ఐరోపాలోని అనేక దేశాలలో ఒకవైపు సైనిక వ్యయం పెరుగుతోంది. మరొకవైపు ఆర్థిక ఇబ్బందుల పేరిట ప్రజలపై భారాలు మోపుతున్నారు. ప్రభుత్వాల ఈ విధానాలకు వ్యతిరేకంగా పెద్ద ఎత్తున పోరాటాలు జరుగుతున్నాయి.
ఈ ఉద్యమాల ఆధారంగా ఒక కొత్త రాజకీయ సమీకరణకు సన్నాహాలు జరుగుతున్నాయి. ఇందులో భాగంగా కార్యకర్తల సమావేశాలు, ఉత్సవాలకు ప్రణాళికలు రచిస్తున్నారు.
వామపక్ష, ప్రగతిశీల ఉద్యమాలు రాబోయే రాజకీయ సమరానికి కార్యాచరణను రూపొందిస్తున్నాయి. రాబోయే వారాల్లో, అనేక ఉద్యమాలలో పనిచేసే కార్యకర్తలు, కళాకారులు, కార్మిక సంఘాల నాయకులు ఒకచోట చేరి, ఇప్పటికే జరుగుతున్న ఉద్యమాలను సంఘటితపరచేందుకు ఏర్పాట్లు చేస్తున్నారు.
ఇటలీలో ‘పోటెరె అల్ పోపోలో పీఏపీ క్యాంప్’, ఫ్రాన్స్‌లో ‘లా ఫెటెడీల హ్యూమనిటే’, బెల్జియంలో ‘మ్యానిఫిస్టా’ పేరుతో ఈ సమన్వయ సమావేశాలు జరుగుతున్నాయి.
మితవాద శక్తులపై పోరాటం
స్థానిక ప్రాధాన్యతలను గుర్తిస్తూనే, ఈ సభలలో ఒక ఉమ్మడి అవగాహనను పెంపొందించుకోవడంపై దృష్టి పెట్టారు. ప్రజా ఉద్యమాలు, స్థానిక పోరాటాలతో పెరుగుతున్న తీవ్ర మితవాద శక్తులను ఎదుర్కోవడం ఈ సభల ముఖ్య ఉద్దేశం.
యూరప్‌లో ప్రధాన రాజకీయ ప్రతిపక్షంగా ఉన్న ఉదారవాద, మధ్యే-వామపక్ష పార్టీలు అనుసరిస్తున్న కార్పొరేట్ అనుకూల, పొదుపు చర్యలకు వ్యతిరేకంగా ఒక ప్రత్యామ్నాయ విధానాన్ని రూపొందించడం లక్ష్యంగా ఈ సన్నాహాలు సాగుతున్నాయి.
ఒకవైపు మితవాద శక్తుల విద్వేషపూరిత వైఖరిని, మరొకవైపు మధ్యేవాదుల పొదుపు చర్యలను తిప్పికొట్టేందుకు విజయవంతంగా జరిగిన పోరాటాలకు గత సంవత్సరం కేంద్ర బిందువు అయిందని ఈ ఏడాది సన్నాహక సమావేశాలను ప్రారంభిస్తూ ఇటలీకి చెందిన ‘పోటెరె అల్ పోపోలో’ పేర్కొంది.
పాలస్తీనా సంఘీభావ ఉద్యమం, ప్రధానమంత్రి జార్జియా మెలోని ప్రతిపాదించిన న్యాయవ్యవస్థ సంస్కరణలకు వ్యతిరేకంగా జరిగిన ఉద్యమాలు ఇందుకు ఉదాహరణ. “కానీ ఈ ప్రతిఘటనలకు ఆటంకాలు ఏర్పడే ప్రమాదం ఉంది” అని వామపక్ష పార్టీ సామాజిక మాధ్యమాలలో రాసింది.
“ఎందుకంటే మితవాద శక్తులను వ్యతిరేకించే మధ్యేవాద-వామపక్ష కూటమి కూడా మెలోని అనుసరించే ఆర్థిక విధానాలు, అంతర్జాతీయ ఒత్తిడులను వ్యతిరేకించడంలో గానీ, దేశానికి ప్రత్యామ్నాయ దిశను చూపడంలో గానీ విఫలమై, కేవలం మెలోని ప్రభుత్వానికి వ్యతిరేకం అని నటించే ప్రమాదం ఉంది.”
దక్షిణ ఇటలీలోని పేస్టమ్లో ఆగస్టు 26-30 వరకు జరిగిన శిబిరంలో ఒక ముఖ్యమైన అంశంపై చర్చ జరిగింది.
“మార్పును కోరుకునే ప్రజల ఆకాంక్షలను ఎలా బలపరచాలి, వారిలో ఉత్తేజాన్ని ఎలా నింపాలి, ఇతర కార్మిక, విద్యార్థి, సామాజిక ఉద్యమాలతో కలిపి ఒక సమైక్య ఉద్యమాన్ని ఎలా నిర్వహించాలి? ప్రజా సమీకరణ లేకుండా మార్పు సాధ్యం కాదు” అనే అంశాలను చర్చించడమే ఈ సమావేశ లక్ష్యం.
ఈ సమావేశంలో యూనియోన్ సిండాకేల్ డి బేస్ అనే కార్మిక సంఘం, కాంబియారే రోటా అనే విద్యార్థి సంఘాలతో పాటు వలసకార్మిక సంఘాలు, స్త్రీవాద బృందాల నుండి వక్తలు పాల్గొన్నారు.
క్యూబా సంఘీభావ యాత్రలు, పాలస్తీనాలో కొనసాగుతున్న మారణకాండకు వ్యతిరేకంగా జరుగుతున్న సమీకరణల వంటి అంతర్జాతీయ సంఘీభావం కూడా ఈ సమావేశాలలో ప్రధాన అంశంగా నిలిచింది.
వివిధ పోరాటాలకు, క్యూబా, పాలస్తీనా సంఘీభావ ఉద్యమాలకు మధ్య ఉన్న సంబంధం ప్రాధాన్యతను సెప్టెంబర్ 12-13 తేదీలలో ఓస్టెండ్లో జరిగే సదస్సులో చర్చించనున్నారు.
సైనికీకరణతో పర్యావరణానికి ముప్పు
యూరోప్‌లో పెరుగుతున్న సైనికీకరణ, పర్యావరణంపై దాని ప్రభావం, మహిళా హక్కులు, సార్వజనిక ఆరోగ్యం అంశాలపై సెప్టెంబరులో జరిగే సదస్సు దృష్టి సారిస్తుంది.
“పర్యావరణ విధ్వంసం, సైనికీకరణకు వ్యతిరేకంగా పోరాడుదాం” అనే అంశంపై చర్చించే బృందం వివరిస్తూ, “భూగోళ పర్యావరణాన్ని విధ్వంసం చేసే ఆర్థిక విధానాలే కొత్త ఆయుధ పోటీకి పరుగులు పెడుతున్నాయి” అని పేర్కొంది.
బహుళజాతి సంస్థలకు కీలకమైన ముడి పదార్థాలు, మార్కెట్లు, వాణిజ్య మార్గాల లభ్యతను కాపాడటానికి, ఐరోపా తిరిగి ఆయుధాలను సమకూర్చుకుంటోంది. ఇంకా తన సైనిక జోక్యాలను తీవ్రతరం చేయడానికి సిద్ధమవుతోంది.
ప్రాంతీయ పునరాయుధీకరణ వాతావరణ సంక్షోభాన్ని మరింత తీవ్రతరం చేయడమే కాకుండా, కార్మిక, సామాజిక హక్కులను హరించివేస్తోంది.
ఈ ఏడాది కార్చిచ్చుల కారణంగా ఐరోపా అంతటా విధ్వంసం సృష్టించడంతో ఇప్పటికే లక్షలాది మంది ప్రత్యక్షంగా నష్టపోయారు.
“మాకు భారీ సైనిక వ్యయం వద్దు, తక్కువ వేతనాలు, నామమాత్రపు పెన్షన్లు, సామాజిక భద్రతను రద్దు చేయడం, మా ప్రజాస్వామ్య హక్కులను హరించడం మానుకోవాలి” అని ‘యూరప్ ట్రంపీకరణకు వ్యతిరేకంగా కార్మిక సంఘాలు’ అనే సదస్సులో బెల్జియం, ఇటలీ, స్పెయిన్‌కు చెందిన వక్తలు హెచ్చరించారు.
అదేవిధంగా “ఆరోగ్య సేవలపై సైనికీకరణ ప్రభావాలు” అనే అంశంపై జరిగిన సదస్సులో “రోగుల వాస్తవ అవసరాలు తీర్చడం కంటే సైనికీకరణకు ప్రాధాన్యత ఇస్తున్న వ్యవస్థలో రోగుల అవసరాలు ఎలా తీరుస్తారు” అని వక్తలు ప్రశ్నించారు.
ప్రజా వ్యతిరేక విధానాలపై గళం
సైనికీకరణ అనేది యువత నుంచి ఆరోగ్య సంస్థల వరకు ప్రతిదానిపై ప్రభావం చూపే ఒక బహుముఖ సమస్య.
యూరప్‌లోని ప్రధాన దేశాలు, వాటి చుట్టుపక్కల దేశాల మధ్య సంబంధాలపై దీని ప్రభావం తీవ్రంగా ఉంటుందని రాబోయే సదస్సు పేర్కొంది.
“చాలా కాలం పాటు ప్రధాన జర్మన్ గుత్తాధిపత్య సంస్థలకు పారిశ్రామిక వెన్నెముకగా పనిచేసిన తూర్పు యూరప్ ఇప్పుడు ఆర్థిక, సైనిక అనే రెండు రకాల ఘర్షణలకు వేదికగా మారింది” అని ‘తూర్పు యూరప్: ఐరోపా యుద్ధ ఆర్థిక వ్యవస్థకు యుద్ధభూమి’ అనే అంశంపై జరిగిన సదస్సులో వక్తలు స్పష్టం చేశారు.
“యూరప్ పారిశ్రామిక సంక్షోభం నేపథ్యంలో, సైనిక ఉత్పత్తిని ఆర్థిక వృద్ధికి ఒక ఆశాజనకమైన చోదక శక్తిగా అబద్ధ ప్రచారం చేస్తున్నారు. జర్మనీ, బెల్జియంలలో, వాహన, ఉక్కు పరిశ్రమలలోని సంక్షోభాన్ని యుద్ధ ఆర్థిక వ్యవస్థ వైపు నెట్టడానికి వాడుకుంటున్నారు. ఇది మొత్తం యూరప్‌కు సంబంధించిన సమస్య.”
సదస్సులో పాల్గొననున్న ప్రముఖులు
మను చావో, మెడిన్ వంటి కళాకారులతో పాటు, ఓస్టెండ్లో సెప్టెంబర్‌లో జరిగే సదస్సులో కార్మిక సంఘ నాయకులైన ఆండ్రియా ఈగన్, ఉల్రికే ఐఫ్లర్, జెరెమీ కార్బిన్ వంటి సుప్రసిద్ధ వామపక్ష రాజకీయ నాయకులు, విశ్లేషకులైన వోలోడిమిర్ ఇష్చెంకో, హసన్ పైకర్, జాసన్ హికెల్, ట్రైకాంటినెంటల్ ఇన్స్టిట్యూట్కు చెందిన టింగ్స్ చాక్, ఇంటర్నేషనల్ పీపుల్స్ అసెంబ్లీకి చెందిన మనోలో డి లాస్ శాంటోస్ వంటి పలువురు వక్తలు ప్రసంగించనున్నారు.
ఈ కార్యక్రమంలో బెల్జియన్ కార్మిక సంఘాలు, యువజన సంఘాలు, సామాజిక న్యాయ సంస్థలు కూడా పాల్గొంటున్నాయి. వీరితో పాటు బెల్జియం కార్మిక పార్టీ అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రౌల్ హెడెబౌ, పీటర్ మెర్టెన్స్ కూడా ప్రసంగించనున్నారు.
(న్యూస్ క్లిక్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము. అన వరకర్ రాసిన వ్యాసానికి తెలుగు అనువాదం: సుబ్రమణ్యం. గమనిక: ఈ వ్యాసం సెప్టెంబర్ 12, 13 తేదీలలో జరగనున్న సదస్సుకు ముందు రాసింది.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
