న్యాయ వ్యవస్థపై విశ్వాసం కలుగజేయటమే తమ లక్ష్యమని సుప్రీంకోర్టు వ్యాఖ్యానించింది. ప్రజలు న్యాయ వ్యవస్థపై కూడా విశ్వాసం కోల్పోతున్నారని సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ ఆందోళన వ్యక్తం చేశారు.
ఈ ప్రకటనకు స్పందనగా అన్యాయానికి వ్యతిరేకంగా చేసే పోరాటంలో ప్రజల విశ్వాసమే తమకు ప్రధానమని ఆదివారం సుప్రీంకోర్టు ప్రకటించింది.
ప్రజలకు ఈ వ్యవస్థపై విశ్వాసం కల్పించడమే తమ ప్రధాన లక్ష్యమని ధర్మాసనం స్పష్టం చేసింది. ఈ ప్రయత్నంలో సిబల్ లాంటి వారి నమ్మకాన్ని చూరగొనటం కూడా అన్యాయానికి వ్యతిరేకంగా తాము చేసే పోరాటంలో కీలకమైన అంశమని సుప్రీంకోర్టు పేర్కొంది. రాజ్యాంగ వ్యవస్థల పట్ల ప్రజలకు భరోసా ఉండాల్సిన అవసరాన్ని నొక్కిచెప్పింది.
వేలాది మంది అరెస్టుపై విచారణ
జ్ఞానేష్ కుమార్ నేతృత్వంలోని ఎన్నికల సంఘం పనితీరును నిరసిస్తూ కాక్రోచ్ జనతా పార్టీతో పాటు పలు విద్యార్థి సంఘాలు ఆందోళనకు పిలుపునిచ్చాయి. ఈ నిరసన పిలుపు మేరకు ఢిల్లీలో వేలాదిమంది స్వచ్ఛందంగా నిరసనలకు దిగారు.
అయితే వారిని కేంద్ర ప్రభుత్వం భారీ బందోబస్తు నడుమ నిర్బంధంలోకి తీసుకుంది. కాక్రోచ్ జనతా పార్టీ నేతలతో పాటు యూట్యూబర్ ధ్రువ్ రాఠీ సహా దాదాపు ఏడు వేల మందిని కేంద్ర ప్రభుత్వ అజమాయిషీలో పనిచేసే ఢిల్లీ పోలీసు యంత్రాంగం అదుపులోకి తీసుకుంది.
ఈ అరెస్టులను ప్రశ్నిస్తూ దాఖలైన పిటిషన్పై ఆదివారం సుప్రీంకోర్టు ధర్మాసనం వాదనలు విన్నది.
చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదు
కాక్రోచ్ జనతా పార్టీ ఇచ్చిన పిలుపుమేరకు ఢిల్లీలో శాంతియుతంగా నిరసన ప్రదర్శనలో పాల్గొంటున్న పౌరులను చట్టవిరుద్ధంగా నిర్బంధించరాదని విచారణలో సుప్రీంకోర్టు సూచించింది.
చట్టాన్ని ధిక్కరించి ఎవరినీ అదుపులోకి తీసుకోకూడదని స్పష్టం చేసింది. ప్రత్యేకించి ప్రజల సమీకరణ గురించి ఆంక్షలు విధించిన ప్రాంతాల్లో మినహా మిగిలిన ప్రాంతాల్లో ఆందోళనకారులను నిర్బంధించరాదని ఆదేశించింది.
తమతమ చట్టపరమైన విధి నిర్వహణలో ఉన్న న్యాయవాదులు, పత్రికా ప్రతినిధులు, ఇతరులను అరెస్టు చేయరాదంటూ సుప్రీంకోర్టు సూచించింది.
ధర్నా ప్రదేశానికి నాలుగు కిలోమీటర్ల పరిధికి బయట ఉన్న ప్రాంతాల్లో కూడా ప్రజలను అరెస్ట్ చేస్తున్న విషయాన్ని రాష్ట్రీయ జనతా దళ్ ఎంపీ మనోజ్ ఝా తరఫున వాదిస్తున్న సీనియర్ న్యాయవాది కపిల్ సిబల్ సుప్రీంకోర్టు దృష్టికి తీసుకొచ్చారు.
మెట్రో, ఇంటర్నెట్ సేవలు పునరుద్ధరించాలి
ఢిల్లీలో మెట్రో రైలు సేవలు, ఇంటర్నెట్ సేవలు చట్టపరిధికి లోబడి యథాతథంగా పునరుద్ధరించాలని కేంద్ర ప్రభుత్వ న్యాయాధికారి సొలిసిటర్ జనరల్ తుషార్ మెహతాను సుప్రీంకోర్టు ఆదేశించింది.
అక్టోబర్ తొమ్మిదవ తేదీన ఉన్నత న్యాయస్థానం ఆదేశించినప్పటికీ 45 మెట్రో స్టేషన్లలో ప్రయాణికుల రాకపోకలకు అవకాశం లేకుండా చేశారని సిబల్ న్యాయస్థానం దృష్టికి తెచ్చారు.
చట్టం ప్రకారం ఇంటర్నెట్ సేవలు ఎటువంటి అవరోధాలకు తావు లేకుండా నిరంతరాయంగా అందుబాటులో ఉంచాలని కోర్టు పేర్కొంది.
అలా చెప్తున్నప్పుడు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ చట్టం కింద ప్రభుత్వానికి దఖలు పడిన అధికారాలను ఉపయోగించవద్దని చెప్పడం లేదని సుప్రీంకోర్టు వివరించింది.
కోర్టు ధిక్కార వ్యాజ్యంపై వాదనలు
ఢిల్లీలో మెట్రో సేవలను సంపూర్ణంగా రద్దు చేయరాదంటూ సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను కేంద్ర ప్రభుత్వం ఉల్లంఘించడాన్ని సవాలు చేస్తూ దాఖలైన కోర్టు ధిక్కార వ్యాజ్యంలో జస్టిస్ జోయ్ మాల్యా బాగ్చి, జస్టిస్ వీ మోహన నేతృత్వంలోని ధర్మాసనం వాదనలు విన్నది.
నిరసన సమయంలో పౌర సేవలు అందించడంలో సుప్రీంకోర్టు మార్గదర్శకాలను ఉల్లంఘించడంపై కోర్టు ధిక్కార కేసును నమోదు చేయాలని పిటిషనర్లు వాదించారు.
సుప్రీంకోర్టు ప్రాంగణంలో భారతీయ న్యాయ సంహిత చట్టం 163వ సెక్షన్ కింద పెట్టిన బోర్డును తొలగించాలని కూడా కోర్టు ఆదేశించింది.
న్యాయ వ్యవస్థపై పెరిగిన నమ్మకం
కేంద్ర ప్రభుత్వానికి సుప్రీంకోర్టు ఇచ్చిన తాజా ఆదేశాలపై స్పందిస్తూ కపిల్ సిబల్ హర్షం వ్యక్తం చేశారు. ఈ ఆదేశాల ద్వారా ప్రజలకు న్యాయవ్యవస్థపై విశ్వాసం కలుగుతుందని రాజ్యసభ సభ్యుడైన మాజీ కేంద్రమంత్రి వ్యాఖ్యానించారు.
ఈ నిర్ణయాలకు దేశంలోని మేధావులు సుప్రీంకోర్టుకు ఎంతగానో రుణపడి ఉంటారని సిబల్ ప్రశంసించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
