నిట్టనిలువుగా చీలిపోతున్న ప్రజాతంత్ర మాతను
కన్నీళ్లతో విస్మయంగా, విరక్తిగా చూస్తున్నా..
టియర్ గ్యాస్‌తో మసకబారిన నా కన్నులలోని దైన్యాన్ని చూసిన నా విజ్ఞత
వాస్తవ గమనాన్ని పరికించమని చెళ్లున వీపుపై చరిచింది.
ఇంతకాలం నన్ను నిటారుగా నిలబెట్టిన నా వెన్నెముక..
స్థాణువులా నిలిచిన పాదాలను ముందుకు ఉరకమంటూ భుజాలను కుదుపుతూ కసిరింది.
కరకు బూట్ల కింద నలిగిన మెడను విదిలించి,
పగిలిన తల నుంచి చిమ్ముతున్న నెత్తురు వేడిని పాదాలలోకి తీసుకుని,
పతాక స్థాయిలో అరుస్తూ..
నూతన పాలనా దేవాలయం వైపు
“బాధ్యత” అనే బ్రహ్మ పదార్థాన్ని వెతుకుతూ..
ఒక్కడినే వడివడిగా కదులుతున్నా..
సరిహద్దుల్లో శత్రువులను చీల్చి చెండాడాల్సిన తమ చేతలు
మనసులు చంపుకుని..
కన్న బిడ్డలనే కనికరం లేకుండా వేటాడే లాఠీలుగా ఉత్పరివర్తనం చెందిన సైనిక దళాలు..
తమ బాధ బయటపడకుండా హెల్మెట్లలో తలలను, తలపులను దాచుకుంటున్న దృశ్యం అస్పష్టంగా కంటబడింది.
ఆ పక్కనే మరో పెద్ద గుంపును చూశాను..
గాయపడ్డ మనసుల మంటలను చల్లార్చే క్యానన్ల నీటి ఒత్తిడిని అలవోకగా మింగుతూ..
దేశమంతా ప్రతిధ్వనించేలా పెద్దపెట్టున అరుస్తూ..
ఎన్ని’కల’లో గెలవలేని యువతరం, వారి బాధల ప్రతినిధులు నాకంటే ముందుగానే పరిగెడుతున్నారని తెలుసుకున్నాను..
నేనే వెనుకబడ్డానని గ్రహించాను..
ఇంతకాలం నాకు తోడుగా ఎవరూ లేరనుకున్నాను, కానీ..
ఇప్పుడు నేనే వారందరికీ నీడగా నిలవాలని నిర్ణయించుకున్నాను..
ఇకపై ‘బాధ్యత’ నేనే వహిస్తానని పరిపూర్ణంగా తలకెత్తుకున్నాను..
– గిరిధర్..
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
