మనీలాండరింగ్ ఆరోపణలు ఎదుర్కొంటున్న వారికి కూడా తమ అభిప్రాయాలను వెల్లడించే హక్కు ఉందని పేర్కొంటూ సుప్రీంకోర్టు ఈడీని మందలించింది.
నిందితుడి వాదన వినకుండానే ఒక నేరాన్ని పరిగణనలోకి తీసుకున్న పీఎంఎల్ఏ(మనీలాండరింగ్ నిరోధక చట్టం) కోర్టు ఉత్తర్వును సుప్రీంకోర్టు తన తీర్పులో రద్దు చేసింది.
రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి నిష్పక్షపాత విచారణ పొందే ప్రాథమిక హక్కు ఉందని, దీనిని విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
న్యూఢిల్లీ: మనీలాండరింగ్ నిరోధక(పీఎంఎల్ఏ) కేసుకు సంబంధించిన ఒక కీలకమైన తీర్పులో, రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం ప్రతి పౌరుడికి నిష్పక్షపాత విచారణ పొందే ప్రాథమిక హక్కు ఉందని, దీనిని విస్మరించలేమని సుప్రీంకోర్టు స్పష్టం చేసింది.
ఇటువంటి ఏ కేసునైనా విచారణకు స్వీకరించే ముందు, నిందితుల వాదనలను కోర్టు తప్పనిసరిగా వినాలని కూడా కోర్టు పేర్కొంది.
ఈడీ వాదనను తిరస్కరించిన ధర్మాసనం..
టైమ్స్ ఆఫ్ ఇండియా కథనం ప్రకారం, పీఎంఎల్ఏ ఒక స్వతంత్ర చట్టం కాబట్టి, దాని కింద జరిగే విచారణలకు భారత పౌర రక్షణ సంహిత (బీఎన్ఎస్ఎస్) నిబంధనలు వర్తించవని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్(ఈడీ) చేసిన వాదనను జస్టిస్ ఎంఎం సుందరేశ్, జస్టిస్ ఎన్కే సింగ్లతో కూడిన ధర్మాసనం కూడా తిరస్కరించింది.
ఈ విషయంలో, “బీఎన్ఎస్ఎస్లోని 16వ అధ్యాయం ఒక మేజిస్ట్రేట్ ముందు ఫిర్యాదులకు సంబంధించిన విధానపరమైన చట్టాన్ని నిర్దేశించినప్పటికీ, పై నిబంధన అత్యంత కీలకమైనదని మేము భావిస్తున్నాము. ఎందుకంటే ఇది విచారణలు నిర్వహించాల్సిన విధానాన్ని నిర్ధారించడమే కాకుండా, విచారణకు స్వీకరించే ముందు నిందితుడికి తన వాదనను వినిపించే హక్కును కూడా కల్పిస్తుంది. ఈ హక్కు రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం నిందితుడికి ఉన్న నిష్పక్షపాత విచారణ హక్కులో భాగం” అని న్యాయస్థానం పేర్కొంది.
సాధారణ ప్రక్రియను విస్మరించలేం..
విచారణ సందర్భంగా, ప్రత్యేక పీఎంఎల్ఏ కోర్టును బీఎన్ఎస్ఎస్ కింద నిర్దేశించిన సాధారణ నేర విచారణా ప్రక్రియను అనుసరించమని బలవంతం చేయలేమని అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్వీ రాజు వాదించగా, కోర్టు కఠిన వైఖరిని తీసుకుని, నిందితుడికి నిష్పక్షపాత విచారణ కల్పించే ఏ చట్టాన్ని కూడా విస్మరించలేమని పేర్కొంది.
అంతేకాకుండా “సీఆర్పిసీలోని 200 నుంచి 205 సెక్షన్ల (ప్రస్తుతం బీఎన్ఎస్ఎస్లోని 223 నుంచి 228 సెక్షన్లు) కింద ఫిర్యాదుకు సంబంధించిన నిబంధనలను పీఎంఎల్ఏ కింద జరిగే విచారణలకు వర్తింపజేయకపోవడం— ముఖ్యంగా నిందితుడి హక్కులపైనా, కోర్టు అధికారాలపైనా తీవ్రమైన ప్రభావం చూపే నిబంధనలను వర్తింపజేయకపోవడం—చాలా ప్రతికూల పరిణామాలకు దారితీయవచ్చు”అని కోర్టు చెప్పుకొచ్చింది.
పీఎంఎల్ఏ కోర్టు ఉత్తర్వుల రద్దు..
నిందితుడి వాదన వినకుండానే నేరాన్ని పరిగణనలోకి తీసుకున్న పీఎంఎల్ఏ కోర్టు ఉత్తర్వును కూడా ధర్మాసనం రద్దు చేసింది.
నిందితుడికి తన వాదన వినిపించేందుకు అవకాశం కల్పించాలని సుప్రీంకోర్టు పీఎంఎల్ఏ కోర్టును ఆదేశించింది.
రాజ్యాంగంలోని 21వ అధికరణ ప్రకారం న్యాయమైన విచారణ పొందే హక్కు ప్రతి పౌరుడి ప్రాథమిక హక్కు అని ధర్మాసనం తన తీర్పులో పేర్కొంది.
నిందితుడి వాదన వినకుండా న్యాయస్థానం ఒక కేసును విచారణకు స్వీకరిస్తే, ఆ న్యాయ ప్రక్రియ మొదటి నుంచే చెల్లదు.
రాజకీయ ఆరోపణల నేపథ్యంలో తీర్పుకు ప్రాధాన్యం..
ఈడీ చర్యలు, అరెస్టులపై తరచుగా ప్రశ్నలు తలెత్తుతున్నాయనేది గమనించాల్సిన విషయం.
ప్రతిపక్ష నాయకులకు వ్యతిరేకంగా ప్రభుత్వం ఈ కేంద్ర సంస్థను ఒక ఆయుధంగా వాడుకుంటోందనే ఆరోపణలు కూడా ఉన్నాయి.
అందువల్ల, కోర్టు నిర్ణయం అత్యంత ముఖ్యమైనదిగా పరిగణించబడుతోంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
