కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా ఆసుపత్రిలో రోగులను కలిసిన వారిలో షేక్ ఇర్షాద్ మన్సూరి ఒకరు. తర్వాత ఆయనకు 3 గంటల శస్త్రచికిత్స జరిగింది.
న్యూఢిల్లీ: సోమవారం జులై 20న “సంసద్ మార్చ్” సందర్భంగా పోలీసుల చర్యల్లో తీవ్రంగా గాయపడిన వారిలో 25 సంవత్సరాల షేక్ ఇర్షాద్ మన్సూరి ఒకరు. లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో ఆయనకు శస్త్రచికిత్స చేశారు. ఆయన పెల్లెట్ గన్ లేదా అటువంటి ఆయుధ బాధితుడిగా కనిపిస్తున్నాడు.
మన్సూరిని ఆసుపత్రికి తీసుకొచ్చి అప్పటి నుంచి ఆయన వెంటే ఉన్న చిన్ననాటి స్నేహితుడు ‘ది వైర్’తో మాట్లాడుతూ, ఈ గాయాలకు కారణంపై వైద్యులు పరిమిత సమాచారం మాత్రమే ఇస్తున్నారని చెప్పారు. ఇర్షాద్ పరిస్థితి లేదా గాయాలపై ఎలాంటి లిఖితపూర్వక పత్రాన్ని కూడా ఇవ్వలేదని ఆయన అన్నారు.
తన గాయాలకు ఇర్షాద్ మంగళవారం 3 గంటల పాటు శస్త్రచికిత్స చేయించుకున్నారు. జంతర్ మంతర్ వద్ద యువజన నిరసనలో పాల్గొనడం అతనికి అదే మొదటి రోజని, మామూలుగా గురుగ్రామ్‌లో పని చేసే దగ్గరే ఇర్షాద్ ఉంటాడని ఆయన స్నేహితుడు చెప్పారు.
ఆసుపత్రి బెడ్ నుంచి ఇర్షాద్ తీసుకున్న సెల్ఫీలో ఆయన ముఖం, మెడపై చిన్న పెల్లెట్ లాంటి గాయాలు కనిపిస్తున్నాయి. ఈ గాయాలలో కన్ను కింద ఒకటి, మెడపై ఉన్న గాయం మరొకటి- ఇవి రెండు చాలా తీవ్రంగా ఉన్నాయని వైద్యులు చెప్పినట్లు ఆయన స్నేహితుడు తెలిపారు.
చికిత్స ప్రక్రియ సందర్భంగా ఇర్షాద్ కంటి చూపును కోల్పోతే అందుకు వైద్యులు బాధ్యులు కారని అంగీకరిస్తూ ఒక కాగితంపై సంతకం చేసి ఇవ్వాలని ఆసుపత్రి సిబ్బంది ‘ది వైర్’ సమక్షంలోనే కోరారు.
ఆర్ఏఎఫ్ జవాన్ల పనేనా?..
ఇర్షాద్ గాయపడినప్పుడు తన స్నేహితునితో కలిసి కన్నాట్ ప్లేస్ ప్రాంతంలో ఉన్నారు. సుమారు 40-50 మీటర్ల దూరం నుంచి ర్యాపిడ్ యాక్షన్ ఫోర్స్ (ఆర్ఏఎఫ్) జవాన్ ఆయుధాన్ని ప్రయోగించారని, అలాంటి ఆయుధంతో దాడికి గురైన మిగతా వారు ఎవరినీ కూడా తాము చూడలేదని వారు ‘ది వైర్’కు చెప్పారు. కొనసాగుతున్న నిరసనల సందర్భంగా సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్(సీఆర్పీఎఫ్) కింద ఉండే ఆర్ఏఎఫ్ను రంగంలోకి దింపారు.
జేపీ నడ్డా పరామర్శ – దాచిపెట్టిన ఆడియో..
కేంద్ర ఆరోగ్య శాఖ మంత్రి జేపీ నడ్డా లేడీ హార్డింజ్ ఆసుపత్రిలో గాయపడిన నిరసనకారుల్లో ఒకరైన ఇర్షాద్‌ను కలుసుకోవడం గమనార్హం. వారి ఇష్టాగోష్ఠి వీడియోను ఏఎన్ఐతో పాటు అనేక వార్తా ఏజెన్సీలు పంచుకున్నాయి, అయితే అందులో ఆడియో లేదు. ఇర్షాద్ గాయాలు స్పష్టంగా కనిపించని విధంగా ఆ వీడియో తీశారు.
ఈ ముఖాముఖి గురించి అడగ్గా, ఇర్షాద్కు పండ్ల గంపను బహూకరించిన నడ్డా “అంతా సర్దుకుంటుంది(సబ్ ఠీక్ హో జాయేగా)” అని చెప్పినట్లు ఆయన స్నేహితుడు తెలిపారు.
ఎలా గాయపడ్డారని కూడా నడ్డా ఆరా తీశారు. దానికి తాను నిరసనలో పాల్గొన్నానని, నిరసనకారులను పోలీసులు లక్ష్యంగా చేసుకున్నప్పుడు గాయపడినట్లు మంత్రి దృష్టికి ఇర్షాద్ తీసుకెళ్లారు.
దేశ యువత, విద్యకు సంబంధించి కేంద్ర ప్రభుత్వ చర్యలు, వైఫల్యాల పట్ల అసంతృప్తితోనే నిరసనలో చేరినట్లు కూడా నడ్డాకు ఇర్షాద్ స్పష్టం చేశారు.
అయితే వార్తా ఏజెన్సీలు పంచుకున్న వీడియోలో ఈ సంభాషణలేవీ వినిపించలేదు. ఇర్షాద్‌ను పరామర్శించి నడ్డా ధైర్యం చెబుతున్న దృశ్యం మాత్రమే కనిపించింది.
శరీరంలో పెల్లెట్ శకలాలు..
ఇర్షాద్‌తో బుధవారం ఉదయం ‘ది వైర్’ మాట్లాడింది. శస్త్రచికిత్స తర్వాత చాలా నొప్పిగా ఉన్నట్లు ఆయన చెప్పారు. శస్త్రచికిత్స సందర్భంగా లోపలికి చొచ్చుకుపోయిన అనేక శకలాలను తొలగించారని అన్నారు.
“నాతో ఏమైందో, ఏమి జరుగుతుందో నాకు తెలియదు, కానీ నా గొంతుక మాత్రం అలాగే ఉంటుంది. నాకంటే నా దేశం ఎంతో విలువైనది” అని పేర్కొంటూ సామాజిక మాధ్యమంలో ఆయన పోస్ట్ చేశారు.
ఖండించిన ఢిల్లీ పోలీసులు..
ఇర్షాద్ చిత్రాన్ని ఉపయోగిస్తూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు పెల్లెట్ గన్స్ వినియోగం గురించి మొట్టమొదటి సారిగా ప్రచారంలోకి వచ్చినట్లు కథనాలు పేర్కొన్నాయి. ఈ వాదనపై ఢిల్లీ పోలీసులు స్పందిస్తూ అవి అబద్ధమని చెప్పారు.
“శాంతియుత నిరసనకారులకు వ్యతిరేకంగా పోలీసు దళాలు పెల్లెట్ గన్స్‌ను ఉపయోగిస్తున్నట్లు వచ్చిన కథనాలు పూర్తిగా అబద్ధం, తప్పుదోవ పట్టించేలా ఉన్నాయి” అని న్యూఢిల్లీ డీసీపీ ‘ఎక్స్’ వేదికగా చెప్పారు.
ఇలాంటి ఆధారాల్లేని కథనాలను పంచుకోరాదని ప్రజలకు డీసీపీ గట్టిగా సలహా ఇచ్చారు. “ఇలాంటి సమాచారాన్ని పోస్ట్ చేయకముందు లేదా పంపించకముందు అధికార వర్గాల నుంచి వాస్తవాలను ధ్రువీకరించుకోవాలి” అని కోరారు.
పోలీసులు బుధవారం ఉదయం కూడా ఇదే వాదనను పునరుద్ఘాటించారు. అయితే, పెల్లెట్ గన్ వాడారన్న ఆరోపణ ఆర్ఏఎఫ్పై ఉందే తప్ప ఢిల్లీ పోలీసులపై కాదు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్టు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
