రాజకీయ అవసరాలకు అనుగుణంగా ఎన్నికల సంఘం, కోర్టులు, దర్యాప్తు సంస్థలు, పార్లమెంట్, హక్కుల సంఘాలను ఆధీనంలోకి తీసుకుని నిర్వీర్యం చేస్తోందని 95 పేజీల హెచ్ఆర్డబ్ల్యూ నివేదిక వెల్లడించింది. ఓటర్ల జాబితా నుంచి 13 కోట్ల మంది పేర్లను తొలగించడమే ఇందుకు తాజా ఉదాహరణగా పేర్కొంది.
న్యూఢిల్లీ: ప్రజాస్వామ్య స్వాతంత్ర్యం, మానవ హక్కుల పరిరక్షణకు ఏర్పాటు చేసిన సంస్థలను ఒక పద్ధతి ప్రకారం ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ప్రభుత్వం బలహీనపరిచి, నిర్వీర్యం చేస్తోందని అంతర్జాతీయ ప్రభుత్వేతర నిఘా సంస్థ హ్యూమన్ రైట్స్ వాచ్ (హెచ్ఆర్డబ్ల్యూ) విడుదల చేసిన కొత్త నివేదికలో వెల్లడించింది.
“ఈ ప్రజాస్వామ్యం గురించా మనం మాట్లాడుకుంటున్నది అయితే ఏంటి?: భారత్‌లో మోదీ నియంతృత్వ ఆట పుస్తకం” అనే శీర్షికతో విడుదలైన ఈ 95 పేజీల నివేదిక భారత్‌లోని నియంతృత్వ పోకడలను లోతుగా ఎత్తిచూపిందని తెలిపింది.
పార్లమెంటరీ ప్రక్రియను తక్కువ చేసి చూపించడం, ప్రతిపక్షాన్ని అణచివేయడం, దర్యాప్తు సంస్థలను ఆయుధంగా మార్చుకోవడం, రాజ్యాంగబద్ధమైన చట్టబద్ధ సంస్థలను బలహీనపరచడం, న్యాయవ్యవస్థ తనకు తాను దిగజారడంతో పాటు న్యాయవ్యవస్థలో జోక్యం చేసుకోవడం వంటి నాలుగు విభాగాలను హెచ్ఆర్డబ్ల్యూ పరిశీలించింది.
2025 జనవరి నుంచి 2026 సెప్టెంబర్ మధ్య కాలంలో 40 మందికి పైగా న్యాయవాదులు, జర్నలిస్టులు, కార్యకర్తలు, పరిశోధకులు, విద్యావేత్తలు, మాజీ–ప్రస్తుత న్యాయమూర్తులు, మాజీ ప్రభుత్వ అధికారులను సంస్థ ఇంటర్వ్యూ చేసింది.
“ఈ పాలన ప్రతి సంస్థను లొంగదీసుకోవడానికి ప్రయత్నిస్తోంది” అని ఎన్నికల సంఘం మాజీ ప్రధాన అధికారి ఎస్‌వై ఖురేషీ 2025 నవంబర్‌లో చేసిన వ్యాఖ్యలతో నివేదిక వివరాలు మొదలయ్యాయి.
13 కోట్ల మంది పేర్ల తొలగింపు.. ‘సంక్షోభంలో’ ఎన్నికల సంఘం
దొంగ ఓట్లు, అనర్హత ఓటర్లు, చనిపోయిన వారి ఓట్లను రద్దు చేయాలన్న లక్ష్యంతో 2025 జూన్‌లో మొదలుపెట్టిన ఓటర్ల జాబితా ప్రత్యేక విస్తృత సవరణ (సర్) 2026 అక్టోబర్ నాటికి 130 మిలియన్ (13 కోట్ల)కు పైగా పేర్లను తొలగించింది.
ఈ ప్రక్రియ మొత్తం తప్పుల తడకగా, ఏకపక్షంగా, అపారదర్శకంగా ఉందని, మహిళలు, పేదలు, మతపరమైన మైనారిటీలు, ప్రత్యేకంగా ముస్లింలను అసమానంగా మినహాయించారని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది.
“విశ్వసనీయత విషయంలో ఎన్నికల సంఘం తీవ్ర సంక్షోభాన్ని ఎదుర్కొంటోంది” అని నివేదిక తెలియజేసింది.
ద్వేషపూరిత ప్రసంగాలతో పాటు ఎన్నికల నియమాల ఉల్లంఘనలకు పాల్పడుతున్న మోదీ, బీజేపీ సీనియర్ నాయకులను కట్టడి చేయడంలో, జవాబుదారీగా నిలపడంలో ఎన్నికల సంఘం తరచుగా విఫలమైందని ఆరోపించింది.
ఓటర్ల జాబితా తారుమారు, పోలింగ్ డేటాను తొక్కిపెట్టడం, లెక్కింపులో అక్రమాలు, ఓటింగ్ యంత్రాలను మార్చడం వంటి ఆరోపణలపై విశ్వసనీయమైన దర్యాప్తు జరపడంలోనూ కమిషన్ విఫలమైందని నివేదిక స్పష్టం చేసింది.
నిరసనల తర్వాత కొన్ని నిర్ణయాలను మార్చుకోవడాన్ని ఎన్నికల సంఘం నవంబర్‌లో మొదలుపెట్టింది. ఢిల్లీతో సహా ఆరు రాష్ట్రాల్లో తొలగించిన ఓటర్లు తిరిగి జాబితాలో చేరడానికి రెండో అవకాశం కల్పించింది.
అయితే ‘సర్’ ప్రక్రియను మాత్రం సంఘం సమర్థించింది. దాని ఉత్తర్వులన్నీ ఏకగ్రీవంగా తీసుకున్నవని, ఫారం 6లో ఎలాంటి మార్పులు లేవని సుప్రీంకోర్టుకు తెలియజేసింది.
పశ్చిమ బెంగాల్: 90 లక్షల పేర్లు తొలగించి, ఓటర్లు వేచిచూడాలని చెప్పింది
పశ్చిమ బెంగాల్లో 2026 ఏప్రిల్ రాష్ట్ర ఎన్నికలకు ముందుగానే 90 లక్షల మందిని, అంటే మొత్తం ఓటర్లలో 12 శాతం మందిని జాబితా నుంచి తొలగించినట్లు హెచ్ఆర్డబ్ల్యూ వెల్లడించింది. తర్వాత వారిని తిరిగి కలిపేంత వరకు అప్పట్లో ఓటు వేయకపోయినా ఫర్వాలేదన్నట్లు సుప్రీంకోర్టు స్పష్టం చేసింది. ఆ తర్వాత మొదటిసారిగా మొత్తం రాష్ట్రాన్ని బీజేపీ తన నియంత్రణలోకి తీసుకుంది.
దాదాపు 90 శాతం పశ్చిమ బెంగాల్ ఓటర్ల అప్పీళ్లపై నిర్ణయం తీసుకుని ఓటు హక్కును పునరుద్ధరించారు. “ఒక పద్ధతి ప్రకారం ఓటు హక్కు లేకుండా చేశారనేదానికి” డేటా సంకేతమివ్వడం లేదని 2026 మేలో కోర్టు చెప్పింది.
సవరణపై పిటిషన్ల విచారణ ఇంకా కొనసాగుతోందని హెచ్ఆర్డబ్ల్యూ గుర్తు చేసింది. ఈ ప్రక్రియ హేతుబద్ధతను మే 27న సుప్రీంకోర్టు సమర్థించింది.
‘సర్’ అనేది పౌరసత్వ పరీక్ష కాదని మే నెలలో కోర్టు ఇచ్చిన వివరణను తన అక్టోబర్ నివేదికలో హెచ్ఆర్డబ్ల్యూ నొక్కి చెప్పింది.
చొరబాటుదారులను “గుర్తించి, తొలగించి, తిరిగి పంపించడానికి” ఇది దారి కల్పిస్తుందని పేర్కొంటూ హోం మంత్రి అమిత్ షా 2025 డిసెంబర్లో ఈ ప్రక్రియను సమర్థించారు.
జాబితా నుంచి తొలగించిన ప్రజలు ఆహార సబ్సిడీలతో పాటు కొన్ని సంక్షేమ పథకాలకు అర్హతను కోల్పోగలరని పశ్చిమ బెంగాల్, బిహార్లలో ఉన్న భారతీయ జనతా పార్టీ ప్రభుత్వాలు ప్రకటించాయని హెచ్ఆర్డబ్ల్యూ గుర్తు చేసింది.
40,000 మంది సిబ్బంది, మొబైల్ ఇంటర్నెట్ కట్: నిరసనలను ఎదుర్కొన్న తీరు
‘సర్’ను రద్దు చేయాలని, సీఈసీ రాజీనామా చేయాలని నిరసనకారులు డిమాండ్ చేసినప్పుడు రాకపోకలపై ఆంక్షలు విధించడం, మొబైల్ ఇంటర్నెట్ సేవల రద్దు, ఢిల్లీలో సుమారు 40 వేల మంది భద్రతా సిబ్బందిని మోహరించి ఏకపక్షంగా వేలాది మందిని నిర్బంధంలో ఉంచారని సంస్థ వివరించింది.
పోలీసులు మితిమీరిన బలాన్ని ఉపయోగించారు. విమర్శనాత్మకమైన ఆన్లైన్ కంటెంట్‌పై సెన్సార్షిప్ విధించి, నిరసనకారులను “జాతి వ్యతిరేకులుగా” చిత్రీకరించడానికి ప్రసార మాధ్యమాలను ప్రభుత్వం ఉపయోగించిందని నిందించింది.
జంతర్‌మంతర్ వద్ద అక్టోబర్ 2న వందలాది మందిని నిర్బంధించి సెంట్రల్ ఢిల్లీలో ఇంటర్నెట్ సేవలను నిలిపివేశారని ‘ది వైర్’ తెలియజేసింది.
అనుమతిని మంజూరు చేయలేదని గుర్తు చేస్తూ సుమారు 1,000 మందిని నిర్బంధించినట్లు ‘డెక్కన్ క్రానికల్’ సంఖ్యను వెల్లడించింది.
‘పీపుల్ ఎగైనెస్ట్ సర్’ సంకీర్ణం తమ ప్రచారాన్ని నవంబర్ 26వ తేదీ నుంచి తిరిగి ప్రారంభిస్తోంది.
2023 చట్టం.. 146 మంది ఎంపీల సస్పెన్షన్
ఎన్నికల కమిషనర్ల నియామకాలు, అధికారిక చర్యలు, ప్రకటనల కోసం వారికి విస్తృతమైన చట్టబద్ధ రక్షణలు కట్టబెడుతూ కార్యవర్గ నియంత్రణను సుస్థిరపరిచే చట్టాన్ని ప్రభుత్వం 2023 డిసెంబర్లో ఆమోదించింది.
ఆ మొత్తం సమావేశాలకు 100 మంది లోక్‌సభ, 46 మంది రాజ్యసభ సభ్యులను సస్పెండ్ చేసి ఆ చట్టాన్ని ఆమోదించిందని హెచ్ఆర్డబ్ల్యూ గుర్తు చేసింది.
పార్లమెంటును దాటవేసి: కమిటీలు, ఆర్థిక బిల్లులు, ఖాళీ పోస్టులు
లోక్‌సభలో పూర్తిస్థాయి మెజారిటీ ఉన్నప్పటికీ 2014 నుంచి 2024 మధ్య కాలంలో బీజేపీ పార్లమెంటరీ కమిటీలను పక్కదారి పట్టించింది.
“ఆర్థిక బిల్లులని” తప్పుగా వర్గీకరిస్తూ ప్రతిపక్షాలకు దక్కాల్సిన కీలక పోస్టులను సంవత్సరాల తరబడి ఖాళీగా ఉంచింది.
పీఆర్ఎస్ లెజిస్లేటివ్ రీసెర్చ్ గణాంకాల ప్రకారం 2014–19 మధ్య 28 శాతం, 2019–24 మధ్య 16 శాతం బిల్లులను మాత్రమే కమిటీలకు పంపగా, అంతకుముందు రెండు పర్యాయాల్లో 71 శాతం, 60 శాతం బిల్లులను కమిటీలకు పంపారు.
2024 వరకు బీజేపీకి మెజారిటీ లేని రాజ్యసభ ఆమోదం ఆర్థిక బిల్లులకు అవసరం లేదు. ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ (ఈడీ) అధికారాలను విస్తరించిన 2019 సవరణతో సహా హక్కులపై తీవ్ర ప్రభావం చూపే చట్టాలను ఆమోదించుకోవడానికి ప్రభుత్వం వీటిని వాడుకుందని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొంది.
ఇది “రాజ్యాంగ ప్రక్రియ దుర్వినియోగం” అని జస్టిస్ డివై చంద్రచూడ్ చేసిన వ్యాఖ్యను నివేదిక ఉటంకించింది.
మొదటి దశాబ్ద కాలంపై పౌర సమాజం చేసిన విశ్లేషణ ప్రకారం, మెజారిటీ బలంతో చట్టాలు చేయడానికి ప్రభుత్వం ఉద్దేశపూర్వకంగానే నిబంధనలను ఉల్లంఘించింది.
2019లో ప్రతిపక్షాల కమిటీ పరిశీలన డిమాండ్లను తోసిపుచ్చి యూఏపీఏ చట్టాన్ని కూడా సవరించింది.
ఈడీ, సీబీఐ, ఎన్ఐఏ: దర్యాప్తు ఏజెన్సీలను పావులుగా వాడుకుంటున్న వైనం
ఆర్థిక చట్టాలు, విదేశీ నిధుల నిబంధనల కింద మీడియా సంస్థలు, హక్కుల గ్రూపులను లక్ష్యంగా చేసుకుని తమ రాజకీయ అవసరాల కోసం సీబీఐ, ఈడీ, ఎన్ఐఏలను పావులుగా కేంద్ర ప్రభుత్వం ఉపయోగించుకుంటోంది.
2015 ఏప్రిల్ నుంచి 2025 ఫిబ్రవరి మధ్య రాజకీయ నాయకులపై ఈడీ 193 కేసులు నమోదు చేయగా, రెండింటిలో మాత్రమే శిక్షలు పడ్డాయని 2025 మార్చిలో కేంద్ర ఆర్థిక శాఖ పార్లమెంటుకు తెలిపింది.
అంతకుముందు దశాబ్దంలో విచారణ ఎదుర్కొన్న 26 మంది రాజకీయ నాయకులతో పోలిస్తే ఇది 600 శాతానికి పైగా పెరుగుదల అని, వీరిలో ఎక్కువ మంది ప్రభుత్వ వ్యతిరేకులేనని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొంది.
రాజకీయ పార్టీల ఆధారంగా ఈడీ కేసులను వేరు చేసి చూడదని మంత్రి చెప్పగా, పార్టీల వారీగా డేటాను నిర్వహించమని ఆర్థిక శాఖ తెలిపింది.
దర్యాప్తు ఎదుర్కొంటున్న కనీసం 23 మంది ప్రతిపక్ష నాయకులు బీజేపీలో చేరిన తర్వాత ఉపశమనం పొందారన్న కథనాలను కూడా హెచ్ఆర్డబ్ల్యూ ఉటంకించింది.
2019లో పార్టీ మారిన ఒక కాంగ్రెస్ శాసనసభ్యుడు ఎలాంటి విచారణలు లేకపోవడంతో తాను “హాయిగా నిద్రపోతున్నానని” చెప్పిన మాటలను ప్రస్తావించింది.
యూఏపీఏ: సాయిబాబా, స్టాన్ స్వామిలపై కేసులు
జైలు నుంచి విడుదలైన ఏడు మాసాల తర్వాత 2024 అక్టోబర్‌లో మరణించిన వీల్‌చైర్‌కే పరిమితమైన వికలాంగ కార్యకర్త జిఎన్ సాయిబాబాతో పాటు మానవ హక్కుల కార్యకర్తలకు వ్యతిరేకంగా చట్టవ్యతిరేక కార్యకలాపాల (నిరోధక) చట్టం (యూఏపీఏ)ను ఎన్ఐఏ వాడుతోంది.
2014 మేలో అరెస్టయిన ఆయనకు 2017లో జీవితఖైదు పడగా, 2022లో సుప్రీంకోర్టు గృహనిర్బంధానికి నిరాకరించింది. విశ్వసనీయమైన ఆధారాలు చూపడంలో రాష్ట్రం విఫలమైందంటూ 2024 మార్చిలో బాంబే హైకోర్టు ఆయనను నిర్దోషిగా విడుదల చేసింది.
ఈ కేసులో సహనిందితుడైన పాండు నరోటే 2022లో కస్టడీలో మరణించగా, భీమా కోరేగావ్ కేసులో 84 ఏళ్ల స్టాన్ స్వామి 2021లో కస్టడీలోనే ప్రాణాలు కోల్పోయారని నివేదిక పేర్కొంది.
కర్ణాటకపై ఎస్ఓఏఎస్ అధ్యయనాన్ని ఉటంకిస్తూ, యూఏపీఏ కింద నమోదైన ప్రతి 10 మందిలో దాదాపు 8 మందిపై బీజేపీ 10.5 ఏళ్ల పాలనలోనే కేసులు పెట్టారని, వారిలో 84 శాతానికి పైగా ముస్లింలే ఉన్నారని తెలిపింది.
విశ్వసనీయమైన ఆధారాలు లేకుండానే ముస్లింలను ఎన్ఐఏ లక్ష్యంగా చేసుకుందని పౌర సమాజ కార్యకర్తలు, న్యాయవాదులు ఆరోపిస్తున్నట్లు పేర్కొంది.
బాంబు కేసుల్లో భాగస్వాములైన హిందూ గ్రూపులు
ఎక్కువగా ముస్లింలే బాధితులుగా మారిన 2006 నుంచి 2008 మధ్యలో జరిగిన ఐదు బాంబు దాడుల కేసు దర్యాప్తును 2011లో ఎన్ఐఏ చేపట్టి, దాదాపు 30 మంది హిందువులపై కేసులను నమోదు చేయగా, 2025 నాటికి ముగ్గురు మినహా మిగతా నిందితులందరినీ నిర్దోషులుగా ప్రకటించారు.
బీజేపీ నేతృత్వంలోని ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత కేసు విషయంలో “మెతక వైఖరి” అవలంబించాలని ఎన్ఐఏ తనపై ఒత్తిడి తెచ్చిందని 2008 నాటి ఒక కేసులో పబ్లిక్ ప్రాసిక్యూటర్ ఆరోపించారు. అయితే ఆ ఆరోపణలను దర్యాప్తు సంస్థ తోసిపుచ్చింది.
కోరలు లేని నిఘా సంస్థలు: ఎన్హెచ్ఆర్సీ, సమాచార హక్కు చట్టం
సాయిబాబా పట్ల వ్యవహరించిన తీరుపై పౌర సమాజం చేసిన ఫిర్యాదులను జైలు నివేదికల ఆధారంగా జాతీయ మానవ హక్కుల కమిషన్ (ఎన్హెచ్ఆర్సీ) కొట్టివేసిందని, ఐక్యరాజ్యసమితి నిపుణులు మాత్రం ఆయన నిర్బంధాన్ని “సిగ్గుచేటు” అని అభివర్ణించారని హెచ్ఆర్డబ్ల్యూ తెలిపింది.
2025 మార్చిలో ఎన్హెచ్ఆర్సీ స్థాయిని ‘ఏ’ నుంచి ‘బీ’కి తగ్గించాలని జాతీయ మానవ హక్కుల సంస్థల అంతర్జాతీయ కూటమి సిఫార్సు చేసింది. ఈ కారణాలు “అసమర్థనీయమైనవి” అంటూ ఎన్హెచ్ఆర్సీ దీనిని సవాలు చేసింది.
పారదర్శకత విషయానికొస్తే, 2019లో సమాచార హక్కు చట్టానికి చేసిన సవరణ ద్వారా సమాచార కమిషనర్ల పదవీకాలం, వేతనాలు, సర్వీస్ నిబంధనలపై కేంద్రానికి పూర్తి నియంత్రణ లభించిందని హెచ్ఆర్డబ్ల్యూ పేర్కొంది.
విమర్శకులకు వ్యతిరేకంగా వాడుకునే ఆయుధాలుగా జాతీయ కమిషన్లు రాజీపడిపోయాయని జాతీయ మైనారిటీ కమిషన్ మాజీ చైర్మన్ ఒకరు వ్యాఖ్యానించారు.
జులైలో విద్యార్థుల నిరసనలు: కమిషన్ల మౌనం
పేపర్ లీక్ కారణంగా వైద్య ప్రవేశ పరీక్షలు రద్దయిన తర్వాత, వ్యంగ్య ఉద్యమంగా మొదలైన కాక్రోచ్ జనతా పార్టీ నేతృత్వంలో 2026 జులైలో నిరసనలు తెలిపిన విద్యార్థులు, ఇతరులపై భద్రతా దళాలు అతిగా బలాన్ని ఉపయోగించడంతో సుమారు 100 మందికి పైగా (ఎక్కువగా విద్యార్థులు) గాయపడ్డారు.
మహిళలు, యువతులపై పోలీసు అధికారులు లైంగిక దాడులకు, కొట్టడానికి పాల్పడినప్పటికీ, వారి వివరాలు ఆన్లైన్లో పెట్టి వేధింపులకు గురిచేసినప్పటికీ జాతీయ మహిళా కమిషన్, బాలల హక్కుల కమిషన్ ఎలాంటి చర్యలు తీసుకోలేదు.
నిరసనకారులకు ఆహారం, నీళ్లు పంచిన ఒక ముస్లిం వ్యక్తిని, ఆయన తండ్రిని పోలీసులు నిర్బంధించారని చెప్పినా మైనారిటీ కమిషన్ మౌనం వహించింది.
న్యాయవ్యవస్థ: బెయిల్ మంజూరులో జాప్యం
న్యాయవ్యవస్థ బెయిల్ మంజూరు విషయంలో తీవ్ర జాప్యం చేస్తోంది. అందుకు ఈ వ్యవస్థలో నియామకాలు, బదిలీలు, పదోన్నతుల్లో పెరుగుతున్న కార్యవర్గ జోక్యమే కారణమని ఇప్పటికే అనేక మంది ప్రస్తుత, మాజీ న్యాయమూర్తులు, న్యాయవాదులు తెలియజేశారు.
పౌర స్వేచ్ఛ విషయంలో కార్యవర్గం హద్దులు దాటి వెళ్లిందని, అయితే న్యాయవ్యవస్థ గట్టిగా నిలబడలేదని సుప్రీంకోర్టు మాజీ న్యాయమూర్తి జస్టిస్ మదన్ లోకూర్ అన్నారు.
యూఏపీఏ కింద 2020 నుంచి జైల్లో ఉన్న ఉమర్ ఖలీద్, షర్జీల్ ఇమామ్‌లకు జనవరి 5న సుప్రీంకోర్టు బెయిల్ నిరాకరించడాన్ని నివేదిక ఉటంకించింది. 53 మంది మరణానికి కారణమైన 2020 ఫిబ్రవరి అల్లర్ల వెనుక ఉన్న పెద్ద కుట్రలో వీరు భాగమని ఢిల్లీ పోలీసులు ఆరోపిస్తున్నారు.
జనవరి నాటి తీర్పు మునుపటి కీలక తీర్పులను విస్మరించిందని మే నెలలో మరో ధర్మాసనం పేర్కొంది. సెప్టెంబర్ 30న ఢిల్లీ హైకోర్టు వీరికి మళ్లీ బెయిల్ నిరాకరించింది.
నిరసనకు, ఉగ్రవాదానికి మధ్య ఉన్న గీతను ప్రభుత్వం చెరిపేసిందని 2021లో ఢిల్లీ హైకోర్టు చేసిన హెచ్చరికను కూడా హెచ్ఆర్డబ్ల్యూ గుర్తు చేసింది. బీజేపీ నేతలపై ఢిల్లీ పోలీసుల నిష్క్రియాపరత్వాన్ని ప్రశ్నించిన తర్వాత జస్టిస్ ఎస్ మురళీధర్ బదిలీని ప్రభుత్వం వేగవంతం చేయడాన్ని ప్రస్తావించింది.
జాతీయ భద్రతా చట్టం కింద ఆరు నెలల పాటు నిర్బంధంలో ఉన్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, విద్యావేత్త అలీ ఖాన్ మహమూదాబాద్లపై కేసులను 2026 మార్చిలో ప్రాసిక్యూటర్లు ఉపసంహరించుకున్నప్పటికీ కోర్టులు అధికారులను మందలించలేదని తెలిపింది.
న్యాయవ్యవస్థలో అవినీతిపై ఒక అధ్యాయం ఉన్న ఎన్సీఈఆర్టీ పాఠ్యపుస్తకాన్ని ఉపసంహరించుకోవాలని 2026 ఫిబ్రవరిలో సుప్రీంకోర్టు ఇచ్చిన ఆదేశాలను, ఆ తర్వాత ఆ అధ్యాయంతో సంబంధం ఉన్న ముగ్గురు విద్యావేత్తలను భవిష్యత్ పాఠ్యప్రణాళిక పనుల నుంచి నిషేధిస్తూ విధించిన ఆంక్షలను కోర్టు వెనక్కి తీసుకోవడాన్ని కూడా నివేదిక పేర్కొంది.
హెచ్ఆర్డబ్ల్యూ ఏం కోరుతోంది?
విమర్శకులకు వ్యతిరేకంగా రాజ్య సంస్థలను ఆయుధాలుగా ఉపయోగించుకోవడాన్ని వెంటనే నిలిపివేసి, పరిరక్షకులుగా వాటిని పునర్నిర్మించాలని, భారతదేశ మిత్రులు ఈ అంశాలను ఐక్యరాజ్యసమితి మానవ హక్కుల మండలితో పాటు వాణిజ్య, భద్రతా చర్చల్లో లేవనెత్తాలని హెచ్ఆర్డబ్ల్యూ వాదిస్తోంది. “భారత్ స్వతంత్ర సంస్థలను ప్రభుత్వం బోలుగా చేస్తోంది” అని హెచ్ఆర్డబ్ల్యూ ఆసియా డైరెక్టర్ ఇలైన్ పియర్సన్ అన్నారు.
“ప్రజాస్వామ్యానికి భారతదేశం తల్లి లాంటిది” అని పదే పదే చెబుతున్న మోదీ ప్రభుత్వం, ఇక్కడి మానవ హక్కుల పరిస్థితిపై విదేశీ సంస్థల అంచనాలను గతంలో తిరస్కరించింది. అమెరికా విదేశాంగ శాఖ మానవ హక్కుల నివేదికను “లోతైన పక్షపాతం” అంటూ భారత విదేశాంగ శాఖ ఒకసారి తోసిపుచ్చింది.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్
(ది వైర్లో ఎడిటోరియల్ ఇంటర్న్‌గా ఆలియా అక్బర్ శిక్షణ పొందుతున్నారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
