మనిషి జీవితంలో బాల్యం, యవ్వనం, మధ్య వయస్సు, వృద్ధాప్యం సహజమైన దశలు. అయితే సమాజం తరచుగా వృద్ధాప్యాన్ని ఒక ‘బలహీన దశ’గా మాత్రమే చూస్తుంది.
ఐక్యరాజ్యసమితి అక్టోబర్ 1ను అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించడం వెనుక ఉన్న ప్రధాన భావన మాత్రం వేరు.
వృద్ధులు కేవలం సంరక్షణ పొందాల్సిన వ్యక్తులు కాదు. వారు కుటుంబాలకు, సమాజానికి, ఆర్థిక వ్యవస్థకు, సంస్కృతికి, జ్ఞానానికి అందించిన, అందిస్తున్న కృషికి గుర్తింపు, గౌరవం, హక్కులు, సామాజిక భాగస్వామ్యం పొందవలసిన వ్యక్తులు.
ఈ దినోత్సవం ఎలా ప్రారంభమైంది?
వృద్ధాప్య సమస్యలను అంతర్జాతీయ స్థాయిలో చర్చించడానికి ఐక్యరాజ్యసమితి 1982లో వియన్నాలో వరల్డ్ అసెంబ్లీ ఆన్ ఏజింగ్ నిర్వహించింది. దాని ఫలితంగా వియన్నా ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ రూపొందించబడింది. తదుపరి 14 డిసెంబర్ 1990న ఐక్యరాజ్యసమితి సాధారణ సభ తీర్మానం 45/106 అక్టోబర్ 1ను అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవంగా ప్రకటించింది.
మొదటిసారిగా ఈ దినోత్సవాన్ని 1991లో పాటించారు. 1991లో ఐక్యరాజ్యసమితి సర్వప్రతినిధి సభ వృద్ధుల కోసం ప్రత్యేక సూత్రాలతో తీర్మానం 46/91 ఆమోదించింది.
స్వతంత్రత, సామాజిక భాగస్వామ్యం, సంరక్షణ, స్వీయ సంతృప్తి లేదా సామర్థ్య వికాసం, గౌరవం అనే 5 ప్రధాన అంశాల ఆధారంగా దీన్ని రూపొందించారు.
వృద్ధులకు తగిన ఆహారం, నీరు, నివాసం, దుస్తులు, ఆరోగ్య సంరక్షణ లభించాలి.
అంతేకాదు, వారి సామర్థ్యం, ఇష్టానికి అనుగుణంగా పని చేయడానికి లేదా ఆదాయాన్ని పొందడానికి అవకాశాలు ఉండాలని ఐక్యరాజ్యసమితి సూత్రాలు చెబుతున్నాయి. వారు ఎప్పుడు ఉద్యోగ విరమణ చేయాలి, ఏ వేగంతో పని నుంచి తప్పుకోవాలి అనే నిర్ణయంలో కూడా వారి అభిప్రాయానికే ప్రాధాన్యత ఇవ్వాలి.
సామాజిక భాగస్వామ్యం
వృద్ధులను సమాజం నుంచి వేరుచేయకూడదు. వారి అనుభవం, జ్ఞానం, నైపుణ్యాలు యువతకు ఉపయోగపడేలా తరాల మధ్య సంబంధాలను బలోపేతం చేయాలి. వృద్ధులు స్వచ్ఛంద సేవా కార్యక్రమాల్లో పాల్గొనే అవకాశం పొందాలి.
తమ ప్రయోజనాలకు సంబంధించిన విధానాల రూపకల్పనలో కూడా వారికి భాగస్వామ్యం ఉండాలని ఐక్యరాజ్యసమితి సూత్రాలు పేర్కొంటున్నాయి.
వృద్ధులకు కుటుంబం, సమాజం నుంచి అవసరమైన సంరక్షణ లభించాలి. ముఖ్యంగా వైద్యం ఒక హక్కు. సామాజిక భద్రత ఒక అవసరం. గౌరవం ఒక హక్కు. ఆరోగ్య సేవలు కేవలం వ్యాధి వచ్చినప్పుడు చికిత్స చేయడానికే పరిమితం కాకుండా, వృద్ధుల శారీరక, మానసిక, భావోద్వేగ శ్రేయస్సును కాపాడే విధంగా ఉండాలి. ఐక్యరాజ్యసమితి సూత్రాలు వృద్ధులకు సామాజిక, న్యాయ సేవలు కూడా అందుబాటులో ఉండాలని చెబుతున్నాయి.
స్వీయ సంతృప్తి
వయస్సు పెరిగిందని ఒక వ్యక్తి తన జీవిత లక్ష్యాలను వదులుకోవాల్సిన అవసరం లేదు. విద్య, సాంస్కృతిక కార్యక్రమాలు, ఆధ్యాత్మిక కార్యకలాపాలు, వినోదం, కొత్త విషయాలు నేర్చుకోవడం వంటి అవకాశాలు వృద్ధులకు కూడా ఉండాలి. వృద్ధాప్యం జీవితానికి ముగింపు కాదు, జీవితంలోని మరో దశ.
ఐక్యరాజ్యసమితి సూత్రాలలో అత్యంత ముఖ్యమైన అంశాలలో ఒకటి గౌరవం. వృద్ధులు దోపిడీ, శారీరక లేదా మానసిక వేధింపులకు గురి కాకుండా సురక్షితంగా, గౌరవంగా జీవించాలి. వారి సంపాదన తగ్గిందని వారిని చిన్న చూపు చూడకూడదు.
వృద్ధులను వారి సంపాదనతో నిమిత్తం లేకుండా గౌరవించాలని ఐక్యరాజ్యసమితి సూత్రాలు పేర్కొంటున్నాయి.
పెరుగుతున్న వృద్ధుల జనాభా
వైద్య విజ్ఞానం, పోషణ, పారిశుధ్యం, జీవన ప్రమాణాలు మెరుగు పడటంతో ప్రపంచవ్యాప్తంగా సగటు ఆయుర్దాయం పెరిగింది.
ఐక్యరాజ్యసమితి ప్రకారం 65 సంవత్సరాలు లేదా అంతకంటే ఎక్కువ వయస్సు ఉన్న ప్రపంచ జనాభా 1980లో సుమారు 26 కోట్ల నుంచి 2021లో 76 కోట్లకు పెరిగింది.
2021–2050 మధ్య ప్రపంచ జనాభాలో 65 ఏళ్లు పైబడిన వారి వాటా 10 నుంచి సుమారు 17 శాతానికి పెరుగుతుందని ఐక్యరాజ్యసమితి అంచనా.
వృద్ధాప్యం వ్యక్తిగత లేదా కుటుంబ సమస్య ఎంతమాత్రం కాదు. అది ఆరోగ్యం, పెన్షన్, ఉపాధి, గృహవసతి, రవాణా, సామాజిక భద్రత, పట్టణ ప్రణాళిక, కుటుంబ నిర్మాణం వంటి అనేక విధాలుగా ఒక సామాజిక సమస్య.
వృద్ధుల సమస్య అంటే కేవలం ఆరోగ్య సమస్య కాదు
వృద్ధాప్యం అంటే తరచుగా అనారోగ్య సమస్యగా చూడటం పరిపాటి. ఇది పొరపాటు వైఖరి. వృద్ధుల జీవన నాణ్యతను ప్రభావితం చేసే అంశాలు అనేకమున్నాయి. పెన్షన్ లేదా స్థిరమైన ఆదాయం, ఆరోగ్య సేవల అందుబాటు, మందుల ధరలు, నివాస భద్రత, ప్రజా రవాణా, ఒంటరితనం, కుటుంబ సంబంధాలు, సామాజిక భాగస్వామ్యం, డిజిటల్ సేవల అందుబాటు, న్యాయ రక్షణ, వృద్ధులపై హింస, దుర్వినియోగం నివారణ, గౌరవప్రదమైన జీవితం లాంటివన్నీ ఇందులో ఇమిడి ఉన్నాయి. అందువల్ల ‘వృద్ధుల సంరక్షణ’ను ‘వృద్ధుల హక్కులు’ అనే విశాల దృక్పథంతో చూడాలి.
భారతదేశానికి దీని ప్రాధాన్యత
భారతదేశంలో కూడా వృద్ధుల సంఖ్య పెరుగుతోంది. సంప్రదాయంగా భారతీయ కుటుంబ వ్యవస్థలో వృద్ధులకు గౌరవప్రదమైన స్థానం ఉండేది.
అయితే పట్టణీకరణ, వలసలు, చిన్న కుటుంబాలు, ఉద్యోగాల కోసం కుటుంబ సభ్యులు దూర ప్రాంతాలకు వెళ్లడం వంటి సామాజిక మార్పులు వృద్ధుల జీవితాలపై ప్రభావం చూపుతున్నాయి. దీంతో కొన్ని కుటుంబాల్లో వృద్ధులు ఒంటరితనం, ఆర్థికంగా ఇతరులపై ఆధారపడటం, సంరక్షణ సమస్యలను ఎదుర్కొంటున్నారు. అందుకే వృద్ధుల సంక్షేమాన్ని కేవలం కుటుంబ బాధ్యతగా కాకుండా సామాజిక బాధ్యతగా, ప్రజా విధాన అంశంగా చూడటం అవసరం.
వృద్ధులు సమాజానికి భారమా?
కేవలం సంపాదనే ప్రధానంగా చూడకూడదు. వృద్ధులు పిల్లల పెంపకంలో కుటుంబాలకు సహాయం చేయవచ్చు. తమ అనుభవాన్ని యువతతో పంచుకోవచ్చు. సామాజిక సేవ చేయవచ్చు.
స్వచ్ఛంద సంస్థల్లో పనిచేయవచ్చు. కళలు, సాహిత్యం, సంస్కృతిని భావి తరాలకు అందించవచ్చు. వృత్తి పరమైన అనుభవాన్ని పంచుకోవచ్చు. కుటుంబ చరిత్ర, స్థానిక చరిత్ర, సామాజిక జ్ఞానాన్ని కాపాడవచ్చు. ఐక్యరాజ్యసమితి సూత్రాలు కూడా వృద్ధులు సమాజంలో చురుకుగా పాల్గొనడానికి, తమ జ్ఞానం, నైపుణ్యాలను యువతతో పంచుకోవడానికి అవకాశాలు కల్పించాలని సూచిస్తున్నాయి.
‘జీవితానికి సంవత్సరాలు కాదు’ — ‘సంవత్సరాలకు జీవితం’
వృద్ధుల దినోత్సవానికి సంబంధించిన ఐక్యరాజ్యసమితి సూత్రాలలో ఒక ముఖ్యమైన భావన, పెరిగిన జీవితకాలానికి అదనంగా ఉత్సాహాన్ని జోడించడం. అంటే మనిషి జీవితకాలం పెరగడం మాత్రమే కాదు. పెరిగిన సంవత్సరాలు ఆరోగ్యం, స్వేచ్ఛ, గౌరవం, భద్రత, సామాజిక భాగస్వామ్యంతో కూడుకొని ఉండాలి.
దీని కోసం ప్రభుత్వాలతో పాటు కుటుంబం, సమాజం, స్థానిక సంస్థలు, ఆరోగ్య వ్యవస్థ, స్వచ్ఛంద సంస్థలు, కార్మిక సంస్థలు, పౌర సమాజం అన్నీ కలిసి పనిచేయాలి.
వృద్ధులు నిన్నటి సమాజాన్ని నిర్మించారు. నేటి యువకులు రేపు వృద్ధులు అవుతారు. అందువల్ల వృద్ధుల హక్కులను కాపాడటం అనేది కేవలం వారికి మాత్రమే సంబంధించిన విషయం కాదు. మనం నిర్మించే సమాజం మనం వృద్ధులయ్యే సమయానికి మనకు లభించే సమాజమే.
అందుకే వృద్ధుల కోసం మంచి ఆరోగ్య వ్యవస్థ, సామాజిక భద్రత, గౌరవప్రదమైన పెన్షన్, అందుబాటులో ఉన్న రవాణా, సురక్షితమైన నివాసం, సామాజిక భాగస్వామ్యం వంటి అంశాల కోసం పనిచేయడం భవిష్యత్ తరాల కోసం కూడా పెట్టుబడి.
2002 మాడ్రిడ్ అంతర్జాతీయ కార్యాచరణ ప్రణాళిక
రెండవ వరల్డ్ అసెంబ్లీ ఆన్ ఏజింగ్ 2002లో జరిగింది. అందులో మాడ్రిడ్ ఇంటర్నేషనల్ ప్లాన్ ఆఫ్ యాక్షన్ ఆన్ ఏజింగ్ ఆమోదించబడింది. 21వ శతాబ్దంలో వృద్ధాప్యంతో వచ్చే అవకాశాలు, సవాళ్లను ఎదుర్కొనేందుకు ఇది ఒక ప్రధాన అంతర్జాతీయ విధాన చట్రంగా మారింది. వృద్ధాప్యాన్ని సమాజ అభివృద్ధిలో భాగంగా చూడటం దీని ప్రధాన ఉద్దేశం.
ఐక్యరాజ్యసమితి ఆధ్వర్యంలోని ఆరోగ్యకరమైన వృద్ధాప్య దశాబ్దం 2021–2030 కార్యక్రమం కూడా వృద్ధుల జీవన నాణ్యతను మెరుగుపరచడంపై దృష్టి పెట్టింది.
ప్రభుత్వాలు, పౌర సమాజం, అంతర్జాతీయ సంస్థలు, వైద్య నిపుణులు, విద్యాసంస్థలు, మీడియా, ప్రైవేట్ రంగం కలిసి పనిచేయాల్సిన అవసరాన్ని ఈ కార్యక్రమం నొక్కి చెబుతున్నది.
అంతర్జాతీయ వృద్ధుల దినోత్సవం అంటే కేవలం ఆ రోజు వృద్ధులను సన్మానించి వదిలివేసే కార్యక్రమం కాకూడదు. వృద్ధులకు గౌరవప్రదమైన జీవితం ఉందా? వారికి ఆరోగ్య సేవలు సక్రమంగా అందుతున్నాయా? వారికి ఆర్థిక భద్రత ఉందా? వారు ఒంటరిగా మిగిలిపోకుండా సామాజిక జీవనంలో భాగస్వాములు అవుతున్నారా? వారి అనుభవం, జ్ఞానం యువతకు అందుతున్నదా? వృద్ధులపై హింస, నిర్లక్ష్యం, దోపిడీని అరికట్టడానికి తగిన వ్యవస్థలున్నాయా? అనేవి నిరంతరం పరీక్షించుకోవాలి.
వృద్ధాప్యం బలహీనత కాదు. వృద్ధులు భారం కాదు. వయస్సు పెరగడం గౌరవం కోల్పోవడానికి కారణం కాదు. ఒక మనిషి జీవితమంతా సమాజానికి అందించిన కృషిని గుర్తించి, వృద్ధాప్యంలో గౌరవం, ఆరోగ్యం, భద్రత, స్వేచ్ఛగా గడపగలిగే సమాజాన్ని నిర్మించడం మన అందరి బాధ్యత. ఐక్యరాజ్యసమితి 1991లో స్వీకరించిన 18 సూత్రాల సారాంశం కూడా ఇదే విషయాన్ని చెబుతున్నది.
భారతదేశంలో వాస్తవ పరిస్థితులు – పరిష్కార మార్గాలు
అంతర్జాతీయ వేదికలు ఏమి చెప్పినా, ప్రపంచంలోని ఇతర దేశాలలో పరిస్థితి ఎలా ఉన్నా భారతదేశంలో మాత్రం వృద్ధాప్యం ఒక శాపంగా మారింది.
ప్రభుత్వమే ఇలా వ్యవహరించడం అత్యంత దుర్మార్గం. ఉద్యోగుల కనీస పెన్షన్ ముష్టి వెయ్యి రూపాయలు పుష్కర కాలంగా పెంచలేదు. ఇది అత్యంత కిరాతకం. ఇది రాజ్యాంగం కల్పించిన జీవించే హక్కును హరించడం తప్ప మరొకటి కాదు.
సరళీకృత ఆర్ధిక విధానాల పుణ్యమా అని ప్రతిదీ సరుకుగా మారింది. కన్న తల్లిదండ్రులను కూడా పిల్లలు తమకు భారంగా భావిస్తున్నారు. ఆస్తి, డబ్బు ఇవ్వలేదని కిరాతకంగా హత్య చేయడం, శ్మశానాలలో వదిలివేయడం లాంటి ఘటనలు చూస్తున్నాం. ఈ నేపథ్యంలో వృద్ధుల సమస్యలు రాజకీయ అజెండాలో చేర్చాలి. వారు గౌరవంగా బ్రతకడానికి అవసరమైన ఏర్పాట్లు ప్రభుత్వం చేయాలి. అందుకు యువత ముందుకు రావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
