కార్మికుల పోరాటాలు, శ్రమ హక్కులు, న్యాయమైన వేతనాల కోసం సాగుతున్న సమరం, కార్మికులపై జరుగుతున్న దోపిడీకి వ్యతిరేక పోరాటం, ప్రైవేటీకరణను అడ్డుకునేందుకు చేపట్టాల్సిన కార్యాచరణ గురించి ఎఆర్ సింధు వివరిస్తున్నారు.
అంగన్వాడీ, ఆశా, మధ్యాహ్న భోజన పథకం కార్మికులు నాలుగు దశాబ్దాలుగా గుర్తింపు కోసం, గౌరవప్రదమైన వేతనాల కోసం, హక్కుల కోసం పోరాడుతూనే ఉన్నారు.
ప్రభుత్వ సంక్షేమ కార్యక్రమాలకు వెన్నెముకగా నిలుస్తున్న వీరిని మాత్రం కార్మికులుగా గుర్తించకుండా, కనీస వేతనాలు, సామాజిక భద్రతలాంటి హక్కులను నిరాకరిస్తున్నారు.
ఈ దోపిడీ వెనుక ఉన్న రాజకీయ, ఆర్థిక ప్రయోజనాలు ఏమిటి? ప్రైవేటీకరణ, కార్మిక హక్కులపై దాడులు వారి జీవితాలను ఎలా ప్రభావితం చేస్తున్నాయి? ఈ అంశాలపై సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్(సీఐటీయూ) జాతీయ కార్యదర్శి ఎఆర్ సింధు మాట్లాడుతున్నారు.
ఇంటర్వ్యూ, నేపథ్య రూపకల్పన: హర్లీన్ కౌర్, పరిశోధకురాలు, ట్రైకాంటినెంటల్: ఇన్స్టిట్యూట్ ఫర్ సోషల్ రీసెర్చ్.
స్వచ్ఛంద సేవ కాదు.. శ్రమకు తగిన హక్కులు
హర్లీన్ కౌర్: అంగన్వాడీ కార్మికులు 1980ల నుంచే తమ హక్కుల కోసం సంఘటితమవుతూ పోరాటాన్ని నిర్మిస్తున్నారు. ఇటీవలి కాలంలో మధ్యాహ్న భోజన పథకం, ఆశా కార్మికులు కూడా అదే బాటలో సంఘటితమై ఉద్యమాలను విస్తరిస్తున్నారు.
నాలుగు దశాబ్దాలుగా సాగుతున్న ఈ కార్మికుల పోరాటాన్ని మీరు ఎలా చూస్తారు? ప్రారంభ రోజుల్లో ప్రభుత్వం “స్వచ్ఛంద కార్యకర్తలు” అని పిలిచి, కార్మికులుగా గుర్తించడానికి నిరాకరించిన మహిళలను—“మనం స్వచ్ఛంద సేవ చేస్తున్నవాళ్లం కాదు, శ్రమను అందిస్తున్న కార్మికులం. అందుకు వేతనం, హక్కులు దక్కాలి” అనే అవగాహనకు ఎలా తీసుకురాగలిగారు?
ఎఆర్ సింధు: మేము పనిచేస్తున్న మూడు ప్రధాన పథకాలు—సమగ్ర శిశు అభివృద్ధి సేవలు(ఐసీడీఎస్), పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం, జాతీయ ఆరోగ్య మిషన్(ఎన్హెచ్ఎం) కింద ఆశా—అన్నీ ప్రజలకు ప్రభుత్వం అందించాల్సిన ప్రజా సేవలు. అంటే ఈ సేవలను అందించడం ప్రభుత్వ బాధ్యత. మొత్తం వ్యవస్థకు ప్రభుత్వం నేరుగా జవాబుదారీగా ఉండాలి.
కానీ పాత ప్రణాళికా విధానంలో ఈ పథకాలను తాత్కాలిక పథకాలుగా రూపొందించారు. ఐదేళ్ల ప్రణాళికలతో వాటిని ముడిపెట్టి, ప్రతి ఐదేళ్లకోసారి కొనసాగించాలా లేదా అన్నది సమీక్షించే విధానం ఉండేది.
ఇలా ప్రజలకు నిరంతరం అందించాల్సిన సేవలను తాత్కాలిక పథకాలుగా చూపించారు. ఆ తాత్కాలికతనే సాకుగా చేసుకుని, ఈ సేవలను అందించే మహిళా కార్మికుల ఉద్యోగాలను కూడా తాత్కాలికంగా మార్చారు.
ప్రభుత్వానికి ఇది ఒక పరిపాలనా సౌలభ్యం కావచ్చు. కానీ కార్మికుల విషయంలో దీని అర్థం— శాశ్వతమైన పనిని చేయిస్తూ, శాశ్వత కార్మిక హక్కులను నిరాకరించడం. ప్రభుత్వం స్వయంగా బాధ్యత వహించాల్సిన ప్రజా సేవలను మహిళల శ్రమపై ఆధారపడి నడిపిస్తూ, అదే మహిళలను మాత్రం “తాత్కాలికులు”, “స్వచ్ఛంద కార్యకర్తలు” అనే పేర్లతో కార్మిక హోదా, తగిన వేతనం, ఉద్యోగ భద్రత లాంటి హక్కులకు దూరంగా ఉంచింది.
తాత్కాలికత ముసుగులో కార్మికుల దోపిడీ
ఆ పథకం తాత్కాలికమైనదిగా ముద్ర వేసినట్టే, ఆ పనిని చేసే మహిళా కార్మికుల జీవితాలకు, ఉద్యోగాలకు తాత్కాలికతను అంటగట్టారు.
ప్రజలకు నిరంతరం అవసరమైన సేవలను ఈ మహిళలు సంవత్సరాల తరబడి అందిస్తున్నా వారి శ్రమను మాత్రం శాశ్వత ఉద్యోగంగా గుర్తించలేదు. పని శాశ్వతం—కానీ మహిళా కార్మికురాలు మాత్రం తాత్కాలికం. ఇదే ఈ వ్యవస్థలోని దోపిడీకి మూలం.
ఇది కేవలం ఉద్యోగ హోదాకు సంబంధించిన విషయం కాదు. మహిళల శ్రమను చౌకగా పొందేందుకు, వారికి కార్మికులుగా దక్కాల్సిన వేతనం, ఉద్యోగ భద్రత, సామాజిక భద్రత, ఇతర హక్కులను నిరాకరించేందుకు “తాత్కాలికత”ను ఒక సాధనంగా ఉపయోగించారు.
ముఖ్యంగా సంరక్షణ, ఆరోగ్యం, పోషణ లాంటి సామాజిక పునరుత్పత్తి పనులను మహిళల సహజ బాధ్యతగా చూసే పితృస్వామ్య దృక్పథం ఈ విధానానికి బలం చేకూర్చింది.
మరింత ఆసక్తికరమైన విషయం ఏమిటంటే 2014లో మోదీ ప్రభుత్వం ప్రణాళికా సంఘాన్ని రద్దు చేసి ప్రణాళికా– ప్రణాళికేతర వ్యయాల మధ్య ఉన్న విభజనను తొలగించిన తర్వాత కూడా మహిళా కార్మికుల తాత్కాలిక హోదా తొలగిపోలేదు.
పథకాలను కేవలం ఆర్థిక సంఘం కాలచక్రాలకు అనుసంధానించారు. అంటే పేరు మారింది కానీ పద్ధతి మాత్రం మారలేదు. తాత్కాలికతకు కొత్త రూపం ఇచ్చారు.
ప్రభుత్వానికి అవసరమైన ఈ సేవలు మాత్రం నిరంతరం కొనసాగుతూనే ఉన్నాయి. కానీ వాటిని మోస్తున్న మహిళా కార్మికులకు మాత్రం శాశ్వత హోదా, గౌరవప్రదమైన వేతనం, ఉద్యోగ భద్రత లాంటి హక్కులు దక్కకుండా అదే తాత్కాలికతను కొనసాగిస్తున్నారు.
మహిళల శ్రమ శాశ్వతం—వారి హక్కులు మాత్రం తాత్కాలికం అన్నట్టుగా ఈ వ్యవస్థ నడుస్తోంది.
ఐసీడీఎస్, మధ్యాహ్న భోజనం, ఆశా కార్మికుల ఆవిర్భావం
వీటిలో మొదటిది అత్యంత పురాతనమైన పథకం సమగ్ర శిశు అభివృద్ధి సేవలు. దీన్ని తొలుత దేశంలోని చాలా కొద్దిమంది కమ్యూనిటీ డెవలప్మెంట్ బ్లాకుల్లో ప్రయోగాత్మక పథకంగా ప్రారంభించారు.
అనంతరం 1990ల చివరి దశలో ఐసీడీఎస్‌ను దేశవ్యాప్తంగా సార్వత్రికంగా అమలు చేసే స్థాయికి విస్తరించారు. దాంతో దేశం నలుమూలలా అంగన్వాడీ కేంద్రాలు ఏర్పడి వాటిలో పనిచేసే అంగన్వాడీ కార్మికుల సంఖ్య భారీగా పెరిగింది.
ఆ తర్వాత ప్రజా సేవల పరిధి మరింత విస్తరించింది. పాఠశాలల్లో మధ్యాహ్న భోజన పథకం అమలులోకి రావడంతో ఆ పథకాన్ని అమలు చేసే కార్మికులు కూడా ఈ రంగంలోకి వచ్చారు. అనంతరం జాతీయ ఆరోగ్య మిషన్ కింద ఆశా కార్యకర్తల వ్యవస్థ ఏర్పడింది.
అంటే తొలుత ఐసీడీఎస్–అంగన్వాడీ కార్మికులు, ఆ తర్వాత మధ్యాహ్న భోజన కార్మికులు, అనంతరం ఆశా కార్యకర్తలు—ఇలా వరుసగా కొత్త పథకాలు, కొత్త కార్మిక వర్గాలు ఈ ప్రజా సేవల వ్యవస్థలో భాగమయ్యాయి.
ఈ విధంగా దేశవ్యాప్తంగా ప్రజలకు పోషణ, విద్య, ఆరోగ్య సేవలను అందించే విస్తృతమైన మహిళా కార్మిక శక్తి ఏర్పడింది.
గ్రామాల్లో పిల్లల సమగ్ర సంరక్షణ అందించే అంగన్వాడీ కార్మికులతోనే మా పని ప్రారంభమైంది. పిల్లల సంపూర్ణ అభివృద్ధికి అవసరమైన అన్ని అంశాలను సమగ్రంగా అందించే విధంగా రూపొందించిన ప్రపంచంలోని అత్యుత్తమ పథకాలలో ఐసీడీఎస్ ఒకటి. కానీ పిల్లల సంరక్షణ మొత్తం స్వచ్ఛంద సేవ అనే భావనతోనే ఈ పథకాన్ని రూపొందించారు.
పెట్టుబడిదారీ సమాజంలో కుటుంబం, పిల్లలు, వృద్ధుల సంరక్షణతో పాటు సమాజాన్ని కొనసాగించడానికి అవసరమైన సామాజిక పునరుత్పత్తి శ్రమను మహిళలు ఉచితంగా అందించాల్సిందే అన్నట్టుగా చూస్తారు.
మహిళలు జీతం లేకుండా ఇంట్లో చేసే శ్రమను ఒక రకంగా సమాజం భరించాల్సిన ఖర్చును తగ్గించే ఆధారంగా ఉపయోగించుకుంటారు. అదే భావనను ఈ పథకంలో కూడా చొప్పించారు.
అందుకే ఈ అత్యంత కీలకమైన సంరక్షణ పనిని చేసే మహిళలకు కార్మికులుగా గుర్తింపు ఇవ్వకుండా, “స్వచ్ఛంద కార్యకర్తలు” అనే పేరు పెట్టారు. వారు అందిస్తున్నది స్వచ్ఛంద సేవ కాదు—వారి శ్రమతోనే ప్రభుత్వ ప్రజా సేవా వ్యవస్థ నడుస్తోంది. కానీ ఆ శ్రమకు తగిన కార్మిక హోదా, వేతనం, హక్కులు ఇవ్వకుండా “స్వచ్ఛంద సేవ”గా పరిగణించడం ద్వారా మహిళల శ్రమను తక్కువగా విలువ కట్టే విధానం కొనసాగింది.
ఈ మహిళలను సంఘటితం చేయడంలో మా ముందున్న ప్రధాన సవాలు ఏమిటంటే వారు ఒకే పని ప్రదేశంలో సమూహంగా ఉండరు.
భారతదేశంలోని గ్రామాలు, పట్టణాలన్నింటిలో చెల్లాచెదురుగా పనిచేస్తున్నారు. అందువల్ల వారిని చేరుకోవడమే చాలా కష్టంగా ఉండేది.
నలభై ఏళ్ల క్రితం మారుమూల గ్రామాలకు వెళ్లాలంటే రవాణా సౌకర్యమే ఒక పెద్ద సమస్యగా ఉండేది.
అప్పట్లో కార్మికుల హక్కులపై అవగాహన కూడా చాలా తక్కువగా ఉండేది. ప్రారంభ రోజుల్లో ఈ మహిళలు కూడా తాము చేస్తున్న పనిని కుటుంబానికి వచ్చే కొంత అదనపు ఆదాయంగా భావించేవారు.
ప్రభుత్వం కూడా వారికి అదే విధంగా చెప్పింది. కానీ పని ప్రారంభించిన వెంటనే వారి అనుభవం వారికి వాస్తవాన్ని తెలియజేసింది.
ఇది స్వచ్ఛంద సేవ కాదని, తమపై మోపబడుతున్న శ్రమ అని వారికి అర్థమైంది. ప్రభుత్వం “స్వచ్ఛంద సేవ” అని చెప్పినా పని మాత్రం తప్పనిసరి. బాధ్యతలు నిరంతరం పెరుగుతూనే ఉంటాయి.
పని చేయకపోతే ప్రశ్నిస్తారు. అంటే పేరుకు స్వచ్ఛందం—ఆచరణలో మాత్రం బలవంతంగా చేయించుకునే శ్రమ. ఈ అనుభవమే వారిలో తమను తాము కార్మికులుగా గుర్తించుకునే అవగాహనకు, తమ హక్కుల కోసం సంఘటితమై పోరాడే చైతన్యానికి పునాది వేసింది.
అదనపు పనులతో పెరుగుతున్న శ్రమ దోపిడీ
మొత్తం వ్యవస్థలోనే సిబ్బంది కొరత ఉంది. అందుకే ప్రతి అదనపు పనినీ ఈ మహిళా కార్మికులపైనే మోపుతున్నారు. కానీ దానికి చెల్లిస్తున్న పారితోషికం ఆ మహిళ తన సొంత జీవనాన్ని కొనసాగించడానికి అయ్యే ఖర్చును కూడా భరించలేనంత తక్కువగా ఉంది.
తాము దోపిడీకి గురవుతున్నామని చెప్పడానికి అవసరమైన పదజాలం వారికి అప్పటికి తెలియకపోయినా ఆ దోపిడీని వారు తమ శరీరాలతో, తమ జీవితాలతో ప్రత్యక్షంగా అనుభవిస్తున్నారు. అదనపు పని, తక్కువ పారితోషికం, అంతులేని బాధ్యతలు— ఇవన్నీ వారి రోజువారీ అనుభవంలోనే దోపిడీని స్పష్టంగా చూపించాయి. కాబట్టి “మీరు దోపిడీకి గురవుతున్నారు” అని వారికి అర్థమయ్యేలా చేయడం అసలు కష్టమైన పని కాదు. ఎందుకంటే దోపిడీని వారు అప్పటికే తమ జీవితాల్లో అనుభవిస్తున్నారు.
అసలు కష్టమైనది ఒక్కటే— దేశంలోని మారుమూల ప్రాంతాల్లో చెల్లాచెదురుగా ఉన్న ఆ మహిళా కార్మికుల దగ్గరకు చేరుకోవడం, వారిని ఒకచోట సంఘటితం చేయడం.
ఇక్కడ దోపిడీ అంటే కేవలం తక్కువ వేతనం ఇవ్వడం కాదు. ప్రభుత్వానికి బాధ్యతగా ఉన్న ప్రజా సేవలను నిర్వహించేందుకు మహిళల శ్రమను వినియోగించుకుని ఆ శ్రమకు తగిన విలువను చెల్లించకుండా ఉండటమే ఈ దోపిడీకి కేంద్రబిందువు. పని మాత్రం శాశ్వతం.
బాధ్యతలు మాత్రం రోజురోజుకూ పెరుగుతాయి. కానీ కార్మిక హోదా లేదు, ఉద్యోగ భద్రత లేదు, తగిన వేతనం లేదు.
ఒక మహిళా కార్మికురాలికి చెల్లించే పారితోషికం ఆమె తన శ్రమశక్తిని పునరుత్పత్తి చేసుకునేందుకు—ఆహారం, బట్టలు, ఇల్లు, ఆరోగ్యం, ప్రయాణం లాంటి కనీస జీవన అవసరాలు తీర్చుకునేందుకు— కూడా సరిపోని స్థాయిలో ఉంటే ఆమె మాత్రం మరింత ఎక్కువ శ్రమను అందించాల్సి వస్తోంది. అంటే ఆమె శ్రమ నుంచి సమాజానికి, ప్రభుత్వ వ్యవస్థకు లభించే సేవ పెరుగుతున్న కొద్దీ ఆమెకు తిరిగి దక్కేది మాత్రం తక్కువగానే ఉంది.
దీనికి తోడు ఒక ముఖ్యమైన విషయం ఉంది. సిబ్బంది కొరతను భర్తీ చేయాల్సిన బాధ్యత ప్రభుత్వానిది. కానీ కొత్త సిబ్బందిని నియమించకుండా ఉన్న మహిళా కార్మికులపైనే అదనపు పనులను మోపుతున్నారు.
సర్వేలు, ఎన్నికల విధులు, వివిధ శాఖల కార్యక్రమాలు, ప్రత్యేక డ్రైవ్‌లు, కరోనా సమయంలో ఇంటింటి సేవలు— ఇలా ఒక ఉద్యోగానికి తీసుకున్న శ్రమశక్తిని అనేక పనులకు వినియోగిస్తున్నారు. అదనపు పనికి అదనపు వేతనం మాత్రం లేదు.
ఇప్పుడు డిజిటలీకరణతో ఈ దోపిడీకి మరో రూపం వచ్చింది. గతంలో ఫీల్డ్‌లో చేసిన పనికి ఇప్పుడు మొబైల్ యాప్‌లో నమోదు, ఫొటోలు, రియల్‌టైమ్ డేటా, ధృవీకరణ లాంటి అదనపు పనులు జత అవుతున్నాయి. అంటే సాంకేతికత పని భారాన్ని తగ్గించడానికి కాకుండా అదే కార్మికుడి నుంచి మరింత శ్రమను వెలికితీయడానికి ఉపయోగపడుతోంది.
ఉత్పాదకత పేరుతో బాధ్యతలు పెరుగుతున్నాయి. కానీ వేతనం మాత్రం సంవత్సరాల తరబడి అదే స్థాయిలో ఉంది.
ఇదే చోట ‘స్వచ్ఛంద కార్యకర్త’ అనే హోదా అసలు రాజకీయ అర్థం బయటపడుతుంది. పని ఉద్యోగంలా తీసుకోవాలి, బాధ్యత కూడా ఉద్యోగిలా ఉండాలి కానీ వేతనం, హక్కులు, భద్రత ఇవ్వాల్సినప్పుడు మాత్రం ‘స్వచ్ఛంద కార్యకర్త’ అని చెప్పాలి. అంటే కార్మికుడి నుంచి శ్రమను తీసుకోవాలి కానీ కార్మికుడిగా అతనికి లేదా ఆమెకు దక్కాల్సిన హక్కులను నిరాకరించాలి.
మహిళల విషయంలో ఈ దోపిడీకి మరో పొర ఉంది. పిల్లల సంరక్షణ, పోషణ, ఆరోగ్యం, కుటుంబ సంరక్షణ లాంటి పనులు సహజంగానే మహిళల బాధ్యత అన్న పితృస్వామ్య భావనను ఉపయోగించుకుని వారి శ్రమ విలువను తక్కువగా అంచనా వేస్తున్నారు.
‘సేవ’, ‘త్యాగం’, ‘స్వచ్ఛందం’ అనే పదాలతో మహిళల శ్రమను గొప్పగా చూపిస్తూ అదే సమయంలో ఆ శ్రమకు దక్కాల్సిన వేతనం, హక్కులను దోచుకోవడం జరుగుతోంది.
అందుకే ఈ కార్మికుల పోరాటం కేవలం వేతనం పెంచాలని చేసే డిమాండ్ కాదు. “మా శ్రమను గుర్తించాలి— మమ్మల్ని కార్మికులుగా గుర్తించాలి. మా శ్రమకు తగిన వేతనం ఇవ్వాలి. ప్రభుత్వ బాధ్యతలను మా ఉచిత శ్రమపై నడపకూడదు” అనే వర్గపోరాట డిమాండ్ అది.
ఉద్యమం విస్తరణ.. కార్మికుల పోరాట బలం
హర్లీన్ కౌర్: ఈ నాలుగు దశాబ్దాల కాలంలో ఈ ఉద్యమం క్రమంగా విస్తరిస్తూ మరింత బలపడుతూ వచ్చింది. ముఖ్యంగా గత దశాబ్దంలో అనేక తీవ్ర పోరాటాలు, ఉధృతమైన నిరసనలు చేపట్టింది.
ప్రస్తుతం ఉద్యమం ఉన్న ఈ దశను, దాని ప్రస్తుత బలాన్ని ఎలా అర్థం చేసుకోవాలి? ఇంత విస్తృతమైన, బలమైన ఉద్యమంగా ఇది ఎలా ఎదిగింది? నేడు ఈ ఉద్యమానికి ఉన్న బలం, పోరాట స్వభావం వెనుక ఉన్న పరిస్థితులు ఏమిటి?
ఎఆర్ సింధు: మేము ఈ ఉద్యమాన్ని ప్రారంభించినప్పుడు ఎదురైన అతిపెద్ద సవాలు ఏమిటంటే ఈ మహిళలకు తమ కార్మిక హక్కులపై అవగాహన చాలా తక్కువగా ఉండటం. అంతేకాదు సమాజం కూడా వారిని కార్మికులుగా చూడడంలేదు.
ముఖ్యంగా వామపక్ష ఉద్యమానికి మహిళలను కార్మికులుగా సంఘటితం చేయడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఒక మహిళ ఇంటి గడప దాటి బయటకు రావడం, యూనియన్ పోరాటంలో నిలబడటం, తన హక్కుల కోసం అధికారిని ప్రశ్నించడం, అవసరమైతే పోలీసులను కూడా ఎదుర్కొని నిలబడటం— మన సమాజంలో అది అంత చిన్న విషయం కాదు.
అదే సమయంలో మహిళలు మతపరమైన కార్యక్రమాల్లో పాల్గొనడం మాత్రం సమాజానికి ఆమోదయోగ్యమే. కానీ తన శ్రమకు విలువ అడిగే కార్మికురాలిగా, హక్కుల కోసం సంఘటితమై పోరాడే మహిళగా ఆమె బహిరంగ జీవితంలోకి రావడం మాత్రం అంత సులభంగా అంగీకరించబడదు.
అదనంగా సేవలు సరిగా అందకపోయినా, లేదా సేవల్లో ఏదైనా లోపం జరిగినా, ప్రజలు ఈ పథకాల్లో పనిచేసే మహిళా కార్మికులనే దోషులుగా చూస్తారు.
భోజనం సమయానికి రాకపోయినా, అంగన్వాడీ కేంద్రం మూసి ఉన్నా— ప్రజల కోపం చివరికి ఆమెపైనే పడుతుంది. ఎందుకంటే మొత్తం వ్యవస్థలో అందరికంటే చివరగా ప్రజలకు కనిపించేది ఆ మహిళా కార్మికురాలే. ప్రభుత్వ వ్యవస్థలోని ఆ పొడవైన గొలుసులో చివరి వ్యక్తి, ప్రజలకు కనిపించే ముఖం ఆమెదే.
నిధులు, సిబ్బంది, మౌలిక సదుపాయాలు, ప్రభుత్వ విధానాలు— ఇలాంటి పైస్థాయి కారణాలతో సేవల్లో లోపాలు ఏర్పడినా, వాటి బాధ్యత మాత్రం ఈ మహిళా కార్మికులపైనే నెట్టబడుతుంది.
ప్రభుత్వ వ్యవస్థలోని లోపాలకు బలయ్యేది కూడా ఆమెనే. ప్రజల ఆగ్రహానికి గురయ్యేది కూడా ఆమెనే.
దాంతో ఈ కార్మికులను కూడా ప్రభుత్వ యంత్రాంగంలో అవినీతికి పాల్పడే మరో భాగంగా, మరో ‘అవినీతి చక్రం’గా ప్రజలు చూడటం మొదలుపెట్టారు. అంటే ప్రభుత్వ వ్యవస్థలో తమకు ఎలాంటి నిర్ణయాధికారం లేని మహిళా కార్మికురాలినే ఆ వ్యవస్థకు ప్రతినిధిగా భావించి వ్యవస్థ వైఫల్యాలకు ఆమెనే బాధ్యురాలిగా నిలబెట్టారు.
కార్మికురాలి పట్ల మారిన సామాజిక దృక్పథం
రెండు అంశాలు ఈ పరిస్థితిని మార్చడంలో కీలక పాత్ర పోషించాయి.
మొదటిది—మేము కేవలం కార్మికుల సమస్యల చుట్టూనే సంఘటితమవడానికి నిరాకరించాం. ఈ పథకాలు ఎవరి కోసం అమలు చేయబడుతున్నాయో అంటే ప్రభుత్వం ‘లబ్ధిదారులు’ అని పిలిచే ప్రజలతో కలిసి మేము ఎప్పుడూ పనిచేశాం. అయితే మేము వారిని కేవలం ‘లబ్ధిదారులు’గా కాకుండా ‘హక్కుదారులు’గా పిలుస్తాం.
ఎందుకంటే ఈ మొత్తం సమస్య కేవలం ఈ పథకాల్లో పనిచేస్తున్న మహిళా కార్మికుల వేతనాలకు మాత్రమే సంబంధించినది కాదు.
ప్రతి పౌరుడికీ సంరక్షణ, పోషణ, ఆరోగ్యం, విద్య లాంటి ప్రజా సేవలను ప్రభుత్వం అందించాల్సిన బాధ్యత ఉంది. కాబట్టి ఈ మహిళా కార్మికుల వేతనాలు, ఉద్యోగ హక్కుల కోసం చేసే పోరాటం ఒకవైపు ఉంటే మరోవైపు ప్రతి పౌరుడికీ నాణ్యమైన ప్రజా సేవలు అందే హక్కు కోసం చేసే పోరాటం కూడా అదే ఉద్యమంలో భాగం.
అందుకే మా పోరాటం కార్మికుల హక్కులకే పరిమితం కాదు. ప్రజల హక్కుల కోసం కూడా జరిగే పోరాటం. కార్మికుడికి న్యాయమైన వేతనం కావాలి— ప్రజలకు నాణ్యమైన ప్రజా సేవలు కావాలి. ఈ రెండింటినీ విడదీయకుండా కలిపే దృక్పథమే ఈ ఉద్యమాన్ని బలపరిచింది.
మేము మా డిమాండ్లను కేవలం మహిళా కార్మికుల వేతనాలు, ఉద్యోగ హక్కులకే పరిమితం చేయకుండా విస్తరించాం. పిల్లల పోషణ, గర్భిణీ స్త్రీల సంరక్షణ, తల్లుల ఆరోగ్యంలాంటి సమస్యలను కూడా మా పోరాటంలో భాగం చేశాం. దీంతో సమాజం ఈ కార్మికురాలిని సమస్యకు కారణంగా చూడటం క్రమంగా మానేసింది.
తమ పిల్లల పోషణ, గర్భిణీల సంరక్షణ, తల్లుల ఆరోగ్యం లాంటి తమ సొంత సమస్యల కోసం పోరాడుతున్న మహిళగా ఆమెను ప్రజలు చూడటం ప్రారంభించారు. ఆమె ప్రజల సమస్యలో భాగమైన వ్యక్తి మాత్రమే కాదు—ప్రజల సమస్యల కోసం పోరాడుతున్న వ్యక్తిగా ఆమె పట్ల అవగాహన మారింది.
ఈ మార్పు చాలా కీలకమైనది. గతంలో ప్రభుత్వ వ్యవస్థలోని మరో అవినీతి భాగంగా కనిపించిన ఈ మహిళా కార్మికురాలు ఇప్పుడు అదే వ్యవస్థలో అట్టడుగు స్థాయిలో ఉండి ఆ వ్యవస్థ చేత దోపిడీకి గురవుతున్న కార్మికురాలిగా ప్రజలకు కనిపించింది. ప్రజల దృష్టిలో ఆమెపై ఉన్న భావన పూర్తిగా తలకిందులైంది. ‘ప్రభుత్వ యంత్రాంగంలోని అవినీతి చక్రంలో మరో భాగం’ అన్న స్థానం నుంచి ‘అదే ప్రభుత్వ వ్యవస్థలో అట్టడుగున పనిచేస్తూ, దోపిడీకి గురవుతున్న మహిళా కార్మికురాలు’ అన్న అవగాహనకు మారింది.
ఇప్పుడు సమాజంలో ఈ మహిళా కార్మికులను సంఘటితమైన, పోరాడే శక్తిగా గుర్తిస్తున్నారు. తమకు కార్మికులుగా ఉన్న హక్కులు ఏమిటో, పౌరులుగా ప్రజలకు ఉన్న హక్కులు ఏమిటో వారికి తెలుసు.
అంతేకాదు ఆ హక్కులను ఎలా సాధించుకోవాలో, వాటి కోసం ఎలా పోరాడాలో కూడా వారికి తెలుసు. ఈ మార్పు వల్లే కొన్నిసార్లు న్యాయస్థానాలు కూడా మా మాట వినడం ప్రారంభించాయని నేను భావిస్తున్నాను. తమ హక్కుల గురించి తెలుసుకుని వాటి కోసం సంఘటితంగా పోరాడే శక్తిగా ఈ మహిళలు ఎదగడం వల్లనే వారి గొంతు సమాజంలోనే కాదు, న్యాయస్థానాల్లో కూడా వినిపించగలిగింది.
రెండో కారణం గ్రామీణ ప్రాంతాల్లో పెరిగిన సంక్షోభం, దేశవ్యాప్తంగా తీవ్రంగా ఉన్న నిరుద్యోగం.
నిరుద్యోగం పెరగడం, గ్రామీణ ప్రాంతాల్లో ప్రజల జీవనాధారాలు కుప్పకూలిపోవడం వల్ల ఈ పథకాల్లో పనిచేసే మహిళలకు లభించే అతి తక్కువ పారితోషికమే అనేక కుటుంబాల్లో ఉన్న ఏకైక నగదు ఆదాయంగా మారింది.
అందువల్ల అది ఇక ప్రభుత్వం ఒకప్పుడు చెప్పినట్టుగా “కుటుంబానికి వచ్చే కొద్దిపాటి అదనపు ఆదాయం” కాదు. ఇప్పుడు ఆ డబ్బుపైనే కుటుంబం తిండి, జీవనం ఆధారపడి ఉంది. దీంతో ఈ మహిళా కార్మికురాలు ఒంటరిగా పోరాటంలోకి రావడం లేదు. ఆమెతో పాటు ఆమె కుటుంబం కూడా పోరాటంలోకి వస్తోంది. ఎందుకంటే ఆమెకు లభించే ఆ కొద్దిపాటి పారితోషికం కూడా ఇప్పుడు కుటుంబ జీవనాధారంలో ఒక ముఖ్యమైన భాగంగా మారిపోయింది.
ఇప్పుడు జరుగుతున్న పోరాటాల్లో ఆ మహిళ వెనుక కేవలం ఆమె కుటుంబం మాత్రమే కాదు— మొత్తం సమాజమే నిలబడటం కనిపిస్తోంది. ఎందుకంటే ఆమె చేస్తున్న పోరాటం కేవలం తన హక్కుల కోసం మాత్రమే కాదు. ఆ కుటుంబం బతకడం కోసం చేస్తున్న పోరాటం కూడా. ఆమెకు వచ్చే ఆదాయం కుటుంబ జీవనాధారంగా మారిపోయింది కాబట్టి, ఆమె పోరాటం కుటుంబం మొత్తానికి సంబంధించినదిగా మారింది.
ఇప్పుడు రెండు డిగ్రీలు చదివిన మహిళలు కూడా అంగన్వాడీ హెల్పర్లుగా పనిచేస్తున్న పరిస్థితిని చూస్తున్నాం. వారికి వేరే ఉపాధి అవకాశాలు లేకపోవడం ఒక కారణం. కనీసం ఈ పని అయినా కొంత స్థిరమైన ఆదాయాన్ని ఇస్తుంది.
భవిష్యత్తులో పారితోషికం పెరుగుతుందన్న చిన్న ఆశ కూడా ఉంటుంది. అందుకే ఉన్నత విద్య చదివిన మహిళలు కూడా ఈ పనిని చేయాల్సిన పరిస్థితి ఏర్పడుతోంది.
మధ్యాహ్న భోజన పథకంలో పనిచేసే కార్మికురాలి పరిస్థితిని చూడండి. నెలకు కేవలం వెయ్యి రూపాయలు మాత్రమే పారితోషికం. అదీ నెలనెలా సకాలంలో అందదు—కొన్ని నెలలు ఆలస్యంగా వస్తుంది. మధ్యలో ఎవరో ఒకరు తమ వాటా తీసుకున్న తర్వాతే ఆ డబ్బు కార్మికురాలి చేతికి చేరే పరిస్థితులు కూడా ఉన్నాయి.
అందువల్ల ఈ పోరాటం కేవలం వేతనం కోసం చేసే పోరాటంగా చూడలేం. కుటుంబం ఎలా బతకాలి, పిల్లలను ఎలా చదివించాలి, రోజువారీ జీవితం ఎలా కొనసాగాలి అన్న ప్రశ్నలతో ముడిపడిన జీవన పోరాటంగా ఇది మారింది. ఆమె తన పనంతా పూర్తి చేస్తోంది.
చివరికి పాఠశాలలో మిగిలిపోయిన ఆహారాన్ని ఇంటికి తీసుకెళ్లగలిగితే అదే ఆమెకు ఒక ఆధారంగా మారుతోంది. మనం సంఘటితం చేస్తున్న మహిళల జీవితాల్లో నెలకొన్న ఆర్థిక సంక్షోభం ఎంత తీవ్రమైందో ఇది తెలియజేస్తోంది.
అయితే ఇప్పుడు వారి ఆత్మగౌరవం, హక్కుల కోసం నిలబడే ధైర్యం కేవలం పని ప్రదేశానికే పరిమితం కావడం లేదు. అది మొత్తం సమాజంలోకి విస్తరిస్తోంది.
ఉత్తర భారతదేశంలో ఒకప్పుడు మహిళ ముసుగు వెనుకే ఉండాలని ఆశించే సామాజిక పరిస్థితులు ఉండేవి. అలాంటి ప్రాంతాల్లోనే ఇప్పుడు అంగన్వాడీ మహిళలు దీపావళి లాంటి ప్రధాన పండుగ రోజున కూడా నిరాహార దీక్షలో కూర్చోవడం చూశాం.
భర్త కోసం వివాహిత మహిళలు ఉపవాసం ఉండే కర్వా చౌత్ రోజున కూడా ఈ మహిళలు పోలీసులను ఎదుర్కొంటూ పోరాటంలో నిలబడటం చూశాం.
ఈ మహిళలు ఇప్పుడు తమ శ్రమకు విలువ లేదనే భావనను పూర్తిగా తిరస్కరిస్తున్నారు. తాము ‘సేవ’ చేయడం లేదని, తమ శ్రమను అందిస్తున్న కార్మికులమని స్పష్టంగా చెబుతున్నారు.
తమ శ్రమతో ప్రభుత్వ ప్రజా సేవలు నడుస్తున్నప్పుడు ఆ శ్రమకు తగిన వేతనం కూడా తమ హక్కేనని వారు నిలదీస్తున్నారు.
అందుకే ఇప్పుడు ఈ ఉద్యమంలో అత్యంత కఠినమైన పోరాటం వేతనం కోసమే. ప్రభుత్వం దాన్ని ఎంతకాలమైనా ‘పారితోషికం’ అని పిలవొచ్చు. కానీ ఈ మహిళలు ఇక తమ శ్రమను చౌకగా లెక్కగట్టడాన్ని అంగీకరించడం లేదు.
పని ఉద్యోగంలా తీసుకుని బాధ్యతలు కార్మికులపై మోపి, వేతనం మాత్రం ‘పారితోషికం’గా ఎందుకు? శ్రమ తీసుకుంటే వేతనం చెల్లించాలి. కార్మికుడి శ్రమకు దానం కాదు— హక్కుగా వేతనం కావాలి. ఇదే ఇప్పుడు వారి పోరాటానికి ప్రధానమైన ప్రశ్న.
అనువాదం: కే మనోహర రాజు
ఈ ఇంటర్వ్యూ మూడు భాగాలుగా ప్రచురితం అవుతుంది. ఇది మొదటి భాగం.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
