రాజ్యాంగ సంస్థల స్వతంత్రతకు సవాళ్లు – ప్రాథమిక హక్కులపై ఆంక్షలు – ప్రజాస్వామ్య పరిరక్షణకు ప్రజలే పునాది.
భారతదేశ చరిత్రలో నవంబర్ 26వ తేదీ అత్యంత విశిష్టమైనది. 1949 నవంబర్ 26న భారత రాజ్యాంగ పరిషత్ మన దేశ రాజ్యాంగాన్ని ఆమోదించింది.
సుదీర్ఘమైన స్వాతంత్ర్య పోరాటం, అనేకమంది త్యాగధనుల పోరాట ఫలితంగా ఏర్పడిన స్వతంత్ర భారతదేశానికి ఎలాంటి రాజకీయ, సామాజిక, ఆర్థిక వ్యవస్థ ఉండాలనే విషయంపై విస్తృత చర్చలు జరిపి రాజ్యాంగాన్ని రూపొందించారు. అందుకే ఈ రోజును రాజ్యాంగ దినోత్సవంగా నిర్వహించుకుంటున్నాం.
అయితే రాజ్యాంగాన్ని ఆమోదించుకుని 77 సంవత్సరాలు పూర్తవుతున్న సందర్భంలో, రాజ్యాంగం నిర్దేశించిన ప్రజాస్వామ్య విలువలు, లౌకికవాదం, సమానత్వం, సామాజిక న్యాయం, పౌర స్వేచ్ఛలు నేడు ఎంతవరకు అమలవుతున్నాయి అనేది ఆత్మపరిశీలన చేసుకోవాల్సిన అవసరం ఉంది.
రాజ్యాంగబద్ధమైన సంస్థలు తమ స్వతంత్రతను కాపాడుకుంటున్నాయా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు పౌరులకు నిజంగా ఉందా? ప్రజాస్వామ్య వ్యవస్థలో అత్యంత కీలకమైన ప్రతిపక్షాల పాత్ర, పార్లమెంటు ప్రాధాన్యత, న్యాయవ్యవస్థ స్వతంత్రత ఎలా ఉన్నాయి అనేవి నేటి సవాళ్లు.
2014 తర్వాత కేంద్రంలో అధికారంలో ఉన్న ప్రభుత్వ విధానాలు, రాజ్యాంగ సంస్థల పనితీరు, ప్రజాస్వామ్య హక్కుల పరిస్థితిపై దేశవ్యాప్తంగా తీవ్ర చర్చ జరుగుతోంది.
ఈ నేపథ్యంలో రాజ్యాంగ దినోత్సవం కేవలం ఉత్సవాలకు పరిమితం కాకుండా రాజ్యాంగ పరిరక్షణకు ప్రజలను చైతన్యపరిచే సందర్భంగా మారాలి.
భారత రాజ్యాంగ నిర్మాణం – స్వాతంత్ర్య పోరాట ఆశయాల ప్రతిబింబం
భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన తర్వాత ప్రజాస్వామ్య దేశంగా ఎలా ముందుకు వెళ్లాలనే అంశంపై రాజ్యాంగ పరిషత్ చర్చలు ప్రారంభించింది.
1946 డిసెంబర్ 9న రాజ్యాంగ పరిషత్ తొలి సమావేశం జరిగింది. డాక్టర్ సచ్చిదానంద సిన్హా తాత్కాలిక అధ్యక్షుడిగా వ్యవహరించగా, తర్వాత డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ శాశ్వత అధ్యక్షుడిగా ఎన్నికయ్యారు.
రాజ్యాంగ ముసాయిదా కమిటీకి డాక్టర్ బీఆర్ అంబేద్కర్ అధ్యక్షత వహించారు. ఆయనతో పాటు మరో ఆరుగురు సభ్యులు కూడా ఈ కమిటీలో ఉన్నారు.
దాదాపు 2 సంవత్సరాల 11 నెలల 18 రోజుల పాటు చర్చలు, పరిశీలనలు, సవరణల అనంతరం రాజ్యాంగాన్ని రూపొందించారు.
1949 నవంబర్ 26న రాజ్యాంగాన్ని ఆమోదించగా, 1950 జనవరి 26 నుంచి అమల్లోకి వచ్చింది. ఈ రాజ్యాంగ నిర్మాణం వెనుక కేవలం పరిపాలనా అవసరాలు మాత్రమే లేవు.
భారత స్వాతంత్ర్య పోరాటంలో పాల్గొన్న వివిధ రాజకీయ, సామాజిక శక్తుల ఆశయాలు, వలసవాద వ్యతిరేక పోరాట స్ఫూర్తి, సమానత్వం కోసం జరిగిన సామాజిక ఉద్యమాల ఆకాంక్షలు ఉన్నాయి.
ముఖ్యంగా కుల వివక్ష, అంటరానితనం, మత వివక్ష, ఆర్థిక అసమానతలు, సామాజిక దోపిడీ నుంచి ప్రజలకు విముక్తి కల్పించాలనే ఆకాంక్ష రాజ్యాంగంలో ప్రతిబింబించింది.
రాజ్యాంగ ప్రవేశిక – భారత ప్రజాస్వామ్యానికి ఆత్మ
భారత రాజ్యాంగ ప్రవేశిక మన దేశం ఏ విధమైన వ్యవస్థగా ఉండాలనే విషయాన్ని స్పష్టంగా పేర్కొంది. భారతదేశం సర్వసత్తాక, సామ్యవాద, లౌకిక, ప్రజాస్వామ్య, గణతంత్ర రాజ్యంగా ఉండాలని ప్రకటించింది.
అంతేకాకుండా పౌరులందరికీ సామాజిక, ఆర్థిక, రాజకీయ న్యాయం, ఆలోచన, భావప్రకటన, విశ్వాసం, మతం, ఆరాధనలకు స్వేచ్ఛ, హోదా, అవకాశాల్లో సమానత్వం, వ్యక్తి గౌరవం, జాతీయ సమైక్యతను పెంపొందించే సౌభ్రాతృత్వం కల్పించాలనే లక్ష్యాలను నిర్దేశించింది.
1976లో 42వ రాజ్యాంగ సవరణ ద్వారా సామ్యవాద, లౌకిక పదాలను ప్రవేశికలో చేర్చారు. అయితే ఆ విలువలు రాజ్యాంగంలోని ఇతర నిబంధనల్లో అప్పటికే అంతర్లీనంగా ఉన్నాయి.
2024 నవంబర్ 25న సుప్రీంకోర్టు కూడా సామ్యవాద, లౌకిక పదాల చేర్పును సవాలు చేసిన పిటిషన్లను తిరస్కరించి, ఈ పదాల రాజ్యాంగబద్ధతను సమర్థించింది.
రాజ్యాంగ ప్రవేశికలోని ఈ విలువలు ఏ ఒక్క రాజకీయ పార్టీకి సంబంధించినవి కావు. అవి భారత ప్రజలందరికీ సంబంధించినవి. అధికారంలోకి వచ్చే ఏ ప్రభుత్వమైనా వాటిని గౌరవించాల్సిందే.
ప్రాథమిక హక్కులు – ప్రజాస్వామ్యానికి జీవనాడి
రాజ్యాంగంలోని మూడో భాగంలో 12 నుంచి 35వ అధికరణాల వరకు ప్రాథమిక హక్కులను పొందుపరిచారు.
వాటిలో ముఖ్యమైనవి:
1. సమానత్వపు హక్కు – అధికరణాలు 14–18. చట్టం ముందు అందరూ సమానులే. మతం, జాతి, కులం, లింగం, జన్మస్థలం ఆధారంగా వివక్ష చూపకూడదు.
2. స్వేచ్ఛా హక్కు – అధికరణాలు 19–22. భావప్రకటన స్వేచ్ఛ, శాంతియుతంగా సమావేశమయ్యే హక్కు, సంఘాలు ఏర్పాటు చేసుకునే హక్కు, దేశంలో స్వేచ్ఛగా సంచరించే హక్కు, నివాసం ఏర్పరచుకునే హక్కు, వృత్తిని నిర్వహించుకునే హక్కు ఇందులో ఉన్నాయి.
3. దోపిడీకి వ్యతిరేకంగా హక్కు – అధికరణాలు 23–24. వెట్టి చాకిరీ, మానవ అక్రమ రవాణా, బాల కార్మిక నిషేధాలకు రాజ్యాంగ రక్షణ కల్పించింది.
4. మత స్వేచ్ఛా హక్కు – అధికరణాలు 25–28. ప్రతి ఒక్కరికీ తమ మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ కల్పించింది.
5. సాంస్కృతిక, విద్యా హక్కులు – అధికరణాలు 29–30. భాషా, మతపరమైన మైనారిటీల సంస్కృతి, భాష, విద్యాసంస్థల పరిరక్షణకు అవకాశం కల్పించింది.
6. రాజ్యాంగ పరిహార హక్కు – అధికరణం 32. ప్రాథమిక హక్కులకు భంగం కలిగినప్పుడు సుప్రీంకోర్టును ఆశ్రయించే హక్కు కల్పించింది. డాక్టర్ అంబేద్కర్ ఈ అధికరణం 32ను రాజ్యాంగంలోని హృదయం, ఆత్మగా అభివర్ణించారు. ప్రజాస్వామ్యం అంటే కేవలం ఐదేళ్లకోసారి ఎన్నికలు నిర్వహించడం మాత్రమే కాదు. ఎన్నికల్లో గెలిచిన ప్రభుత్వం రాజ్యాంగానికి, చట్టాలకు, ప్రజల హక్కులకు లోబడి పనిచేయాలి.
రాజ్యాంగ సంస్థల స్వతంత్రత – ప్రజాస్వామ్య పరిరక్షణకు కీలకం
భారత రాజ్యాంగం ప్రభుత్వ అధికారాలను ఒకే వ్యవస్థ చేతిలో కేంద్రీకరించకుండా వివిధ సంస్థల మధ్య విభజించింది.
1. శాసన వ్యవస్థ – పార్లమెంటు, రాష్ట్ర శాసనసభలు.
2. కార్యనిర్వాహక వ్యవస్థ – రాష్ట్రపతి, ప్రధానమంత్రి, మంత్రిమండలి, ప్రభుత్వ యంత్రాంగం.
3. న్యాయ వ్యవస్థ – సుప్రీంకోర్టు, హైకోర్టులు, ఇతర న్యాయస్థానాలు. ఈ మూడు రాజ్యాంగానికి మూలస్తంభాలు. పత్రికా రంగాన్ని కూడా నాలుగో స్తంభంగా పరిగణిస్తారు.
వీటితో పాటు స్వతంత్రంగా పనిచేయాల్సిన రాజ్యాంగ, చట్టబద్ధ సంస్థలను కూడా ఏర్పాటు చేసింది. వాటిలో ముఖ్యమైనవి ఎన్నికల సంఘం, కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్, యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఆర్థిక సంఘం, జాతీయ షెడ్యూల్డ్ కులాల కమిషన్, జాతీయ షెడ్యూల్డ్ తెగల కమిషన్, జాతీయ వెనుకబడిన తరగతుల కమిషన్.
అలాగే కేంద్ర విజిలెన్స్ కమిషన్, కేంద్ర దర్యాప్తు సంస్థ(సీబీఐ), ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ), సమాచార కమిషన్, జాతీయ మానవ హక్కుల కమిషన్ వంటి చట్టబద్ధ సంస్థలు కూడా ప్రజాస్వామ్య జవాబుదారీతనంలో కీలక పాత్ర పోషిస్తాయి.
ఈ సంస్థలు అధికారంలో ఉన్న ప్రభుత్వం తప్పు చేసినప్పుడు ప్రశ్నించగలగాలి, ప్రభుత్వ ఆర్థిక లావాదేవీలను పరిశీలించగలగాలి, ఎన్నికలు నిష్పక్షపాతంగా జరిగేలా చూడగలగాలి, పౌరుల హక్కులకు రక్షణ కల్పించగలగాలి. కానీ ఈ సంస్థల నియామకాలు, పనితీరు, నిర్ణయాలపై ప్రభుత్వ ప్రభావం పెరిగితే వాటి స్వతంత్రత దెబ్బతింటుంది. ప్రజాస్వామ్యంలో ఇది అత్యంత ప్రమాదకరమైన పరిణామం.
గత 12 సంవత్సరాల్లో రాజ్యాంగ సంస్థలపై పెరిగిన ఒత్తిళ్లు
గత 12 సంవత్సరాల రాజకీయ పరిణామాలను పరిశీలిస్తే, రాజ్యాంగ సంస్థల స్వతంత్రతపై పలు అనుమానాలు, ఆరోపణలు వస్తున్నాయి.
2014 తర్వాత కేంద్రంలో అధికార కేంద్రీకరణ, సంస్థల నియామకాల విధానం, దర్యాప్తు సంస్థల వినియోగం, పార్లమెంట్ సమావేశాలు జరిగే రోజులు, వివిధ అంశాలు, బిల్లులపై చర్చలు గణనీయంగా తగ్గి మొక్కుబడిగా జరుగుతున్నాయి.
ఎన్నికల సంఘం స్వతంత్రతపై ప్రశ్నలు
భారత ప్రజాస్వామ్యానికి ఎన్నికల సంఘం అత్యంత కీలకమైన సంస్థ. రాజ్యాంగంలోని 324వ అధికరణం ప్రకారం ఎన్నికల నిర్వహణ, పర్యవేక్షణ, నియంత్రణ బాధ్యతలు ఎన్నికల సంఘానికి అప్పగించారు.
ఎన్నికలు నిష్పక్షపాతంగా జరగడం, అధికార పార్టీతో పాటు ప్రతిపక్ష పార్టీలకు సమాన అవకాశాలు కల్పించడం ఈ సంస్థ బాధ్యత. కానీ ఎన్నికల సంఘం స్వతంత్రతపై గత కొన్నేళ్లుగా అనేక ప్రశ్నలు తలెత్తుతున్నాయి.
2023 మార్చి 2న సుప్రీంకోర్టు అనూప్ బరణ్వాల్ కేసులో చారిత్రాత్మక తీర్పునిస్తూ, పార్లమెంటు చట్టం చేసేంత వరకు ప్రధానమంత్రి, లోక్సభ ప్రతిపక్ష నాయకుడు, భారత ప్రధాన న్యాయమూర్తితో కూడిన కమిటీ ఎన్నికల కమిషనర్ల నియామకాలను సిఫారసు చేయాలని ఆదేశించింది.
అయితే 2023లో కేంద్ర ప్రభుత్వం కొత్త చట్టాన్ని తీసుకొచ్చింది. అందులో ప్రధానమంత్రి, ప్రతిపక్ష నాయకుడితో పాటు ప్రధానమంత్రి నామినేట్ చేసే కేంద్ర మంత్రిని నియామక కమిటీలో చేర్చింది.
ఈ విధంగా సుప్రీంకోర్టు సూచించిన కమిటీలోని ప్రధాన న్యాయమూర్తి స్థానంలో కేంద్ర మంత్రి వచ్చారు. అంటే ముగ్గురిలో ఇద్దరు అధికార పక్షం వారే. ఈ చట్టం వల్ల ఎన్నికల సంఘంపై ప్రభుత్వ ప్రభావం ఉన్నదని తీవ్ర విమర్శలు ఉన్నాయి. ఈ నియామక విధానాన్ని సవాలు చేస్తూ సుప్రీంకోర్టులో పిటిషన్లు కూడా దాఖలయ్యాయి.
ఎన్నికల సంఘం నిష్పక్షపాతంగా పనిచేస్తుందనే విశ్వాసం ప్రజల్లో ఉండాలి. నేడు ఆ విశ్వాసం దెబ్బతిని ఎన్నికల ప్రక్రియపైనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి.
సీబీఐ, ఈడీ వంటి దర్యాప్తు సంస్థలపై విమర్శలు
అవినీతిని అరికట్టడం, ఆర్థిక నేరాలను విచారించడం, చట్టవిరుద్ధ కార్యకలాపాలను నియంత్రించడం దర్యాప్తు సంస్థల ప్రధాన బాధ్యత. కానీ ఇటీవలి కాలంలో కేంద్ర దర్యాప్తు సంస్థలు ప్రతిపక్ష నాయకులపైనే ప్రధానంగా కేసులు మోపుతున్నాయి.
ముఖ్యంగా ప్రతిపక్ష పార్టీల నాయకులపై ఈడీ, సీబీఐ దాడులు, విచారణలు, ఎన్నికలకు ముందు ప్రతిపక్ష నాయకుల అరెస్టులు, ప్రభుత్వాన్ని విమర్శించే స్వచ్ఛంద సంస్థలు, కార్యకర్తలపై దర్యాప్తులు, అధికార పార్టీలో చేరిన తర్వాత కొందరు నాయకులపై కేసులు మరుగున పడటం లాంటివి చోటుచేసుకుంటున్నాయి.
ప్రభుత్వ దర్యాప్తు సంస్థలు తమ స్వతంత్రతను కోల్పోయి అధికారంలో ఉన్న రాజకీయ వ్యవస్థకు అనుకూలంగా వ్యవహరిస్తున్నాయనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి.
2026 నవంబర్ 23న విడుదలైన హ్యూమన్ రైట్స్ వాచ్ నివేదికలో కూడా కేంద్ర దర్యాప్తు సంస్థలను రాజకీయ ప్రత్యర్థులు, ప్రభుత్వ విమర్శకులపై వినియోగిస్తున్నారనే తీవ్ర ఆరోపణలు ఉన్నాయి.
2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి వరకు ఈడీ 193 మంది రాజకీయ నాయకులపై కేసులు నమోదు చేసింది. వారిలో ఎక్కువమంది ప్రభుత్వ ప్రత్యర్థులేనని నివేదిక పేర్కొంది.
అవినీతికి పాల్పడిన వ్యక్తి ఏ పార్టీకి చెందిన వారైనా చట్టప్రకారం విచారణ జరగాలి. కానీ ఒకే రకమైన ఆరోపణల విషయంలో రాజకీయ అనుబంధాన్ని బట్టి దర్యాప్తు వేగం, తీవ్రత మారకూడదు. అదే చట్టం ముందు సమానత్వం.
పార్లమెంటు ప్రాధాన్యత తగ్గిపోవడం
పార్లమెంటు ప్రజాస్వామ్యానికి దేవాలయం అని తరచుగా చెబుతుంటాం. ప్రజల తరఫున ఎన్నికైన ప్రతినిధులు ప్రభుత్వ విధానాలను చర్చించాలి, ప్రశ్నించాలి, తప్పులను ఎత్తిచూపాలి. కానీ ఇటీవలి సంవత్సరాల్లో పార్లమెంటులో చర్చలు జరగకుండానే కీలక బిల్లులు ఆమోదం పొందుతున్నాయి.
2023 డిసెంబర్ పార్లమెంటు శీతాకాల సమావేశాల్లో భద్రతా ఉల్లంఘన ఘటనపై చర్చ కోరిన ప్రతిపక్ష సభ్యులపై చర్యల నేపథ్యంలో లోక్సభలో 100 మంది, రాజ్యసభలో 46 మంది సభ్యులను సస్పెండ్ చేశారు.
ఆ సమావేశంలో ఎన్నికల కమిషనర్ల నియామక బిల్లుతో సహా కీలక బిల్లులు ఆమోదం పొందాయి.
పార్లమెంటులో ప్రతిపక్ష సభ్యులు లేకుండా చట్టాలు ఆమోదించడం ప్రజాస్వామ్య స్ఫూర్తికి విరుద్ధం. ప్రభుత్వం తనకు ఉన్న మెజారిటీతో బిల్లులను ఆమోదించుకోవచ్చు. కానీ మెజారిటీ ఉందని ప్రజాస్వామ్య చర్చలను, ప్రతిపక్షాల హక్కులను హరించకూడదు.
పార్లమెంటును పక్కనపెట్టి చట్టాల రూపకల్పన
కొన్ని కీలక చట్టాలను మనీ బిల్లులుగా ప్రవేశపెట్టి రాజ్యసభలో సమగ్ర చర్చకు అవకాశం లేకుండా చేయడం విమర్శలకు దారితీసింది. ముఖ్యంగా 2019లో మనీ లాండరింగ్ నిరోధక చట్టం (పీఎంఎల్ఏ)కు చేసిన కొన్ని సవరణలు ఈడీ అధికారాలను విస్తరించాయి.
ఆ సవరణల ద్వారా దర్యాప్తు సంస్థలకు లభించిన అధికారాల పరిధి, అరెస్టు ప్రక్రియ, నిందితుల హక్కులపై న్యాయవాదులు, పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి.
మనీ బిల్లు అనే ప్రత్యేక రాజ్యాంగ ప్రక్రియను ఉపయోగించి ముఖ్యమైన హక్కులకు సంబంధించిన చట్టాలను రాజ్యసభలో సమగ్ర చర్చ లేకుండా ఆమోదించడం పార్లమెంటరీ ప్రజాస్వామ్యాన్ని అభాసుపాలు చేసింది.
కాగ్ నివేదికలు – ప్రభుత్వ జవాబుదారీతనం
కంప్ట్రోలర్ అండ్ ఆడిటర్ జనరల్ (కాగ్) ప్రభుత్వ ఆదాయ వ్యయాలను పరిశీలించే రాజ్యాంగబద్ధ సంస్థ. ప్రభుత్వం ప్రజాధనాన్ని ఎలా ఖర్చు చేస్తోంది? ప్రభుత్వ పథకాల అమలులో అవకతవకలు ఉన్నాయా? కాంట్రాక్టులు, నిర్మాణాలు, కొనుగోళ్లలో నిబంధనలు పాటిస్తున్నారా వంటి అంశాలను పరిశీలించడం సీఏజీ బాధ్యత. కాగ్ నివేదికలను పార్లమెంటు, శాసనసభల ప్రజా ఖాతాల కమిటీలు పరిశీలించాలి.
కానీ కాగ్ నివేదికలు ప్రజల ముందుకు రావడంలో ఆలస్యం, నివేదికలపై శాసనసభల్లో తగిన చర్చ జరగకపోవడం ప్రభుత్వ జవాబుదారీతనానికి సవాలుగా మారాయి.
ప్రజాధనానికి కాపలాదారుగా ఉండాల్సిన సంస్థ తన బాధ్యతను స్వతంత్రంగా నిర్వహించే వాతావరణం ఉండాలి.
న్యాయవ్యవస్థ స్వతంత్రత – ప్రజాస్వామ్యానికి రక్షణ కవచం
భారత రాజ్యాంగం ప్రకారం న్యాయవ్యవస్థకు అత్యంత కీలకమైన స్థానం ఉంది. ప్రభుత్వం రాజ్యాంగానికి విరుద్ధంగా చట్టాలు చేసినా, పౌరుల హక్కులను ఉల్లంఘించినా, ప్రభుత్వ సంస్థలు అధికార దుర్వినియోగానికి పాల్పడినా న్యాయస్థానాలు జోక్యం చేసుకుని న్యాయం చేయాలి.
ఈ నేపథ్యంలో న్యాయవ్యవస్థ స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం పడినా అది ప్రజాస్వామ్యానికి పెద్ద ప్రమాదం. గత కొన్నేళ్లుగా న్యాయవ్యవస్థ పనితీరుపై కొన్ని ముఖ్యమైన ప్రశ్నలు చర్చకు వచ్చాయి.
ప్రభుత్వానికి సంబంధించిన కీలక కేసుల విచారణలో జాప్యం, వ్యక్తిగత స్వేచ్ఛకు సంబంధించిన పిటిషన్ల పరిష్కారంలో ఆలస్యం, ప్రభుత్వ నిర్ణయాలపై న్యాయ సమీక్షలో అసమానత ఉందనే విమర్శలు, న్యాయమూర్తుల నియామకాలు, కొలీజియం వ్యవస్థ, న్యాయవ్యవస్థపై ప్రభుత్వ ప్రభావం వంటి అంశాలు చర్చనీయాంశమయ్యాయి.
2025లో ఆక్స్ఫర్డ్ అకాడమిక్లో ప్రచురితమైన ఒక పరిశోధనా వ్యాసం, సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి కార్యాలయంలో ఉన్న విస్తృత అధికారాలు, బెంచీల ఏర్పాటు, కేసుల కేటాయింపు వంటి అంశాలు సంస్థాగత స్వతంత్రతపై ఎలాంటి ప్రభావం చూపుతున్నాయో విశ్లేషించింది. ఇది పరిశోధకుల అభిప్రాయ విశ్లేషణ మాత్రమే, న్యాయస్థానం ఇచ్చిన తీర్పు కాదు.
అయితే న్యాయవ్యవస్థపై వస్తున్న అన్ని విమర్శలను ఒకే గాటన కట్టలేం. ప్రభుత్వానికి వ్యతిరేకంగా కూడా సుప్రీంకోర్టు కొన్ని సందర్భాల్లో తీర్పులు ఇచ్చింది.
న్యాయవ్యవస్థ స్వతంత్రత, జవాబుదారీతనం, ప్రజలకు అందుబాటులో న్యాయం లభించే పరిస్థితులను బలోపేతం చేయడం ముఖ్యం.
ఎన్నికల బాండ్లు – ప్రజాస్వామ్యంలో పారదర్శకతకు ఎదురైన సవాలు
భారత ఎన్నికల వ్యవస్థలో రాజకీయ పార్టీలకు అందే విరాళాలు చాలా కీలకమైన అంశం. 2017లో కేంద్ర ప్రభుత్వం ఎన్నికల బాండ్ల పథకాన్ని ప్రవేశపెట్టి 2018లో అమల్లోకి తీసుకొచ్చింది.
ఈ పథకం ద్వారా రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే వ్యక్తులు, కంపెనీల వివరాలు సాధారణ ప్రజలకు తెలియకుండా ఉండే విధానం ఏర్పడింది.
రాజకీయ పార్టీలకు విరాళాలు ఇచ్చే కంపెనీల వివరాలు ప్రజలకు తెలియకపోతే, ఆ కంపెనీలకు ప్రభుత్వం నుంచి కాంట్రాక్టులు, అనుమతులు, విధానపరమైన ప్రయోజనాలు లభిస్తున్నాయా లేదా అన్నది ప్రజలు పరిశీలించలేరు.
ఈ పథకాన్ని సవాలు చేస్తూ దాఖలైన పిటిషన్లపై 2024 ఫిబ్రవరి 15న సుప్రీంకోర్టు చారిత్రాత్మక తీర్పు ఇచ్చింది.
ఎన్నికల బాండ్ల పథకం రాజ్యాంగ విరుద్ధమని ప్రకటించింది. రాజకీయ విరాళాల వివరాలను తెలుసుకునే ఓటర్ల హక్కు రాజ్యాంగంలోని 19(1)(a) అధికరణం కింద భావప్రకటన స్వేచ్ఛలో భాగమని స్పష్టం చేసింది.
అలాగే అపరిమిత కార్పొరేట్ విరాళాలకు అనుమతించిన సవరణను కూడా రాజ్యాంగ విరుద్ధంగా ప్రకటించింది.
ఎన్నికలు కేవలం ఓటర్ల నిర్ణయంతోనే ప్రభావితం కావు. ఎన్నికలకు నిధులు సమకూర్చే కార్పొరేట్ సంస్థల ప్రభావం కూడా ప్రజాస్వామ్యంపై పడుతుంది. అందుకే రాజకీయ విరాళాల వివరాలు ప్రజలకు అందుబాటులో ఉండాలి.
భావప్రకటన స్వేచ్ఛ, నిరసన తెలిపే హక్కుపై ఆంక్షలు
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వాన్ని ప్రశ్నించడం పౌరుల హక్కు. ప్రభుత్వ విధానాలను విమర్శించడం, నిరసన ప్రదర్శనలు నిర్వహించడం, సంఘాలు ఏర్పాటు చేసుకోవడం ప్రజాస్వామ్య వ్యవస్థలో అంతర్భాగాలు. కానీ గత 10 సంవత్సరాలుగా ప్రభుత్వాన్ని విమర్శించిన జర్నలిస్టులు, విద్యార్థులు, మేధావులు, మానవ హక్కుల కార్యకర్తలు, సామాజిక ఉద్యమకారులపై కేసులు, విచారణ లేకుండానే జైళ్లలో మగ్గడం సర్వసాధారణమైంది.
ప్రత్యేకంగా ఉపా చట్టం కింద అరెస్టులు, దేశద్రోహం పేరుతో కేసులు, శాంతియుత నిరసనల్లో పాల్గొన్నవారిపై కేసులు, ప్రభుత్వ విధానాలను విమర్శించే సామాజిక మాధ్యమ పోస్టులపై చర్యలు, జర్నలిస్టులపై విచారణలు, దాడులు, విద్యార్థి ఉద్యమాలపై పోలీసుల కర్కశ చర్యలు—ఈ పరిణామాలు భావప్రకటన స్వేచ్ఛకు తీవ్ర విఘాతం కలిగిస్తున్నాయి.
2022లో సుప్రీంకోర్టు దేశద్రోహ చట్టంలోని సెక్షన్ 124A అమలును పునఃపరిశీలన పూర్తయ్యే వరకు నిలిపివేసింది.
అయితే 2024 జూలై 1 నుంచి అమల్లోకి వచ్చిన భారతీయ న్యాయ సంహితలో 152వ సెక్షన్ ద్వారా దేశ సార్వభౌమత్వం, ఐక్యత, సమగ్రతకు ముప్పు కలిగించే చర్యలకు సంబంధించి కొత్త నేర నిబంధన తీసుకొచ్చారు. అందువల్ల పాత దేశద్రోహ నిబంధన నిలిచిపోయినంత మాత్రాన భావప్రకటన స్వేచ్ఛపై ఆందోళనలు పూర్తిగా తొలగిపోలేదు.
ఇంటర్నెట్ నిలిపివేతలు – పౌర స్వేచ్ఛకు మరో సవాలు
జమ్మూ కశ్మీర్లో 2019 ఆగస్టు 5 తర్వాత సుదీర్ఘకాలం ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారు. దీనిపై అనురాధ భాసిన్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా కేసులో 2020 జనవరి 10న సుప్రీంకోర్టు కీలక తీర్పు ఇచ్చింది.
ఇంటర్నెట్ ద్వారా భావప్రకటన, వృత్తి, వ్యాపారం నిర్వహించే స్వేచ్ఛలు రాజ్యాంగంలోని 19వ అధికరణం కింద రక్షణ పొందుతాయని, నిరవధికంగా ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం అనుమతించబడదని స్పష్టం చేసింది.
నేటి డిజిటల్ యుగంలో ఇంటర్నెట్ కేవలం వినోద సాధనం కాదు. విద్య, ఉపాధి, వ్యాపారం, సమాచారం, ప్రజాస్వామ్య చర్చలకు అత్యంత అవసరమైన సాధనం. అందువల్ల భద్రత ముసుగులో ఇంటర్నెట్ సేవలను నిలిపివేయడం ప్రజల ప్రజాస్వామ్య హక్కులను హరించడమే.
మతతత్వం, మైనారిటీల హక్కులు – లౌకిక రాజ్యాంగానికి పరీక్ష
భారతదేశం అనేక మతాలు, భాషలు, సంస్కృతులు, కులాలు, తెగలు కలిసి ఉన్న దేశం. భారత స్వాతంత్ర్య ఉద్యమంలో వివిధ మతాలకు చెందిన ప్రజలు కలిసి పోరాడారు. ఆ ఐక్యతే భారత రాజ్యాంగంలోని లౌకికవాదానికి పునాది.
ఇటీవలి సంవత్సరాల్లో జరుగుతున్న మతపరమైన విభజన, మైనారిటీలపై ద్వేషపూరిత ప్రసంగాలు, మతపరమైన ఉద్రిక్తతలు, సామాజిక వివక్ష వంటి పరిణామాలు ఆందోళన కలిగిస్తున్నాయి.
ప్రభుత్వం ఏ మతానికీ ప్రత్యేక ప్రాధాన్యత ఇవ్వకుండా అన్ని మతాల పట్ల సమాన దూరం పాటించాలి. ప్రతి పౌరుడికి తన మతాన్ని విశ్వసించే, ఆచరించే, ప్రచారం చేసుకునే స్వేచ్ఛ ఉండాలి.
ప్రజల మధ్య మతపరమైన విభజన పెరిగితే రాజ్యాంగం నిర్దేశించిన సౌభ్రాతృత్వం కంటితుడుపుగా మిగులుతుంది.
మతం ఆధారంగా పౌరుల హక్కులను నిర్ణయించడం, ఒక మతానికి చెందినవారిని అనుమానంతో చూడటం, ద్వేషపూరిత రాజకీయాలను ప్రోత్సహించడం భారత రాజ్యాంగ మౌలిక స్ఫూర్తికి విరుద్ధం.
రాజ్యాంగంలోని 14, 15, 25, 26 అధికరణాలు ఈ విషయంలో స్పష్టమైన రక్షణ కల్పిస్తున్నాయి.
సమాఖ్య వ్యవస్థకు తూట్లు – రాష్ట్రాల హక్కులకు సవాళ్లు
భారతదేశం రాష్ట్రాల సమాఖ్య దేశం. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల మధ్య అధికారాలను రాజ్యాంగం విభజించింది. కానీ గత కొన్నేళ్లుగా రాష్ట్రాల అధికారాలు, హక్కులు, ఆదాయ వనరులపై కేంద్ర ప్రభుత్వం దాడి చేస్తున్నది.
ముఖ్యంగా గవర్నర్ల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాల వ్యవహారాల్లో జోక్యం పెరిగింది. రాష్ట్ర శాసనసభలు ఆమోదించిన బిల్లులపై గవర్నర్లు నిర్ణయాలు తీసుకోకుండా తీవ్ర జాప్యం చేస్తున్నారు.
రాష్ట్రాలకు రావాల్సిన ఆర్థిక వనరుల పంపిణీపై వివాదాలు, కేంద్ర దర్యాప్తు సంస్థల ద్వారా రాష్ట్ర ప్రభుత్వాలపై ఒత్తిడి, విద్య, వ్యవసాయం, ఆరోగ్యం వంటి రంగాల్లో కేంద్ర నిర్ణయాల ప్రభావం పెరిగింది. గవర్నర్ రాజ్యాంగబద్ధమైన పదవి.
ఆయన కేంద్ర ప్రభుత్వ ప్రతినిధిగా కాకుండా రాజ్యాంగాన్ని పరిరక్షించే బాధ్యత కలిగిన వ్యక్తిగా వ్యవహరించాలి.
రాష్ట్రాల్లో ప్రజలు ఎన్నుకున్న ప్రభుత్వాల నిర్ణయాలను గవర్నర్లు తమ వ్యక్తిగత లేదా రాజకీయ అభిప్రాయాల ఆధారంగా అడ్డుకోకూడదు. రాష్ట్రాల హక్కులు, కేంద్రం బాధ్యతలు, ప్రజాస్వామ్య సమాఖ్య వ్యవస్థ మధ్య సమతుల్యత ఉండాలి.
సమాచార హక్కు చట్టం – పారదర్శకతకు ఎదురైన దెబ్బ
2005లో అమల్లోకి వచ్చిన సమాచార హక్కు చట్టం (RTI) భారత ప్రజాస్వామ్యంలో ఒక ముఖ్యమైన మైలురాయి. ప్రభుత్వ కార్యాలయాల్లో జరిగే వ్యవహారాలను ప్రజలు తెలుసుకునే అవకాశం ఈ చట్టం కల్పించింది. అవినీతి, అక్రమాలు, ప్రభుత్వ నిధుల దుర్వినియోగం వంటి అంశాలను బయటపెట్టడంలో సమాచార హక్కు కార్యకర్తలు కీలక పాత్ర పోషించారు.
కానీ 2019లో చేసిన సవరణలతో కేంద్ర, రాష్ట్ర సమాచార కమిషనర్ల పదవీకాలం, జీతభత్యాలు, సేవా నిబంధనలను నిర్ణయించే అధికారాన్ని కేంద్ర ప్రభుత్వానికి అప్పగించడం విమర్శలకు దారితీసింది. దీనివల్ల సమాచార కమిషన్ల స్వతంత్రత, ప్రభుత్వంపై వాటి పర్యవేక్షణ సామర్థ్యం బలహీనపడే ప్రమాదం ఉందని పౌరహక్కుల సంఘాలు ఆందోళన వ్యక్తం చేశాయి. ప్రభుత్వం తన పనితీరును ప్రజలకు వెల్లడించాల్సిన బాధ్యత కలిగి ఉంది. ప్రజలకు సమాచారం అందుబాటులో లేకపోతే ప్రజాస్వామ్య జవాబుదారీతనం బలహీనపడుతుంది.
సామాజిక, ఆర్థిక న్యాయం – రాజ్యాంగ లక్ష్యాల అసంపూర్తి
భారత రాజ్యాంగం కేవలం రాజకీయ ప్రజాస్వామ్యాన్ని మాత్రమే లక్ష్యంగా పెట్టుకోలేదు. సామాజిక, ఆర్థిక ప్రజాస్వామ్యాన్ని కూడా లక్ష్యంగా నిర్దేశించింది.
అంబేద్కర్ తన ప్రసిద్ధ రాజ్యాంగ పరిషత్ ప్రసంగంలో రాజకీయ సమానత్వం, సామాజిక, ఆర్థిక అసమానతల మధ్య వైరుధ్యాన్ని తొలగించాల్సిన అవసరాన్ని స్పష్టం చేశారు.
నేడు భారతదేశంలో ధనిక, పేదల మధ్య ఆర్థిక అంతరాలు అనూహ్యంగా పెరిగాయి. వ్యవసాయ రంగ సంక్షోభంతో రైతులు దివాలా తీస్తున్నారు.
నిరుద్యోగ సమస్య గత రికార్డులను బద్దలు కొట్టింది. కార్మికులు పోరాడి సాధించుకున్న హక్కులు కోడ్ల రూపంలో హరించబడుతున్నాయి.
ప్రభుత్వ విద్య, వైద్య రంగాలు నిధులు, మౌలిక సదుపాయాల కొరతతో దిగాలు పడి ఉన్నాయి. దళితులు, ఆదివాసీలు, మహిళలు, మైనారిటీలపై దాడులు నిత్యకృత్యమయ్యాయి.
రాజ్యాంగంలోని నాలుగో భాగంలో పొందుపరిచిన ఆదేశిక సూత్రాలు ప్రజల సంక్షేమం, సమాన అవకాశాలు, జీవన ప్రమాణాల మెరుగుదల, కార్మికుల హక్కులు, విద్య, ఆరోగ్యం వంటి అంశాలకు ప్రాధాన్యత ఇచ్చాయి. అధిక సంపద కొద్దిమంది చేతుల్లో కేంద్రీకృతమవుతున్నది. విస్తృత ప్రజానీకం కనీస అవసరాల కోసం పోరాడాల్సిన పరిస్థితి ఏర్పడి రాజ్యాంగం నిర్దేశించిన ఆర్థిక న్యాయం లక్ష్యం నీరుగారిపోతున్నది.
అంతర్జాతీయ నివేదికలు – భారత ప్రజాస్వామ్యంపై వెలువడుతున్న ఆందోళనలు
భారతదేశంలో ప్రజాస్వామ్య సంస్థల పనితీరు, పౌర స్వేచ్ఛలు, మైనారిటీల హక్కులు, భావప్రకటన స్వేచ్ఛ వంటి అంశాలపై అంతర్జాతీయ సంస్థలు కూడా పలు నివేదికలు విడుదల చేస్తున్నాయి.
2026 నవంబర్ 23న హ్యూమన్ రైట్స్ వాచ్ విడుదల చేసిన 95 పేజీల నివేదికలో భారతదేశంలోని ప్రజాస్వామ్య సంస్థల స్వతంత్రత, ప్రభుత్వ దర్యాప్తు సంస్థల వినియోగం, పార్లమెంటరీ చర్చలు, పౌర హక్కుల పరిస్థితిపై తీవ్ర విమర్శలు చేసింది.
అదేవిధంగా బెర్టెల్స్మన్ ట్రాన్స్ఫర్మేషన్ ఇండెక్స్ (బీటీఐ) 2026 నివేదిక భారత ప్రజాస్వామ్య సంస్థలు ఇంకా పనిచేస్తున్నప్పటికీ, ప్రభుత్వేతర సంస్థల స్వతంత్రత, పార్లమెంటరీ పర్యవేక్షణ, సమాఖ్య వ్యవస్థ వంటి అంశాల్లో బలహీనతలు పెరుగుతున్నాయని పేర్కొంది.
ఫ్రీడమ్ హౌస్ 2026 నివేదికలో భారతదేశానికి 100కు 62 స్కోరు ఇచ్చి ‘పాక్షిక స్వేచ్ఛ’ దేశంగా వర్గీకరించింది.
అయితే ఈ అంతర్జాతీయ సంస్థల నివేదికలు వాటి పరిశోధనా పద్ధతులు, దృక్పథాల ఆధారంగా రూపొందుతాయి. వాటిని తుది న్యాయ నిర్ణయాలుగా కాకుండా పరిశీలనకు, చర్చకు ఉపయోగపడే ఆధారాలుగా చూడాలి.
అదే సమయంలో భారతదేశంలోని సంస్థల అధికారిక గణాంకాలు, న్యాయస్థానాల తీర్పులు, పార్లమెంటరీ రికార్డులు, స్వతంత్ర పరిశోధనలతో వాటిని సరిపోల్చి చూడాలి.
రాజ్యాంగ పరిరక్షణ బాధ్యత ఎవరిది?
రాజ్యాంగాన్ని కాపాడాల్సిన బాధ్యత రాష్ట్రపతికి, ప్రధానమంత్రికి, న్యాయవ్యవస్థకు, పార్లమెంటుకు ఉంది. అదే సందర్భంలో ప్రజల భాగస్వామ్యానికి కూడా ప్రాధాన్యత ఉంది.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం మారవచ్చు. రాజకీయ పార్టీలు అధికారంలోకి రావచ్చు, పోవచ్చు. కానీ రాజ్యాంగం శాశ్వతంగా ఉండాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి కొన్ని ముఖ్యమైన చర్యలు అవసరం.
1. రాజ్యాంగ సంస్థలకు సంపూర్ణ స్వతంత్రత – ఎన్నికల సంఘం, కాగ్, సమాచార కమిషన్లు, దర్యాప్తు సంస్థలు రాజకీయ ఒత్తిళ్లకు అతీతంగా పనిచేసే వ్యవస్థగా ఉండాలి.
2. పార్లమెంటు, శాసనసభల్లో సమగ్ర చర్చలు – ప్రజలకు సంబంధించిన ప్రతి కీలక చట్టంపై విస్తృత చర్చ జరగాలి. ప్రతిపక్షాల గొంతుకకు తగిన ప్రాధాన్యత ఉండాలి.
3. న్యాయవ్యవస్థ స్వతంత్రత – ప్రభుత్వం నుంచి ఎలాంటి ఒత్తిడి లేకుండా న్యాయస్థానాలు పనిచేయాలి. పేదలకు, బలహీన వర్గాలకు సకాలంలో న్యాయం అందాలి.
4. భావప్రకటన స్వేచ్ఛకు రక్షణ – ప్రభుత్వాన్ని ప్రశ్నించడం దేశద్రోహం కాదు. ప్రజాస్వామ్యంలో విమర్శలు, నిరసనలు, భిన్నాభిప్రాయాలు సహజం. శాంతియుత నిరసనలకు రక్షణ ఉండాలి.
5. మతసామరస్యం, లౌకికవాదం – ప్రతి మతానికి సమాన గౌరవం, ప్రతి పౌరుడికి సమాన హక్కులు కల్పించాలి. మతపరమైన ద్వేష రాజకీయాలకు తావు ఉండకూడదు. రాజ్యం మతం విషయంలో జోక్యం చేసుకోకూడదు.
6. సామాజిక, ఆర్థిక సమానత్వం – కుల, మత, వర్గ వివక్షను తొలగించి పేదలు, కార్మికులు, రైతులు, మహిళలు, దళితులు, ఆదివాసీలకు సమాన అవకాశాలు కల్పించాలి.
7. పౌర సమాజం, ప్రజా ఉద్యమాల పాత్ర – ప్రజా సంఘాలు, కార్మిక, రైతు, విద్యార్థి, మహిళా సంఘాలు, మేధావులు, న్యాయవాదులు, జర్నలిస్టులు రాజ్యాంగ విలువల పరిరక్షణలో చురుకైన పాత్ర పోషించాలి.
రాజ్యాంగం పుస్తకాల్లో ఉండటానికి కాదు, ప్రజల జీవితాల్లో అమలు కావడానికి
రాజ్యాంగం అనేది కేవలం చట్టాల సంకలనం కాదు. అది కోట్లాది భారతీయుల స్వేచ్ఛా ఆకాంక్షలకు, సమానత్వ పోరాటాలకు, సామాజిక న్యాయ లక్ష్యాలకు ప్రతిరూపం అని భారత రాజ్యాంగ దినోత్సవం సందర్భంగా మనం గుర్తుంచుకోవాల్సిన ముఖ్యమైన విషయం.
దేశానికి స్వాతంత్ర్యం సాధించిన తర్వాత భారతదేశం ప్రజాస్వామ్య గణతంత్రంగా అవతరించడానికి కారణం రాజ్యాంగం. అనేక భాషలు, మతాలు, సంస్కృతులు, కులాలు, తెగలతో కూడిన దేశాన్ని ఐక్యంగా ఉంచడంలో రాజ్యాంగం కీలక పాత్ర పోషిస్తోంది.
కానీ రాజ్యాంగాన్ని ఆమోదించుకున్నంత మాత్రాన ప్రజాస్వామ్యం సురక్షితంగా ఉండదు. దానిని నిరంతరం పరిరక్షించుకోవాలి. రాజ్యాంగ సంస్థలు ప్రభుత్వానికి అనుకూలంగా కాకుండా రాజ్యాంగానికి అనుకూలంగా పనిచేయాలి. అధికారంలో ఉన్నవారు తమకు ప్రజలు ఇచ్చిన అధికారాన్ని రాజ్యాంగ పరిమితులకు లోబడి వినియోగించాలి.
ప్రభుత్వాన్ని ప్రశ్నించే పౌరుడిని శత్రువుగా చూడకూడదు. ప్రభుత్వ విధానాలను విమర్శించే జర్నలిస్టును దేశద్రోహిగా చిత్రీకరించకూడదు. నిరసన తెలిపే విద్యార్థిని నేరస్థుడిగా పరిగణించకూడదు. తమ హక్కుల కోసం పోరాడే కార్మికులు, రైతులను అణచివేయకూడదు.
ప్రజాస్వామ్యంలో ప్రభుత్వం ప్రజల కోసం ఉంటుంది. ప్రజలచేత, ప్రజలకొరకు ఎన్నికైనదే ప్రజా ప్రభుత్వం. ప్రజలు ప్రభుత్వం కోసం కాదు. రాజ్యాంగం ప్రభుత్వానికి అధికారాలను ఇచ్చింది. అదే సమయంలో ఆ అధికారాలకు పరిమితులను కూడా విధించింది. ఆ పరిమితులను గుర్తుచేయడమే రాజ్యాంగ పరిరక్షణ.
రాజ్యాంగంలోని పదాలను ఉటంకించడం కాదు, దాని ఆత్మను కాపాడుకోవడం ముఖ్యం. ఎన్నికలు జరుగుతున్నాయా లేదా అన్నది మాత్రమే ప్రజాస్వామ్యానికి కొలమానం కాదు. ప్రజలకు తమ అభిప్రాయాన్ని స్వేచ్ఛగా వ్యక్తం చేసే హక్కు ఉందా? ప్రభుత్వాన్ని ప్రశ్నించే హక్కు ఉందా? న్యాయం పొందగలుగుతున్నారా? మతం, కులం, భాషతో సంబంధం లేకుండా సమానంగా జీవించగలుగుతున్నారా అన్నదే అసలైన కొలమానం.
డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాజ్యాంగ పరిషత్లో చేసిన హెచ్చరికను ఈ సందర్భంగా గుర్తుచేసుకోవాలి. రాజ్యాంగం ఎంత మంచిదైనా, దానిని అమలు చేసేవారు చెడ్డవారైతే అది చెడ్డ ఫలితాలను ఇవ్వవచ్చు.
అలాగే రాజ్యాంగం ఎంత లోపభూయిష్టంగా ఉన్నా, దానిని అమలు చేసేవారు మంచివారైతే మంచి ఫలితాలు రావచ్చు. అందువల్ల రాజ్యాంగ విజయానికి రాజ్యాంగ నైతికత, ప్రజాస్వామ్య సంస్కృతి అత్యంత అవసరం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
