అక్టోబర్ పన్నెండవ తేదీన జరిగిన భారీ నిరసన ర్యాలీ గురించి దేశమంతటా నాకంటే ఎంతో అనుభవజ్ఞులు, ప్రావీణ్యం ఉన్నవారు విశ్లేషిస్తారు. కాబట్టి నేను నా పరిధిలోని విషయాలపైనే దృష్టి సారిస్తాను.
భారతదేశంలో రాజకీయాలు ఎలా మారుతున్నాయో చెప్పడానికి ఈ ర్యాలీ ఒక సంకేతం. భయమెరుగని యువత ఇలాంటి మార్పుకు పునాదిగా నిలుస్తారు.
ఈ పరిణామాల వల్ల రాజకీయాల్లో నిజంగానే ఏమైనా మార్పు వస్తుందో లేదో నాకు ఇంకా తెలియదు. బీహార్ ఎన్నికలకు ముందు నుంచే రాహుల్ గాంధీ ఓట్ల చోరీ అంశంపై పదేపదే మాట్లాడుతూ వస్తున్నాడు.
బెంగాల్ ఎన్నికలకు ముందు మిగతా వారెవరూ దీని గురించి ఆలోచించలేదే అని బాధ అనిపించినా… “దేర్ ఆయే దురుస్త్ ఆయే”(ఆలస్యంగా వచ్చినా సరైన దారికే వచ్చారు) అనుకోవాలి.
రాజకీయ మార్పులన్నీ విప్లవాల రణగొణ ధ్వనులతో, రక్తపాతంతో(గడిచిన పన్నెండేళ్లలోనే ఎంత రక్తం చిందిందో ఆ దేవుడికే తెలియాలి), యుద్ధ భేరీలతోనే రావాల్సిన అవసరం లేదు.
కొన్ని మార్పులు చాలా నిశ్శబ్దంగా, ఎవరికీ అంతుపట్టని రీతిలో మొదలవుతాయి. ఏ క్షణంలోనైతే తాము భయపెట్టి అణచివేయగలమని భావించిన ప్రజలు… ఇక తమను ఎంతమాత్రం లెక్కచేయడం లేదని అతివిశ్వాసంతో ఉన్న ప్రభుత్వం గుర్తిస్తుందో, అప్పుడే అసలైన మార్పు మొదలవుతుంది.
నేను అతిగా ఊహిస్తున్నానని మీకు అనిపించవచ్చు. కానీ మనం అలాంటి ఒక ఘట్టానికి చేరువవుతున్నామేమో అనిపిస్తోంది.
యువత ముఖాల్లో, వారు మాట్లాడే భాషలో, వారిలో కనిపిస్తున్న నిర్భీతి, ఆత్మవిశ్వాసంలో దీనికి సంబంధించిన స్పష్టమైన నిదర్శనం కనిపిస్తోంది.
హక్కుల సాధనలో యువత నిర్భీతి
ఢిల్లీలోని సుప్రీంకోర్టు వైపు రాహుల్ గాంధీ నాయకత్వంలో జరిగిన మార్చ్… ఓటర్ల జాబితా నుండి అనవసరంగా పేర్లు తొలగించకుండా సరైన రక్షణలు కల్పించాలని, ఎన్నికల ప్రక్రియలో మరింత జవాబుదారీతనం ఉండాలని కోరుతూ ప్రతిపక్షాలు దాఖలు చేసిన పిటిషన్‌కు సంబంధించింది.
రాహుల్ గాంధీ మొదటి నుంచీ చెబుతున్నట్లుగా, ఇది చాలా తీవ్రమైన విషయం. ఇది భారతదేశంలో రోజురోజుకూ విసుగు పుట్టిస్తున్న రాజకీయ నాటకాల్లో ఒక భాగం అనుకునేంత చిన్న విషయం మాత్రం కాదు. అతనిని ఒక నిష్ప్రయోజకుడిగా, నైపుణ్యం లేని నాయకుడిగా చిత్రీకరించడానికి వేల కోట్లు ఖర్చు చేసిన నేపథ్యంలో, అధికారపక్షాన్ని వ్యతిరేకించేవారు కూడా ఈ విషయాన్ని నమ్మడానికి కొంత సమయం పట్టింది.
అయితే ఇవాళ వీధుల్లో ఇంకొక మార్పు కూడా చోటు చేసుకుంటుంది. అది రాహుల్ గాంధీ లేవనెత్తిన పిటిషన్ అంశంకన్నా కూడా ఎంతో కీలకమైనది.
యువత రాజకీయాల్లోకి రావడానికి ఇక ఎవరి అనుమతి కోసం వేచి చూడటం లేదు. వారు తమ స్థానాన్ని తామే హక్కుగా పొందుతున్నారు.
పదిహేనేళ్ల పిల్లలు సైతం పోలీసులకు ఎదురుతిరిగి నినాదాలు చేస్తున్నారు. ఇంట్లో కూర్చుని సోషల్ మీడియాలో నిరాశాజనకమైన వార్తలు చూసే నాలాంటి వారికి- అంత ధైర్యం, తెగింపు రావడానికి ఎంత గుండె నిబ్బరం కావాలో కదా అని ఆశ్చర్యం వేస్తుంది.
ఎంతో శక్తివంతమైన ప్రభుత్వం, దాని భారీ ప్రచార వ్యవస్థ, భయపెట్టే సంస్థలు, రాజకీయ నాటకాలను ప్రదర్శించే సామర్థ్యాన్ని చూసి కూడా… “రండి చూసుకుందాం” అని నిలబడగలిగే ఈ తరం ధైర్యసాహసాలు నిజంగా పరమాద్భుతం.
అధికారాన్ని ప్రశ్నించే కొత్త తరం
వాళ్ళది మిడిసిపాటూ కాదు, దుందుడుకుతనమూ కాదు, లేదా యువతకు స్వతహాగానే అపారమైన జ్ఞానం ఉంటుందనే భావన కూడా కాదు. వారికి అన్ని వేళలా సరైన ఆలోచనలు ఉండకపోవచ్చు.
పెద్దవారిలాగే యువకులు కూడా తప్పులు చేయవచ్చు, భావోద్వేగానికి లోనుకావచ్చు లేదా రాజకీయంగా అమాయకులు కావచ్చు. కానీ వారి తిరుగుబాటులో ఒక ప్రత్యేకమైన గుణం ఉంది. అధికారంలో ఉన్నవారిని కచ్చితంగా గౌరవించి తీరాలనే అపోహ వారిలో లేదు.
మీమ్స్‌లో, వారి నినాదాల్లో, వారు ప్రశ్నిస్తున్న తీరులో, ఎగతాళి చేస్తున్న, నిలదీస్తున్న విధానంలో ఇది స్పష్టంగా కనపడుతున్నది.. వారు అధికారానికి, నైతిక అర్హతకు ఉన్న తేడాను సరిగ్గా గుర్తిస్తున్నారు.
నేహా బోరా, ఐషీ ఘోష్ వంటి వారు ఖచ్చితంగా ఈ మార్పుకు నిలువెత్తు నిదర్శనంగా నిలుస్తున్నారు. వాళ్ల ధైర్యం, చురుకుదనం, ఎదుటివారికి అధికారం ఉంది కాబట్టి లొంగిపోవడానికి నిరాకరించే తత్వం- ఈ ప్రస్తుత ఆందోళనలో వాళ్ళను కీలకమైన నాయకురాళ్లుగా నిలబెట్టాయి. వాళ్లు, బహుశా వాళ్ల తరం వీధి పోరాటాల భాషను, సోషల్ మీడియా భాషను ఒకేలా అర్థం చేసుకున్నారు.
రాజ్యాంగ హక్కుల గురించి తీవ్రంగా పోరాడుతూనే, హాస్యచతురతను కోల్పోకుండా, నిరసన తెలిపేటప్పుడు అనవసరమైన గంభీరత్వాన్ని ప్రదర్శించాల్సిన అవసరం లేదని నమ్మే తరం వాళ్లది.
వీళ్ల రాజకీయాల్లో ఒక రకమైన చురుకుదనం ఉంది, అలాగే సరుకు కూడా ఉంది. పౌరులు తమ ఓట్లు నమోదు చేసుకునే, లెక్కించబడే ప్రక్రియను నమ్మవచ్చా లేదా అనే ప్రశ్నే తలెత్తినప్పుడు… ఈ రకమైన నిర్భయత్వమే అధికారంలో ఉన్నవారి చుట్టూ అల్లుకున్న ఓటమి లేని శక్తి అనే భావనను బద్దలు కొడుతుంది.
యవ్వనంలో ఉండటం సాక్షాత్తు స్వర్గం
ఈ నిరసన పట్ల ప్రభుత్వం స్పందించిన తీరు, సోమవారం నాటి మార్చ్‌ను అడ్డుకోవడానికి చేసిన విస్తృతమైన భద్రతా ఏర్పాట్లు, ఆంక్షలు ఆ వ్యత్యాసాన్ని మరింత స్పష్టంగా వెల్లడించాయి.
నిరసనకారులు ఇంకా తమ లక్ష్యాలను సాధించలేదు, అలాగే ఎన్నికల క్రమంలో అక్రమాలు జరిగాయనే ఆరోపణలను సాక్ష్యాధారాల సహా చట్టపరమైన ప్రక్రియ ద్వారా నిరూపించాల్సి ఉంది.
అయితే ప్రభుత్వం వీధులను సులభంగా నియంత్రించగలదు కానీ, ఒక తరం తన గురించి ఏమనుకుంటుందో నిర్దేశించలేదు. ఎందుకో ఒక్కసారిగా, ఈ దేశంలో వామపక్ష భావజాలం ఉన్న ఒక భారతీయుడిగా ఉండటం ఎంతో అందంగా అనిపిస్తోంది. ఆ కవితా పంక్తి ఏమిటి? “ఈ ఉదయాన సజీవంగా ఉండటమే ఒక వరం, ఇక యవ్వనంలో ఉండటం సాక్షాత్తు స్వర్గం”.
ఫ్రెంచ్ విప్లవం గురించి రాస్తూ వర్డ్స్‌వర్త్ అన్న మాటలు ఇవి అని అనుకుంటాను. (సరేలేండి, నేను ఈ పోలికను మరీ సుదూరానికి తీసుకెళ్తున్నాను, ఇక నోరు మూసుకుంటాను). నా అరిగిపోయిన మోకాళ్లతో ఎలాగూ అంత నడవలేను, పరిగెత్తలేను.
ఆధిపత్యం లేని నాయకత్వ లక్షణాలు
ఇక రాహుల్ గాంధీ విషయానికి వస్తే ఖచ్చితంగా చెప్పుకోవాలి. మీరు నాపై విరుచుకుపడటానికి ముందే చెబుతున్నాను, నేను ఆయనను ఎంతో ఇష్టపడతాను. అయినప్పటికీ ఆయనను నిష్పాక్షికంగా అంచనా వేయగలను. ఇతర ప్రతిపక్ష నాయకుల్లో చాలామందిపై, ఆఖరికి కాంగ్రెస్‌లోని కొందరిపై నాకు అభిప్రాయ భేదాలు ఉన్నాయి. కానీ ఈ క్షణంలో ఈ మనిషి నిజాయితీ, నిబద్ధత గురించి నాకెలాంటి అనుమానం లేదు. ఆయన రాజకీయ పరిణామంలో అత్యంత ఆసక్తికరమైన అంశం ఏమిటంటే… వేదికపై తనొక్కడే కేంద్రబిందువుగా ఉండాలని తాపత్రయపడకుండా, ఇతరులతో వేదికను పంచుకోవడానికి సిద్ధపడటం.
ప్రతి ఫ్రేమ్‌లోనూ, ప్రతి వేదికపైనా తానే ఉండాలని తపించే వారిని చూసినప్పుడు… రాహుల్‌కు అనుకోకుండా ఒక ప్రత్యేకమైన ప్రాధాన్యత లభిస్తుంది.
నేహా, ప్రియాంకలతో కలిసి నడుస్తూ, జనాల మధ్య నుండి దారి చేసుకుంటూ, కెమెరాలు, జనసందోహం మధ్య వారికి మార్గం చూపిస్తున్న చిత్రం… కేవలం ప్రచారం కోసం చేసింది కాకపోవడం వల్లనే ప్రత్యేకంగా నిలిచింది. ఆ ముగ్గురి మధ్య ఉన్న సహజమైన స్నేహపూర్వక బంధం… నిరాశతో ఉన్న మన కళ్లకు ఎంతో ఉపశమనాన్ని ఇచ్చింది.
ఒక సీనియర్ రాజకీయ నాయకుడు తన పక్కన ఉన్న యువ కార్యకర్తను తక్కువ చేసి చూపకుండా, ఆమె గొంతును తనదిగా మార్చుకోకుండా లేదా తరాల మార్పుకు ఒక అలంకారిక సంకేతంగా మాత్రమే వాడుకోకుండా సరళంగా ఉండటం ఎంతో ఉపశమనంగా అనిపిస్తుంది.
నేహాతో రాహుల్ ఉన్న తీరు ప్రాధాన్యమైనది, ఎందుకంటే రాజకీయ చైతన్యం ఎక్కడ ఉద్భవించినా — అది తన స్వంత పార్టీ బయట ఉన్నప్పటికీ — దాన్ని గుర్తించేందుకు ఆయన సిద్ధంగా ఉన్నారని ఇది సూచిస్తుంది.
ప్రియాంకతో ఆయనకున్న అనుబంధం కూడా ఇందులో భాగమే. ఇది ఒక రాజవంశం ప్రజల ముందు ప్రదర్శించే కృత్రిమమైన నాటకం లాగా కాకుండా, ఒక పరస్పర నమ్మకం, చొరవ ఉన్న కుటుంబ బంధంలా అనిపిస్తుంది.
ప్రతీ చిన్న విషయానికీ ఏదో ఒక గొప్ప అంతరార్థం వెతకడం కాకుండా… ఆధిపత్యం చెలాయించని అనుభవం, ఆంక్షలు విధించని రక్షణనిచ్చే నాయకత్వ విలువను గుర్తించడంలోనే దీని ప్రాముఖ్యత ఉంది.
భవిష్యత్తు రాజకీయాల కొత్త ఆకారం
చాలా కాలంగా, భారతీయ రాజకీయాలు వయస్సు, హోదా, అధికారానికి దగ్గరగా ఉండటమే ఎవరు మాట్లాడాలో, ఎవరు వినాలో నిర్ణయిస్తాయనే ఆధిపత్య నిర్మాణం పైనే నడుస్తున్నాయి.
సరిగ్గా ఒక వాక్యం కూడా చెప్పలేని లేదా వారు మాట్లాడితే మధ్యలో ఒక చిన్న నిద్ర తీయగలిగేంత నెమ్మదిగా మాట్లాడే పాతతరం నాయకులతో నాకు విసిగొచ్చేసింది.
సాధారణంగా యువతను జండాలు ఊపడానికి, సభలను నింపడానికి, పెద్దలను చూసి చప్పట్లు కొట్టడానికే ఆహ్వానిస్తారు. వాదనలను రూపొందించే బాధ్యతను వారిపై ఉంచడం చాలా అరుదు. రాహుల్ తన రాజకీయ ప్రాంగణాన్ని నేహాతో పంచుకోవడానికి వెనుకాడకపోవడం ఈ పురాతన సాంప్రదాయాన్ని సవాలు చేస్తోంది.
మరొక నాయకుడు ఎదుగుతున్నప్పుడు, తను నాయకత్వాన్ని వదులుకోవాల్సిన అవసరం లేదు అనే వ్యత్యాసాన్ని చూపడం ఇక్కడ చాలా ముఖ్యం. ఆఖరికి ఆయన ధరించే సాధారణ టీ-షర్ట్, ట్రౌజర్లు కూడా ఆయన తన శైలిలో ఎంత హాయిగా, స్వేచ్ఛగా ఉన్నారో చాటిచెబుతాయి.
భారతీయ రాజకీయాల భవిష్యత్తు అనేది పాత స్క్రిప్ట్‌నే కొత్త నటులు ప్రదర్శించడం కాకూడదు. ఇది నాయకత్వం పట్ల ఒక కొత్త అవగాహనను కలిగి ఉండాలి — వ్యక్తిపూజ తగ్గాలి, జవాబుదారీతనం పెరగాలి.
ప్రజల నుండి విధేయతను ఆశించడం తగ్గాలి, వ్యవస్థల నుండి సమాధానాలు రాబట్టాలి. నాయకుడి వైభవంపై వ్యామోహం తగ్గి, ప్రజల ఆత్మగౌరవంపై శ్రద్ధ పెరగాలి.
యువత చేతిలో మార్పు పగ్గాలు
సోమవారం నాటి మార్చ్ మాత్రమే ఓటర్ల జాబితా వివాదాన్ని పరిష్కరించలేదు లేదా భారత రాజకీయ యవనికను రాత్రికి రాత్రే మార్చలేకపోవచ్చు. తమ కూటమి ఒక సమర్థవంతమైన ప్రచారాన్ని కొనసాగించగలదని, ప్రజలలో ఉన్న ఆగ్రహాన్ని వ్యవస్థలపై ఒత్తిడిగా మార్చగలదని, కేవలం నిరసనలకే పరిమితం కాకుండా ఒక నమ్మదగిన ప్రత్యామ్నాయాన్ని చూపగలదని వారు నిరూపించాల్సి ఉంది (నాకు ఆయన కూటమి భాగస్వాములలో చాలామందిపై తీవ్రమైన అనుమానాలు ఉన్నాయి, వారి నిజాయితీపై అసలు నమ్మకం లేదు).
మరోవైపు నేహా బోరా, ఆమె సహచరుల విద్యార్థి ఉద్యమం… ఇప్పటికే నిలదొక్కుకుని ఉన్న రాజకీయ పార్టీలతో కలిసి పనిచేస్తున్నప్పటికీ తమ స్వతంత్రతను కాపాడుకోవాలి.
ఇది అంత తేలికైన విషయం కాదు. పెను సవాళ్లతో కూడుకున్నది. ఉత్సాహం మాత్రమే సరైన నిర్వహణ కాజాలదు, కేవలం ధైర్యం మాత్రమే విజయాన్ని పూచీ ఇవ్వలేదు. కానీ రాజకీయ మార్పు అనేది ఎన్నికల ఫలితాల్లో కొలవడానికి ముందే ప్రారంభమవుతుంది.
అధికారం తమ చుట్టూ గీసిన హద్దులను ప్రజలు నిరాకరించడం మొదలుపెట్టినప్పుడే ఆ మార్పు మొదలవుతుంది.
ప్రజాస్వామ్య పోరాటంలో ఒక జాతీయ నాయకుడితో కలిసి తాను ఒక సమాన భాగస్వామిగా నిలబడగలనని ఒక విద్యార్థి గుర్తించినప్పుడు అది ప్రారంభమవుతుంది.
తమను ప్రశ్నించే అధికారం యువతకు ఉందా అని అడగడం మానేసి, తమ అధికారాన్ని సమర్థించుకోవాలని ప్రభుత్వాన్ని యువత నిలదీసినప్పుడు అది మొదలవుతుంది.
బహుశా ఢిల్లీలో జరుగుతున్న పరిణామాల అసలైన సందేశం ఇదే కావచ్చు. బెదిరింపులకు లొంగని ఒక తరం ఆత్మవిశ్వాసంలో, అధికారాన్ని పవిత్రమైనదిగా భావించడానికి నిరాకరించే యువత చురుకుదనంలో, యువతను నడిపించడమే కాక వారికి స్థానం కల్పించడం తన బాధ్యత అని గ్రహించిన ఒక ప్రతిపక్ష నాయకుడి పరిణతిలో భారతదేశం మారుతోంది.
ఇకపై అత్యంత కీలకమైన రాజకీయ ప్రశ్న— పాతతరం నాయకులు భవిష్యత్తును వారసత్వంగా యువతకు అందిస్తారా లేదా అనేది కాదు.
యువత ఇప్పటికే తమ స్థానాన్ని ఆక్రమించుకుందని ఆ పాతతరం గుర్తించిందా లేదా అనేదే అసలైన ప్రశ్న.
చివరి మాట
నా మొబైల్ ఆటో కరెక్ట్ ఆప్షన్లో ఇంగ్లిషులో నా అరిగిపోయిన మోకాళ్ల(క్రీకీ నీస్) గురించి టైప్ చేస్తే, అది వెన్నలాంటి మోకాళ్లు(క్రీమీ నీస్) అని మార్చింది. అది చూసి నాకు నవ్వు ఆగలేదు. ఓ వైపు ఫోన్లో ఒకే వేలితో టైప్ చేస్తున్న ఒక పిచ్చి ముసలావిడను భర్తీ చేయడానికి… కృత్రిమ మేధస్సు (ఏఐ) ఇంకా చాలా అభివృద్ధి చెందాల్సి ఉంది.
అనువాదం: కె. సత్యరంజన్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
