“ఉద్రిక్తతల సమయంలో కొంతమంది నటులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారు” అని సంఘం వాదిస్తోంది.
న్యూఢిల్లీ: భారతదేశంలో పాకిస్తానీ నెట్‌ఫ్లిక్స్ సిరీస్ విడుదలను నిలిపివేయాలని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి అఖిల భారత సినీ వర్కర్ల సంఘం లేఖ రాసింది.
సురేశ్ శ్యాంలాల్ గుప్తా 2016లో ప్రారంభించిన ఈ సంఘం పాకిస్థాన్‌ను ఒక “ఉగ్రవాద దేశంగా” తరచూ పేర్కొంటూ, పాకిస్థాన్‌కు చెందిన అన్ని రకాల కంటెంట్‌ను భారతదేశంలో శాశ్వతంగా నిషేధించాలని కోరింది.
2016 ఉరీ దాడుల నాటి నుంచి పాకిస్థానీ నటీనటులు, సాంకేతిక సిబ్బంది భారత్‌లో పనిచేయకుండా నిలిపివేయడంలో భారతీయ సినిమా కార్మికులకు ప్రాతినిధ్యం వహిస్తున్న సంఘాలు విజయవంతంగా ప్రయత్నించాయి.
కేంద్ర ప్రభుత్వ సూచనలకు విరుద్ధమంటూ వాదన
పహల్గామ్లో ఉగ్రవాదుల దాడుల తర్వాత పాకిస్థానీ మూలంతో ఉన్న కంటెంట్‌ను భారత్‌లో స్ట్రీమింగ్ చేయడం నిలిపివేయాలని అన్ని ఓటీటీ వేదికలు, స్ట్రీమింగ్ సర్వీసులు, మధ్యవర్తులకు 2025 మే 8న ప్రభుత్వం చేసిన సూచనలకు వ్యతిరేకంగా ఈ సిరీస్ ఉందని సంఘం పేర్కొంది.
ఫవాద్ ఖాన్, మాహిరా ఖాన్, హనియా ఆమీర్, సమన్ అన్సారీ వంటి నటీనటులతో “జో బచే హై సంగ్ సమేట్లో” పేరుతో పాకిస్థాన్ తొలి ఒరిజినల్ సిరీస్‌ను నెట్‌ఫ్లిక్స్ నిర్మించింది. “ఉద్రిక్తతల సమయంలో ఇందులో ఉన్న కొంతమంది నటులు భారత్‌కు వ్యతిరేకంగా మాట్లాడారని” సంఘం వాదిస్తోంది.
“ఉగ్రవాద దేశానికి చెందిన ఈ ప్రజలు భారత్ మంచిని ఎప్పుడూ కోరుకోలేరు” అని సంఘం రాసిన లేఖ పేర్కొంది.
కఠిన చట్టం తీసుకురావాలని డిమాండ్
“ఈ రోజే కాదు, భవిష్యత్తులో ఎప్పుడూ కూడా పాకిస్థాన్‌తో కలిసి భారత్ ప్రయాణించజాలదు. భారతీయ తెరలపై పాకిస్థానీ ముఖాలకు, గొంతుకలకు, కథలకు స్థానం లేదు” అని కూడా ఆ లేఖ తెలియజేసింది.
షాంఘై సహకార సంస్థ నాగరికతల సంభాషణ (సివిలైజేషన్ డైలాగ్)లో భాగంగా భారత ప్రభుత్వ ఆహ్వానంపై పాకిస్థాన్ వాతావరణ మార్పు శాఖ మంత్రి ముసద్దిఖ్ మసూద్ మాలిక్ గత వారం చివరిలో ఢిల్లీ సందర్శించిన నేపథ్యంలో ఈ లేఖ వచ్చింది.
భారతీయ టెలివిజన్, ఓటీటీ వేదికలు లేదా సినిమా హాళ్లలో మరోసారి పాకిస్థానీ కంటెంట్, నటీనటులు, చిత్రాలను చూపించకుండా నిరోధించడానికి “భారీ జరిమానాలు విధిస్తూ శాశ్వత ప్రాతిపదికన బలమైన చట్టాన్ని తీసుకురావాలని” ఆ లేఖ కోరింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
