రాజుగారు చనిపోయారు. లేదా, రాజుగారు చనిపోయారని చెబుతున్నారని రాయాలా?
రాజుగారి మరణం విషయంలో ఇంకా గందరగోళం, గొడవలు కొనసాగుతూనే ఉన్నాయి. ఉబ్బిపోయిన ఒక శవం మాత్రం అక్కడ ఒక ఖరీదైన తివాచీ మీద పడి ఉంది. అదేదో దూర దేశం నుంచి రాజుగారికి బహుమానంగా వచ్చిన తివాచీ అని ఎవరో అంటున్నారు.
రాజుగారు రహస్య నేలమాళిగలో ఆత్మహత్య చేసుకున్నారని మంత్రి నమ్మకంగా చెబుతున్నాడు. చనిపోయాక తన శవాన్ని అవమానిస్తారనే అనుమానంతో, తన దేహాన్ని ఒక రహస్య ప్రదేశంలో భద్రపరచాలని రాజుగారు తనని కోరారనీ… ఆ కోరిక ప్రకారం శవాన్ని పైకి తెచ్చి సింహాసనం మీద కూర్చోబెట్టి, అక్కడి నుంచి తరలించే ఏర్పాట్లు చేసేలోగా ఇంకెవరో శవాన్ని పక్కకి జరిపారని చెబుతున్నాడు. అయితే ఆత్మహత్య ఎలా చేసుకున్నదీ తాను చూడలేదని మంత్రి ఒప్పుకున్నాడు.
భద్రతా సలహాదారు కథనం మాత్రం మరొకలా ఉంది. కోటలోని తోటలో దీపస్తంభానికి రాజుగారి శవం తలకిందులుగా వేలాడుతూ ఉండగా చూశామని ఆయన చెబుతున్నాడు. ఎవరో కుట్ర చేసి రాజుగారిని చంపారనేది ఆయన వాదన.
మరో వైపు, తివాసీ మీద రాజుగారి శవం పడి ఉండడాన్ని మొదట చూసింది తానేనని పనివాడు చెబుతున్నాడు.
వంటవాడి కథనం ఇంకోలా ఉంది. తేనీరు కావాలని రాజుగారు అడిగారనీ, దాన్ని తయారు చేసి తెచ్చేలోగా ఆయన మాయమయ్యారనీ ఆ వంటవాడు అంటున్నాడు.
ఎవరి కథనం వాళ్లది. శవం మాత్రం మౌనంగా తివాచీ మీద పడి ఉంది.
క్రూరత్వానికి, నిశితమైన ప్రణాళికలకి పేరుగాంచిన భద్రతా సలహాదారు రంగంలోకి దిగి పరిస్థితిని అదుపులోకి తీసుకున్నాడు. తర్వాతి చర్యలు చేపట్టాలని పురమాయించాడు. శవ పరీక్షకు రాజుగారి దేహాన్ని భయభక్తులతో, అత్యంత శ్రద్ధగా తరలించారు. పైకి దేహం మీద ఎలాంటి గాయాలూ లేవు.
అయితే శవ పరీక్షలో వైద్యులకు దిగ్భ్రాంతికరమైన విషయాలు బయటపడ్డాయి. రాజుగారి శరీరంలో గుండె లేదు, తలలో మెదడు లేదు. ఊపిరితిత్తుల స్థానంలో ఒకే ఒక పెద్ద గాలి బుడగ ఉంది. అది ఒక వైపు సగం పగిలినట్టు కనిపిస్తోంది, ఇంకోవైపు చూస్తే ఏదో గుండుసూది గుచ్చుకున్న రంధ్రం లాంటిది ఉంది. కడుపులో మిగతా అవయవాలేవీ ఉన్నట్టు లేదు. జీర్ణాశయం మాత్రం మామూలుకంటే అతి పెద్దదిగా ఉంది. విష ప్రయోగం జరిగినట్లు ఆధారాలు లేవు కానీ, నిర్ధారణ కోసం ఇంకా కొన్ని పరీక్షలు చేయాలని వైద్యులు చెప్పారు.
రాజుగారికి గుండె, మెదడు లేవనే విషయం బయటికి వెల్లడించకూడదని మంత్రి పట్టుపడుతున్నాడు. భద్రతా సలహాదారు మాత్రం అసలు ఆయన ఎలా చనిపోయారో తేల్చాలని చూస్తున్నాడు. వైద్యులకు ఇదొక విషమ పరీక్ష. గాలి బుడగ బాగా ఉబ్బిపోయి తనంత తానుగా పగిలిపోయి ఉండవచ్చనీ, లేదా గుండుసూది గుచ్చుకుని గాలి బయటికి పోయి చనిపోయి ఉండవచ్చనీ చెప్పారు. రెండూ ఏకకాలంలో జరిగినా జరిగి ఉండవచ్చని అభిప్రాయపడ్డారు.
చనిపోయింది నిజంగా రాజుగారేనా అని ఇంతలో ఎవరో అనుమానం వ్యక్తం చేశారు. ఆయన ఇంతకు ముందు చేసిన ప్రయోగాల జ్ఞాపకాలు గుర్తొచ్చి అందరికీ గుండె ఝల్లుమంది. తాను చనిపోయాక ఎవరెవరు ఏమేం చేస్తారో తెలుసుకోవడానికి గతంలో స్వయంగా పుకార్లు సృష్టించారు. ఎవరెవరు దీపాలు వెలిగించారు, ఎవరెంతగా శోకాలు పెట్టారు, భజన గీతాలు మైకులలో వినిపించారు అని లెక్కలు వేశారు. పట్టించుకోనట్లు ఉన్నవాళ్లనీ, రహస్యంగా సంబరాలు చేసుకున్నవాళ్లనీ కనిపెట్టారు. అనుమానాస్పదంగా వ్యవహరించిన వాళ్లనందరినీ పదవుల నుంచి తొలగించి, నిర్దాక్షిణ్యంగా శిక్షించారు. అయితే, అవన్నీ అంతఃపుర సన్నిహిత బృందానికే పరిమితమై జరిగాయి.
ఈసారి రాజుగారి శవం కళ్ళ ముందే ఉంది. కానీ అది ఆయనను పోలిన మరొకరిది కావొచ్చు కదా అని సందేహం. చనిపోయిన కబురు కూడా ఈసారి కొంచెం ఎక్కువ మందికి తెలిసింది. పూర్వపు శిక్షలు గుర్తుకు వచ్చి సన్నిహితులందరిలో ఒక్కసారిగా భయం పట్టుకుంది. ఆయన రహస్యంగా అందరినీ గమనిస్తున్నారేమోనన్న అనుమానంతో ఎవరూ నోరు మెదపడంలేదు. అంతా నిశ్శబ్దం.
ఇంతలో, ఎవరో ఒక చిన్న పిల్ల, హఠాత్తుగా తెర వెనుక నుంచి ప్రత్యక్షమైంది. ఎక్కడ నుంచి వచ్చిందో తెలియదు, ఎవరి తాలూకో తెలియదు. ఏమాత్రం భయపడకుండా, బిగ్గరగా “రాజుగారు చనిపోయారు” అని కేక పెట్టింది.
పెద్ద గందరగోళం మొదలైంది. ఏం చేయాలో ఎవరికీ పాలుపోవడం లేదు. భృత్యగణంలో గగ్గోలు. రాజుగారికి సన్నిహితులైన వ్యాపారవేత్తల ముఖాల్లో నెత్తురుబొట్టు లేదు. ఆయనే సర్వస్వం అని నిత్యం భజన గీతాలు పాడిన వాళ్లకి కాళ్లూ చేతులూ ఆడడం లేదు. కాళ్ల కింద నేల కదిలిపోయింది. ఏడవాలంటే సమయానికి కన్నీళ్లు కూడా రావడం లేదు. ఆయన నిజంగా చనిపోయారా లేదా అనే అనుమానం మనస్సులను తొలిచేస్తోంది. తలెత్తి చూడాలంటే భయం, కళ్లు తెరిచి చూడాలంటే భయం, నోరు తెరిచి మాట్లాడాలంటే భయం.
అప్పుడే కోట బయట చావు డప్పు మోగింది, ఊరేగింపు శబ్దం వినిపించింది.
ఆ చిన్నపిల్ల పాడుతూ ఉంది: “అంతమే ఆనందం”…
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
