రష్యన్ సాయుధ దళాల్లో చేరడానికి మార్గంగా ఎంచుకుని భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడంపై ప్రభుత్వం మొదటిసారిగా బహిరంగంగా సలహా ఇచ్చింది.
న్యూఢిల్లీ: రష్యన్ సాయుధ దళాల్లో చేరడానికి భారత పౌరసత్వాన్ని వదులుకుని రష్యన్ పాస్‌పోర్టులు పొందడం వెనక ఉన్న ప్రమాదాలపై భారతీయులను విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ సెప్టెంబర్ 30న హెచ్చరించింది.
తాత్కాలిక ద్రవ్య ప్రయోజనాలకు ఆశపడి కొందరు పౌరులు ఈ అడుగు వేశారని పేర్కొంది.
రష్యా పర్యటనకు వెళ్తున్న భారతీయులకు తాజా సూచనలు చేస్తూ, భారతీయ పౌరసత్వాన్ని వదులుకోవడానికి భారత అధికారులను అనేక మంది వ్యక్తులు సంప్రదిస్తున్న సంఘటనలు తమ దృష్టికి వచ్చాయని, ఇలా భారత పౌరసత్వాన్ని వదులుకుని రష్యన్ సాయుధ దళాల్లో చేరడానికి తమకు తాము రష్యన్ పాస్‌పోర్టును పొందుతున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
తాత్కాలిక ఆశలు.. ప్రాణాపాయం
తాత్కాలిక డబ్బు ఆశకులోనై భారత అధికారులను సంప్రదించకుండానే ఇప్పటికే కొంత మంది ఈ పని చేశారని మంత్రిత్వ శాఖ తెలియజేస్తూ, అలాంటి వ్యక్తులు తమను తాము ఎలాంటి మృత్యు ప్రమాదానికి గురిచేసుకుంటున్నారో అర్థం చేసుకోవాలని హెచ్చరించింది.
ఇలాంటి చర్యలకు పాల్పడకుండా భారత జాతీయులు సంయమనం పాటించాలని ప్రభుత్వం సూచించింది.
రష్యన్ సాయుధ దళాల్లో చేరడానికి మార్గంగా ఎంచుకుని భారతీయులు పౌరసత్వాన్ని వదులుకోవడంపై ప్రభుత్వం తొలిసారిగా బహిరంగంగా స్పందించి సూచనలు చేయడం ఇదే మొదటిసారి.
ముందుగా ఆశపడి.. ఆపై సాయం కోసం
రష్యన్ సాయుధ దళాల్లో చేరేందుకు ఇష్టపూర్వకంగా ఆఫర్లను వెతుక్కుంటున్న అనేక మంది భారతీయులు తారసపడ్డారని, ముందుగా డబ్బు లాభాన్ని స్వీకరించి ఆ తర్వాత విడుదలను కోరుతూ భారత ప్రభుత్వాన్ని ఆశ్రయించవచ్చని వారు భావిస్తున్నారని విదేశీ వ్యవహారాల శాఖ వెల్లడించింది.
ఇది ప్రమాదకరమైన మార్గమని, దీనిని ప్రభుత్వం తీవ్రంగా నిరుత్సాహపరుస్తుందని పునరుద్ఘాటించింది.
ఏజెంట్ల పట్ల అప్రమత్తత
ప్రైవేటు, స్వచ్ఛంద సంస్థల నియామకాలకు వ్యతిరేకంగా ప్రత్యేకంగా హెచ్చరిస్తూ, స్వచ్ఛంద సంస్థలతో పాటు ప్రభుత్వేతర సంస్థలు విదేశీ జాతీయులను రష్యన్ సాయుధ దళాల్లో భర్తీ చేస్తున్నాయని స్పష్టం చేసింది.
విదేశీ వ్యవహారాల మంత్రిత్వ శాఖ వద్ద నమోదు చేసుకోని ఇలాంటి ఏజెంట్ల నుంచి వచ్చే ఉద్యోగ ఆఫర్లను అంగీకరించడానికి ముందు అన్ని వివరాలపై తగిన జాగ్రత్తలు వహించాలని భారత జాతీయులకు సలహా ఇచ్చింది.
భారతీయుల భద్రతకు ప్రాధాన్యం
రష్యన్ సాయుధ దళాల్లో విధులు నిర్వర్తిస్తున్న భారత జాతీయులందరి భద్రత, బాగోగులు, త్వరగా విడుదల చేసే అంశంపై రష్యాతో భారత్ సంప్రదింపులు జరుపుతోందని మంత్రిత్వ శాఖ తెలియపరిచింది.
యుక్రెయిన్‌తో యుద్ధం మొదలైనప్పటి నుంచి రష్యన్ సాయుధ దళాల్లో 227 మంది భారత జాతీయులను నియమించారు. వారిలో 51 మంది సంఘర్షణలో చనిపోగా, 139 మందిని విధుల్లో నుంచి విముక్తులను చేసినట్లు గత నెలలో విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిస్రీ తెలిపారు.
జెలెన్స్కీ విజ్ఞప్తి
గత వారం ఐక్యరాజ్యసమితి సాధారణ సభలో యుక్రెయిన్ అధ్యక్షుడు వొలొదిమిర్ జెలెన్స్కీ మాట్లాడుతూ, యుక్రెయిన్‌కు వ్యతిరేకంగా సాగిస్తున్న యుద్ధంలో రష్యా 47 దేశాలకు చెందిన పౌరులను ఉపయోగిస్తోందని, ఆ దేశాలలో భారత్ కూడా ఒకటని తెలిపారు.
ఈ సంఘర్షణలో తమ పౌరులు పాలుపంచుకోకుండా నిరోధించాలని సంబంధిత ప్రభుత్వాలకు ఆయన విజ్ఞప్తి చేశారు. కొందరు మోసపూరిత వలల ద్వారా యుద్ధ భూమిలోకి లాగబడి మరణిస్తున్నారని ఆరోపించారు.
అనువాదం: గంట రాజు, సీనియర్ జర్నలిస్ట్.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
