అసాంఘిక శక్తులు, నేరప్రవృత్తి కలిగిన వ్యక్తులు కేవలం సమాజంలో దిగువ, మధ్య తరగతి వర్గాల్లోనే ఉంటారని భావించడం ఒక పెద్ద పొరపాటు.
సమాజంలో అత్యున్నత శ్రేణుల్లో, విలాసవంతమైన జీవితాలను గడుపుతూ, నాగరికంగా, అత్యంత సున్నితంగా, సోఫిస్టికేటెడ్‌గా చలామణీ అయ్యే అగ్రవర్గాల వెనుక ఎలాంటి భయానక రూపాలు దాగి ఉంటాయో తెలియాలంటే ‘ఎప్స్టీన్ ఫైల్స్’ చదవాల్సిన అవసరం ఉంది.
సరిగ్గా అదే రకమైన నెట్వర్క్, అరాచకాలు ఈరోజు ప్రపంచ టెక్నాలజీకి గుండెకాయలాంటి అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో వెలుగుచూశాయి.
బయటకు మహా నాగరికులుగా, విప్లవాత్మక ఆవిష్కర్తలుగా చలామణీ అవుతున్న కొందరు టెక్ దిగ్గజాలు, పెట్టుబడిదారులు, ఇంజనీర్లు తమ అధికార బలం, ధన బలంతో మహిళలపై సాగిస్తున్న లైంగిక వేధింపులు, అత్యాచార ఘటనలు సమాజాన్ని తీవ్ర దిగ్భ్రాంతికి గురిచేస్తున్నాయి.
సిలికాన్ వ్యాలీలో ‘స్ప్రెడ్‌షీట్’ సంచలనం
అమెరికాలోని సిలికాన్ వ్యాలీలో ప్రస్తుతం తీవ్ర సంచలనం సృష్టిస్తున్న ‘స్ప్రెడ్‌షీట్’ అనేది ఒక ప్రైవేట్ డాక్యుమెంట్. దీనిని అక్కడి మహిళలు తమ రక్షణ కోసం ‘విస్పర్ నెట్వర్క్’ అని పిలుస్తున్నారు.
టెక్ పరిశ్రమలోని ప్రముఖులపై వచ్చిన లైంగిక వేధింపుల ఆరోపణలను ఇందులో రహస్యంగా పొందుపరిచారు.
‘విస్పర్ నెట్వర్క్’ అనే పదం ఇక్కడ కీలకం. మహిళా వ్యవస్థాపకులు, ఇంజనీర్లు, టెక్ రంగంలోని ఇతర మహిళలు తమకు ఎదురైన అనుభవాలను పరస్పరం చెప్పుకుంటూ, ప్రమాదం ఉందని భావించిన వ్యక్తుల గురించి ఇతరులను హెచ్చరిస్తున్నారని నివేదికలు చెబుతున్నాయి.
ఒక టెక్ ఉద్యోగిని తన అనుభవం గురించి ఇతర మహిళలను అడిగిన తర్వాతే ఈ నెట్వర్క్ గురించి తెలుసుకున్నానని, అక్కడ వందల కేసులు ఉన్నాయని తనకు చెప్పారని న్యూయార్క్ పోస్ట్ వెల్లడించింది.
కెరీర్ దెబ్బతింటుందనే భయంతో రహస్య పోరాటం
ఇక్కడ మరో భయంకరమైన అంశం కెరీర్‌పై ప్రతీకారం. సిలికాన్ వ్యాలీలో పెట్టుబడి, ఉద్యోగం, స్టార్టప్‌కు నిధులు, వ్యాపార భాగస్వామ్యం, సామాజిక పరిచయాలు— అన్నీ పరస్పరం ముడిపడి ఉంటాయి. అందువల్ల శక్తిమంతమైన వ్యక్తిపై ఫిర్యాదు చేస్తే తనకు భవిష్యత్తులో పెట్టుబడులు, ఉద్యోగ అవకాశాలు, వ్యాపార సంబంధాలు దెబ్బతింటాయనే భయం మహిళల్లో ఉందని కథనాలు చెబుతున్నాయి.
ఒక మహిళ తన కేసులో న్యాయం కోరడం విఫలమైతే సిలికాన్ వ్యాలీలోని పెట్టుబడిదారులందరి దగ్గరా తనను ‘బ్లాక్‌లిస్ట్’ చేసే ప్రమాదం ఉందని భయపడినట్లు తెలిపింది.
సిలికాన్ వ్యాలీ అంటే ప్రపంచ టెక్నాలజీ పరిశ్రమకు ప్రతీక. స్టార్టప్‌లు, వెంచర్ క్యాపిటల్, కృత్రిమ మేధస్సు, బిలియన్ డాలర్ల కంపెనీలు అక్కడి ఆర్థిక వ్యవస్థను నడిపిస్తున్నాయి.
అదే ప్రపంచంలో ప్రముఖ పెట్టుబడిదారులు, వ్యాపారవేత్తలు, స్టార్టప్ వ్యవస్థాపకులు, టెక్ రంగానికి చెందిన వ్యక్తులపై తీవ్రమైన లైంగిక వేధింపుల ఆరోపణలు ఉన్నాయని ఒక ప్రైవేట్ స్ప్రెడ్‌షీట్ వెలుగులోకి రావడం ఇప్పుడు అంతర్జాతీయ చర్చకు దారితీసింది.
సెప్టెంబర్ 24న న్యూ యార్క్ పోస్ట్ ఈ విషయాన్ని వెలుగులోకి తీసుకురాగా, సెప్టెంబర్ 29–30 తేదీల్లో ఇతర అమెరికా, అంతర్జాతీయ మీడియా సంస్థలు కూడా దీనిపై కథనాలు ప్రచురించాయి.
మహిళా స్టార్టప్ వ్యవస్థాపకులు, ఇంజనీర్లు, డిజిటల్ స్ట్రాటజిస్ట్‌లు ఇతర మహిళలను హెచ్చరించడానికి, బాధితులను కాపాడుకోవడానికి ఈ జాబితాను రహస్యంగా పంచుకుంటున్నారు.
అధికారిక మార్గాల్లో ఫిర్యాదు చేస్తే కెరీర్ దెబ్బతింటుందనే భయం వల్లే మహిళలు ఇలాంటి ప్రైవేట్ మార్గాలను ఎంచుకోవాల్సి వచ్చిందని మీడియా కథనాలు పేర్కొంటున్నాయి.
టెక్ హబ్‌లలో మహిళల రక్షణలో అధికారిక వ్యవస్థలు విఫలమయ్యాయని విమర్శకులు అభిప్రాయపడుతున్నారు.
పరిశ్రమలోకి కొత్తగా వచ్చే మహిళలకు ముందస్తు హెచ్చరికగా, ఒక రక్షణ కవచంగా ఈ నెట్వర్క్ ఉపయోగపడుతుందని ది ఎకనామిక్ టైమ్స్ కథనం ద్వారా తెలుస్తోంది.
ఈ డాక్యుమెంట్‌లోని సమాచారం బహిరంగంగా కాకుండా అత్యంత జాగ్రత్తగా దాచబడింది. బహిరంగంగా చెప్తే లీగల్ నోటీసులు, బెదిరింపులు ఎదుర్కోవాల్సి వస్తుందనే భయంతో మహిళలు దీనిని రహస్యంగా ఉంచారని న్యూస్ 18 విశ్లేషించింది.
ఎప్స్టీన్ తరహాలో ముఠాగా టెక్ దళారులు
లైంగిక వేధింపులు, మత్తు పదార్థాలు కలపడం, అత్యాచారం లాంటి భయానక ఘటనలు ఎక్కువగా ఉద్యోగులు, స్టార్టప్ వ్యవస్థాపకులు కలిసి ఉండే నివాస ప్రాంగణాలు, టెక్ పార్టీల్లో జరుగుతున్నట్లు ఈ కథనాలు వెల్లడించాయి.
ఈ స్ర్పెడ్ షీట్ గురించిన నిజాలు బయటకు రావడంతో తాము ఎదుర్కొన్న భయానక వేధింపులను ధైర్యంగా చెప్పడానికి మరికొందరు బాధితులు ముందుకు రావడం విశేషం.
ఈ వ్యవహారంలో టెక్ రంగంలోని కొందరు వ్యక్తులు దళారులుగా ఉన్నారు. లైంగిక వేధింపులకు పాల్పడుతూ- ఒకరికొకరు సాయం చేసుకుంటూ తమ తప్పులను కప్పిపుచ్చుకుంటున్నారు. దీన్ని ఎప్స్టీన్ తరహా నెట్‌వర్క్‌గా చూడొచ్చు’ అని టెక్ రంగానికి చెందిన ఒక వ్యక్తి సంచలన విషయాలు వెల్లడించారు.
‘ఆ నిందితులు అత్యంత ధనవంతులు, శక్తిమంతమైన వ్యక్తులు. వారికి ఎదురెళ్తే ప్రాణాలకే ప్రమాదం. తమ వివరాలు బయటపెట్టిన వారిని వారు ఆధునిక సాంకేతికతతో ట్రాక్ చేస్తారు, నిఘా పెడతారు, చివరికి బాధితుల కుటుంబాలను కూడా తీవ్రంగా దెబ్బతీస్తారు’ అని ఆందోళన వ్యక్తం చేశారు.
ఒక బాధితురాలు తనకు జరిగిన అన్యాయాన్ని బయటపెట్టగా.. ఆరోపణలు ఎదుర్కొన్న ప్రసిద్ధ వ్యక్తి ఆమె ఫోన్‌ను హ్యాక్ చేసి, రహస్య సమాచారాన్ని సేకరించి, ఆమెను భయభ్రాంతులకు గురిచేసినట్లు నివేదికలు చెబుతున్నాయి.
మరో మహిళ తనపై జరిగిన లైంగిక దాడి గురించి పోలీసులకు, సంస్థకు ఫిర్యాదు చేయగా- న్యాయం జరగకపోగా ఆమె ఉద్యోగాన్ని ఊడబెరికారు. ఆ తర్వాత టెక్ పరిశ్రమలో ఎక్కడా ఆమెకు ఉద్యోగం దొరక్కుండా బ్లాక్‌లిస్ట్ చేసి అణచివేశారు.
దాతల అండ కరువై మూతపడిన స్వచ్ఛంద సంస్థ
లైంగిక దాడికి గురైన బాధితులను ఒక దగ్గరకు చేర్చేందుకు, వారికి న్యాయపరమైన సాయం అందించేందుకు ఏర్పాటైన ‘కాలిస్టో’ అనే స్వచ్ఛంద సంస్థ జులైలో మూతపడటం టెక్ ప్రపంచంలోని దారుణ పరిస్థితికి అద్దం పడుతోంది.
నేరస్థుల గురించి సమాచారాన్ని పంచుకోవడానికి బాధితులకు ఒక సురక్షిత మార్గం కావాలి. దురుసుగా ప్రవర్తించే వ్యక్తులను తొలగించే విషయంలో కంపెనీల విధానాలు మారాలి. కానీ అది టెక్ రంగంలో, విశ్వవిద్యాలయాల్లో, ప్రభుత్వంలో ఎక్కడా జరగడం లేదు’అని కాలిస్టో సీఈఓ ఆవేదన వ్యక్తంచేశారు.
కోటీశ్వరులైన నిందితులకు వ్యతిరేకంగా పనిచేసే ఈ సంస్థకు నిధులు ఇవ్వడానికి దాతలు ముందుకు రాకపోవడంతో నిధుల కొరతతో దీనిని మూసివేయాల్సి వచ్చింది.
నిజమైన నాగరిక సమాజానికి కొలమానం ఏమిటి?
ఇది కేవలం సిలికాన్ వ్యాలీ మహిళల సమస్యగా చూడటం కూడా ప్రమాదకరం. అధికార సంబంధాలు అసమానంగా ఉన్న ప్రతి కార్యాలయంలోనూ లైంగిక వేధింపుల ప్రమాదం ఉంటుంది.
పెట్టుబడిదారుడు–వ్యవస్థాపకురాలు, బాస్–ఉద్యోగి, మెంటర్–యువతి, ప్రభావశీల వ్యక్తి–కొత్తగా రంగంలోకి వచ్చిన వ్యక్తి మధ్య ఉన్న అధికార వ్యత్యాసం ఫిర్యాదు చేయడాన్ని కష్టతరం చేయవచ్చు. అందుకే సంస్థల్లో స్పష్టమైన ఫిర్యాదు విధానం, స్వతంత్ర దర్యాప్తు, ప్రతీకార చర్యలపై రక్షణ, బాధితులకు సహాయం లాంటి వ్యవస్థలు కాగితంపై కాకుండా ఆచరణలో ఉండాలి.
చివరికి సిలికాన్ వ్యాలీ వ్యవహారం మన ముందుంచే ప్రశ్న చాలా పెద్దది. ‘పై వర్గాల్లో ఉన్నవారు నాగరికులే’ అనే భ్రమను మనం ఎప్పుడు వదులుకుంటాం? సమాజంలోని అసాంఘికతకు దుస్తులు, డిగ్రీలు, హోదాలు, కోట్ల రూపాయల విలువ, సాంకేతిక పరిజ్ఞానం అడ్డుకట్టలు కావు.
ఎప్స్టీన్ కేసు శక్తి–సంపదల వెనుక దాగిన లైంగిక దోపిడీపై ప్రపంచాన్ని ఆలోచింపజేసింది. ఇప్పుడు సిలికాన్ వ్యాలీ నుంచి వస్తున్న ఈ ఆరోపణలు మరోసారి అదే హెచ్చరికను వినిపిస్తున్నాయి—అరాచకాన్ని దాని రూపం చూసి కాదు, దాని చర్యలను చూసి గుర్తించాలి.
బాధితురాలి గొంతు వినిపించే వ్యవస్థ, నిందితుడిపై న్యాయపరమైన విచారణ జరిగే వ్యవస్థ, అధికారాన్ని ఎవరు ఉపయోగించినా జవాబుదారీతనం తప్పని వ్యవస్థ— ఇవే నిజమైన నాగరిక సమాజానికి కొలమానాలు.
ఈ ఘటనలు ప్రపంచానికి ఒక స్పష్టమైన హెచ్చరికను ఇస్తున్నాయి. సూటు-బూటు వేసుకుని, ల్యాప్‌టాప్‌ల ముందు కూర్చుని కోట్లు సంపాదించే ప్రతి ఒక్కడూ సంస్కారవంతుడు కాదు.
టెక్నాలజీ పెరుగుతున్న కొద్దీ, దాన్ని అడ్డుపెట్టుకుని నేరాలు చేసే పైవర్గాల రాక్షసత్వం మరింత భయంకరంగా మారుతోంది.
వ్యవస్థలు, చట్టాలు కేవలం పేదలపై మాత్రమే కాకుండా.. ఇలాంటి శ్వేతవర్ణ క్రిమినల్స్‌పై కూడా కఠినంగా వ్యవహరించినప్పుడే నిజమైన నాగరిక సమాజం సాధ్యమవుతుంది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
