భారత స్వాతంత్ర్యోద్యమ చరిత్రలో జాతీయ విముక్తి పోరాటాన్ని సామాజిక, ఆర్థిక సమానత్వం కోసం జరిగిన పోరాటంలో పాల్గొన్న నాయకుల్లో అయిల్యాత్ కుట్టియారి గోపాలన్ నంబియార్ — ఏకే గోపాలన్(ఏకేజీ) ఒకరు.
కేరళలో ఆయన ఒక ప్రజా నాయకుడిగా ఎదిగినప్పటికీ, ఆయన దేశ రాజకీయాల్లో ప్రముఖ పాత్ర వహించారు. ఏకే గోపాలన్ జయంతి అక్టోబర్ 1.
ఆయన జీవితాన్ని మూడు ప్రధాన భాగాలుగా చూడాలి. బ్రిటిష్ వ్యతిరేక స్వాతంత్య్రోద్యమం-కార్మిక, రైతు, సామాజిక ఉద్యమాలు-కమ్యూనిస్టు, పార్లమెంటరీ రాజకీయాలు.
బాల్యం, ఉపాధ్యాయ జీవితం
ఏకే గోపాలన్ 1904 అక్టోబర్ 1న ఉత్తర కేరళలోని కన్నూర్ ప్రాంతంలో జన్మించారు. ఉపాధ్యాయుడిగా తన వృత్తి జీవితాన్ని ప్రారంభించారు.
అయితే దేశంలో పెరుగుతున్న జాతీయోద్యమ ప్రభావంతో ఆయన అందులో భాగస్వామి అయ్యారు. ఖాదీ ప్రచారం, విదేశీ వస్తువుల బహిష్కరణ, సామాజిక సంస్కరణ వంటి కార్యక్రమాల్లో చురుకుగా పాల్గొన్నారు.
భారత ప్రభుత్వ ‘ఆజాదీ కా అమృత్ మహోత్సవ్’లో కూడా ఆయన ఉపాధ్యాయ వృత్తి నుంచి స్వాతంత్ర్యోద్యమంలోకి ప్రవేశించిన విషయాన్ని నమోదు చేసింది.
ఖిలాఫత్ ఉద్యమం, కాంగ్రెస్‌లో ప్రవేశం
ఏకే గోపాలన్ రాజకీయ చైతన్యానికి ఖిలాఫత్ ఉద్యమం ఒక ముఖ్యమైన మలుపు.
1927లో భారత జాతీయ కాంగ్రెస్‌లో చేరి ఖాదీ ఉద్యమం, అంటరానితన నిర్మూలన, సామాజిక సంస్కరణ కార్యక్రమాల్లో పనిచేశారు.
ఆ కాలంలో జాతీయోద్యమం కేవలం బ్రిటిష్ పాలనను వ్యతిరేకించే రాజకీయ పోరాటం మాత్రమే కాకుండా, భారత సమాజంలోని అసమానతలను ప్రశ్నించే వేదికగా కూడా పని చేసింది.
1930లో గాంధీజీ నాయకత్వంలోని ఉప్పు సత్యాగ్రహంలో ఏకే గోపాలన్ పాల్గొన్నారు. పయ్యన్నూరులో జరిగిన సత్యాగ్రహంలో ఆయన ముఖ్య పాత్ర పోషించారు.
బ్రిటిష్ ప్రభుత్వం ఆయనను అరెస్టు చేసి జైలుకు పంపింది. జైలు జీవితం ఆయన రాజకీయ ఆలోచనలలో కీలకమైన మార్పుకు దారితీసింది.
జాతీయ విముక్తితో పాటు పేదలు, రైతులు, కార్మికులు ఎదుర్కొంటున్న ఆర్థిక సమస్యలను కూడా పరిష్కరించాల్సిన అవసరం ఉందని ఆయన మరింతగా భావించారు.
గురువాయూర్ సత్యాగ్రహం
కేరళ సామాజిక చరిత్రలో గురువాయూర్ సత్యాగ్రహానికి ప్రత్యేక స్థానం ఉంది. దేవాలయ ప్రవేశ హక్కు, సామాజిక సమానత్వం కోసం జరిగిన ఈ ఉద్యమంలో ఏకే గోపాలన్ చురుకుగా పాల్గొన్నారు. ఇది ఆయన రాజకీయ జీవితంలో మరో ముఖ్యమైన అంశం.
స్వాతంత్ర్యం అంటే కేవలం విదేశీ పాలన నుంచి విముక్తి మాత్రమే కాదు, సామాజిక వివక్ష నుంచి కూడా విముక్తి కావాలి.
జైలులోనే రాజకీయ పరివర్తన
బ్రిటిష్ జైళ్లలో గడిపిన కాలంలో ఆయనకు సామ్యవాద, మార్క్సిస్టు ఆలోచనలతో పరిచయం పెరిగింది. కార్మికులు, రైతులు ఎదుర్కొంటున్న దోపిడీ, పేదరికం, భూసంబంధ అసమానతలు వంటి అంశాలను ఆయన మరింతగా అధ్యయనం చేశారు. తరువాత కాంగ్రెస్ సోషలిస్ట్ పార్టీ, చివరకు కమ్యూనిస్టు ఉద్యమంలోకి ప్రవేశించారు.
కేరళలో కమ్యూనిస్టు ఉద్యమం ఏర్పడుతున్న కాలంలో ఏకే గోపాలన్ కీలక నాయకుడిగా ఎదిగారు. 1939లో కమ్యూనిస్టు పార్టీ కార్యకలాపాల్లో చేరడం ఆయన రాజకీయ జీవితంలో ప్రధాన మలుపు.
కార్మికులు, రైతుల కోసం పోరాటం
ఏకే గోపాలన్ ప్రధానంగా కార్మికులు, వ్యవసాయ కార్మికులు, పేద రైతుల సమస్యలపై కేంద్రీకరించారు. కార్మికుల సమస్యలు కేవలం వేతనాల సమస్యలు మాత్రమే కాదని, ఉపాధి భద్రత, పని పరిస్థితులు, సంఘటిత హక్కు, గౌరవప్రదమైన జీవితం వంటి అంశాలతో అవి ముడిపడి ఉన్నాయని ఆయన విశ్వసించి వాటి సాధనకు కృషి చేశారు.
బ్రిటిష్ పాలనలోనే ఆయన కార్మికుల సమస్యల పై పోరాడారు. జైళ్లలో కూడా కార్మికులను సంఘటితం చేయడానికి కృషి చేశారు.
1936లో కన్నూర్ నుంచి మద్రాస్ వరకు జరిగిన మార్చ్‌లో పాల్గొన్నారు. ఇది ప్రజా సమస్యలను విస్తృత స్థాయిలో ముందుకు తీసుకెళ్లే ప్రయత్నాల్లో ఒకటిగా నిలిచింది.
1947 ఆగస్టు 15న భారతదేశానికి స్వాతంత్ర్యం వచ్చిన రోజున కూడా ఆయన కన్నూర్ సెంట్రల్ జైలులో ఉండటం ఏకే గోపాలన్ జీవితంలో అత్యంత ప్రాధాన్యత కలిగిన విషయం.
బ్రిటిష్ పాలనలో స్వాతంత్ర్యోద్యమ కార్యకలాపాల కారణంగా అనేక సార్లు జైలుకు వెళ్లిన ఆయన, స్వాతంత్ర్యం వచ్చిన సమయానికీ జైలులోనే ఉన్నారు.
పార్లమెంట్ సభ్యుడిగా
స్వాతంత్ర్యం తరువాత కూడా ఏకే గోపాలన్ ప్రజా సమస్యలపై తన రాజకీయ పోరాటాన్ని కొనసాగించారు. 1952లో జరిగిన తొలి లోక్‌సభ ఎన్నికల్లో కమ్యూనిస్టు పార్టీ తరఫున ఎన్నికైన 16 మంది సభ్యుల్లో ఆయన ఒకరు. అనంతరం కన్నూర్, కాసరగోడ్ ప్రాంతాల నుంచి లోక్‌సభకు ప్రాతినిధ్యం వహించారు.
తొలి లోక్‌సభలో ప్రతిపక్ష నాయకత్వానికి ఆయనకు ప్రత్యేక స్థానం ఉంది. పార్లమెంటును కేవలం చట్టాలు చేసే సంస్థగా కాకుండా ప్రజల సమస్యలను దేశం ముందు ఉంచే వేదికగా ఉపయోగించాలనే లక్ష్యం ఆయన పార్లమెంటరీ రాజకీయాల్లో ముఖ్యమైనది.
భారత రాజ్యాంగ చరిత్రలో కూడా ఏకే గోపాలన్ పేరు ముఖ్యమైనది. 1950లో ఏకే గోపాలన్ వర్సెస్ స్టేట్ ఆఫ్ మద్రాస్ కేసులో నిర్బంధ చట్టానికి వ్యతిరేకంగా ఆయన సుప్రీంకోర్టును ఆశ్రయించారు.
ఈ కేసు భారత రాజ్యాంగంలోని వ్యక్తిగత స్వేచ్ఛ, నిర్బంధం, ప్రాథమిక హక్కులపై ప్రారంభ దశలో జరిగిన అత్యంత ముఖ్యమైన రాజ్యాంగ చర్చల్లో ఒకటిగా నిలిచింది.
ఈ కేసు తరువాత భారత రాజ్యాంగ న్యాయశాస్త్రం అభివృద్ధిలో ఒక ముఖ్యమైన చారిత్రక సూచనగా మారింది.
కమ్యూనిస్టు ఉద్యమంలో చీలిక
1964లో భారత కమ్యూనిస్టు ఉద్యమంలో విభజన ఏర్పడినప్పుడు ఏకే గోపాలన్ సీపీఐ(ఎం)గా ఏర్పడిన కొత్త పార్టీలో ఉన్న ప్రముఖ నాయకుల్లో ఒకరు. ఆయన ఆ పార్టీ స్థాపక నాయకత్వంలో భాగం.
ప్రజలతో మమేకమై ఉండటం ఆయన రాజకీయ జీవితంలో అత్యంత ప్రధానమైనది. సాధారణ ప్రజలతో నేరుగా కలవడం, వారి సమస్యలు వినడం, గ్రామాలు, కార్మిక ప్రాంతాల్లో పర్యటించడం, ప్రజా పోరాటాల్లో ప్రత్యక్షంగా పాల్గొనడం ఆయన రాజకీయ జీవితంలో అంతర్భాగం.
అందువల్ల కేరళలో ఆయన పేరు ఒక రాజకీయ పార్టీ నాయకుడిగా మాత్రమే కాకుండా, ఒక ప్రజా నాయకుడిగా స్థిరపడింది.
రచయితగా ఏకేజీ
ఆయన తన అనుభవాలను రచనల రూపంలో అందించారు. ఆయన ఆత్మకథ (ఎంటే జీవితకథ) మలయాళంలో ప్రసిద్ధి చెందింది.
ఆయన పార్లమెంటరీ అనుభవాలు, ప్రజా ఉద్యమాలు, విదేశీ పర్యటనలు తదితర అంశాలపై కూడా రచనలు చేశారు.
ఏకె గోపాలన్ 1977 మార్చి 22న మరణించారు. ఆయన జీవితం దాదాపు అర్ధ శతాబ్దం పాటు సాగిన భారత జాతీయ, సామాజిక, కార్మిక, కమ్యూనిస్టు, పార్లమెంటరీ రాజకీయ చరిత్రలో ఒక ముఖ్యమైన అధ్యాయం.
ఏకె గోపాలన్ జీవితం రాజకీయ పరిధికే పరిమితం చేయడం పొరపాటు. ఆయన స్వాతంత్ర్య సమరయోధుడు.
సామాజిక సమానత్వం కోసం పోరాడిన ధీరుడు. కార్మిక, రైతు ఉద్యమ నాయకుడు. కమ్యూనిస్టు. తొలి లోక్‌సభలో ప్రముఖ ప్రతిపక్ష నాయకుడు. ప్రజా సమస్యలను పార్లమెంటులో ప్రతిధ్వనింపజేసిన ప్రజా నాయకుడు. ఢిల్లీలోని సీపీఐ(ఎం) కేంద్ర కార్యాలయం ఆయన పేరుతోనే ఉంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
