“నన్ను వాహనంలోకి ఎక్కించిన తర్వాత పోలీసుల దాష్టీకం మరింత పెరిగింది. పోలీసులు నాపై దాడి చేసి, సీటుకు అదిమిపట్టారు. నేను పార్లమెంటు సభ్యుడినని తెలిపిన తర్వాత కూడా నాపై దాడి కొనసాగించారు.”
న్యూఢిల్లీ: మీడియాతో మాట్లాడుతున్న సమయంలో భారత కమ్యూనిస్టు పార్టీ(మార్క్సిస్టు) ఎంపీ జాన్ బ్రిట్టాస్ పట్ల ఢిల్లీ పోలీసులు తీవ్రమైన దురుసుతనంగా వ్యవహరించారు. ఆయనను బలవంతంగా తీసుకెళ్లి, దాడి చేసి, చివరకు ఎక్కడో వదిలిపెట్టారు. ప్రస్తుతం జాన్ బ్రిట్టాస్ రామ్ మనోహర్ లోహియా ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు.
పోలీసుల దాడికి సంబంధించి తాను రాష్ట్రపతి, ఉపరాష్ట్రపతి(రాజ్యసభ చైర్మన్), భారత ప్రధాన న్యాయమూర్తికి రాసిన లేఖను ఎంపీ జాన్ బ్రిట్టాస్ తన ఎక్స్ (ట్విట్టర్) ఖాతాలో పోస్ట్ చేశారు.
పోలీసులపై తక్షణమే జోక్యం చేసుకోవాలని, దాడికి బాధ్యులైన సిబ్బందిపై జవాబుదారీతనాన్ని నిర్ధారించి చర్యలు తీసుకోవాలని, పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన అంశంపై కూడా తగిన చర్యలు చేపట్టాలని ఆయన తన లేఖలో కోరారు.
ఆ లేఖ పూర్తి పాఠం:
విషయం: ఢిల్లీలో ప్రశాంతంగా మీడియాతో మాట్లాడుతున్న సమయంలో రాజ్యసభ ప్రస్తుత సభ్యుడినైన నాపై పోలీసులు దారుణంగా దాడి చేయడం— రాజ్యాంగం కల్పించిన స్వేచ్ఛలకు, పార్లమెంటు గౌరవానికి తీవ్ర భంగం— తక్షణ జోక్యం చేసుకుని, స్వతంత్ర దర్యాప్తు జరిపించాలని విజ్ఞప్తి.
గౌరవనీయులైన భారత రాష్ట్రపతికి,
ఈరోజు న్యూఢిల్లీలో నాపై పోలీసులు జరిపిన అమానుష దాడి ఘటనను గౌరవనీయులైన మీ దృష్టికి అత్యవసరంగా తీసుకురావడానికి ఈ లేఖ రాస్తున్నాను.
ప్రధాన ఎన్నికల కమిషనర్ శ్రీ జ్ఞానేశ్ కుమార్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ కొనసాగుతున్న ప్రజాస్వామ్య నిరసనలకు సంబంధించి నేను ప్రశాంతంగా పాత్రికేయులతో మాట్లాడుతున్న సమయంలో పోలీసులు నన్ను బలవంతంగా ఈడ్చుకెళ్లారు.
పోలీసు సిబ్బంది నన్ను బలవంతంగా పైకి ఎత్తుకెళ్లి పోలీసు వాహనంలో దారుణంగా కొట్టారు. అనంతరం రహదారి పక్కన నన్ను వదిలిపెట్టారు.
ఈ మొత్తం ఘటన చట్టబద్ధ పాలన, ప్రజాస్వామ్యబద్ధంగా అసమ్మతిని వ్యక్తం చేసే హక్కుకు ఉన్న హామీ, చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత అప్పగించిన వారి జవాబుదారీతనం వంటి కీలక అంశాలపై తీవ్ర ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఈ ఘటనను మరింత దిగ్భ్రాంతికరంగా మార్చే అంశమేమిటంటే శాంతియుతంగా నిరసన తెలుపుతున్న వారిని అక్రమ నిర్బంధం నుంచి రక్షించాలని, ఇంటర్నెట్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూడాలని, మెట్రో రైలు, రైల్వే సేవలు యథావిధిగా కొనసాగించాలని, ప్రజల స్వేచ్ఛాయుత రాకపోకలకు భంగం కలగకుండా చూడాలని గౌరవనీయ సుప్రీంకోర్టు స్పష్టమైన ఆదేశాలు జారీ చేసిన కొన్ని గంటల్లోనే ఈ పోలీసుల దాష్టీకం చోటుచేసుకోవడం.
ఈరోజు మధ్యాహ్నం సుమారు పన్నెండున్నర గంటల సమయంలో యువ కార్యకర్తలపై పోలీసులు దాడి చేస్తున్నారని, వారిని నిర్బంధిస్తున్నారని తెలుసుకుని నేను కన్నాట్ ప్లేస్‌కు చేరుకున్నాను. అక్కడ పాత్రికేయులతో మాట్లాడుతున్నాను.
పత్రికా ప్రతినిధులతో మాట్లాడటం ద్వారా నా ప్రజాస్వామ్య హక్కును మాత్రమే నేను వినియోగించుకుంటున్నాను.
అయినప్పటికీ ఢిల్లీ పోలీసులు, కేంద్ర రిజర్వ్ పోలీసు దళం(సీఆర్పీఎఫ్) సిబ్బంది నన్ను బలవంతంగా పట్టుకుని సుమారు యాభై మీటర్ల దూరం ఈడ్చుకెళ్లారు.
నేను ప్రస్తుత పార్లమెంటు సభ్యుడినని అక్కడే ఉన్న పాత్రికేయులు పదేపదే స్పష్టం చేసినప్పటికీ పోలీసులు ఏమాత్రం పట్టించుకోలేదు.
అధికార దుర్వినియోగం
కొంతమంది పోలీసులు నన్ను ఏకంగా గాలిలోకి ఎత్తి ఒక పోలీసు వాహనం వైపు మోసుకెళ్లారు. పదవిలో ఉన్న ఒక పార్లమెంటు సభ్యుడిని ఏదో వస్తువును బలవంతంగా ఎత్తుకెళ్లినట్లుగా వ్యవహరించారు. పోలీసులు ఇంతటి అధికార దుర్వినియోగానికి పాల్పడటాన్ని సమర్థించే విధంగా నేను ఎలాంటి రెచ్చగొట్టే చర్యకూ పాల్పడలేదు.
నన్ను పోలీసు వాహనంలోకి ఎక్కించిన తర్వాత పోలీసుల దాష్టీకం మరింత పెరిగింది. పోలీసు సిబ్బంది నాపై దాడి చేసి సీటుకు అదిమిపట్టారు. నేను పార్లమెంటు సభ్యుడినని నా గుర్తింపును స్పష్టంగా తెలిపిన తర్వాత కూడా దాడి కొనసాగించారు.
ప్రజలచే ఎన్నికైన ప్రతినిధిననే విషయం కూడా నన్ను అవమానకరంగా, శారీరకంగా హింసించేలా వ్యవహరించకుండా వారిని నిరోధించలేకపోయింది.
సంబంధిత డిప్యూటీ కమిషనర్ ఆఫ్ పోలీస్(డీసీపీ) ఆదేశాల మేరకు నన్ను విడుదల చేయడంతో పోలీసులు నన్ను రహదారి పక్కన వదిలిపెట్టారు. నా నిర్బంధం పూర్తిగా చట్టవిరుద్ధమైనదని గుర్తించిన డీసీపీ నన్ను విడుదల చేయాలని ఆదేశించినట్లు తెలిసింది.
పోలీసుల దాడి అనంతరం ఇప్పటికీ నేను తీవ్రమైన శారీరక నొప్పితో, అసౌకర్యంతో బాధపడుతున్నాను. జార్ఖండ్‌కు చెందిన ఒక యువకుడు ఈ ఘటనను ప్రత్యక్షంగా చూసి నాకు సహాయం చేశాడు. అతని వాంగ్మూలాన్ని నమోదు చేసి భద్రపరచాల్సిన అవసరం ఉంది.
ఉన్నతాధికారుల పాత్రపై దర్యాప్తు జరగాలి
ఈ దాడి గురించి సంబంధిత డీసీపీకి తెలుసు. డీసీపీ ఫోన్ ద్వారా వాహనంలోని పోలీసు సిబ్బందికి అందించిన ఆదేశాల మేరకే నన్ను విడుదల చేశారు. ఈ మొత్తం ఘటనపై ముఖ్యంగా సంబంధిత ఉన్నతాధికారుల పాత్ర, వారికి ఈ ఘటన గురించి ఉన్న సమాచారం వంటి అంశాలపై స్వతంత్రంగా దర్యాప్తు జరగాలి.
ఇవి స్పష్టంగా గుర్తించగలిగే పోలీసు సిబ్బంది, గుర్తించదగిన పోలీసు వాహనం, గుర్తించగలిగే అధికారుల ఆదేశాల పరంపర, ప్రత్యక్ష సాక్షులకు సంబంధించిన నిర్దిష్టమైన, ధృవీకరించదగిన దాష్టీక చర్యలు.
పాత్రికేయులు, అక్కడ ఉన్న ఇతర వ్యక్తులు చిత్రీకరించిన సంబంధిత దృశ్యాలను పూర్తిగా పరిశీలించాలి.
నాపై జరిగిన ఈ దిగ్భ్రాంతికరమైన దాడిని నమోదు చేసిన, నాకు జరిగిన క్రూరమైన దాడికి సాక్ష్యంగా నిలిచే కొన్ని వార్తా కథనాల లింకులను కింద పేర్కొంటున్నాను. ఇవి కేవలం ఉదాహరణలు మాత్రమే.
ఈ ఘటనకు సంబంధించిన మరెన్నో వార్తా కథనాలు, వీడియో రికార్డింగులు అందుబాటులో ఉన్నాయి. ఎలాంటి ఆధారాలు కనుమరుగుకాకుండా చూడటానికి, దాడికి పాల్పడిన వారితో పాటు అధికారుల ఆదేశాల పరంపరలో బాధ్యత వహించాల్సిన వారిని కూడా జవాబుదారీ చేయడానికి, ఈ ఆధారాలన్నింటినీ అత్యవసరంగా గుర్తించి, సేకరించి, భద్రపరచాలి.
వాక్ స్వాతంత్ర్యంపై దాడి
నేను పాత్రికేయులతో మాట్లాడుతున్నాను తప్ప ఎలాంటి నేరానికీ పాల్పడలేదు. ఇక్కడ వివరించిన పరిస్థితుల్లో నాపై భౌతిక దాడికి పాల్పడటాన్ని సమర్థించే కారణమేదీ లేదు.
ప్రస్తుతం కొనసాగుతున్న నిరసనల విస్తృత నేపథ్యం నుంచి ఈ ఘటనను వేరుచేసి చూడలేం. నిన్న కేరళ మాజీ ముఖ్యమంత్రి శ్రీ పినరయి విజయన్, నాతో పాటు పలువురు ప్రతిపక్ష నాయకులను పోలీసులు నిర్బంధించారు.
మమ్మల్ని గంటల తరబడి ఢిల్లీలోని వివిధ ప్రాంతాలకు తిప్పారు. మమ్మల్ని ఎక్కడికి తీసుకెళ్తున్నారు, ఈ ప్రయాణాన్ని ఎందుకు కొనసాగిస్తున్నారనే విషయాలపై స్పష్టత ఇవ్వలేదు.
నిర్బంధంలో ఉన్నవారికి ఆహారం, అత్యవసర మందులు అందించడంలో నిరాకరణ, జాప్యం జరిగిందన్న ఆందోళనలు కూడా వ్యక్తమయ్యాయి.
ఈ విస్తృత రాజకీయ నేపథ్యం కారణంగానే నేడు జరిగిన ఘటన మరింత ఆందోళనకరంగా కనిపిస్తోంది. ప్రధాన ఎన్నికల కమిషనర్ రాజీనామా చేయాలన్న డిమాండ్‌ను ప్రజాస్వామ్యబద్ధమైన ప్రజా సమీకరణ, రాజకీయ అభిప్రాయ వ్యక్తీకరణ ద్వారా ముందుకు తీసుకెళ్తున్నారు.
ఈ డిమాండ్లను లేవనెత్తడాన్ని గానీ, ప్రభుత్వ సంస్థలను విమర్శించడాన్ని గానీ, ప్రజలను బెదిరించడానికి ప్రభుత్వం తన అధికారాన్ని ఉపయోగించుకునే అనుమతిగా భావించరాదు.
రాజ్యాంగంలోని ఆర్టికల్ 19(1)(a), 19(1)(b)లు వరుసగా వాక్ స్వాతంత్య్రాన్ని, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కును పరిరక్షిస్తున్నాయి.
వ్యక్తి జీవించే హక్కును, వ్యక్తిగత స్వేచ్ఛను కాపాడే ఆర్టికల్ 21 కూడా ఈ ఘటనలో తీవ్రమైన ప్రశ్నలను లేవనెత్తుతోంది.
ఎవరినైనా నిర్బంధించాలన్నా, వారి స్వేచ్ఛపై ఆంక్షలు విధించాలన్నా అందుకు చట్టబద్ధమైన ఆధారం ఉండాలి.
పోలీసులు బలప్రయోగం చేయాల్సి వస్తే అది సమర్థించదగినదిగా, అవసరానికి మించనిదిగా, తగిన పరిమితుల్లో ఉండాలి.
నాపై జరిగిన క్రూరమైన దాడి, నన్ను బలవంతంగా తీసుకెళ్లిన తీరు, చివరకు రోడ్డుపై వదిలిపెట్టిన విధానం— ఇవన్నీ రాజ్యాంగం కల్పించిన హక్కుల వెలుగులో తక్షణమే సమగ్ర పరిశీలనకు గురికావాలి.
పోలీసుల ప్రవర్తన, నిర్బంధానికి సంబంధించి అమలులో ఉన్న చట్టాలు, నిబంధనల ప్రకారం కూడా ఈ ఘటనపై అత్యవసరంగా విచారణ జరపాలి.
పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘన
ఈ ఘటన పార్లమెంటరీ హక్కులు, గౌరవం కోణంలోనూ తీవ్రమైన పరిశీలనకు అర్హమైనది. రాజ్యాంగంలోని ఆర్టికల్ 105 పార్లమెంటు పరిధిలో నిర్దేశించిన మేరకు పార్లమెంటులో వాక్ స్వాతంత్ర్యాన్ని, పార్లమెంటు సంస్థాగత కార్యకలాపాల స్వేచ్ఛాయుత నిర్వహణను పరిరక్షిస్తుంది.
పార్లమెంటు సభ్యుడినైనంత మాత్రాన చట్టానికి అతీతుడినని, చట్టం నుంచి మినహాయింపు ఉంటుందని నేను చెప్పడం లేదు.
అయితే ప్రజా ప్రాధాన్యత కలిగిన అంశంపై ప్రశాంతంగా మీడియాతో మాట్లాడుతున్న ప్రస్తుత పార్లమెంటు సభ్యుడిపై భౌతిక దాడి జరగడం అత్యంత తీవ్రమైన విషయం. ఇది పార్లమెంటు స్థాయిలో సమగ్ర పరిశీలనకు అర్హమైనదే కాకుండా, పార్లమెంటరీ హక్కుల ఉల్లంఘనగా కూడా పరిగణించాల్సిన అంశం.
చట్టాన్ని అమలు చేయాల్సిన బాధ్యత పోలీసులదే తప్ప వారు చట్టానికి అతీతులు కారు. పోలీసు యూనిఫాం వేసుకున్నంత మాత్రాన దాడి చేసినా, చట్టవిరుద్ధంగా నిర్బంధించినా, అధికారాన్ని దుర్వినియోగం చేసినా శిక్ష నుంచి మినహాయింపు లభించదు.
నిష్పక్షపాత దర్యాప్తుకు విజ్ఞప్తి
కావున ఈ ఘటనపై తక్షణమే జోక్యం చేసుకుని కేంద్ర ప్రభుత్వం, ఢిల్లీ జాతీయ రాజధాని ప్రాంత ప్రభుత్వాల నుంచి సమగ్ర నివేదిక కోరాలని, స్వతంత్రంగా, నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిగేలా చర్యలు తీసుకోవాలని తమకు నేను హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
ఈ ఘటనకు సంబంధించిన అన్ని ఆధారాలను తక్షణమే భద్రపరచాలి. వాటిలో పూర్తి నిడివి గల, ఎలాంటి కత్తిరింపులు చేయని వీడియో రికార్డింగులు, పోలీసు వాహనం గుర్తింపు వివరాలు, దాని రాకపోకల రికార్డులు, సిబ్బంది విధుల కేటాయింపు పట్టికలు, బలగాల మోహరింపునకు సంబంధించిన ఆదేశాలు, వైర్లెస్ సమాచార ప్రసారాలు, కంట్రోల్ రూమ్ లాగ్‌లు, నన్ను నిర్బంధించిన తీరుకు, విడుదల చేసిన విధానానికి సంబంధించిన రికార్డులు అన్నీ ఉండాలి.
ఈ ఘటనలో పాల్గొన్న పోలీసు సిబ్బంది ఎవరెవరో ఎలాంటి జాప్యం లేకుండా గుర్తించాలి. దాడి గురించి సమాచారం అందుకున్న డీసీపీ పాత్రతో పాటు, ఇతర ఉన్నతాధికారుల పాత్రను కూడా సమగ్రంగా పరిశీలించాలి.
ఈ ఘటనలో బాధ్యులుగా తేలిన వారందరిపైనా బాధ్యతారాహిత్యం లేదా కుమ్మక్కైన ప్రమేయం నిర్ధారణైన పర్యవేక్షక ఉన్నతాధికారులతో సహా చట్టప్రకారం తగిన క్రమశిక్షణా చర్యలు తీసుకోవాలి. క్రిమినల్ చర్యలు కూడా ప్రారంభించి చట్టం ముందు వారు బాధ్యత వహించేలా చూడాలి.
సామాన్యుడికి రక్షణ ఏది?
ఈ ఫిర్యాదును మీ ముందుంచుతున్నది కేవలం భౌతిక అవమానానికి, దాడికి గురైన వ్యక్తిగా మాత్రమే కాదు. మన గణతంత్ర వ్యవస్థకు ఇలాంటి పోలీసు ప్రవర్తన వల్ల కలిగే పరిణామాల పట్ల తీవ్ర ఆందోళన చెందుతున్న పార్లమెంటు సభ్యుడిగా కూడా ఈ ఫిర్యాదు చేస్తున్నాను.
తాను పార్లమెంటు సభ్యుడినని స్పష్టంగా చెప్పినప్పటికీ, మీడియాతో శాంతియుతంగా మాట్లాడుతున్నందుకు ఒక ఎన్నికైన ప్రజాప్రతినిధిపైనే దాడి చేసి చివరకు రోడ్డుపై వదిలిపెడితే— ఇలా రాష్ట్ర అధికార యంత్రాంగం ఇష్టారాజ్యంగా వ్యవహరించినప్పుడు సామాన్య పౌరుడికి ఇక ఎలాంటి రక్షణ ఉంటుందని ఆశించగలం?
పార్లమెంటు సభ్యుడిననే కారణంతో నాకు ప్రత్యేక మర్యాదలు చూపాలని, ప్రత్యేక సౌకర్యాలు కల్పించాలని నేను కోరడం లేదు. చట్టం అందరికీ సమానంగా రక్షణ కల్పించాలి; చట్టాన్ని అమలు చేసేవారు కూడా చట్టానికి జవాబుదారీగా ఉండాలి — ఇదే నా డిమాండ్.
ప్రజాస్వామ్య బలం భిన్నాభిప్రాయాలను అణచివేయడంలో లేదు; వాటిని ఆలకించి, వాటికి తగిన పరిష్కారం చూపగల సామర్థ్యంలోనే ఉంది.
కావున నాపై జరిగిన పోలీసు దాడిపై నిష్పక్షపాతంగా దర్యాప్తు జరిపించి, సంబంధిత ఆధారాలన్నింటినీ భద్రపరచి, బాధ్యులెవరో నిర్ధారించి, తప్పు చేసిన వారందరిపైనా తగిన చర్యలు తీసుకునేలా తక్షణమే జోక్యం చేసుకోవాలని మరోసారి హృదయపూర్వకంగా విజ్ఞప్తి చేస్తున్నాను.
అలాగే ఈ ఘటనకు సంబంధించి సాక్ష్యాలు అందించే సాక్షులు లేదా ఇతర వ్యక్తులపై ఎలాంటి ప్రతీకార చర్యలూ జరగకుండా సమర్థవంతమైన రక్షణ చర్యలు చేపట్టేందుకు నిర్దిష్టమైన ఆదేశాలు జారీ చేయాలని కూడా కోరుతున్నాను.
ధన్యవాదాలతో, భవదీయుడు, జాన్ బ్రిట్టాస్
(ఈ వ్యాసం 2026 అక్టోబర్ 11వ తేదీ రాత్రి 9 గంటల 33 నిమిషాలకు ప్రచురితమైంది. అనువాదం: కె మనోహర రాజు).
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
