నెల్సన్ మండేలా దినోత్సవాన్ని పురస్కరించుకుని చేసిన ప్రసంగంలో న్యూయార్క్ నగర మేయర్ జోహ్రాన్ మమ్దాని, విభజనలతో చీలిపోయిన ఈ ప్రపంచానికి మడీబా(నెల్సన్ మండేలా) మనకు ఏమి బోధించగలరో విశ్లేషించారు.
నెల్సన్ మండేలా ఫౌండేషన్ నాయకత్వాన్ని గౌరవించేందుకు మనమందరం ఒకచోట చేరడం నిజంగా గొప్ప గౌరవం.
గత 27 సంవత్సరాలుగా ఈ సంస్థ మడీబా వారసత్వం కేవలం మ్యూజియాల్లో భద్రపరచాల్సిన చరిత్ర మాత్రమే కాదని, స్వేచ్ఛ కోసం సాగుతున్న ప్రజా ఉద్యమాల్లోనూ అది సజీవంగా కొనసాగాలని దృఢంగా నొక్కిచెబుతోంది.
కోట్లాది మంది ప్రజలకు స్ఫూర్తినిచ్చిన ఒక వారసత్వానికి నేను నా వందనాలు తెలియజేస్తున్నాను.
మడీబా స్ఫూర్తి సజీవం..
న్యాయం కోసం జరిగే ప్రతి నిరసనలో, ప్రజాస్వామ్యం కోసం వినిపించే ప్రతి పిలుపులో, న్యాయమైన డిమాండ్‌తో సాగే ప్రతి ర్యాలీలో మడీబా సజీవంగా ఉన్నారు.
గౌరవప్రదమైన జీవితం ఇంకా అందని ద్రాక్షలా మిగిలి ఉన్న ప్రతి టౌన్షిప్లో, ప్రతి మురికివాడలో ఆయన స్ఫూర్తి జీవిస్తోంది.
ఆ గౌరవప్రదమైన జీవితాన్ని సాధించడానికి చేయి చాచే ప్రతి మనిషిలో, రోజంతా శ్రమించి ఇంటికి చేరి ఆకలితో ఉన్నవారికి ఆహారం, అనారోగ్యంతో ఉన్నవారికి మందులు అందించే ప్రతి వ్యక్తిలో మడీబా జీవిస్తున్నారు.
అణచివేతను, కొరతను, దుర్భర జీవితాన్ని చూసి దానికి సాక్షిగా నిలిచే ప్రతి సందర్భంలో దానిని తప్పనిసరి విధిగా అంగీకరించకుండా, మనలో ప్రతి ఒక్కరూ కలిసి పోరాడి మార్చగల పరిస్థితిగా భావించే ప్రతి మనిషిలో మడీబా జీవిస్తున్నారు.
ఈ రోజు మనలో ఎంతోమంది ఎక్కడ ఉన్నామో అక్కడికి చేరగలిగాం అంటే, విలువలకు కట్టుబడి ఉండే జీవితం కూడా సాధ్యమేనని ఊహించగలుగుతున్నామంటే అందుకు కారణం మడీబా మనకు ఆ మార్గాన్ని చూపించినందువల్లే.
తొలి నల్లజాతి అధ్యక్షుడు..
ప్రతి కొలమానం ప్రకారం మడీబానే ప్రథముడు. మ్జాన్సీకి(దక్షిణాఫ్రికా) తొలి నల్లజాతి అధ్యక్షుడు ఆయన.
దేశంలోని అన్ని వర్ణాల దక్షిణాఫ్రికా ప్రజలు ఓటు వేసి ఎన్నుకున్న ప్రజాస్వామ్య ఎన్నికల ద్వారా అధికారంలోకి వచ్చిన తొలి దేశాధ్యక్షుడు కూడా ఆయనే.
అయితే 1996లో కేప్‌టౌన్‌లో నివసించిన ఐదేళ్ల బాలుడికి భవనాల ముఖ భాగాలపై రెపరెపలాడుతున్న బ్యానర్లపై కనిపించిన మడీబా ముఖం మరో రకమైన ప్రథమత్వానికి ప్రతీకగా నిలిచింది.
నాకు తెలిసిన తొలి అధ్యక్షుడు మడీబాయే. ప్రపంచాన్నే మార్చగల శక్తి ఉన్న వ్యక్తిగా ఆయన నాకు కనిపించారు.
బాల్యంలో అది నాకు ఎంతటి భావనను కలిగించిందో మాటల్లో చెప్పడం కష్టం.
అందుకే ఇలా చెబుతాను, నా చిన్ననాటి ఫ్రిజ్‌పై అతికించిన డేవిడ్ సీమన్, సిల్వైన్ విల్టోర్డ్, ఆర్సెనల్ జట్టు సభ్యుల మాగ్నెట్ల పక్కనే బఫానా జెర్సీ ధరించిన మడీబా మాగ్నెట్ కూడా ఉండేది.
న్యాయం ఆచరణాత్మకం కావాలి..
నా జీవితంలోని ఆ తొలి సంవత్సరాలను తలచుకున్నప్పుడు నాకు అత్యంత స్పష్టంగా గుర్తుండిపోయిన పాఠం ఒక్కటే.
న్యాయం అనేది కేవలం ఒక ఆదర్శంగా మాత్రమే ఉండకూడదు. అది ప్రజల జీవితాల్లో ఆచరణాత్మకంగా, వాస్తవంగా సాకారం కావాలి.
అలాగే అసాధారణ వ్యక్తిత్వం కలిగిన ఒక నాయకుడు కూడా నాకు గుర్తొస్తారు.
నేను అప్పుడే అర్థం చేసుకోవడం ప్రారంభించిన అదే ప్రపంచాన్ని ఆయన కూడా చూశారు.
ఆ ప్రపంచాన్ని మార్చడానికి తన చేతిలో ఉన్న అధికారాన్ని ఆయన నిరంతరం అలుపెరగకుండా ప్రయత్నించారు.
తన జీవితంలోని చివరి సంవత్సరాల్లో మడీబాను సాధారణ మనుషుల స్థాయిని దాటి మహనీయుల పీఠంపై నిలబెట్టారు.
నేడు నోబెల్ శాంతి కేంద్రం ఆయనను లక్షలాది మంది ప్రజలకు ఒక మెస్సయ్య (రక్షకుడు)గా అభివర్ణిస్తోంది. అలాంటి అపారమైన గౌరవానికి ఎవరైనా నిజంగా అర్హులైతే అది మడీబాయే.
“నేను చేసే ప్రతిదాన్ని వాళ్లు కూడా చేయాలనుకుంటారు, నేను చెప్పే ప్రతి మాటను వాళ్లు కూడా చెప్పాలనుకుంటారు”అని రాప్ గాయకుడు రికీ రిక్ ఆలపించినప్పుడు- బహుశా ఆయన మనసులో మెదిలింది మడీబానే అయి ఉండవచ్చు.
మనిషిగా గుర్తించడమే అసలైన గౌరవం..
అయితే ఈ రాత్రి మడీబా నాయకత్వం సాధ్యమని నిరూపించిన లక్ష్యాల పట్ల మన నిబద్ధతను మరోసారి పునరుద్ఘాటించడానికి మనమంతా ఒకచోట చేరిన ఈ సందర్భంలో ఆయనను ఒక మనిషికన్నా పురాణ పురుషుడిగా చూడటం ఆయనకు చేసే తీవ్రమైన అన్యాయమని మనం గుర్తించాలి.
అలా చేయడం అంటే, “ఒక సాధువు అంటే నిరంతరం ప్రయత్నిస్తూ ఉండే ఒక పాపి అని మీరు భావిస్తే తప్ప నేను సాధువును కాదు” అని ఒకప్పుడు ప్రసిద్ధిగా చెప్పిన వ్యక్తిని పవిత్రునిగా ప్రకటించి ఆయన నిజమైన మానవత్వాన్ని మరుగునపరచడమే అవుతుంది.
ఆయన ఒక మనిషి. మనలో ఎవరికైనా కలిగినట్లే తనను తాను ప్రశ్నించుకునే ప్రశ్నలకు, ఆత్మ సంశయాలకు లోనయ్యే వ్యక్తి. ఆయన ఒక ఉద్యమంలో సభ్యుడు.
ఉన్నతమైన లక్ష్యాన్ని చేరుకోవడానికి సుదీర్ఘమైన మలుపులతో నిండిన ప్రయాణం చేస్తున్న ఏ సమిష్టి ఉద్యమంలోనైనా కనిపించే అంతర్గత విభేదాలకు, పోరాటాలకు అతీతుడు కాదు.
ఆయన చారిత్రాత్మక విజయాలను సాధించిన నాయకుడు. అయినప్పటికీ తాను కలలు కన్న దక్షిణాఫ్రికాను నిర్మించాలనే పోరాటం ఇంకా పూర్తికాలేదు. ఆ విజయాన్ని ఇంకా సాధించాల్సి ఉంది.
మడీబా కూడా మనలో ప్రతి ఒక్కరిలాగే లోపాలతో కూడిన మనిషి కావడం ఎంత గొప్ప వరమో.
ఎందుకంటే ఒక మెస్సయ్యను(రక్షకుడిని) అనుసరించడం అసాధ్యం. ఆయనను ఆరాధించడం మాత్రమే చేయగలం.
కానీ మడీబాలోని ఆ మానవత్వమే తరువాతి తరం నాయకుల వైపు చూసి మీరు కూడా మడీబా కావచ్చని మనస్ఫూర్తిగా, నిజాయితీగా చెప్పే ధైర్యాన్ని మనకు ఇస్తుంది.
మండేలా ఫౌండేషన్ గ్లోబల్ లీడర్షిప్ ఫోరం..
మడీబా దాదాపు ఒక శతాబ్దం పాటు మార్గదర్శకంగా నిలబెట్టుకున్న గౌరవప్రదమైన జీవితానికి సంబంధించిన పోరాటాన్ని కొనసాగించేందుకు ఏర్పాటు చేస్తున్న మండేలా ఫౌండేషన్ గ్లోబల్ లీడర్షిప్ ఫోరంను ప్రారంభించడానికి ఈ సాయంత్రం మనమంతా ఒకచోట చేరాము.
మన ముందున్న కల్లోలభరితమైన మార్గంలో ముందుకు సాగేందుకు దిశను నిర్దేశించుకోవడానికి మనం ఇక్కడ సమావేశమయ్యాం.
బలమైన వ్యక్తుల నిరంకుశ పాలన, అవినీతి ప్రపంచాన్ని కుదిపేస్తున్న ఈ కాలంలో అర్థరాత్రి చాటునే ప్రజల హక్కులు హరించబడుతున్నాయి. వివిధ రూపాల్లో వర్ణవివక్ష (అపార్థైడ్) ఇప్పటికీ కొనసాగుతోంది.
ఈ విభజనలకు సమాధానాలు వెతుకుతూ, వాటి అర్థాన్ని గ్రహించడానికి ప్రయత్నిస్తూ, తీవ్ర కల్లోల పరిస్థితుల మధ్య నాయకత్వం వహించే మార్గాన్ని అన్వేషిస్తూ మనమందరం ఇక్కడ ఒకటయ్యాం.
ఇలాంటి సందర్భంలో ఈ రోజు నేను నిలబడి ఉన్న ఈ స్థానంలో నిలిచే అదృష్టం కలిగిన వ్యక్తి సాధారణంగా సభలో ఉన్నవారిని చూసి, మడీబా ఈ రోజు మన మధ్యన ఉంటే ఆయన ఏమి చెప్పేవారు? ఏమి చేసేవారు? అని ఊహించమని కోరుతారు. కానీ దానికి బదులుగా మనం మనల్ని మనమే మరో ప్రశ్న ఎందుకు అడగకూడదు? మడీబా మన మధ్య ఉన్నప్పుడు ఆయన ఏమి చెప్పారు? ఆయన చెప్పిన మాటలకు ప్రతిగా మనం ఏమి చెప్పాము?
దీనికి సమాధానం తెలుసుకోవడానికి మనం చాలా దూరం వెళ్లాల్సిన అవసరం లేదు.
ఈ భవనం తలుపులు దాటి బయటకు వెళ్లి 2 నిమిషాలు నడిచి 42వ వీధిలోని బీ లేదా డీ సబ్వే స్టేషన్‌కు చేరుకుని అక్కడి నుంచి రైలులో 125వ వీధికి వెళ్లండి.
అక్కడి నుంచి మరో 10 నిమిషాలు నడిస్తే మీరు క్యూనీకి చెందిన ఆరోన్ డేవిస్ హాల్ ముందు నిలబడి ఉంటారు.
అక్కడే 1990 జూన్ 21న రాబెన్ దీవి జైలు నుంచి విడుదలైన కేవలం 4 నెలల తర్వాత మడీబా ఏబీసీ న్యూస్‌కు చెందిన టెడ్ కొప్పెల్తో జరిగిన ఒక టౌన్‌హాల్ సమావేశంలో పాల్గొనడానికి వచ్చారు.
ఆ ఫిబ్రవరిలో మడీబా జైలు నుంచి విడుదలైన నాటి నుంచి ప్రపంచం మొత్తం ఆయనపైనే తన చూపును కేంద్రీకరించింది.
నిజానికి అంతకు ముందు ఎన్నో దశాబ్దాలుగా కూడా ప్రపంచ దృష్టి ఆయనపైనే నిలిచి ఉంది.
అయితే ఈసారి మాత్రం ఒక తేడా ఉంది.
ప్రపంచం తన గురించి నిర్మించుకున్న ఆ మహోన్నత ప్రతిరూపానికి తాను నిజంగా తగినవాడినేనా అనే ప్రశ్నకు స్వయంగా ప్రపంచం వైపు తిరిగి చూసి సమాధానం చెప్పే అవకాశం ఆయనకు తొలిసారిగా లభించింది.
అయితే మడీబా అలాంటి వ్యక్తి కాదని నిరూపించడానికి ఆసక్తి చూపినవారు చాలామందే ఉన్నారు.
టెడ్ కొప్పెల్ ఒక ఆకస్మిక దాడిని టౌన్‌హాల్ సమావేశం ముసుగులో నిర్వహించాడు.
సభలో ప్రత్యక్షంగా కూర్చున్నవారితో పాటు దక్షిణాఫ్రికా నుంచి ఉపగ్రహ ప్రసారం ద్వారా పాల్గొన్న ప్రశ్నకర్తలు మడీబాపై విమర్శలు గుప్పించి ఆయనను ఒంటరివాడిగా నిలబెట్టే ఉద్దేశంతో సిద్ధంగా ఉన్నారు.
అనువాదం : మనోహర రాజు
ఈ వ్యాసం మూడు భాగాలుగా ప్రచురితమవుతుంది, ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
