్రాజెక్టును ముక్కలు చేసి చూపుతారా?
రాష్ట్రంలో నిర్మాణంలో ఉన్న భారీ నీటి పారుదల ప్రాజెక్టుల సమగ్ర నివేదిక(డీపీఆర్)లను దగ్గర పెట్టుకుని, బాగా సరిచూసుకున్న మీదటనే సమాధానాలు ఇవ్వమని కూడా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఉదాహరణకు, గాలేరు – నగరి సుజల స్రవంతి(జీఎన్ఎస్ఎస్) ప్రాజెక్టునే తీసుకుందాం.
శ్రీశైలం జలాశయం నుంచి 38 టీఎంసీ కృష్ణా నది మిగులు జలాల ఆధారంగా 3 దశాబ్దాలుగా నిర్మాణంలో ఉన్నది. శ్రీశైలం జలాశయం నుంచి అవుక్ రిజర్వాయరు వరకు శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ ద్వారా జీఎన్ఎస్ఎస్కు నీటిని తరలిస్తారు.
అక్కడ నుంచి జీఎన్ఎస్ఎస్ వరద కాలువ ద్వారా గండికోట రిజర్వాయరుకు 38 టీఎంసీలను చేరుస్తారు. గండికోట రిజర్వాయరు నుంచి గాలేరు – నగరి ప్రాజెక్టు ప్రధాన కాలువ మొదలవుతుంది. ఆ ప్రధాన కాలువను 300 కి.మీ. తవ్వాలి. 35 ఏళ్లలో చాలా కష్టపడి గండికోట రిజర్వాయరు నిర్మాణం, 50 – 60 కిమీ మాత్రమే ప్రధాన కాలువ తవ్వారు.
రెండు చిన్న రిజర్వాయర్లు, వామికొండ, సర్వరాయసాగర్ నిర్మించారు. కానీ, 1 సెంటు భూమికి కూడా పంట కాలువల ద్వారా నీటిని అందించలేదు.
ఇప్పుడు మీరు విడుదల చేసిన ఇరిగేషన్ క్యాలెండరులోని 36 ప్రాజెక్టులలో జీఎన్ఎస్ఎస్ – కడప పట్టణం వరకు, జీఎన్ఎస్ఎస్ – కడప నుండి కోడూరు వరకు, జీఎన్ఎస్ఎస్ – కోడూరు – బాలాజీ రిజర్వాయర్ వరకు అంటూ విడగొట్టి 3 ప్రాజెక్టులుగా పేర్కొన్నారు.
మంత్రి గారు.. ఇవి 3 ప్రాజెక్టులా? లేదా, గాలేరు – నగరి సుజల స్రవంతి ప్రాజెక్టులో అంతర్భాగాలా? ఈ 3 భాగాల నిర్మాణాలను 2028 డిసెంబర్ నాటికి పూర్తి చేస్తామని సెలవిచ్చారు. 2026-27 వార్షిక బడ్జెట్ లో వీటి నిర్మాణానికి నిధులను మంజూరు చేయలేదు. మీరు చెప్పే మాటలను ప్రజలు ఎలా విశ్వసిస్తారు?
కాలువలు లేకుండా హంద్రీ-నీవా నీళ్లెలా ఇస్తారు?
హంద్రీ – నీవా సుజల స్రవంతి పథకాన్ని కూడా పరిశీలించండి. గత ఏడాది రూ 3,850 కోట్లు కేటాయించి, ఖర్చు చేశామంటున్నారు. పనులు చేసిన మాట నిజమే. కానీ, వాటిని సమగ్ర దృక్పథంతో చేయలేదు. శ్రీశైలం జలాశయం నుంచి మల్యాల ఎత్తిపోతల పథకం ద్వారా 3,850 క్యూసెక్కులను హంద్రీ – నీవాకు తరలించడానికి వీలుగా నిర్మించారు. తదనుగుణంగానే హెచ్ఎన్ఎస్ఎస్ ప్రధాన కాలువను తవ్వి, లైనింగ్ చేశారు.
మీరు ప్రగతి నివేదికలో పేర్కొన్నట్లు 250 రోజుల్లో 52 టీఎంసీలు తరలించారు. ఆ నీటిని 530 చెరువులకు అందజేసినట్లు చెప్పారు. హెచ్ఎన్ఎస్ఎస్ కింద డిస్ట్రిబ్యూషన్ వ్యవస్థను నిర్మించే ఆలోచన ప్రభుత్వానికి అసలు ఉందా? డిపీఆర్లో పేర్కొన్న ఆయకట్టు భూముల్లో ఒక్క ఎకరానికైనా పంట కాలువల ద్వారా నీటిని సరఫరా చేశారా? ప్రాజెక్టును రూపొందించింది, వంకలు – వాగుల ద్వారా చెరువులకు నీళ్ళు తరలించడానికా? హెచ్ఎన్ఎస్ఎస్ దశ -2 (కిమీ 400-490), హెచ్ఎన్ఎస్ఎస్ దశ -2 (కి.మీ. 490 -554), మడకశిర బ్రాంచి కాలువ విస్తరణ, నీవా బ్రాంచ్ కెనాల్, ఇలా ఎన్ని ప్రాజెక్టులు ప్రచారం చేస్తారు?
ఈ ప్రాజెక్టుకు రూ. 13,500 కోట్ల వ్యయానికి ప్రభుత్వం పరిపాలన అనుమతి ఇచ్చింది. ఇప్పటికే ఆ మొత్తానికి మించి వ్యయం చేసినట్లుంది. ఈ ఏడాదిలో రూ 3,000 కోట్లు కేటాయించామని పేర్కొన్నారు.
మొత్తం ప్రాజెక్టు వ్యయ అంచనాను పెంచలేదు. ప్రాజెక్టును పూర్తి చేసే నాటికి ఎంత మొత్తం వెచ్చించాల్సి ఉంటుందో ప్రభుత్వానికి ఉన్న అంచనా చెప్పగలరా?
ఒకే ప్రాజెక్టును ముక్కలు ముక్కలుగా విడగొట్టి, వాటిని దేనికి దాన్ని ఒక ప్రాజెక్టుగా చెప్పి(మనిషి శరీరాన్ని ఒక్కొక్క అవయవాన్ని ఒక మానవ శరీరంగా పరిగణించగలమా!), ఘనమైన సంఖ్యలో ప్రాజెక్టుల నిర్మాణం చేస్తున్నామని ముఖ్యమంత్రి మొదలుకొని మీ వరకు నిత్యం డప్పు కొట్టుకోవడం వల్ల మీకు ఏం రాజకీయ ప్రయోజనం లభిస్తుందో నాకు తెలియదు.
మీరు రోజూ చెబుతున్న ఈ డొల్ల మాటలనే ప్రభుత్వ అనుకూల మీడియా ఏ మాత్రం అలసిపోకుండా ప్రజల్లోకి తీసుకెళ్లడానికి నిత్యం చాలా శ్రమపడుతున్నది. ప్రజలను భ్రమల్లోకి నెట్టే ప్రయత్నం చేయడం నిష్ప్రయోజనమే.
రాష్ట్ర సమగ్రాభివృద్ధి లక్ష్యంగా ప్రజల కోసమే నీటి పారుదల ప్రాజెక్టుల నిర్మాణాన్ని అంకిత భావంతో చేస్తున్నామన్న భావన వాస్తవాల ఆధారంగా మాత్రమే ప్రజలకు కల్పించగలరు, మన్ననలు పొందగలరు. క్షేత్ర స్థాయిలో ప్రాజెక్టుల నిర్మాణాలను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేసి, ప్రతిపాదిత ఆయకట్టు భూములకు సాగు నీటిని అందించినప్పుడే ప్రభుత్వంపై విశ్వాసం పెరుగుతుంది.
అధికారుల మౌనం.. సమాధానం చెప్పాల్సిన తరుణం..
నేను, ఆలోచనాపరుల వేదిక సభ్యుల్లో ఒకడిగాను, వ్యక్తిగతంగాను, గడచిన ఆరు మాసాల కాలంలో కర్నూలు, తిరుపతి, కడప, అనంతపురం చీఫ్ ఇంజనీర్లను (సీఈ), పూల సుబ్బయ్య వెలిగొండ ప్రాజెక్టు, శ్రీశైలం కుడి బ్రాంచి కాలువ (ఎస్సార్బీసీ), తెలుగు గంగ, హంద్రీ – నీవా, గాలేరు -నగరి ప్రాజెక్టుల నిర్మాణ పనుల్లో, క్షేత్ర స్థాయి బాధ్యతల్లో ఉన్న పలువురు సూపరింటెండెంట్ ఇంజనీర్లు, ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లు, అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్లను ప్రాజెక్టుల పర్యటనలో భాగంగాను, ఆయా ప్రాంతాల్లో నీటిపారుదల ప్రాజెక్టులపై నిర్వహించిన సభల్లో పాల్గొనడానికి వెళ్ళిన సందర్భాల్లో ప్రత్యేకంగా నీటిపారుదల శాఖ ఆఫీసులకు వెళ్ళి కలిశాను.
ప్రాజెక్టుల సమగ్ర నివేదిక (డిపీఆర్)ల ప్రకారం నిర్మాణ పనులు జరుగుతున్నాయా, పంట కాలువల వ్యవస్థ నిర్మాణంపై ఎందుకు దృష్టి సారించడం లేదని సంబంధిత అధికారులను అడిగాను. తాజాగా, కృష్ణా నదీ జలాలను తరలించడమే రాయలసీమ కరువు కాటకాలకు శాశ్వత పరిష్కారమని పోరుసల్పిన అమరజీవి కామ్రేడ్ వీకే ఆదినారాయణరెడ్డి గారి వర్ధంతి సభలో సాగునీటి ప్రాజెక్టులపై మాట్లాడడానికి ఈనెల 18న అనంతపురం వెళ్ళాను.
సీఈ గారి ఆఫీసుకు వెళ్ళి కలిసి పాత ప్రాజెక్టుల మరమ్మత్తులు, నిర్మాణంలో ఉన్న హంద్రీ – నీవా ప్రస్తుత స్థితిపై వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేశాను. ప్రాజెక్టుల సమగ్ర నివేదికలకు కట్టుబడి ప్రాజెక్టుల నిర్మాణం జరుగుతున్నదా అన్న ప్రశ్నకు అందరి నుండి మౌనమే సమాధానం. నేను గతంలో కలిసినప్పుడు, ఉత్తరాల ద్వారా, అలాగే సభల్లో మాట్లాడినప్పుడు ఈ అంశాలపై మంత్రిగారిని, ప్రభుత్వాన్ని అడుగుతూనే ఉన్నా. ఇటీవలే డాక్టర్ కేఎల్ రావు 125వ జయంతి సభా వేదిక నుండి అడిగా. 2 ఏళ్ల ప్రగతి నివేదికను వెల్లడించిన పూర్వరంగంలో మళ్ళీ ఈ బహిరంగ లేఖ ద్వారా నా ప్రశ్నలపై స్పందించమని మంత్రిగారిని కోరుతున్నా.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
