ఇదిగో..
వినిపిస్తోందా నా గావుకేక..!
తట్టుకోలేని ఈ శబ్దాన్ని ఆపేందుకు నా గొంతు నులమాలని చూస్తావా?
నా మౌన నిరసన ప్రళయ ఘోషకన్నా ఎన్నోరెట్లు ప్రతిధ్వనిస్తుంది తెలుసా!
పిడికిలి బిగించిన నా చేతిని ఒక్కవేటుతో నరికేద్దామని చూస్తావా?
వేళ్లులేని ఆ మొండి చేయి మరింత పదును సంతరించుకుంటుంది తెలుసా!
పరిగెత్తే కాళ్ల మీద అమాంతం రక్తాలు కారేట్టు కర్రలతో గట్టిగా బాది, పరుగును ఆపుదామని చూస్తావా?
_ఈ బలహీనమైన నా దేహాన్ని,_
_బలమైన నా దేశాన్ని.._
_నడవలేని మోకాళ్ళతో ఈడ్చుకుంటూ మరింత వడివడిగా ముందుకు కదిలిస్తాను తెలుసా!_
అయినా..
సమైక్యతా రాగాల మానస వీణ తంత్రులను
నీ స్వార్థ విష ప్రయోజనాల కత్తులతో చిదిమివేసి, వికటాట్టహాసం చేద్దామనుకుంటున్నావా?
నేను…
దిగంబరుడినైన నా చుట్టూ వీచే గాలిలోనే నిశ్శబ్దపు నినాదాలతో తిరుగుబాటు తుపానులు కురిపించి,_
ఇనుప పదఘట్టనల కింద నలిగిపోయిన ఎన్నో మెత్తని మకరందపు పూబాలలను చిగురింపజేస్తా!
_పసి కన్నుల కలలన్నీ ఈ జన్మలోనే నిజరూపు దాల్చేట్లు_
డప్పులు, గజ్జెలు, కొమ్ముబూరలతో
ప్రజాకళలకు పునర్వైభవం కల్పింపజేస్తా!!
_కల్లోల జగతిలో మందార, మహువాలను పూయించి,_
ఆకలిదప్పులు తీర్చే మధుర గానాలను సృజియింపజేస్తా!!!
– _గిరిధర్_
9849801947
08.05.2026
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
