భారతదేశ చరిత్రలో అక్టోబర్ 2 అత్యంత విశిష్టమైన తేదీ. ఈ రోజు భారత స్వాతంత్య్రోద్యమాన్ని ప్రపంచ చరిత్రలో కొత్త మార్గంలో నడిపించిన మహాత్మా గాంధీ జయంతి.
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొని, స్వతంత్ర భారతదేశానికి రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు నిర్వహించిన లాల్ బహదూర్ శాస్త్రి ఇదే రోజు జన్మించారు. అంతేకాదు, గాంధీజీ జన్మదినమైన అక్టోబర్ 2ను ఐక్యరాజ్యసమితి అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా ప్రకటించింది.
అక్టోబర్ 2 కేవలం ఇద్దరు భారతీయ నాయకుల జయంతి మాత్రమే కాదు. సత్యం, అహింస, ప్రజా ఉద్యమం, స్వాతంత్ర్యం, సామాజిక బాధ్యత, రైతు, సైనికుల గౌరవం, శాంతి, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం వంటి అనేక విలువలకు ప్రాధాన్యత నిచ్చిన తేదీ అక్టోబర్ 2.
గాంధీ అహింసను ఒక రాజకీయ పోరాట పద్ధతిగా, నైతిక జీవన విధానంగా పరిగణించారు. శాస్త్రి ఆలోచనల్లో ప్రధానంగా సరళత, బాధ్యత, దేశ సేవ, రైతు, సైనికుల ప్రాధాన్యత కనిపిస్తాయి.
ఐక్యరాజ్యసమితి మాత్రం అహింసను శాంతి, సహనం, అవగాహన, మానవ హక్కులు, ప్రజాస్వామ్యం, అభివృద్ధితో కలిపి చూడాలని, ఆచరణలో పెట్టాలని తీర్మానించింది.
మహాత్మా గాంధీ ప్రస్థానం
మోహన్‌దాస్ కరంచంద్ గాంధీ 1869 అక్టోబర్ 2న గుజరాత్‌లోని పోర్బందర్లో జన్మించారు.
1888లో న్యాయశాస్త్రం చదవడానికి లండన్ వెళ్లి, అనంతరం దక్షిణాఫ్రికాకు న్యాయవాదిగా వెళ్లారు. అక్కడ భారతీయులు ఎదుర్కొన్న జాతి వివక్ష, అవమానం, అన్యాయాలను ప్రత్యక్షంగా అనుభవించారు.
దక్షిణాఫ్రికాలో ఎదురైన అనుభవాలు ఆయన రాజకీయ ఆలోచనలను మలిచాయి. ముఖ్యంగా అన్యాయాన్ని ఎదుర్కోవడానికి సత్యం, అహింస, సత్యాగ్రహంతో సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని నిర్ణయించుకున్నారు.
1893లో పీటర్ మారిట్జ్ బర్గ్ రైల్వే స్టేషన్లో ఫస్ట్ క్లాస్ టికెట్ ఉన్నప్పటికీ జాతి వివక్ష కారణంగా రైలు నుంచి బయటకు తోసివేయబడిన సంఘటన ఆయన జీవితంలో ఒక కీలక మలుపుగా నిలిచింది.
స్వాతంత్య్ర సమరంలో కీలకంగా..
1915లో భారతదేశానికి తిరిగి వచ్చిన తరువాత గాంధీజీ స్వాతంత్య్రోద్యమంలో కీలక నాయకుడిగా ఎదిగారు. ఆయన రాజకీయ ప్రయాణం కేవలం బ్రిటిష్ పాలనను తొలగించడానికే పరిమితం కాలేదు.
సామాజిక సంస్కరణ, అంటరానితనం నిర్మూలన, గ్రామీణాభివృద్ధి, స్వదేశీ, ఖాదీ, మత సామరస్యం వంటి అంశాలను స్వాతంత్ర్య పోరాటంలో భాగంగా చూశారు.
1920–21లో గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమానికి పిలుపునిచ్చారు. బ్రిటిష్ పాలనకు భారతీయుల సహకరించకుండా చేస్తే ఆ పాలన బలహీన పడుతుందనే ఆలోచన దాని వెనుక ఉంది. 1922లో చౌరీచౌరా ఘటనలో హింస చోటుచేసుకున్నప్పుడు గాంధీజీ సహాయ నిరాకరణ ఉద్యమాన్ని అర్ధాంతరంగా నిలిపివేశారు.
ఉద్యమ లక్ష్యం ఎంత ముఖ్యమైనదైనా, హింస అందుకు మార్గం కాదనేది ఆయన సిద్ధాంతం. అందుకే ఒక చెంప మీద ఎవరైనా కొడితే రెండవ చెంప చూపించాలని ఆయన చెప్పారు.
నిజమైన స్వాతంత్య్రం
అదే సందర్భంలో స్వాతంత్ర్యం అంటే విదేశీ పాలకులు వెళ్లిపోవడం మాత్రమే కాదని గాంధీ భావించారు. సామాన్య ప్రజల గౌరవం, గ్రామ స్వరాజ్యం, అంటరానితనం రద్దు, మత సామరస్యం, మహిళల స్వేచ్ఛ, భద్రత కోసం ఆయన కృషి చేశారు.
మహిళలు అర్ధరాత్రి స్వేచ్ఛగా తిరగగలిగిన రోజే నిజమైన స్వాతంత్ర్యం అని ఆయన చెప్పారు. మత సామరస్యం కాపాడటానికే 1947 ఆగస్ట్ 15 స్వాతంత్ర్య దినోత్సవం రోజు ఆయన కలకత్తాలో ఉన్నారు. అందుకే మతోన్మాదులు 1948 జనవరి 30న ఆయనను కిరాతకంగా హత్య చేశారు.
నిరుద్యోగం, రైతులకు గిట్టుబాటు ధరలు లేక దివాళా తీయడంతో గ్రామాలు నేడు బోసిపోతున్నాయి. మహిళలు అర్ధ రాత్రి కాదు పట్ట పగలు నడిరోడ్డు మీద అత్యాచారాలకు గురవుతున్నారు. అంటరానితనం, కుల వివక్ష నేటికీ స్వైర విహారం చేస్తున్నది.
లాల్ బహదూర్ శాస్త్రి స్ఫూర్తి
లాల్ బహదూర్ శాస్త్రి 1904 అక్టోబర్ 2న ఉత్తరప్రదేశ్‌లోని మొఘల్ సరాయ్లో జన్మించారు. చిన్నతనంలోనే తండ్రిని కోల్పోయి, ఆర్థిక ఇబ్బందుల మధ్య పెరిగారు. విద్యాభ్యాస కాలంలోనే జాతీయోద్యమం వైపు ఆకర్షితులయ్యారు.
1920లో ప్రారంభమైన సహాయ నిరాకరణ ఉద్యమం శాస్త్రిపై తీవ్ర ప్రభావం చూపింది. అప్పటికి ఆయన వయసు కేవలం 16 సంవత్సరాలు. చదువును వదిలి జాతీయోద్యమంలో పాల్గొనాలని నిర్ణయించుకున్నారు.
తరువాత వారణాసిలోని కాశీ విద్యాపీఠంలో చదువుకున్నారు. అక్కడ పొందిన “శాస్త్రి” పట్టం తరువాత ఆయన పేరులో శాశ్వతంగా భాగమైంది.
స్వాతంత్య్రోద్యమంలో పాల్గొన్నందుకు ఆయన పలుమార్లు జైలుకు వెళ్లారు. బ్రిటిష్ పాలనలో ఆయన మొత్తం సుమారు ఏడు సంవత్సరాలు జైలు జీవితం గడిపారు.
సరళత, స్వీయ నియంత్రణ, ప్రజా సేవ, బాధ్యత, త్యాగం వంటి విలువలను శాస్త్రి తన జీవితంలో పాటించారు.
పరిపాలనలో కీలక బాధ్యతలు
ఆయన వివాహ సమయంలో కూడా కట్నం విషయంలో ప్రత్యేకమైన వైఖరి ప్రదర్శించారు. చరఖా, చేతితో నేసిన వస్త్రం మాత్రమే కట్నంగా స్వీకరించారు.
1947 తరువాత శాస్త్రి స్వతంత్ర భారతదేశ పరిపాలనలో కీలక బాధ్యతలు చేపట్టారు.
ఉత్తరప్రదేశ్‌లో పార్లమెంటరీ కార్యదర్శిగా ప్రారంభించి, తరువాత రాష్ట్ర హోం మంత్రిగా పనిచేశారు. కేంద్రంలో రైల్వే, రవాణా తదితర శాఖల్లో మంత్రిగా బాధ్యతలు నిర్వహించారు.
1964 జూన్ 9న భారత రెండవ ప్రధానమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. ఆయన 1964 జూన్ నుంచి 1966 జనవరి వరకు ప్రధానమంత్రిగా ఉన్నారు. ఇది భారతదేశానికి అత్యంత క్లిష్టమైన కాలం.
దేశం ఒక వైపు ఆహార కొరతను ఎదుర్కొంటుండగా, మరో వైపు 1965లో పాకిస్తాన్‌తో యుద్ధం వచ్చింది.
జై జవాన్ – జై కిసాన్
ఈ సమయంలో ఆయన “జై జవాన్ – జై కిసాన్” ఉద్యమానికి శ్రీకారం చుట్టారు. ఇది కేవలం ఒక నినాదం కాదు. దేశ భద్రతకు సైనికుడు ఎంత అవసరమో, దేశ ఆహార భద్రతకు రైతు అంతే అవసరమనే విధానం. 1960లలో ఆహార ఉత్పత్తి సమస్య తీవ్రంగా ఉండేది.
వ్యవసాయ ఉత్పత్తిని పెంచడం, రైతుకు ప్రాధాన్యత ఇవ్వడం ఆయన ప్రభుత్వ విధానాలలో ముఖ్యమైన అంశాలు. నేడు సన్న, చిన్నకారు రైతులను దివాళా తీయించి స్వదేశీ, విదేశీ కార్పొరేట్ సంస్థలకు ధారాదత్తం చేసే చర్యలు చేపడుతున్నారు. 3 రైతు చట్టాలు అందులో భాగమే.
750 మంది రైతులు ప్రాణ త్యాగం తర్వాత వాటిని ప్రభుత్వం వెనక్కి తీసుకుంది. కానీ నేటికీ స్వామినాథన్ సిఫారసులకు అనుగుణంగా కనీస మద్దతు ధర నిర్ణయించడానికి ప్రభుత్వం నిరాకరిస్తున్నది.
ప్రపంచ అహింసా దినోత్సవం
గాంధీజీ అహింసా సిద్ధాంతానికి ప్రపంచ స్థాయిలో లభించిన ముఖ్యమైన గుర్తింపులలో ఒకటి అంతర్జాతీయ అహింసా దినోత్సవం.
ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ తీర్మానాన్ని 2007 జూన్ 15న ఆమోదించి, అక్టోబర్ 2ను ప్రతి సంవత్సరం అంతర్జాతీయ అహింసా దినోత్సవంగా పాటించాలని నిర్ణయించింది.
ఈ తీర్మానాన్ని 2007లో నాటి విదేశాంగ శాఖ సహాయ మంత్రి ప్రతిపాదించగా ఏకగ్రీవంగా ఆమోదించబడింది.
విద్య, ప్రజా అవగాహన ద్వారా అహింసను లేకుండా చేయడం ప్రపంచ అహింసా దినోత్సవం ఉద్దేశం. ఐక్యరాజ్యసమితి తీర్మానం అహింసను శాంతి, సహనం, మానవ హక్కులు, ప్రాథమిక స్వేచ్ఛలు, ప్రజాస్వామ్యం, అభివృద్ధి, పరస్పర అవగాహన, వైవిధ్యానికి గౌరవం వంటి అంశాలతో కలిపి చూడాలని చెబుతున్నది. ఇది చాలా ముఖ్యమైన విషయం.
ప్రపంచ అహింసా దినోత్సవం అంటే కేవలం “హింస చేయకండి” అనే సూక్తులు చెప్పడం కాదు. అహింసా సంస్కృతి న్యాయం, మానవ గౌరవం, హక్కులు, ప్రజాస్వామ్యం, పరస్పర గౌరవంతో కూడిన సామాజిక వ్యవస్థ అనే విస్తృత భావనను ప్రాతిపదిక.
అన్యాయాన్ని వ్యతిరేకించడమే అసలైన అహింస
మార్టిన్ లూథర్ కింగ్ జూనియర్ నేతృత్వంలోని అమెరికా పౌరహక్కుల ఉద్యమం, నెల్సన్ మండేలా, దక్షిణాఫ్రికా విముక్తి అహింసకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు.
భారతదేశం ఐక్యరాజ్యసమితిలో ప్రవేశపెట్టిన అంతర్జాతీయ అహింసా దినోత్సవ తీర్మానానికి 140 దేశాలు కో-స్పాన్సర్స్ గా ఉన్నాయి. అహింస అంటే అన్యాయం జరుగుతున్నా చూస్తూ మౌనం వహించడం కాదు.
హింసకు దూరంగా ఉండటం. అన్యాయాన్ని వ్యతిరేకించడం. న్యాయం కోసం ప్రజాస్వామ్య, శాంతియుత, నైతిక మార్గాల్లో పోరాడటం. ఈ మూడింటి సమన్వయమే అహింసను ఆచరించడం.
నేటి సమాజానికి అహింస అత్యవసరం
ప్రపంచం శాస్త్ర, సాంకేతిక రంగాల్లో అపూర్వమైన పురోగతి సాధించింది. కానీ అదే సమయంలో యుద్ధాలు, మత, జాతి ఘర్షణలు, ద్వేష ప్రసంగాలు, వివక్ష, తీవ్ర అసమానతలు, రాజకీయ హింస వంటి సమస్యలు తీవ్రమవుతున్నాయి. ద్వేష ప్రసంగం హింస, అసహనం, వివక్షలను పెంచుతుందని ఐక్యరాజ్యసమితి పేర్కొంటున్నది.
అహింసను కేవలం శారీరక హింసకు వ్యతిరేకతగా కాకుండా ద్వేషం, వివక్ష, అసహనం, మానవ హక్కుల ఉల్లంఘనలను పూర్తిగా నిర్మూలించే విధంగా చేయాలని ఐక్యరాజ్యసమితి చర్చలు తెలియజేస్తున్నాయి. కానీ నేడు స్వయంగా ప్రధాన మంత్రి నుండి కింది దాకా అధికార పార్టీ, స్వయం సేవక్ సంఘ్ నేతలు రెచ్చగొడుతున్నారు.
2007లో ఐక్యరాజ్యసమితిలో తీర్మానం పెట్టిన దేశంలోనే నేటి పాలకులు దానికి విరుద్ధంగా వ్యవహరిస్తున్నారు.
నేడు దాదాపు లాల్ బహదూర్ శాస్త్రిని మర్చిపోతున్నారు. అక్టోబర్ 2న హంగామా, ఆర్భాటాలతో గాంధీ విగ్రహాలకు పూలమాలలు వేసి చేతులు దులుపుకుంటున్నారు.
దొంగే దొంగ-దొంగ అని అరచిన చందంగా హింసను ప్రేరేపించే వారు, మత ఉన్మాదం రెచ్చగొట్టే వారు ప్రజాస్వామ్య బద్ధంగా ప్రశ్నించిన వారిని అర్బన్ నక్సల్స్, దిమాగి నక్సల్స్ అనే పేర్లతో తీవ్ర నిర్బంధాన్ని ప్రయోగిస్తున్నారు. చిత్రహింసలకు గురి చేస్తున్నారు.
అందువల్ల అక్టోబర్ 2ను గాంధీ, లాల్ బహదూర్ శాస్త్రిల జయంతి, అంతర్జాతీయ అహింసా దినోత్సవం జరుపుకోవడం అంటే ఆచరణలో వాటిని అమలు చేయడానికి శపథం తీసుకోవడంగా చూడాలి. అన్యాయం ఏ రూపంలో ఉన్నా వ్యతిరేకించాలి. ప్రజా సంక్షేమమే దేశ నిర్మాణానికి కీలకం. హింస ఏ స్థాయిలో జరిగినా దానికి వ్యతిరేకంగా నిలబడాలి. ఇదే అక్టోబర్ 2 ప్రాధాన్యత.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
