“అగ్ని మొదటి ప్రయోగంతో ముగిసిన దశదాకా చెప్పిన కథ ఇది. జీవితం కొనసాగుతూనే ఉంటుంది. మనం 900 మిలియన్ల జనాభా ఒకే జాతి అనుకొని ఆలోచిస్తే అన్ని రంగాల్లోనూ పురోగమించగలం” అంటూ ఆత్మవిశ్వాసంతో కూడిన ఆశావాదంతో తన ఆత్మకథ ముగించారు వింగ్స్ ఆఫ్ ఫైర్ పుస్తకంలో అబ్దుల్ కలాం.
తన జీవిత కథను రామేశ్వరం దీవిలో, మసీదు వీధిలో ఆరంభించి తన గుండెలోని భారతీయతను యావత్ ప్రపంచానికి ఆదర్శంగా చూపారు.
1931 అక్టోబర్ 15న ఉదయించిన కలాం.. చివరికి 2015 జూలై 27న షిల్లాంగ్‌లోని ఐఐఎంలో విద్యార్థులకు ఉపన్యాసం ఇస్తూనే గుండెపోటుతో భౌతికంగా మరణించారు.
ప్రస్తుతం ఇస్రో సాధించిన అంతరిక్ష అద్భుత విజయాలతో పాటు, కొన్ని నెలల క్రితం స్కైరూట్ ఏరోస్పేస్ సంస్థ సాధించిన విక్రమ్-1 రాకెట్ ప్రయోగ విజయం దాకా.. నేటి మన అత్యున్నత స్థాయికి స్ఫూర్తి శిఖరం అబ్దుల్ కలాం. అందుకే విక్రమ్-1 ప్రయోగంలో శాస్త్రవేత్తలు రాకెట్‌లోని ఘన ఇంధన వ్యవస్థకు ‘కలామ్’ అని పేరు పెట్టి, 18 క్యారెట్ల బంగారు మైక్రో రాకెట్లో అబ్దుల్ కలాం ప్రతిమతో సూక్ష్మ శిల్పం నిర్మించి అంతరిక్షంలోకి పంపి వారికి ఘన నివాళులర్పించారు.
చింతగింజలు అమ్ముకునే నిరుపేద కుటుంబం నుంచి నెల్సన్ మండేలా వంటి విశ్వవిఖ్యాతుడిని కలవడం, యూరోపియన్ పార్లమెంట్లో ప్రసంగించడం దాకా సాగిన కలాం జీవన పయనం అనితర సాధ్యం.
కోట్లాది యువకుల కలల రెక్కలలో దేశభక్తిని నింపి, అంతరిక్ష యానపు హద్దులలో విశ్వాన్వేషణ చేసేలా బతుకు పాఠం నేర్పారు. కలాం నేటి స్వతంత్ర భారతానికి మరో మహాత్మా గాంధీ అంటూ ప్రపంచం కీర్తిస్తోంది.
పత్రికల పంపిణీ నుంచి అంతరిక్ష పరిశోధనల వరకు
వార్తాపత్రికలు పంపిణీ చేసి చదువుకున్న కలాం.. కొన్ని దశాబ్దాల తర్వాత ప్రపంచ ప్రముఖ పత్రికల్లో ప్రధాన వార్తగా ఎదిగారు. ఉపాధ్యాయుల ప్రోత్సాహంతో భౌతికశాస్త్రంపై ఆసక్తిని పెంచుకొని కొన్ని పరిణామాల మధ్య ఏరోస్పేస్ ఇంజనీరింగ్ పూర్తి చేశారు.
తన వృత్తిలో భాగంగా భారతీయ రక్షణ పరిశోధన అభివృద్ధి సంస్థ, భారతీయ అంతరిక్ష పరిశోధనా సంస్థ(ఇస్రో)లో కీలక బాధ్యతలు చేపట్టి మన దేశం గర్వపడేలా పనిచేశారు.
బాలిస్టిక్ క్షిపణుల అభివృద్ధితో పాటు, మన దేశపు మొదటి స్వదేశీ ఉపగ్రహ ప్రయోగ వాహనం ఎస్ఎల్వీ-3 ప్రాజెక్టు ద్వారా 1980లో రోహిణి ఉపగ్రహాన్ని భూ సమీప కక్ష్యలో ప్రవేశపెట్టడంలో కలాం పాత్ర అద్వితీయం.
అణు పరీక్షల విజయాలు, రాష్ట్రపతిగా సేవలు
1998లో అప్పటి భారతదేశ ప్రధానమంత్రి అటల్ బిహారీ వాజ్‌పేయిని ఒప్పించి, పోఖ్రాన్-2 అణు పరీక్షలు విజయవంతం చేశారు. అప్పటినుంచే ప్రపంచం దృష్టిలో భారత్ అణ్వాయుధ దేశంగా ఎదగింది.
కలాం నాయకత్వం భారత అంతరిక్ష పరిశోధనకు అంతర్జాతీయ స్థాయిలో పేరు తీసుకొచ్చింది. శాస్త్రవేత్తలు సాధించిన అంతరిక్ష ప్రయోగ విజయాలు మంగళయాన్, చంద్రయాన్, ఆదిత్య ఎల్-1 వాటికి కలాం లాంటి మహానుభావుల కృషే పునాది. అందుకే యావత్ భారతం కలాంను “మిస్సైల్ మ్యాన్ ఆఫ్ ఇండియా”గా గౌరవించింది.
దేశానికి ఆయన చేసిన సేవలకు గుర్తింపుగా ప్రభుత్వం 1997లో “భారతరత్న” పురస్కారంతో సత్కరించింది. తదనంతరం దేశ 11వ రాష్ట్రపతిగా ఆయన చేసిన సేవలు సర్వేపల్లి రాధాకృష్ణన్ వంటి మహానుభావుల సరసన ప్రజా రాష్ట్రపతిగా నిలిపాయి.
2002-2007 ఆయన పదవీకాలంలో యువతకు పెద్ద పెద్ద కలలు కనమని మార్గదర్శనం చేస్తూనే, అభివృద్ధి చెందిన భారత్ మన లక్ష్యమంటూ ఇండియా 2020 విజన్‌ను అందించారు.
యువతకు స్ఫూర్తిదాయక సందేశాలు
నీవు సూర్యుడిలా ప్రకాశించాలనుకుంటే ముందు సూర్యుడిలా మండేందుకు సిద్ధపడాలన్న కలాం మాటలు నిరాశ నిస్పృహల్లో చిక్కుకొని, గమ్యమంటూ లేని కోట్లాదిమంది యువత గుండెల్లో దివ్యాగ్నిని రగిలిస్తున్నాయి. ఓటమికి తలవంచక గెలుపు శిఖరమై నిలవాలనే జీవన పాఠాలు నేర్పుతున్నాయి.
శాస్త్ర సాంకేతిక రంగాల్లో అగ్రస్థానమే లక్ష్యం
అభివృద్ధి చెందిన దేశంగా మనం మారాలంటే శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అగ్రస్థానం పొందాలంటారు కలాం. ప్రపంచానికి ఇంతవరకూ మనకు తెలిసి శ్రీనివాస రామానుజన్ వంటి మేధావి మరొకరు జన్మించలేదంటూనే, మన పాఠశాలల్లో మరొక రామానుజన్‌ను, సీవీ రామన్‌ను ఎందుకు చూడలేకపోతున్నామంటూ మనల్ని సూటిగా ప్రశ్నించారు.
జాతీయోద్యమ కాలంలోనే భారతదేశం ఒక పాలిత దేశమే కావచ్చు గాక, కానీ సైన్స్‌లో మాత్రం మనం పాశ్చాత్య ప్రపంచంతో సమ ఉజ్జీలుగానే నిలబడ్డామంటారు. కలాం తన జీవితంలో ముగ్గురు శాస్త్రవేత్తలు డాక్టర్ డీఎస్ కొఠారి, డాక్టర్ హోమీ జహంగీర్ భాభా, డాక్టర్ విక్రమ్ సారాభాయ్ శాస్త్ర సాంకేతిక రంగాల్లో చూపిన నాయకత్వ లక్షణాల్ని ప్రేరణగా తీసుకున్నారు.
రచనల ద్వారా మార్గదర్శకత్వం
సైన్స్, టెక్నాలజీ, పర్యావరణ పరిరక్షణ, వ్యవసాయ ఆధునీకరణ, గుణాత్మక విద్య తదితర రంగాల్లో దేశం కోసం కలాం చేసిన కృషి కొన్ని దశాబ్దాల పాటు శ్లాఘించదగినది.
ఎన్నో విశ్వవిద్యాలయాల నుంచి గౌరవ డాక్టరేట్ పట్టా పొందిన ఆయన.. తన ఆత్మకథ “వింగ్స్ ఆఫ్ ఫైర్”తో పాటు ఇగ్నైటెడ్ మైండ్స్, ది లూమినస్ స్పార్క్స్, ఇన్స్పైరింగ్ థాట్స్, యు ఆర్ బార్న్ టు బ్లాసమ్ వంటి ఎన్నో ప్రఖ్యాత రచనలతో యువతకు ధ్రువతార అయ్యారు.
సర్వమత సహనాన్ని ప్రదర్శిస్తూ, శాస్త్రసాంకేతిక రంగాల్లో అగ్రగామిగా ఎదిగితేనే ప్రపంచం మనల్ని గౌరవిస్తుందని నమ్మే కలాం.. రామేశ్వరం వీధుల్లో సామాన్యుడిగా ఉదయించి ఈ శతాబ్దపు అత్యున్నత మానవుల్లో ఒకడిగా విశ్వ మానవీయతను ప్రదర్శిస్తూ, తన జీవితాన్ని కొన్ని తరాలకు ప్రేరణ ఇచ్చే అసాధారణ చరిత్రగా ఎదిగారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
