దేశానికి ఆహారాన్ని అందించే రైతు ఎంత ముఖ్యమో, ఆ ఆహారాన్ని పండించడంలో విత్తనాల నుంచి పంట కోత వరకు శ్రమించే గ్రామీణ మహిళ కూడా అంతే ముఖ్యం.
పొలంలో నాట్లు, కలుపు, పంట కోత, ధాన్యాన్ని శుభ్రపరచడం, పశువులను పోషించడం, పాల ఉత్పత్తి, కూరగాయల సాగు, విత్తనాల సంరక్షణ వంటి అనేక పనుల్లో గ్రామీణ మహిళల శ్రమ కీలకమైనది. అయినప్పటికీ వారి శ్రమకు తగిన వేతనం, గుర్తింపు, ఆర్థిక స్వాతంత్ర్యం, సామాజిక భద్రత లేవు.
వ్యవసాయ పనులతోపాటు ఇంటి పని, పిల్లల పెంపకం, వృద్ధుల సంరక్షణ, నీరు తెచ్చుకోవడం, వంట చెరకు సేకరించడం వంటి బాధ్యతలను మహిళలే నిర్వహిస్తున్నారు.
ఈ పనులు జాతీయ ఆదాయ గణాంకాల్లోనూ, అధికారిక ఉపాధి లెక్కల్లోనూ ప్రతిబింబించవు. ఈ నేపథ్యంలో ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ అక్టోబర్ 15ను అంతర్జాతీయ గ్రామీణ మహిళా దినోత్సవంగా 2007లో ప్రకటించింది.
2008 నుంచి అంతర్జాతీయంగా ఈ దినోత్సవాన్ని పాటిస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లో మహిళల స్థితిగతులను మెరుగుపరచడం, పేదరికాన్ని తగ్గించడం, ఆహార భద్రతను మెరుగు చేయడం, మహిళల సాధికారతను ప్రోత్సహించడం దీని ముఖ్య ఉద్దేశాలు.
దినోత్సవం ఆవిర్భావం, ప్రాధాన్యం
వ్యవసాయం, ఆహార ఉత్పత్తి, గ్రామీణ ఆర్థిక వ్యవస్థలో మహిళలు కీలక పాత్ర పోషిస్తున్నారు. అయినప్పటికీ వారికి వనరులు, భూమి, రుణాలు, సాంకేతిక పరిజ్ఞానం, మార్కెట్లు, విద్య, ఆరోగ్యం వంటి అవకాశాలు పురుషులతో సమానంగా అందడం లేదనే సమస్య అంతర్జాతీయ స్థాయిలో చాలాకాలంగా చర్చకు వస్తోంది.
ఈ దినోత్సవం ఒక వేడుక కాకూడదు. గ్రామీణ మహిళా కార్మికులకు కనీస వేతనాల అమలు, సమాన పనికి సమాన వేతనం, భూమిపై హక్కులు, గర్భధారణ, ప్రసూతి సమయంలో రక్షణ, వృద్ధాప్యంలో పెన్షన్, లైంగిక వేధింపులు, కుల, లింగ వివక్ష నుంచి రక్షణ ఉందా అనే ప్రశ్నలకు సమాధానంగా కార్యాచరణకు ఉపయోగపడేలా ఈ దినోత్సవాన్ని నిర్వహించాలి.
ప్రపంచవ్యాప్తంగా గ్రామీణ మహిళల శ్రమ – గణాంకాలు
ఐక్యరాజ్యసమితి ప్రచురించిన గ్రామీణ మహిళా దినోత్సవ సమాచారంలో పేర్కొన్న గణాంకాలు మహిళల పట్ల అసమానతను స్పష్టంగా తెలియజేస్తున్నాయి.
వ్యవసాయ కార్మికుల్లో మహిళల వాటా 2023 నాటికి సుమారు 40 శాతం. కానీ వ్యవసాయ భూముల యాజమాన్యం కేవలం 15 శాతం మాత్రమే ఉన్నట్లు ఐరాస పేర్కొంది.
కూలీ విషయంలో పురుషులకు వస్తున్నదానిలో గరిష్టంగా 82 శాతం మాత్రమే. మహిళలకు సమాన వనరులు, హక్కులు ఉంటే వ్యవసాయ దిగుబడులు 20 నుంచి 30 శాతం పెరిగే అవకాశం ఉందని, తద్వారా అదనంగా 10 నుంచి 15 కోట్ల మందికి ఆహారం అందించవచ్చని ఐరాస పేర్కొంది.
ఈ గణాంకాలు రెండు ప్రధాన విషయాలను తెలియజేస్తున్నాయి. మొదటిది, వ్యవసాయ ఉత్పత్తిలో మహిళల భాగస్వామ్యం ఎక్కువగా ఉన్నా, భూమి వంటి ఉత్పాదక ఆస్తులపై వారికి హక్కు తక్కువగా ఉంది.
రెండోది, మహిళలకు సమాన అవకాశాలు కల్పించడం కేవలం సామాజిక న్యాయానికి సంబంధించిన అంశం మాత్రమే కాదు, వ్యవసాయ ఉత్పాదకతను, ఆహార భద్రతను పెంచే ఆర్థిక విధానం కూడా.
భారతదేశంలో గ్రామీణ మహిళా కార్మికుల స్థితిగతులు
భారతదేశం వ్యవసాయాధారిత గ్రామీణ సమాజం నుంచి వేగంగా మారుతున్నది. అయినప్పటికీ, కోట్లాది కుటుంబాలకు ఇప్పటికీ వ్యవసాయమే జీవనాధారం.
వ్యవసాయ కూలీ పని, పశు పోషణ, తదితర పనులపై ఆధారపడి ఉంది. వీటిలో మహిళల పాత్ర అత్యంత ముఖ్యమైనది.
వ్యవసాయంలో మహిళల పనులు
విత్తనాల ఎంపిక, విత్తడం, నారు మళ్లు పెంచడం, వరి నాట్లు, కలుపు తీయడం, పంటలకు నీరు పెట్టడం, పంట కోత, నూర్పిడి, ధాన్యం శుభ్రపరచడం, నిల్వ చేయడం, పత్తి, మిర్చి, పొగాకు, కూరగాయలు, పండ్ల తోటల్లో పని చేయడం, పశువుల సంరక్షణ, పాలు పితకడం, పశుగ్రాసం సేకరించడం, వ్యవసాయ ఉత్పత్తుల ప్రాసెసింగ్, చిన్న వ్యాపారాలు, స్వయం ఉపాధి.
అయితే అందరూ ఈ పనులన్నీ చేస్తారని కాదు. కొందరు మహిళలు భూమి యజమానులు, స్వయం ఉపాధి రైతులు, మరికొందరు రోజువారీ కూలీలు, ఇంకొందరు కుటుంబ వ్యవసాయంలో వేతనం లేకుండా పనిచేస్తారు. అందువల్ల వారి సమస్యలకు కూడా వేర్వేరు పరిష్కారాలు అవసరం.
భారతదేశ గణాంకాలు
గ్రామీణ మహిళల శ్రమ వ్యవసాయ రంగంలో ఎంత ముఖ్యమో భారత ప్రభుత్వ గణాంకాలు తెలియజేస్తున్నాయి.
15 ఏళ్లు, అంతకంటే ఎక్కువ వయసున్న గ్రామీణ మహిళల్లో ఉపాధి పొందిన లేదా పని కోసం ఎదురు చూస్తూ ఉన్నవారు 47.6 శాతం మంది.
గ్రామీణ మహిళా కార్మికుల్లో వ్యవసాయ రంగం వాటా 76.9 శాతం. ఈ గణాంకాలు 2023, 24కు సంబంధించినవి. మహిళల ఉపాధి పెరుగుతున్నట్లు కనిపించడం సానుకూల పరిణామమే.
అయితే వారు పొందుతున్న ఆదాయం, పని స్థిరత్వం, వేతనం, పని గంటలు, సామాజిక భద్రత, ఉద్యోగ నాణ్యత వంటి అంశాలను పరిశీలిస్తే వారు తీవ్ర వివక్షకు గురవుతున్నారని పలు నివేదికలు తెలియజేస్తున్నాయి.
సమాన పనికి సమాన వేతనం
గ్రామీణ ప్రాంతాల్లో ఒకే పొలంలో, ఒకే పంటకు సంబంధించిన పనుల్లో మహిళలు, పురుషులు పనిచేసినా కూడా వేతనాల్లో వ్యత్యాసాలు ఉన్నాయి.
పని స్వభావం, నైపుణ్యం, పని గంటలు, వివిధ ప్రాంతాలలో వేతన పరిస్థితులు మారవచ్చు. అయినప్పటికీ కేవలం మహిళ అనే కారణంతో తక్కువ వేతనం ఇవ్వడం ఎంతమాత్రం సమర్థనీయం కాదు.
నాట్లు వేయడం, కలుపు తీయడం, పంట కోయడం, వ్యవసాయ ఉత్పత్తులను వేరు చేయడం వంటి పనులలో శారీరక శ్రమతో పాటు నైపుణ్యం కూడా అవసరం.
ఈ పనుల విలువను తక్కువగా లెక్కించడం మహిళల పట్ల వివక్ష తప్ప మరొకటి కాదు. పనిని బట్టి వేతన రేట్లను పారదర్శకంగా ప్రకటించాలి.
వేతన చెల్లింపులకు రికార్డులు నిర్వహించాలి. వేతన వివక్షపై ఫిర్యాదు చేసే వ్యవస్థ, పరిస్థితులు కల్పించడం పరిష్కార మార్గాలు.
భూమిపై యాజమాన్య హక్కులు
భర్త లేదా కుటుంబానికి చెందిన భూమిలో మహిళలు సంవత్సరాల తరబడి పనిచేసినా, భూమి రికార్డుల్లో వారి పేర్లు నమోదు కావడం లేదు. దీంతో బ్యాంకు రుణాలు, పంట బీమా, వ్యవసాయ పెట్టుబడులు, ప్రభుత్వ సహాయ పథకాలు, వ్యవసాయ నిర్ణయాల్లో వారికి నామమాత్రపు పాత్ర ఉంటున్నది.
భూమిని సాగు చేసే మహిళకు, భూమిపై చట్టబద్ధమైన హక్కు ఉన్న మహిళకు మధ్య ఆచరణలో పెద్ద తేడా ఉంది.
భూమి యాజమాన్యం లేకపోవడం వల్ల మహిళా రైతులు తమ శ్రమతో ఉత్పత్తి చేసిన సంపదపై వారికి ఎలాంటి అధికారం ఉండదు.
వారసత్వ హక్కుల అమలు, భూమి రికార్డుల్లో అర్హులైన మహిళల పేర్ల నమోదు, మహిళా రైతులకు రుణాలు, పంట బీమా, విత్తనాలు, ఎరువులు, సాగునీటి సౌకర్యాలు, భూమి లేని మహిళా కూలీలకు కూడా భూమి, ఉపాధి, గృహవసతి వంటి హక్కులపై ప్రత్యేక విధానాలు రూపొందించి అమలు చేయడం ద్వారానే మహిళలకు సముచిత ప్రాతినిధ్యం వస్తుంది.
వేతనం లేని గృహ శ్రమ, సంరక్షణ బాధ్యతలు
గ్రామీణ మహిళల పని పొలంతో అయిపోదు. ఇంటికి తిరిగి వచ్చి వంట చేయడం, పిల్లల సంరక్షణ, వృద్ధుల సేవ, నీరు తెచ్చుకోవడం, ఇంటి పరిశుభ్రత వంటి పనులు చేయాల్సి ఉంటుంది.
ఈ పనులు కుటుంబ మనుగడకు, కార్మిక శక్తి పునరుత్పత్తికి అత్యవసరం. అయినప్పటికీ వీటికి వేతనం చెల్లించరు. దాంతో మహిళలకు విశ్రాంతి, విద్య, నైపుణ్యాభివృద్ధి, సంఘ కార్యకలాపాలు, రాజకీయ భాగస్వామ్యం దాదాపు శూన్యం.
అంతర్జాతీయ కార్మిక సంస్థ గ్రామీణ మహిళల సాధికారతలో ఈ చెల్లింపు లేని సంరక్షణ పనుల భారాన్ని తగ్గించడం ముఖ్యమని పేర్కొంది.
గ్రామాల్లో తాగునీరు, ఇంధనం, ప్రజా రవాణా, పిల్లల సంరక్షణ కేంద్రాలు, వృద్ధుల సంరక్షణ సేవలను మెరుగుపరచడం, గృహ పనులు మహిళల బాధ్యత మాత్రమే అనే భావనను మార్చి, కుటుంబ సభ్యుల మధ్య బాధ్యతలను పంచుకోవడమే పరిష్కారమని ఆ సంస్థ పేర్కొంది.
ఉపాధి అస్థిరత, సీజనల్ నిరుద్యోగం
వ్యవసాయ పనులు పంట కాలాలపై ఆధారపడి ఉంటాయి. నాట్లు, కలుపు, కోత సమయాలలో పని దొరికినా, మిగిలిన నెలల్లో పని ఉండదు.
వర్షాభావం, వరదలు, తుఫానులు, పంట నష్టం, యాంత్రీకరణ వంటి అంశాలు మహిళా కూలీల ఉపాధిని దెబ్బతీస్తాయి.
గ్రామీణ మహిళలకు ప్రత్యామ్నాయ ఉపాధి లేకపోతే అప్పులు చేయడం, వలస వెళ్లడం, తక్కువ వేతనానికి పని చేయడం వంటి పరిస్థితులకు దారితీస్తాయి. గ్రామీణ ఉపాధి హామీ కార్యక్రమాలను సమర్థంగా అమలు చేయడం, వ్యవసాయేతర గ్రామీణ పరిశ్రమలు, ఆహార ప్రాసెసింగ్, పాడి పరిశ్రమ, చేతివృత్తులు, అటవీ ఉత్పత్తుల ప్రాసెసింగ్ వంటి రంగాల్లో స్థిరమైన ఉపాధి అవకాశాలను పెంచడమే ఇందుకు పరిష్కారం.
ఆరోగ్యం, పని ప్రదేశ భద్రత
తీవ్రమైన ఎండలో పని చేయడం, తగినంత నీరు అందుబాటులో లేకపోవడం, పురుగు మందులకు గురికావడం, బరువులు మోయడం, విశ్రాంతి లేకుండా ఎక్కువ గంటలు పనిచేయడం మహిళల ఆరోగ్యంపై ప్రభావం చూపుతాయి.
గర్భిణులు, ప్రసూతి అనంతర దశలో ఉన్న మహిళలకు ప్రత్యేక రక్షణలు అవసరం. పొలాల్లో మరుగుదొడ్లు, తాగునీరు, విశ్రాంతి స్థలాలు లేకపోవడం గౌరవప్రదమైన పని పరిస్థితులకు విరుద్ధం.
సురక్షితమైన పని పద్ధతులు, రక్షణ పరికరాలు, తాగునీరు, నీడ, మరుగుదొడ్లు, ప్రాథమిక వైద్య సదుపాయాలు కల్పించాలి. పురుగుమందుల వినియోగంపై శిక్షణ ఇవ్వాలి.
గర్భిణులు, బాలింతలకు తగిన పని సర్దుబాట్లు, చట్ట ప్రకారం ప్రసూతి ప్రయోజనాలు అమలు చేయడమే పరిష్కారం.
కుల, వర్గ, లింగ వివక్ష
గ్రామీణ భారతదేశంలో మహిళలందరి పరిస్థితి ఒకేలా ఉండదు. దళిత, ఆదివాసీ, భూమి లేని, వలస, ఒంటరి మహిళా కుటుంబాలపై ఆర్థిక సామాజిక సమస్యల ప్రభావం తీవ్రంగా ఉంటుంది.
కొన్ని ప్రాంతాల్లో కుల ఆధారిత వృత్తి విభజన, అంటరానితనం, సామాజిక బహిష్కరణ, పని స్థల వేధింపులు మహిళల ఉపాధి అవకాశాలను దెబ్బతీస్తాయి.
కుల, లింగ వివక్షకు వ్యతిరేకంగా చట్టాలను సమర్థంగా అమలు చేయడం, ఫిర్యాదులపై వెంటనే స్పందించడం, కార్మిక సంఘాలు, మహిళా సంఘాలు, గ్రామ పంచాయతీలు బాధితులకు అండగా నిలవడం, మహిళలకు సురక్షితమైన ఫిర్యాదు వ్యవస్థలు ఏర్పాటు చేయడమే ఈ సమస్యలకు పరిష్కారం.
రుణాలు, మార్కెట్లు, సాంకేతిక పరిజ్ఞానం
సాగు, పశు పోషణ, ఆహార ప్రాసెసింగ్, చిన్న వ్యాపారాల్లో మహిళలు పనిచేసినా, బ్యాంకు రుణాలు, నిల్వ సౌకర్యాలు, మార్కెట్ సమాచారం, ఆధునిక పరికరాలు వారికి అందుబాటులో ఉండటం లేదు. మధ్యవర్తులపై ఆధారపడటం వల్ల ఉత్పత్తికి తగిన ధర లభించదు.
మహిళా రైతులకు వ్యవసాయ విస్తరణ సేవలు, డిజిటల్ శిక్షణ, తక్కువ వడ్డీ రుణాలు, మార్కెట్ అనుసంధానం, సామూహిక నిల్వ కేంద్రాలు, సహకార మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించాలి.
స్వయం సహాయక సంఘాలను కేవలం పొదుపు-రుణాలకే పరిమితం చేయకుండా ఉత్పత్తి, ప్రాసెసింగ్, మార్కెటింగ్ సంస్థలుగా అభివృద్ధి చేయడమే పరిష్కారం.
గ్రామీణ మహిళా కార్మికుల సమస్యలు వ్యక్తిగత కుటుంబ సమస్యలు మాత్రమే కావు. అవి ఉపాధి విధానం, భూ సంస్కరణలు, వేతన విధానం, సామాజిక భద్రత, ప్రజారోగ్యం, లింగ సమానత్వంతో ముడిపడి ఉన్న సామాజిక, ఆర్థిక సమస్యలు. వీటిని పరిష్కరించాల్సిన బాధ్యత ప్రభుత్వాలదే.
రాజ్యాంగం కల్పించిన హక్కులు
భారత రాజ్యాంగంలోని పలు నిబంధనలు మహిళల సమానత్వానికి, కార్మికుల సంక్షేమానికి పునాది వేస్తాయి.
ఉదాహరణకు ఆర్టికల్ 14 ప్రకారం చట్టం ముందు అందరూ సమానులే. ఆర్టికల్ 15 ప్రకారం మతం, కులం, లింగం తదితర ప్రాతిపదికలపై వివక్షకు వ్యతిరేకంగా రక్షణ కల్పిస్తుంది.
మహిళలు, పిల్లల కోసం ప్రత్యేక నిబంధనలకు అనుమతి ఉంది. ఆర్టికల్ 16 ప్రకారం ప్రభుత్వ ఉద్యోగాల్లో సమాన అవకాశాలు కల్పించాలి.
ఆర్టికల్ 21 జీవించే హక్కు, వ్యక్తిగత స్వేచ్ఛకు రక్షణ నిస్తుంది. ఆర్టికల్ 27 బలవంతపు శ్రమ, మానవ అక్రమ రవాణాను నిషేధిస్తుంది.
ఆర్టికల్ 39(డి) పురుషులు, మహిళలకు సమాన పనికి సమాన వేతనం దిశగా ప్రభుత్వ విధానానికి మార్గదర్శకం.
ఆర్టికల్ 42 మానవీయమైన పని పరిస్థితులు, ప్రసూతి సహాయానికి సంబంధించి మార్గదర్శకం. ఆర్టికల్ 43 జీవనోపాధికి సరిపడా వేతనం, గౌరవప్రదమైన జీవన ప్రమాణాల కోసం మార్గదర్శకం.
ఈ నిబంధనలు సమానత్వం, గౌరవప్రదమైన పని, కార్మిక సంక్షేమం కోసం ప్రభుత్వ విధానాలకు పునాది. వీటిని ఆచరణలోకి తీసుకురావడానికి చట్టాలు, బడ్జెట్ కేటాయింపులు, సమర్థమైన అమలు అవసరం.
వేతనాల చట్టాలు, సమాన వేతనం
పురుషులకు, మహిళలకు సమానమైన లేదా సమాన స్వభావం కలిగిన పనులకు లింగం ఆధారంగా వివక్ష చూపకూడదనే సూత్రం భారత కార్మిక చట్టాల్లో కూడా ఉంది.
వేతనాల కోడ్, 2019లో సమాన వేతనం, లింగ వివక్షకు వ్యతిరేక నిబంధనలు ఉన్నాయి. అయితే చట్టం ఉండటం మాత్రమే సరిపోదు.
గ్రామీణ ప్రాంతాల్లో వేతనాలు ఎంత చెల్లిస్తున్నారు, పని వారీ రేట్లు ఎలా నిర్ణయిస్తున్నారు, చెల్లింపులు సక్రమంగా జరుగుతున్నాయా అనే అంశాలను పర్యవేక్షించాలి.
వర్తించే చట్టాల ప్రకారం మహిళలకు అందాల్సిన వేతనాలు, ప్రయోజనాలు అందేలా చూడాలి. ఇది ప్రభుత్వాల బాధ్యత.
గ్రామీణ ఉపాధి హామీ చట్టం
మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ చట్టం గ్రామీణ కుటుంబాలకు వేతన ఉపాధి అవకాశాలు కల్పించడానికి రూపొందించబడింది.
అర్హతలు, చట్టంలోని నిబంధనలకు లోబడి ఈ పథకం ద్వారా గ్రామీణ మహిళలకు ఉపాధి, సొంత ఆదాయం లభించే అవకాశం ఉంటుంది.
వామపక్ష పార్టీల మద్దతుతో ఏర్పడిన యునైటెడ్ ప్రోగ్రెసివ్ అలయన్స్ ప్రభుత్వం ఒక కనీస ఉమ్మడి కార్యక్రమాన్ని ఆమోదించింది. అందులో ఇది కూడా ఒక అంశం.
ఫలితంగానే ఈ చట్టం వచ్చింది. దీని అమలులో ముఖ్యమైన అంశాలు: కోరిన ఉపాధిని నిబంధనల ప్రకారం కల్పించడం. వేతనాలను సకాలంలో చెల్లించడం.
పని ప్రదేశాల్లో తాగునీరు, నీడ, అవసరమైన సదుపాయాలు కల్పించడం. మహిళలు పనిని కోరేందుకు, ఫిర్యాదులు చేయడానికి సహకరించడం. పనుల ఎంపికలో నీటి సంరక్షణ, భూసార పరిరక్షణ, గ్రామీణ మౌలిక వసతులకు ప్రాధాన్యం ఇవ్వడం.
ఈ పథకం ద్వారా లభించే ఆదాయం గ్రామీణ కుటుంబాల కొనుగోలు శక్తిని పెంచడంతో పాటు, వ్యవసాయేతర కాలాల్లో కొంత ఉపాధి భద్రతను కల్పిస్తున్నది. ఈ చట్టం పేరును మార్చి పని పొందే హక్కును ప్రభుత్వ దయాదాక్షిణ్యాలకు వదిలివేసింది.
కేంద్రం వాటా నిధులను తగ్గించి రాష్ట్ర ప్రభుత్వాలపై ఆ భారాన్ని మోపింది. ఇంకా అనేక నష్టదాయక అంశాలు నూతన చట్టంలో కేంద్ర ప్రభుత్వం చేర్చింది.
ప్రసూతి ప్రయోజనాలు, సామాజిక భద్రత
మహిళా కార్మికులకు ప్రసూతి ప్రయోజనాలు, ఆరోగ్య సేవలు, ప్రమాద పరిహారం, వృద్ధాప్య పెన్షన్, ఇతర సామాజిక భద్రతా ప్రయోజనాలు కల్పించాలి.
అయితే ప్రతి పథకానికి వేర్వేరు అర్హతలు, నిబంధనలు ఉన్నాయి. వ్యవసాయ కూలీలకు ఆ ప్రయోజనాలు అన్నీ వాటంతట అవే వర్తించవు.
గ్రామీణ మహిళా కార్మికులకు ప్రత్యేకంగా నమోదు శిబిరాలు నిర్వహించి, అర్హులైన వారికి అందుబాటులో ఉన్న సామాజిక భద్రతా పథకాలను అమలు చేయాలి.
స్వయం సహాయక సంఘాలు
గ్రామీణ మహిళల ఆర్థిక స్వావలంబనలో స్వయం సహాయక సంఘాలు ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నాయి. చిన్న మొత్తాల పొదుపు, పరస్పర రుణ సహాయం, బ్యాంకు అనుసంధానం ద్వారా మహిళలు కొంత ఆర్థిక స్వాతంత్ర్యం పొందగలుగుతున్నారు.
అదే సందర్భంలో మైక్రో ఫైనాన్స్ సంస్థల చక్ర వడ్డీల భారంతో అనేక మంది కుదేలవుతున్నారని అఖిల భారత ప్రజాస్వామ్య మహిళా సంఘం నిర్వహించిన సర్వేలో తేలింది.
మహిళా సాధికారతను కేవలం రుణాలు తీసుకోవడం, చిన్న వ్యాపారం ప్రారంభించడం వరకే పరిమితం చేయకూడదు. మహిళల ఆదాయం పెరగడంతో పాటు, ఆ ఆదాయంపై వారి నియంత్రణ, కుటుంబ నిర్ణయాల్లో భాగస్వామ్యం, ఆస్తి హక్కులు, మార్కెట్ అందుబాటు కూడా పెరగాలి.
స్వయం సహాయక సంఘాలను ఈ విధంగా బలోపేతం చేయవచ్చు:
1. మహిళా రైతు ఉత్పత్తిదారుల సంస్థలను ఏర్పాటు చేయడం.
2. పాలు, కూరగాయలు, చిరుధాన్యాలు, పప్పుధాన్యాల ప్రాసెసింగ్ యూనిట్లను ప్రోత్సహించడం.
3. నిల్వ, రవాణా, ప్యాకేజింగ్, మార్కెటింగ్ సౌకర్యాలు కల్పించడం.
4. ప్రభుత్వ కొనుగోలు వ్యవస్థలు, సహకార సంస్థలతో అనుసంధానం చేయడం.
5. డిజిటల్ చెల్లింపులు, లెక్కల నిర్వహణ, వ్యాపార నిర్వహణలో శిక్షణ ఇవ్వడం. స్వయం సహాయక సంఘాల పేరుతో మహిళలపై రుణభారాన్ని పెంచకుండా, లాభదాయకమైన ఉపాధి, సరైన మార్కెట్, న్యాయమైన ధరలకు ప్రాధాన్యం ఇవ్వాలి.
సమగ్ర కార్యాచరణ ఆవశ్యకత
గ్రామీణ మహిళా కార్మికుల జీవితాల్లో శాశ్వతమైన మార్పు రావాలంటే విడివిడిగా పథకాలు ప్రకటించడం సరిపోదు.
ఉపాధి, ఆదాయం, ఆస్తి హక్కులు, ఆరోగ్యం, విద్య, సామాజిక భద్రత, రాజకీయ ప్రాతినిధ్యం వంటి అంశాలను అనుసంధానించే విధానం అవసరం. అక్టోబర్ 15ను అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని కేవలం శుభాకాంక్షలు చెప్పి సరిపెట్టుకోవడం కాదు.
గ్రామీణ మహిళల జీవితాల్లో వాస్తవమైన మార్పు కోసం ఈ రోజును ఒక కార్యాచరణ దినంగా మార్చాలి. ఈ సందర్భంగా ఈ ప్రతిజ్ఞలు తీసుకోవాలి:
మహిళల శ్రమను గుర్తిస్తాం, వారి పనిని తక్కువగా అంచనా వేయం. సమాన పనికి సమాన వేతనం కోసం కృషి చేస్తాం. మహిళలకు భూమి, ఆస్తి, రుణాలు, విద్య, సాంకేతిక పరిజ్ఞానంపై సమాన అవకాశాలు కల్పించాలని కోరుతాం.
వేతనం లేని గృహ శ్రమ, సంరక్షణ పనుల భారాన్ని తగ్గించేందుకు ప్రభుత్వ సేవలను పెంచాలని డిమాండ్ చేస్తాం.
గ్రామీణ మహిళలకు సామాజిక భద్రత, ఆరోగ్య రక్షణ, సురక్షితమైన పని పరిస్థితులు కల్పించాలని పోరాడుతాం.
మహిళా కార్మిక సంఘాలను బలోపేతం చేసి, మహిళలకు నిర్ణయాధికారంలో తగిన ప్రాతినిధ్యం కల్పిస్తాం. కుల, వర్గ, లింగ వివక్షకు వ్యతిరేకంగా సంఘటితంగా పనిచేస్తాం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
