ఏటా ధర్నాలు.. లాఠీ దెబ్బలు.. రద్దవుతున్న పరీక్షలు; బిడ్డల భవిష్యత్తు కోసం సమాజమంతా ఏకోన్ముఖంగా నిలవాల్సిన తక్షణ సమయమిది.
ఢిల్లీ నడిబొడ్డున ఉన్న జంతర్ మంతర్ వీధులు ఇప్పుడు కేవలం నిరసనలకు వేదిక కాదు.
అవి నవభారత యువత అణచివేయబడిన ఆక్రందనకు, ఉవ్వెత్తున ఎగసిన చారిత్రాత్మక తిరుగుబాటుకు సజీవ సాక్ష్యాలు.
వాన చినుకుల మధ్య, పోలీసు లాఠీల విచక్షణారహిత దెబ్బల ఎదుట ‘మారో.. సర్.’ అంటూ భరత్ బనైట్ అనే 27 ఏళ్ల యువకుడు ఎంతో ధైర్యంతో నిలబడ్డ దృశ్యాలు ప్రతి భారతీయుడి మనస్సాక్షిని కుదిపేశాయి.
ఇది కేవలం ఒక రోజు ఆగ్రహం కాదు. దశాబ్ద కాలంగా విద్యావ్యవస్థలో పేరుకుపోయిన అవినీతిపై, పేపర్ లీకేజీల విష సంస్కృతిపై జెన్ జీ గర్జించిన అక్షర విప్లవం.
విమర్శల పొగమంచు వెనుక… కుమిలిపోతున్న కోట్లాది గుండె చప్పుడు..
ఢిల్లీ జంతర్ మంతర్‌లో రగిలిన ఈ చారిత్రాత్మక ఉద్యమాన్ని అణచివేయడానికి పాలకులూ, వారి అనుకూల వర్గాలు రకరకాల లేబుళ్లు అంటించే ప్రయత్నం చేశాయి. కొందరు దీనిని ‘స్పాన్సర్డ్ ఉద్యమం’ అని హేళన చేస్తే, మరికొందరు విదేశీ శక్తుల కుట్రగా చిత్రీకరించారు. ఇంకొందరు గతంలో జరిగిన అన్నా హజారే ఉద్యమంతో పోల్చి దీని తీవ్రతను తగ్గించి చూపించే కుట్ర చేశారు.
ఈ ఉద్యమానికి స్పష్టమైన దిశలేదని, కేవలం విద్యాశాఖ మంత్రి రాజీనామా ఒక్కటే లక్ష్యంగా మిగిలిపోయిందని విమర్శలు గుప్పించారు.
కానీ, ఈ రాజకీయం, వాదోపవాదాల పొగమంచు వెనుక నలిగిపోతున్న అత్యంత చేదు నిజం ఒకటి ఉంది.
అది దశాబ్ద కాలంగా పేపర్ లీకేజీల రొంపిలో నలిగిపోతున్న లక్షలాది మంది విద్యార్థులు, వారి రక్తాన్ని కూడబెట్టి చదివిస్తున్న తల్లిదండ్రుల గుండెకోత.
పిల్లల కళ్లలో మెరిసే భవిష్యత్తు కలలు కన్నీళ్లై కారుతుంటే, వారి నిద్రాహారాలు, జీవిత త్యాగాలు నీటిపాలవుతుంటే కలత చెందిన ఆ కడుపుకోతను ‘కుట్ర’ అనడం కన్నతల్లుల ఆవేదనను హేళన చేయడమే.
ఈ పోరాటం ఏ ఒక్క నాయకుడి స్వార్థమో, విదేశీ కుట్రో కాదు. ఇది తమ ఆత్మగౌరవాన్ని, భవిష్యత్తును కాపాడుకోవడానికి భావి భారత పౌరులు చేస్తున్న ధర్మయుద్ధం.
గత 15 ఏళ్ల లీకేజీల దగా సంస్కృతి..
గత 15 ఏళ్లుగా భారతదేశంలో ప్రవేశ, నియామక పరీక్షల పేపర్ లీకేజీలు ఒక అలవాటుగా, లాభసాటి వ్యాపారంగా మారిపోయాయి.
రాష్ట్రాల పబ్లిక్ సర్వీస్ కమిషన్ల(పీఎస్సీ) ఉద్యోగ ప్రకటనల నుంచి జాతీయ స్థాయి అర్హత పరీక్షలైన నీట్, యూజీసీ-నెట్ వరకు ప్రతి ప్రధాన పరీక్షా విద్యా మాఫియా చేతిలో విక్రయ వస్తువుగా మారింది.
పారదర్శకతకు మారుపేరుగా ఉండాల్సిన పరీక్షా కేంద్రాలు, బోర్డులు అవినీతి రొంపిలో కూరుకుపోయి, కష్టపడి చదివే ప్రతిభావంతులైన పేద, మధ్యతరగతి విద్యార్థులకు నిలువునా ద్రోహం చేస్తున్నాయి.
కోట్లాది మంది భవిష్యత్తుతో చెలగాటం..
ప్రతి సంవత్సరం దేశవ్యాప్తంగా దాదాపు 3 కోట్లకు పైగా విద్యార్థులు ప్రవేశ, నియామక పరీక్షల కోసం రాత్రింబగళ్లు కష్టపడుతున్నారు.
తమ కడుపు కట్టుకుని, ఆస్తులు తాకట్టు పెట్టి పిల్లలను చదివిస్తున్న తల్లిదండ్రుల నిద్రాహారాలు, విద్యార్థుల శ్రమ- పరీక్ష సరిగ్గా ముగిసిందనుకునే లోపే ‘పేపర్ లీక్’ అనే ఒక్క మాటతో నీటిపాలవుతున్నాయి.
గడచిన 15 ఏళ్లలో డజన్ల కొద్దీ రద్దయిన పరీక్షల వల్ల లక్షలాది మంది వయోపరిమితి దాటిపోయి, భవిష్యత్తు అంధకారమై రోడ్డున పడ్డారు.
ధర్నాలు, రాస్తారోకోలు, లాఠీ దెబ్బల నిరంతర వలయం..
ఏటా పరీక్ష జరగడం, లీక్ కావటం, దానికి నిరసనగా విద్యార్థులు రోడ్లపైకి వచ్చి ధర్నాలు, రాస్తారోకోలు చేయడం, వారిపై ప్రభుత్వాలు పోలీసులు లాఠీ ఛార్జీలు చేయించడం ఒక నిరంతర వలయంగా మారిపోయింది.
ఎంతమంది విద్యార్థులు రక్తం చిందించినా, ఎంతమంది ఆసుపత్రుల పాలైనా పాలకుల పద్ధతిలో కనీస మార్పు రాకపోవడం వ్యవస్థాగత వైఫల్యానికి పరాకాష్ట. ప్రతిసారీ విచారణ కమిటీల పేరుతో కాలయాపన చేయడం తప్ప, శాశ్వత పరిష్కారం చూపిన దాఖలాలు లేవు.
కుప్పకూలిన సంస్థల విశ్వసనీయత..
పరీక్షలను పారదర్శకంగా నిర్వహిస్తుందని నమ్మి బాధ్యతలు అప్పగించిన జాతీయ పరీక్షల సంస్థ(ఎన్టీఏ) లాంటి కేంద్ర ఏజెన్సీలు సైతం వరుస కుంభకోణాల్లో చిక్కుకోవడమే నేటి విషాదం.
సెంట్రల్ సర్వర్లు, డిజిటల్ వ్యవస్థలు, కట్టుదిట్టమైన భద్రత ఉన్నాయని గొప్పలు చెప్పుకునే ప్రభుత్వాలు, విద్యా మాఫియా ముందు మోకరిల్లుతున్నాయి.
ఇది కేవలం ఒక సాంకేతిక లోపం కానే కాదు. పాలక వ్యవస్థలు, విద్యా మాఫియా అపవిత్ర కలయికతో జరుగుతున్న వ్యవస్థాగత నేరం.
కరడుగట్టిన పాలకుల ఉదాసీనత..
దేశ రాజధానిలో లక్షలాది మంది విద్యార్థులు, యువకులు తమ భవిష్యత్తును కాపాడాలని రోడ్డెక్కి అరుస్తున్నా పాలకుల్లో కనీస స్పందన లేదు.
అంతర్జాతీయంగా దేశానికి గుర్తింపు తెచ్చిన ప్రఖ్యాత విద్యావేత్త, శాస్త్రవేత్త సోనమ్ వాంగ్‌చుక్ 18 రోజులకు పైగా నిరాహార దీక్ష చేస్తూ దాదాపు 9 కిలోల బరువు తగ్గి, చావుబతుకుల మధ్య ఉన్నా ఒక్క కేంద్ర మంత్రి గానీ, అధికారి గానీ పలకరించకపోవడం పాలకుల కరడుగట్టిన మౌనానికి, ఉదాసీనతకు నిదర్శనం.
ప్రశ్నించే యువతపై ‘యాంటీ నేషనల్’ ముద్ర..
విద్యావ్యవస్థలో జవాబుదారీతనం కోరుతూ, విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయాలని శాంతియుతంగా నిరసన తెలుపుతున్న భావి భారత పౌరులపై ‘దేశద్రోహులు'(యాంటీ నేషనల్స్), ‘అర్బన్ నక్సలైట్లు’, ‘విదేశీ నిధులతో నడిచే శక్తులు’ అని ముద్ర వేయడం పాలకుల నైతిక పతనానికి నిదర్శనం.
తమ తప్పులను కప్పిపుచ్చుకోవడానికి, రాజ్యాంగబద్ధమైన హక్కుల కోసం పోరాడే విద్యార్థులను శత్రువులుగా చిత్రీకరించడం పాలకుల బేలతనాన్ని బయటపెడుతోంది.
అణచివేత ధోరణి – సభ్య సమాజం తలదించుకునే దృశ్యాలు..
శాంతియుతంగా నిరసన తెలుపుతున్న యువతుల బట్టలు చించివేయడం, నిరసనకారులపై టియర్ గ్యాస్ ప్రయోగించడం, హెల్మెట్లు ధరించిన పోలీసులు నిరాయుధులైన పిల్లలపై రాళ్లు రువ్వడం లాంటి దృశ్యాలు సభ్య సమాజాన్ని తలదించుకునేలా చేశాయి.
నిరసనకారులు ఎక్కడా హింసకు పాల్పడలేదు. ముందస్తు అనుమతి లేదనే ఒకే ఒక సాంకేతిక కారణంతో వారిపై విచక్షణారహితంగా దాడి చేయడం పాలకుల నిరంకుశత్వానికి అద్దం పడుతోంది.
కాక్రోచ్ జనతా పార్టీ – జెన్ జీ ఆత్మగౌరవ ప్రతీక..
ఉద్యోగాలు లేక, డిగ్రీలు చేతిలో ఉండి భవిష్యత్తు కనిపించక నిరాశలో ఉన్న యువతను ‘చెత్త’, ‘పరాన్నజీవులు’ అని హేళన చేసిన వ్యాఖ్యల నుంచే ‘కాక్రోచ్ జనతా పార్టీ’ జన్మించింది.
కేవలం సోషల్ మీడియా మీమ్ పేజీగా ప్రారంభమై, కొద్ది రోజుల్లోనే కోట్ల మంది మద్దతు కూడగట్టుకుని జంతర్ మంతర్ వద్ద ప్రత్యక్ష పోరాటానికి దిగిన ఈ ‘జెన్-జీ’ చైతన్యం దేశంలో సరికొత్త రాజకీయ అవగాహనకు, యువజన విప్లవానికి నాంది పలికింది.
నిరుద్యోగ దావానలం.. విద్యార్థుల ఆత్మహత్యలు..
ప్రభుత్వ గణాంకాల ప్రకారమే 15 నుంచి 29 ఏళ్ల లోపు పట్టణ యువతలో నిరుద్యోగ రేటు 13.6 శాతానికి పైగా ఉంది.
కష్టపడి రాసిన పరీక్షలు లీకేజీల వల్ల రద్దవ్వడం, ఫలితాలు రాక ఏళ్లు గడచిపోవడంతో తీవ్ర మానసిక ఒత్తిడికి గురై ప్రతి ఏటా వేలాది మంది విద్యార్థులు బలవన్మరణాలకు పాల్పడుతున్నారు.
ఈ మరణాలు కేవలం ఆత్మహత్యలు కావు. అవినీతి వ్యవస్థ, పాలకులు చేసిన హత్యలేనని విద్యార్థి లోకం ఆక్రోశిస్తోంది.
విద్యా రంగానికి అరకొర బడ్జెట్ కేటాయింపులు..
దేశ ప్రగతికి మూలస్తంభమైన విద్యారంగానికి జీడీపీలో కనీసం 6 శాతం కేటాయించాలని నిపుణులు ఎన్నో ఏళ్లుగా మొత్తుకుంటున్నా- కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు కలిపి కేవలం 4 శాతానికే పరిమితం చేశాయి.
నాణ్యమైన విద్యను అందించడంలో, విశ్వవిద్యాలయాలను బలోపేతం చేయడంలో విఫలమైన ప్రభుత్వాలు, విద్యను కార్పొరేట్ విద్యా మాఫియాకు అమ్ముకోవడానికి సహకరిస్తున్నాయనే తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.
పార్టీలకతీతంగా మేల్కోవాల్సిన తక్షణ సమయం..
ఇది కేవలం విద్యార్థుల సమస్య మాత్రమే కాదు; ఇది దేశ భవిష్యత్తుకు, ప్రజాస్వామ్య మనుగడకు సంబంధించిన ముప్పు.
ఈ రోజు నీట్, యూజీసీ-నెట్ బాధితులుగా ఉన్న విద్యార్థులు రేపు మన ఇంట్లోని పిల్లలే కావచ్చు.
అందుకే రాజకీయ రంగులు, పక్షపాతాలు పక్కనబెట్టి, ప్రతి పౌరుడూ, ప్రతి రాజకీయ పార్టీ, పౌర సమాజం ఏకోన్ముఖంగా తమ పిల్లల పక్షాన, సోనమ్ వాంగ్‌చుక్ పక్షాన నిలబడాల్సిన అత్యంత కీలకమైన సమయమిది.
‘చలో సంసద్’ – పాలకుల కొమ్ములు వంచిన చారిత్రాత్మక అడుగు..
అణచివేతకు భయపడకుండా, జూలై 16న సామూహిక నిరాహార దీక్షలు, జూలై 20న లక్షలాది మందితో నిర్వహించ తలపెట్టిన “చలో సంసద్”(పార్లమెంట్ మార్చ్) పాలకుల గుండెల్లో నిద్రపోతోంది.
ఇప్పటికే మిస్డ్‌కాల్ ప్రచారం ద్వారా లక్షలాది మంది మద్దతు తెలపడం, శబానా ఆజ్మీ, ప్రకాశ్ రాజ్, యోగేంద్ర యాదవ్ లాంటి మేధావులు, విపక్ష నేతలు సంఘీభావం తెలపడంతో ప్రభుత్వం దిగివచ్చి చర్చలకు ఆహ్వానించక తప్పలేదు.
యువత రక్తాన్ని ధారపోసి చేస్తున్న ఈ చారిత్రాత్మక పోరాటాన్ని దేశీయ ప్రధాన స్రవంతి (మెయిన్ స్ట్రీమ్) మీడియా తొక్కిపెట్టిన తీరు, వారి పక్షపాత వైఖరిని నగ్నంగా బయటపెట్టింది.
నిరుద్యోగం, పేపర్ లీకేజీల దగాపై లక్షలాది మంది జెన్ జీ విద్యార్థులు ఢిల్లీ వీధుల్లోకి వస్తే- ప్రపంచంలోని ఏ ప్రజాస్వామ్య దేశంలోనూ లేని విధంగా మన మీడియా గోడ కట్టుకుని పూర్తిగా ఇగ్నోర్ చేసింది, ఘోరమైన మౌనం వహించింది.
అంతర్జాతీయంగా ది గార్డియన్, బీబీసీ, అల్ జజీరా, డబ్ల్యూడబ్ల్యూ లాంటి గ్లోబల్ మీడియా సంస్థలు భారత యువత ఆక్రందనలను, పాలకుల అణచివేతను ప్రముఖంగా ప్రపంచానికి చాటిచెబుతుంటే, ఇక్కడి మీడియా మాత్రం పాలకుల భజనకే పరిమితమైంది.
కానీ, పార్లమెంట్ మార్చ్ సందర్భంగా వేలాది మంది విద్యార్థులు పారామిలటరీ బలగాలు, పోలీసుల లాఠీ ఛార్జీలు, టియర్ గ్యాస్ ప్రయోగాలకు బెదరక, నిరాయుధులై రక్తం ఓడుతున్నా గుండెలు తీసిన ధైర్యంతో బారికేడ్లను బద్దలుకొట్టుకుని ముందుకు దూసుకెళ్లారు.
ఆ యువ సింహాల తెగువ పాలకుల గుండెల్లో రైళ్లు పరుగెత్తించడమే కాక, కళ్లు మూసుకున్న మెయిన్‌స్ట్రీమ్ మీడియా సైతం దిగివచ్చి, అనివార్యంగా ఈ ప్రజా విప్లవాన్ని కెమెరాల్లో బంధించక తప్పని పరిస్థితిని కల్పించింది.
యువత మేల్కొంటే దేశం మేల్కొంటుంది..
‘ఇతరులలో హీరోలను వెతకడం ఆపేసి, మీ జీవితాలకు మీరే హీరోలుగా మారండి.. పౌరులుగా మీ బాధ్యతలను నెరవేర్చండి’ అన్న సోనమ్ వాంగ్‌చుక్ సందేశం నవభారత యువతకు దిశానిర్దేశం చేస్తోంది.
స్వాతంత్ర్య పోరాటం నుంచి ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటం వరకు విద్యార్థులు కదిలినప్పుడే చరిత్ర మారినట్లు, నేడు విద్యార్థులు వేస్తున్న ప్రతీ అడుగు భారతదేశ విద్యావ్యవస్థను పునర్నిర్మించే దిశగా, ఉజ్వల భవిష్యత్తును సాధించే దిశగా పడుతున్న చారిత్రాత్మక అడుగు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
