భారతీయ సమాజ మూలాలు సమగ్రంగా తెలుసుకోవాలంటే సంస్కృత, ఆంగ్ల, తెలుగు భాషలతోపాటుగా హిందీ భాషను కూడా నేర్చుకోవాలని తెలంగాణ సాహిత్య అకాడమీ మాజీ చైర్మన్ జూలూరు గౌరీశంకర్ తెలిపారు.
దేశం సమగ్ర స్వరూపం తెలుసుకోవడానికి, భారతీయ సామాజిక జీవన విశ్వరూపం అవగతం చేసుకోవడానికి హిందీ భాషను నేర్చుకోవాలని చెప్పారు.
ఆర్టీసీ క్రాస్ రోడ్స్‌లోని తెలంగాణ బుక్‌ట్రస్ట్ కార్యాలయంలో మిధున్ కుమార్ రాసిన “మిధున్ స్పోకెన్ హిందీ” పుస్తకాన్ని భారత ప్రభుత్వ హిందీ సలహాదారు సమితి సభ్యులు శ్రుతికాంత్ భారతి, రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు, జూలూరు గౌరీశంకర్ సంయుక్తంగా ఆవిష్కరించారు.
అనుసంధాన భాషగా హిందీ
ఈ సందర్భంగా జూలూరు మాట్లాడుతూ భారతదేశం విభిన్న భాషల కూడలి అని, దేశానికి బలమైన అనుసంధాన భాషగా హిందీ పనిచేస్తుందన్నారు.
హిందీ, తెలుగు, ఆంగ్లం మూడు భాషల మాధ్యమాల ద్వారా ఈ పుస్తకం తయారు చేయబడిందన్నారు. సరళమైన పదాలు, జీవనగమనంలో పదాలను ఉపయోగించినప్పుడే భాషను నేర్చుకోవడం సులభతరమవుతుందని పేర్కొన్నారు.
కార్పొరేట్ సమాజంలో కమ్యూనికేషన్ స్కిల్స్ అభివృద్ధి చేసుకోవడానికి హిందీ భాష దోహదం చేస్తుందని గౌరీశంకర్ వివరించారు.
రచయితకు అభినందనలు
భారత ప్రభుత్వ సలహా సమితి సభ్యులు శ్రుతికాంత్ భారతి మాట్లాడుతూ భాషను సరళంగా వ్యావహారిక భాషలో సులభతరం చేయగలిగినప్పుడే అది అందరికీ చేరువ అవుతందన్నారు.
హిందీ భాషాభ్యాసాన్ని సరళతరం చేసి ఆసక్తికరంగా మార్చి పుస్తకాన్ని తయారు చేసిన మిధున్ కృషిని రామానందతీర్థ గ్రామీణ విద్యాసంస్థ చైర్మన్ నారా కిషోర్‌రెడ్డి, అంబేద్కర్ ఓపెన్ యూనివర్సిటీ స్టూడెంట్ సర్వీసెస్ డైరెక్టర్ వై వెంకటేశ్వర్లు అభినందించారు.
భాషా సమస్యపై రచయిత అనుభవాలు
కేంద్రప్రభుత్వంలో ఉద్యోగం పొంది ఇతర రాష్ట్రాలలో పనిచేస్తున్నప్పుడు భాషా సమస్యను ఎదుర్కోవడం జరిగిందని, ఆ నేపథ్యంలోనే హిందీ భాషను సాధనచేసి నేర్చుకున్నానని పుస్తక రచయిత మిధున్ కుమార్ తెలిపారు.
హిందీ భాష రాకపోవడంతో భయంతో చాలామంది కేంద్రప్రభుత్వ ఉద్యోగాలకు దూరమవుతున్నారని పేర్కొన్నారు.
ఉత్తరభారతంతో సంబంధాలు ఏర్పరచుకోవడానికి హిందీ భాష వారధిలా పనిచేస్తుందని చెప్పారు. పుస్తక రచయిత మిధున్‌ను ఈ సందర్భంగా పలువురు సన్మానించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
