రాజకీయ పరిస్థితులకు అనుగుణంగా ఆలోచన, అవగాహన, ప్రత్యామ్నాయ మార్గాలను సృష్టించడంలో సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి సురవరం సుధాకర్ రెడ్డిని ఆదర్శంగా తీసుకోవాలని డాక్టర్ బీఆర్ అంబేడ్కర్ సార్వత్రిక విశ్వవిద్యాలయం వైస్ ఛాన్సలర్ ప్రొఫెసర్ ఘంటా చక్రపాణి అన్నారు.
దేశంలో విద్యార్థులు, యువకులు ప్రస్తుతం చేపట్టిన ఆందోళనలతో గొప్ప పరిణామాలకు దారి తీయగలదని, ఇలాంటి సమయంలో సుధాకర్‌రెడ్డి వంటి కమ్యూనిస్టు పార్టీ నాయకుడు ఉండి ఉంటే బాగుండేదని ఆయన అభిప్రాయపడ్డారు.
ఘనంగా నివాళులు..
సీపీఐ జాతీయ మాజీ ప్రధాన కార్యదర్శి, మాజీ పార్లమెంటు సభ్యులు సురవరం సుధాకర్ రెడ్డి ప్రథమ వర్ధంతిని పురస్కరించుకొని అనేక మంది ఘనంగా నివాళులర్పించారు.
ఈ కార్యక్రమం సీపీఐ తెలంగాణ రాష్ట్ర సమితి పార్టీ కార్యాలయం మఖ్దూం భవన్లో జరిగింది.
ఉద్యమాక్షర వ్యాసాల సంపుటి ఆవిష్కరణ..
సభకు సీపీఐ రాష్ట్ర కార్యదర్శి, శాసనసభ్యులు కూనంనేని సాంబశివరావు అధ్యక్షత వహించగా, పార్టీ జాతీయ కార్యదర్శి పల్లా వెంకట్ రెడ్డి, సీనియర్ నాయకులు అజీజ్ పాషా, కే నారాయణ, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు, సుధాకర్ రెడ్డి సతీమణి బీవీ విజయలక్ష్మి వేదికపై ఆసీనులయ్యారు.
ఈ సందర్భంగా చక్రపాణి మాట్లాడుతూ సుధాకర్ రెడ్డితో తనకున్న సంబంధాలను తెలియజేశారు. అంతేకాకుండా సుధాకర్ రెడ్డి దృఢమైన కమ్యూనిస్టు కాదని, అనువైన కమ్యూనిస్టని పేర్కొన్నారు.
కమ్యూనిజంలో నమ్మకం అనేది ప్రాథమిక సూత్రమని, ఇప్పటికైనా ఎదుటి వారిని నమ్మాలని సూచించారు.
దేశంలో విద్యార్థులు, యువకులు కాక్రోచ్ జనతా పార్టీ ఏర్పాటు చేసి సంచలనాలు సృష్టిస్తున్నారని ఇలాంటి సమయంలో సుధాకర్ రెడ్డి ఉంటే బాగుండేదని చెప్పారు.
సభకు పార్టీ రాష్ట్ర సహాయ కార్యదర్శి ఈటీ నరసింహ తొలుత స్వాగతం పలుకగా బీవీ విజయలక్ష్మి వందన సమర్పణ చేశారు.
నవ చేతన విజ్ఞాన సమితి ప్రచురించిన సుధాకర్ రెడ్డి ఉద్యమాక్షర వ్యాసాల సంపుటిని చక్రపాణి ఆవిష్కరించారు.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
