పన్ను రాయితీలను తగ్గించి పెరిగిన గృహ ధరల సమస్యను ఎదుర్కోవాలని ఆస్ట్రేలియా ప్రభుత్వం ప్రయత్నం చేస్తున్నది.
సరసమైన గృహ మార్కెట్‌ను ఎలా సృష్టించాలనే ప్రయోగంలో ఆస్ట్రేలియా ఇప్పుడు ప్రపంచంలోనే కేంద్ర స్థానంలో నిలిచింది.
తరతరాలుగా రాజకీయ నాయకులు “మహా ఆస్ట్రేలియన్ కల”ను అందిస్తామని హామీ ఇచ్చారు.
అంటే వీలైనంత ఎక్కువ మంది ఓటర్లకు తోటలు, ఈత కొలనుతో కూడిన గృహాలకు యజమానులను చేయడం.
అయితే సిడ్నీ, మెల్బోర్న్ నగరాల్లో గృహ ధరలు ప్రపంచంలోనే అత్యంత ఖరీదైనవిగా ఉన్నాయి. దాంతో ముఖ్యంగా యువతకు ఆ కల మరింత దూరమవుతోంది.
ప్రధానమంత్రి ఆంథనీ ఆల్బనీస్ ప్రభుత్వం 1999 నుంచి గృహధరలు 400 శాతం పెరగడానికి దోహదపడిన కొన్ని పన్ను ప్రోత్సాహకాలను ఇప్పుడు వెనక్కి తీసుకుంటోంది.
ఈ సంస్కరణలను గత 25 సంవత్సరాలలో అత్యంత ధైర్యవంతమైన చర్యగా, యువ ఓటర్లను ఆకర్షించే రాజకీయ వ్యూహంగా ప్రశంసిస్తున్నారు.
అయితే విమర్శకులు ఇది ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన గృహ మార్కెట్లలో ఒకదాన్ని కుప్పకూలేలా చేయవచ్చని హెచ్చరిస్తున్నారు.
చారిత్రక పతనంలో గృహ మార్కెట్..
విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం, ఆస్ట్రేలియా గత 40 ఏళ్లలోనే గృహ మార్కెట్ అత్యంత తీవ్రమైన ఒడిదుడుకులను ఎదుర్కొనే పరిస్థితిలో ఉంది.
పన్ను సంస్కరణల ప్రభావానికి అధిక వడ్డీ రేట్లు, ద్రవ్యోల్బణం కూడా తోడై డిమాండ్‌ను తగ్గిస్తున్నాయి.
ఆస్తి పరిశోధనా సంస్థ కోటలిటీ ప్రకారం, మే నెలలో సిడ్నీలో గృహ విలువలు 0.9 శాతం, మెల్బోర్న్లో 0.8 శాతం తగ్గాయి.
అమ్మకాల జోరు కూడా ఏడాది క్రితం కంటే 2.2 శాతం తగ్గింది. సిడ్నీలో పెట్టుబడిదారుల అమ్మకాలు 17 శాతం పెరిగాయి.
సిడ్నీలో మధ్యస్థ గృహ ధర సుమారు 1.3 మిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లు(సుమారు తొమ్మిది లక్షల ముప్పై వేల అమెరికన్ డాలర్లు)గా ఉంది.
మోర్గాన్ స్టాన్లీ అంచనా ప్రకారం గృహధరలు 10 శాతం వరకు పడిపోవచ్చు.
ఎందుకంటే అధిక అప్పులపై ఆధారపడే పెట్టుబడి నమూనాకు, పన్ను నష్టాలను చూపించడం, పెద్ద, పెద్ద మూలధన లాభాలపై ఆధారపడటం వంటి విధానాలు ఇప్పుడు “మూలంగా మారిపోయాయి”.
కొత్త పన్ను సంస్కరణలు – నిపుణుల హర్షం..
ఆర్థిక మంత్రి జిమ్ చాల్మర్స్ అనేక మంది ఆస్ట్రేలియన్లకు సొంత ఇంటి కలను అందనంత దూరం చేసిన “వక్రీకృత పన్ను వ్యవస్థ”నే దీనికి కారణమని విమర్శించారు.
బడ్జెట్లో ప్రతిపాదించిన మార్పుల ప్రకారం నెగటివ్ గేరింగ్(పెట్టుబడి ఆస్తుల నష్టాలను ఆదాయపు పన్నులో మినహాయించడం) కొత్తగా నిర్మించే ఇళ్లకే పరిమితం అవుతుంది.
1999లో ప్రవేశపెట్టిన మూలధన లాభాల పన్నుపై 50 శాతం రాయితీని తొలగించి, ద్రవ్యోల్బణానికి అనుసంధానించిన కొత్త విధానం తీసుకురానున్నారు.
కనీసం 30 శాతం పన్ను రేటు అమలు చేయబడుతుంది.
కుటుంబ ట్రస్టులపై కూడా 30 శాతం కనీస పన్ను విధించనున్నారు. గ్రాటన్ ఇన్స్టిట్యూట్ ప్రధాన కార్యనిర్వాహకురాలు అరుణ సథానపల్లి ఈ మార్పులను స్వాగతిస్తూ, ప్రస్తుత పన్ను వ్యవస్థ “వక్రీకృత ప్రోత్సాహకాలు, అన్యాయ ఫలితాలు” సృష్టించిందని, “ఇది (తాజా నిర్ణయం) మొదటిసారి ఇల్లు కొనుగోలు చేయాలనుకునే యువ ఉద్యోగులకు అనుకూలంగా, సమతుల్యతను తీసుకురావడం ప్రారంభిస్తుంది” అని పేర్కొన్నారు.
విమర్శలు, నిర్మాణ రంగ ఆందోళనలు..
అయితే కొంతమంది వ్యాపార నాయకులు, రాజకీయ ప్రత్యర్థులు ఈ పన్ను మార్పులు అద్దెలను మరింత పెంచి, యువ పెట్టుబడిదారులకు అవకాశాలు తగ్గిస్తాయని విమర్శిస్తున్నారు.
మరికొందరు, మరిన్ని ఇళ్లు నిర్మించకపోతే ఈ సంస్కరణల ప్రభావం పరిమితంగానే ఉంటుందని అంటున్నారు.
ట్రెజరీ తాజా అంచనాల ప్రకారం, ఈ పన్ను మార్పులు వచ్చే పదేళ్లలో ప్రైవేట్ గృహ సరఫరాను 35,000 ఇళ్ల మేర తగ్గించవచ్చు. దీనివల్ల ఏర్పడే నష్టాన్ని భర్తీ చేసేందుకు ప్రభుత్వం 2 బిలియన్ ఆస్ట్రేలియన్ డాలర్లతో కొత్త గృహ నిర్మాణ నిధిని ఏర్పాటు చేయనుంది.
అలాగే కాలువలు వంటి మౌలిక సదుపాయాల అభివృద్ధికి మద్దతు ఇస్తూ 65,000 ఇళ్ల నిర్మాణాన్ని ప్రోత్సహించనుంది. దశాబ్దం చివరినాటికి ఇప్పటికే ప్రణాళికలో ఉన్న 1.2 మిలియన్ ఇళ్లకు అదనంగా ఇవి నిర్మించబడతాయి.
కొత్త గృహాల్లో పెట్టుబడులను ప్రోత్సహించేందుకు ప్రభుత్వం పన్ను రాయితీలను కొనసాగించింది. అలాగే ఇప్పటికే ఉన్న ఆస్తి పెట్టుబడులను మినహాయిస్తూ “గ్రాండ్‌ఫాదరింగ్” విధానాన్ని కూడా అమలు చేసింది.
మూడీస్ సంస్థకు చెందిన ఆర్థికవేత్త సన్నీ న్యూయెన్ మాట్లాడుతూ, “కొత్త గృహాల వైపు పెట్టుబడులను మళ్లించడం సూత్రప్రాయంగా తెలివైన చర్య. కానీ అదే సమయంలో పన్ను రాయితీలను తగ్గించడం ద్వారా పెట్టుబడిదారుల డిమాండ్‌ను కుదిస్తున్నారు. చరిత్రలో ఇది విజయవంతమైన వ్యూహంగా కనిపించలేదు” అని అన్నారు.
హౌసింగ్ ఇండస్ట్రీ అసోసియేషన్ ప్రధాన ఆర్థికవేత్త టిమ్ రియర్డన్ మాట్లాడుతూ, “ఆస్ట్రేలియా 11 మిలియన్ ఇళ్లను 10 మిలియన్ ఇళ్లుగా మార్చే ప్రయత్నం చేస్తున్నట్టుంది. యజమానుల వాటా, అద్దెదారుల వాటా ఎలా మారినా మొత్తం ఇళ్ల సంఖ్య ఒకటే. మనకు తగినన్ని ఇళ్లు లేవు” అని అన్నారు.
తరాల మధ్య సమానత్వం – యువత అభిప్రాయం..
ఆల్బనీస్ ప్రభుత్వ ప్రధాన లక్ష్యాలలో ఒకటి తరాల మధ్య సమానత్వాన్ని పెంపొందించడం. యువ ఓటర్లను ఆకర్షించేందుకు రాజకీయపరమైన ప్రమాదాన్ని కూడా ప్రభుత్వం స్వీకరించింది.
సిడ్నీ యూనివర్సిటీ ఆఫ్ టెక్నాలజీకి చెందిన ఆర్థికవేత్త టిమ్ హార్కోర్ట్ మాట్లాడుతూ “ఈ మార్పులు ఆస్తి కలిగిన వృద్ధ ఆస్ట్రేలియన్లలో కొందరిని నిరాశపరచవచ్చు. కానీ జీవితాంతం ఇల్లు కొనలేమని భావిస్తూ పెరిగిన యువతకు ఇది సరైన దిశలో వేసిన అడుగులా అనిపిస్తుంది” అని చెప్పారు.
అయితే న్యూ సౌత్ వేల్స్ విశ్వవిద్యాలయంలో సృజనాత్మక రచన, భాషాశాస్త్రం చదువుతున్న 20 ఏళ్ల క్రిసెల్లే పువినాయగం మాత్రం ఇంకా నమ్మకం వ్యక్తం చేయలేదు.
ఆమె మాట్లాడుతూ “రాజకీయ నాయకులు అబద్ధం చెబుతున్నారని అనిపిస్తోంది. ఇల్లు కొనడం అంత కష్టమవడం మానవ జీవన హక్కును పొందడమే కష్టమైనట్లుగా ఉంది. ఏదో ఒకటి తప్పకుండా చేయాలి” అని అన్నారు.
అనువాదం: డి వెంకన్న
ఫైనాన్షియల్ టైమ్స్ యూరప్ ఎడిషన్ సౌజన్యంతో ఈ వ్యాసాన్ని అందిస్తున్నాము.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
