తెలంగాణ రాష్ట్రంలోని ఆటో, టాక్సీ, క్యాబ్, పోర్టర్, లారీ తదితర విభాగాలలో పనిచేసే రవాణా రంగ కార్మికులు పలు సమస్యలతో సతమతమవుతున్నారు.
ప్రధానంగా హైదరాబాద్ నగరంలో 13 సంవత్సరాల క్రితం నిర్ణయించిన ఆటో మీటర్ చార్జీలు ఇంతవరకు సవరించలేదు.
రవాణా రంగ కార్మికుల సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలని గత 10 సంవత్సరాలు బీఆర్ఎస్ ప్రభుత్వంలో, ప్రస్తుత కాంగ్రెస్ ప్రభుత్వంలో మూడు సంవత్సరాలుగా పలు ఆందోళనలు జరిగాయి.
రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చినప్పటి నుంచి పలు దఫాలు రవాణా శాఖ మంత్రితో సహా పలువురు అధికారులకు విజ్ఞప్తులు చేసినప్పటికీ ఆచరణలో సమస్యల పరిష్కారానికి నోచుకోలేదు.
ఈ పరిస్థితులలో రవాణా రంగంలో పనిచేస్తున్న 16 కార్మిక సంఘాలు ఐక్య కార్యాచరణ కమిటీగా ఏర్పడి ఆగస్టు 24 నుంచి నిరవధిక సమ్మె చేయాలని నిర్ణయించి ప్రభుత్వానికి, అధికారులకు సమ్మె నోటీసులు జారీ చేసింది.
సమ్మె సన్నాహాలలో భాగంగా కరపత్రాలు, వాల్ పోస్టర్లు, స్టాండ్ మీటింగ్‌లు, ఆగస్టు 13న రాష్ట్ర సదస్సు జరిపి కార్మికులను సమ్మెకు సన్నద్ధం చేశారు. ప్రభుత్వ నిర్లక్ష్య వైఖరితో విసుగు చెందిన కార్మికులు సమ్మెకు సన్నద్ధం అయ్యారు. ఇంత జరుగుతున్నా నిద్ర పోతున్నట్లు నటించిన ప్రభుత్వం తీరా సమ్మె రేపు(ఆగస్టు 24) ప్రారంభం అవుతుందనగా ఆగస్టు 23వ తేదీ రవాణా శాఖ మంత్రి, ఇతర అధికారులు కార్మిక సంఘాల జాయింట్ యాక్షన్ కమిటీతో చర్చలు జరిపారు.
రవాణా శాఖామాత్యులు వీడియో కాన్ఫరెన్స్ ద్వారా చర్చలలో పాల్గొన్నారు. కమిషనర్, ఉప కమిషనర్లు, ఇతర అధికారులు భౌతికంగా సమావేశంలో పాల్గొన్నారు. చర్చలలో ఒక సానుకూల ఒప్పందం కుదరడంతో సమ్మె ప్రతిపాదనను విరమించుకుంటున్నట్లు కార్మిక సంఘాల ఐక్య కార్యాచరణ కమిటీ ప్రకటించింది.
ప్రభుత్వంతో సానుకూల చర్చలు..
ప్రధానంగా సుదీర్ఘ కాలం పాటుగా పోరాటం చేస్తున్న సంక్షేమ బోర్డు ఏర్పాటు, లాస్ట్ మైల్ కనెక్టివిటీ పేరుతో టీఎస్ఆర్టీసీ యాజమాన్యానికి విద్యుత్ ఆటోలకు అనుమతివ్వాలనే ప్రభుత్వ ప్రతిపాదనను వెనక్కి తీసుకుంటామని, పెట్రోల్, డీజిల్, గ్యాస్, నిత్యావసర సరకుల ధరల పెరుగుదలకు అనుగుణంగా ఆటో మీటర్ ఛార్జీలను పెంచుతామని, ఓలా, ఉబెర్, ర్యాపిడో యాప్‌లకు బదులుగా ప్రభుత్వమే కొత్త పబ్లిక్ ట్రాన్స్పోర్ట్ యాప్ తీసుకొస్తామని, ఆటో డ్రైవర్లకు ఏడాదికి రూ 12,000 ఆర్థిక సాయం వచ్చే క్యాబినెట్లో చర్చించి అమలు చేస్తామని అంగీకరించారు.
మిగతా వాటిని వెంటనే సంబంధిత అధికారులతో మాట్లాడి విధి విధానాలు రూపొందిస్తామని వీడియో కాన్ఫరెన్స్ ద్వారా రవాణా శాఖ మంత్రి హామీ ఇచ్చారు. మిగతా ముఖ్యమైన డిమాండ్లకు కూడా అంగీకరించి రాతపూర్వకంగా హామీ ఇవ్వడంతో సమ్మెను విరమిస్తున్నట్లు జాయింట్ యాక్షన్ కమిటీ ప్రకటించింది.
ఒప్పందంపై రవాణా శాఖ కమిషనర్, జేఏసీ నేతలు సంతకాలు చేశారు. పట్టుదలతో వివిధ రూపాలలో ఆందోళనలు చేసి, సమ్మెకు సిద్ధమై, చివరకు ప్రభుత్వంతో ఒక ఒప్పందం సాధించిన తెలంగాణ రాష్ట్ర రవాణా కార్మిక సంఘాల నాయకత్వానికి, కార్మికులకు అభినందనలు.
ఒప్పందంలోని ప్రధాన అంశాలు..
1. లాస్ట్ మైల్ కనెక్టివిటీ పాలసీ కింద టీఎస్ఆర్టీసీ ద్వారా ఆటోలను ప్రవేశపెట్టడం లాంటి పాలసీ చర్చ ఏదీ జరగలేదని రవాణా శాఖ మంత్రి తెలిపారు.
2. రవాణా కార్మికుల సంక్షేమ బోర్డుకు సంబంధించి, కార్మిక శాఖతో ప్రాధాన్యతా క్రమంలో ఈ అంశాన్ని చేపడతామని గౌరవ రవాణా శాఖ మంత్రి తెలిపారు. అలాగే తాను స్వయంగా ఈ విషయాన్ని పరిశీలిస్తానని, రాబోయే అసెంబ్లీ సమావేశంలో కూడా దీనిపై చర్చిస్తామని మంత్రి హామీ ఇచ్చారు. సెప్టెంబర్ మొదటి వారంలో గౌరవ కార్మిక శాఖ మంత్రితో కలిసి సంయుక్త సమావేశం నిర్వహిస్తామని కూడా ఆయన తెలిపారు.
3. ఆటోరిక్షా ఛార్జీల పెంపు, సవరణకు సంబంధించి వర్కింగ్ గ్రూప్‌ను ఏర్పాటు చేసినట్లు, ఛార్జీల సవరణ ప్రతిపాదనలను 15 రోజుల్లోగా ప్రభుత్వానికి పంపుతామని తెలియజేశారు.
4. ఓలా, ఉబెర్, ర్యాపిడో మాదిరిగానే ప్రభుత్వం తరఫున ఒక యాప్‌ను అభివృద్ధి చేయడంపై ఐటీ శాఖతో మాట్లాడటం జరుగుతుంది.
5. జీఓఎంఎస్ నెంబర్ 263 కింద తిరస్కరించబడిన కేసులు, అనుమతుల గడువు ముగిసిన కేసులకు సంబంధించి, ఆటో రిక్షా పర్మిట్ కోటాను విడుదల చేయడం జరుగుతుంది.
6. అగ్రిగేటర్లు వైట్ ప్లేట్ వాహనాలను ఉపయోగిస్తున్నారనే అంశంపై, అగ్రిగేటర్ పాలసీలో కేవలం ఎల్లో ప్లేట్ బైక్‌లను మాత్రమే సిఫార్సు చేసినట్లు తెలియజేశారు.
7. ఇతర జిల్లాలకు చెందిన ఆటోలు నగరంలో తిరగడంపై తగిన చర్యలు తీసుకునేందుకు రవాణా శాఖ అంగీకరించింది.
8. సారథి పోర్టల్‌లో ఆటో రిక్షా లైసెన్స్ కేటగిరీకి సంబంధించి భారత ప్రభుత్వం నుంచి స్పష్టత కోరడం జరుగుతుంది.
9. ఆటో డ్రైవర్లకు రూ 12,000 ఆర్థిక సహాయం అందించే అంశంపై మంత్రివర్గ సమావేశంలో చర్చిస్తామని గౌరవ రవాణా శాఖ మంత్రి తెలిపారు.
10. ఆటోరిక్షా డ్రైవర్లకు ప్రమాద, సహజ బీమా పాలసీ అంశాన్ని యూనియన్లు లేవనెత్తగా, ఈ విషయాన్ని కార్మిక శాఖ దృష్టికి తీసుకెళ్తామని తెలియజేశారు.
11. ప్రైవేట్ ఫైనాన్స్ కంపెనీల అక్రమాల గురించి యూనియన్లు లేవనెత్తి, ఈ వ్యవహారంపై విచారణ జరిపించాలని కోరాయి. సంబంధిత శాఖతో ఈ విషయాన్ని మాట్లాడేందుకు రవాణా శాఖ అంగీకరించింది.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
