నూజివీడు రోటరీ క్లబ్ ఆడిటోరియం ఎర్రజెండాల తోరణాలతో, ఉద్యమ నినాదాలతో హోరెత్తిపోయింది. ఎనిమిది దశాబ్దాలుగా పేదల హక్కుల కోసం, భూమి కోసం, ఆత్మగౌరవం కోసం అలుపెరుగని పోరాటం సాగించిన కమ్యూనిస్టు యోధుడు చలసాని జగన్నాధరావు శత వసంతోత్సవ సభ విప్లవావేశంతో ఉప్పొంగింది.
ఉభయ తెలుగు రాష్ట్రాల వామపక్ష నాయకులు, ప్రజాసంఘాల బాధ్యులు, వేలాది మంది శ్రామికులు కిక్కిరిసిన ఈ సభలో అడుగడుగునా కమ్యూనిస్టు స్ఫూర్తి రగిలింది.
ఎర్రటి పూలగుత్తులు, శాలువాల సత్కారాలతో, విప్లవ జేజేలతో మహోన్నత ప్రజా నాయకుడికి సమరశీల నీరాజనాలు అర్పించారు.
పోరాటాల ప్రస్థానం
భారత కమ్యూనిస్టు పార్టీ ఆవిర్భవించిన కేవలం పదిహేడు నెలల తర్వాత 1927లో ఏలూరు జిల్లా నూజివీడు తాలూకా అన్నవరం శివారు వెంకటాద్రిపురంలో వ్యవసాయ కుటుంబంలో జన్మించిన చలసాని జగన్నాధరావు జీవితం సిద్ధాంతం- ఆచరణల సమాహారం.
స్వాతంత్య్ర సమరయోధుడైన తన సోదరుడు చలసాని రాజగోపాలరావు ప్రేరణతో 1946లోనే ఎర్రజెండా పట్టిన ఆయన, నాటి నుంచి నేటి వరకు బడుగు, బలహీన వర్గాల గుండెచప్పుడుగా నిలిచారు.
పల్లెల్లో ఫ్యూడల్ రాక్షసత్వాన్ని, మొఖాసాదార్ల అన్యాయాలను తుదముట్టించేందుకు వీరోచితంగా పోరాడి కమ్యూనిస్టు విలువలకు నిలువుటద్దంగా మారారు.
రాచరిక పోకడలకు, భూస్వామ్య దోపిడీకి వ్యతిరేకంగా నినదించిన జగన్నాధరావు నూజివీడు ప్రాంత భూపోరాటాలకు సేనానిగా నిలిచారు.
1955 నుంచి సీపీఐ అగ్రనేత అమరజీవి దాసరి నాగభూషణరావుతో కలిసి సాగించిన పోరాటాల ఫలితంగా ఇరవై వేల ఎకరాలకు పైగా బంజరు భూములు పేదలకు దక్కాయి. అందులో పద్నాలుగు వేల ఎకరాలకు పైగా పట్టాలు సాధించి, వేలాది కూలి కుటుంబాలను భూయజమానులుగా, రైతులుగా మార్చిన ఘనత ఆయన పోరాటానిదే.
నేడు నాగార్జునసాగర్ నీళ్లు పారుతున్న ఆ పచ్చని పొలాలే ఆయన చేసిన మహత్తర భూపోరాటాలకు నిదర్శనాలు.
1948-51 మధ్య సాయుధ దళ సభ్యునిగా అజ్ఞాతంలో ఉంటూ తృటిలో ప్రాణాపాయాల నుంచి బయటపడిన జగన్నాధరావు, భూస్వాముల అక్రమాలను ఎదుర్కొనేందుకు ధైర్యంగా గ్రామాల్లో తిష్టవేసి ప్రజా విజయం సాధించారు.
శోభనాపురంలో కిరాతక మునసబు అకృత్యాలకు అడ్డుకట్ట వేసి గ్రామానికి స్వేచ్ఛను తెచ్చినా, బస్సులో తోటి ప్రయాణికులను బెదిరిస్తున్న దొంగలను ప్రాణాలకు తెగించి పట్టుకుని పోలీసులకు అప్పగించినా అది ఆయనకే చెల్లింది. లాఠీ దెబ్బలు తిన్నా, జైలుపాలైనా ఏనాడూ వెరవని ధీరత్వం ఆయనది.
నిరాడంబర జీవితం – క్రమశిక్షణ
నూజివీడు తాలూకా పార్టీ కార్యదర్శిగా సైకిలుపై ఊరూరా తిరుగుతూ, ఆకలి వేస్తే అరటిపండు తిని దాహం తీర్చుకుంటూ నిరాడంబరంగా పనిచేసిన జగన్నాధరావు, తనతో పాటు ఇల్లాలిని, పిల్లలను కూడా పూర్తికాలపు కమ్యూనిస్టు కార్యకర్తలుగా తీర్చిదిద్దారు.
ఆర్థిక కష్టాలు వెంటాడినా ఆయన శ్రీమతి జయప్రద కుట్టు మిషన్ పై వచ్చే రాబడితో ఇల్లు గడుపుతూ పార్టీ మెస్ బాధ్యతలు చూసేవారు.
ఆస్తులు కరిగినా, కష్టాలు ఎదురైనా ముఖంలో చిరునవ్వు చెరగని ఆదర్శ దాంపత్యం వారిది. మంచి కమ్యూనిస్టు ఎలా ఉండాలి అనడానికి చలసాని దంపతుల జీవితమే ఒక నిదర్శనం.
నూజివీడులో కమ్యూనిస్టు పార్టీకి సొంత భవనం లేని రోజుల్లో, తీవ్ర ఆటంకాలను తట్టుకుని ప్రజల సహకారంతో ‘అమర్ భవన్’ నిర్మించడంలో జగన్నాధరావు వహించిన పాత్ర అపూర్వం.
పార్టీ కంట్రోల్ కమిషన్ బాధ్యునిగా సభ్యుల మధ్య వివాదాలు తీర్చినా, పైకమిటీ చుట్టులేఖ రాగానే తన భూవసతి, ఆదాయ వివరాలను పూర్తి పారదర్శకంగా సమర్పించిన తొలి నాయకుడిగా నిలిచినా అది ఆయన క్రమశిక్షణకు నిదర్శనం.
సూటిగా, స్పష్టంగా మాట్లాడే ఆయన నైజం, నిబద్ధత ప్రజాపార్టీకి పట్టుగొమ్మగా మారాయి. సభలో ముఖ్యఅతిథులు కామ్రేడ్ జగన్నాధరావు విప్లవ ప్రస్థానాన్ని, ఆదర్శవంతమైన జీవనశైలిని ఎలుగెత్తి చాటారు.
భావితరాలకు నిత్య స్ఫూర్తినిచ్చే ఉద్యమ పాఠం
సీపీఐ జాతీయ కార్యదర్శి కె రామకృష్ణ మాట్లాడుతూ విశ్వం ఉన్నంతకాలం కమ్యూనిజం ఉంటుందని, జగన్నాధరావు ఒక పేరు కాదు, ఒక జీవితం కాదు, భావితరాలకు నిత్య స్ఫూర్తినిచ్చే ఉద్యమ పాఠమని కొనియాడారు.
ఎనిమిది దశాబ్దాల సుదీర్ఘ కమ్యూనిస్టు ప్రస్థానంలో జగన్నాథరావు పదవులు, ప్రలోభాలు, వ్యక్తిగత ప్రయోజనాలకు దూరంగా నిలిచి, ప్రజల మధ్యే జీవిస్తూ ప్రజల కోసం పోరాడారని అన్నారు.
విలువలతో జీవించడమే కాకుండా, తన ఆచరణ ద్వారా ఇతరులకు విలువలతో కూడిన జీవితాన్ని చూపించిన ఆదర్శ కమ్యూనిస్టు అని పేర్కొన్నారు. ఆయన త్యాగాలు, పోరాటాలు, ప్రజా ఉద్యమాలు భావితరాలకు స్ఫూర్తిదాయకమని అన్నారు. ఆయన ఆశయాలను ముందుకు తీసుకు వెళ్లాలన్నారు.
దోపిడీ, అన్యాయాలకు వ్యతిరేకంగా ప్రజా ఉద్యమాలను మరింత బలోపేతం చేయాల్సిన బాధ్యత నేటి తరంపై ఉందని పిలుపునిచ్చారు.
కమ్యూనిస్టు ఉద్యమానికి నిలువుటద్దం
సీపీఐ తెలంగాణ రాష్ట్ర కార్యదర్శి, కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు మాట్లాడుతూ ‘నేనెవరికీ పాదాభివందనం చేయలేదు, మొదటిసారి ఈ గొప్ప ప్రజా ఉద్యమనేత జగన్నాధరావుకు చేస్తున్నాను’ అని భావోద్వేగంగా పేర్కొన్నారు.
జగన్నాథరావు కమ్యూనిస్టు ఉద్యమానికి నిలువుటద్దమని అన్నారు. ఎన్ని నిర్బంధాలు, కష్టాలు, బెదిరింపులు ఎదురైనా ప్రజల పక్షాన నిలబడి తన గళాన్ని వినిపించిన పోరాట యోధుడని కొనియాడారు.
కృష్ణాజిల్లా కమ్యూనిస్టు ఉద్యమానికి త్యాగాల గడ్డ అని, ఎందరో మహనీయులు తమ భూములను, ఆస్తులను, జీవితాలను ప్రజా ఉద్యమాలకు అంకితం చేశారని గుర్తుచేశారు.
ఈ తరానికి ఆదర్శం
సీపీఎం పూర్వ రాష్ట్ర కార్యదర్శి పీ మధు మాట్లాడుతూ రాచరిక వ్యవస్థకు, ఫ్యూడల్ పెత్తందారీతనానికి వ్యతిరేకంగా పోరాడిన జగన్నాధరావు ఈ తరానికి అత్యంత ఆదర్శవంతుడని, ఆయన జీవితం ఎనిమిది దశాబ్దాల ఉద్యమ చరిత్రకు నిలువుటద్దమని చెప్పారు.
రాచరిక వ్యవస్థకు వ్యతిరేకంగా జగన్నాథరావు ధైర్యంగా పోరాడారని గుర్తు చేశారు. ఆయన కుటుంబం మొత్తం కమ్యూనిస్టు ఉద్యమానికి అంకితమైందని కొనియాడారు.
భావితరాలకు మార్గదర్శకం
ఏపీ రైతు సంఘ రాష్ట్ర నాయకులు వై కేశవరావు మాట్లాడుతూ జగన్నాథరావు అత్యంత నిరాడంబరమైన జీవితం గడిపిన ప్రజా నాయకుడన్నారు.
నిత్యం గ్రామాల్లో పర్యటిస్తూ రైతుల సమస్యలను తెలుసుకొని, వాటి పరిష్కారానికి పోరాడేవారని తెలిపారు. ప్రాణహాని ఎదురైనా వెనుకడుగు వేయకుండా ప్రజల కోసం ధైర్యంగా నిలబడ్డారని కొనియాడారు.
త్యాగాల బాటే భవిష్యత్తుకు బాట అని, జగన్నాథరావు శతవసంతాలు పూర్తి చేసుకోవడం ఒక వ్యక్తి జీవిత ఘట్టం మాత్రమే కాదని ఎనిమిది దశాబ్దాల కమ్యూనిస్టు పోరాట చరిత్రకు ఒక ప్రతీక అని పేర్కొన్నారు.
ప్రజల హక్కుల కోసం ఆయన ఎత్తిన ఎర్రజెండా, అన్యాయానికి వ్యతిరేకంగా ఆయన వినిపించిన గళం, పేదల కోసం ఆయన సాగించిన పోరాటం భావితరాలకు మార్గదర్శకమన్నారు.
అంకితభావంతో కుటుంబం మొత్తాన్ని కమ్యూనిస్టులుగా మలచి, సిద్ధాంత నిబద్ధతతో నాయకత్వాన్ని తయారు చేసిన జగన్నాధరావు నూరేళ్ల వయసులోనూ మార్క్సిజంపై చెక్కుచెదరని విశ్వాసం కలిగిన నాయకుడని పేర్కొన్నారు.
ఆదర్శమూర్తికి అరుదైన సత్కారం
ఈ సందర్భంగా నాటి పోరాట జ్ఞాపకాలను, కామ్రేడ్ చలసాని జగన్నాధరావుతో ఉన్న అనుబంధాన్ని పలువురు నేతలు గుర్తుచేసుకున్నారు.
కమ్యూనిస్టు నైతిక విలువలను ఆచరించి చూపడంలో జగన్నాధరావు చూపిన చొరవ అసాధారణమని వక్తలు అభివర్ణించారు.
సీపీఐ సీనియర్ నాయకులు ఈడ్పుగంటి నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్నాధరావు జీవితంలో ఆశయాలకు, ఆచరణకు వ్యత్యాసమే లేదని, జమాబందీల్లో సైతం పాల్గొని రైతు సమస్యలు తీర్చిన ఆదర్శమూర్తి అని కొనియాడారు.
సీపీఐ సీనియర్ నాయకులు అక్కినేని చంద్రరావు మాట్లాడుతూ ‘శ్రమభరిత పర్వతారోహణకు భయపడనివారే తేజోమయ జ్ఞాన శిఖరాలను చేరుకోగలరు’ అన్నట్లు పదవులను ఆశించకుండా శ్రామిక సిద్ధాంతానికే అంకితమైన ఆదర్శ దాంపత్యం వారిదని గుర్తుచేసుకున్నారు.
సభాధ్యక్షత వహించిన సీపీఐ సీనియర్ నాయకులు కొమ్మన నాగేశ్వరరావు మాట్లాడుతూ జగన్నాధరావు జీవితమే ఒక తెరిచిన పుస్తకమని, ఆయనొక పాఠశాల అని, భావితరం కమ్యూనిస్టు కార్యకర్తలకు ఆయన జీవితం ఒక గొప్ప అధ్యయనాంశం అని వ్యాఖ్యానించారు.
ఇదే సభలో జల్లి విల్సన్, ముప్పాళ్ళ నాగేశ్వరరావు, అక్కినేని వనజ, టీ లక్ష్మీనారాయణ, డీవీవీఎస్ వర్మ తదితర వామపక్ష నాయకులు ప్రసంగిస్తూ అన్యాయాలపై జగన్నాధరావు ఎత్తిన ఎర్రజెండా, పేదల హక్కుల కోసం ఆయన చేసిన పోరాటాలు ప్రజాస్వామ్యవాదులకు ఎప్పటికీ మార్గదర్శకమని స్పష్టం చేశారు.
ఏలూరు జిల్లా కార్యదర్శి మన్నవ కృష్ణచైతన్య, సీపీఎం నాయకులు బీఆర్ తులసీరావు, జీ రాజు, ఎంఎల్ నాయకులు హరినాథ్, మాజీ ఎమ్మెల్యే మానం ఆంజనేయులు తదితరులు కామ్రేడ్ జగన్నాధరావుకు విప్లవాభివందనాలు అర్పించారు.
ఈ చారిత్రాత్మక శత వసంతోత్సవ సందర్భాన్ని పురస్కరించుకుని జగన్నాధరావు జీవితం, నూజివీడు ప్రాంత పోరాటాల ఆధారంగా ఆయన కుమారులు చలసాని వెంకట రామారావు, రాఘవేంద్రరావుల పర్యవేక్షణలో వెలువడిన ‘మావూరు – మాచరిత్ర’ పుస్తకాన్ని వేదికపై ఉన్న వామపక్ష దిగ్గజాలు ఆవిష్కరించారు.
వందో ఏట అడుగుపెట్టిన జగన్నాధరావు సమరశీల ప్రస్థానానికి గుర్తుగా నూజివీడు నియోజకవర్గ కమ్యూనిస్టు శ్రేణులు ఆయనకు వెండితో చేసిన ‘కత్తి-సుత్తి’ జ్ఞాపికను బహుకరించి, దుశ్శాలువాలతో ఘనంగా సత్కరించాయి.
పదవులు, ప్రలోభాలు, కాసుల వేట వైపు కన్నెత్తి అయినా చూడకుండా, నిత్యం పేదల కన్నీళ్లు తుడవడమే ధ్యేయంగా బతికిన కామ్రేడ్ జగన్నాధరావు శత వసంతాల వేడుక కేవలం ఒక వ్యక్తి ఉత్సవం కాదని, కమ్యూనిస్టు సిద్ధాంత విజయోత్సవమని సభ ఏకగ్రీవంగా చాటిచెప్పింది.
1952లో విశాలాంధ్ర పత్రిక ఆరంభం నుంచి చందాదారుడిగా ఉంటూ, నిండు నూరేళ్ల వయసులోనూ నిత్యం సాహిత్య అధ్యయనం చేస్తూ సోషలిస్టు సమాజ స్వప్నాన్ని గుండెల్లో మోస్తున్న కామ్రేడ్ చలసాని జగన్నాధరావు స్ఫూర్తి చిరకాలం భావితరాలకు వెలుగుబాటగా నిలుస్తుందనడంలో సందేహం లేదు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
