గౌరవ ముఖ్యమంత్రికి,
మీరు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టినప్పటి నుంచి విద్యను రాష్ట్ర అభివృద్ధికి కేంద్రంగా చూడాల్సిన అవసరాన్ని పదేపదే నొక్కి చెబుతున్నారు.
విద్యా కమిషన్ ఏర్పాటు, ప్రభుత్వ పాఠశాలల్లో అల్పాహార పథకం, ఫిన్లాండ్, జపాన్, జర్మనీ, వియత్నాం వంటి దేశాలకు అధ్యయన పర్యటనలు, ఉపాధ్యాయులకు విదేశాల్లో ఉన్నత విద్య అభ్యసించేందుకు అధ్యయన సెలవులు ఇవ్వాలన్న మీ నిర్ణయం, ఇటీవల మండలాన్ని ప్రామాణిక యూనిట్‌గా తీసుకొని విద్యా సంస్కరణలపై ఉపాధ్యాయుల నుంచే సూచనలు కోరడం- ఈ చర్యలన్నీ తెలంగాణకు మంచి విద్యా వ్యవస్థను నిర్మించాలన్న సంకల్పాన్ని స్పష్టపరుస్తున్నాయి.
విదేశీ నమూనాల అనుకరణ కాదు, పునర్నిర్మాణం అవసరం..
అయితే చరిత్ర ఎప్పుడూ చాలా సరళమైన, కాని అత్యంత లోతైన సత్యాన్ని మనకు చెబుతుంది. ఏ సమాజమూ మరో దేశ విద్యా నమూనాను దిగుమతి చేసుకొని గొప్ప విద్యా వ్యవస్థను నిర్మించుకోలేదు.
ప్రతి విజయవంతమైన దేశానికి స్వంతంగా నిర్మించుకున్న బలమైన ప్రభుత్వ విద్యా వ్యవస్థే కారణం. ఫిన్లాండ్ను తెలంగాణలోకి తీసుకురాలేం.
జపాన్ను యథాతథంగా అనుకరించలేం. సింగపూర్‌ను కాపీ చేయలేం. కాని ఈ దేశాలన్నీ కొన్ని ప్రాథమిక సూత్రాలను అనుసరించడం వల్లనే ప్రపంచానికి ఆదర్శాలుగా నిలిచాయి.
తెలంగాణ ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నిర్మించాలంటే విదేశీ నమూనాలను అనుకరించడం కంటే, వాటిని విజయవంతం చేసిన సూత్రాలను తెలంగాణ పరిస్థితులకు అనుగుణంగా పునర్నిర్మించుకోవాలి. ఈ లక్ష్యాన్ని సాధించడానికి నాలుగు ప్రాథమిక సంస్కరణలు అత్యవసరమని నేను వినయపూర్వకంగా ప్రతిపాదిస్తున్నాను.
మొదటి ప్రాథమిక సంస్కరణ – బలమైన పరిసర ప్రభుత్వ పాఠశాలలు..
ప్రపంచంలోని ప్రతి గొప్ప విద్యా వ్యవస్థకు, ప్రజల్లో విశ్వాసం కలిగిస్తున్న ప్రభుత్వ పాఠశాలలే పునాదిగా ఉన్నాయి.
కాబట్టి ప్రభుత్వ పాఠశాలలు కేవలం పేదల కోసమే అన్నట్లు కాకుండా, సమాజంలోని ప్రతి వర్గం నమ్మకంతో తమ పిల్లలను పంపే స్థాయికి ఎదిగినప్పుడే ప్రజా విద్య బలపడుతుంది.
వ్యవసాయ కూలీల, కార్మికుల, పేద వర్గాల పిల్లలు చదువుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో, మంత్రులు, ఎమ్మెల్యేలు, ఐఏఎస్ అధికారులు, ఉపాధ్యాయులు, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, ప్రభుత్వ జీతాలు, సౌకర్యాలు పొందే వారందరి పిల్లలు ఎందుకు చదవకూడదన్న ఒక ప్రశ్న సహజంగానే తలెత్తుతుంది.
విద్యా న్యాయం, ప్రజాస్వామ్యాల పునాది..
ఈ ప్రశ్న కేవలం పరిపాలనా లేదా రాజకీయ ప్రశ్న కాదు; ఇది విద్యా న్యాయానికి, ప్రజాస్వామ్యానికి సంబంధించిన ప్రశ్న. అమెరికన్ విద్యావేత్త జాన్ డ్యూయీ చెప్పిన మాటలు ఈ భావాన్ని ఎంతో లోతుగా వ్యక్తం చేస్తాయి.
“ఉత్తమమైన, వివేకవంతమైన తల్లిదండ్రులు తమ సొంత బిడ్డ కోసం కోరుకునే మంచి విషయం ఏదైతే ఉంటుందో, అదే విషయాన్ని అందరి పిల్లల కోసం, సమాజం కోరుకోగలగాలి. దీని కంటే తక్కువ, పరిమితమైన లక్ష్యం ఏదైనా సరే అది మన పాఠశాలలకు సరైనది కాదు; అలా చేస్తే మన ప్రజాస్వామ్యం నశిస్తుంది.” — జాన్ డ్యూయీ
అంటే, వివేకవంతమైన తల్లిదండ్రులు తమ బిడ్డకు కోరుకునే అత్యుత్తమ విద్యను సమాజం ప్రతి బిడ్డకు హక్కుగా అందించాలి.
కొందరి పిల్లలకు అత్యుత్తమ పాఠశాలలు, మరికొందరి పిల్లలకు కనీస సౌకర్యాలతో కూడిన పాఠశాలలు అనే ద్వంద్వ విద్యా వ్యవస్థ ప్రజాస్వామ్య సమాజానికి అనుకూలమైనది కాదు.
అందుకే ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయడం అనేది కేవలం విద్యాశాఖకు సంబంధించిన కార్యక్రమం కాదు; అది సమానత్వాన్ని, సామాజిక న్యాయాన్ని, ప్రజాస్వామ్యాన్ని బలోపేతం చేసే ప్రక్రియ.
ఆదర్శంగా నిలిచిన ఆచరణలు..
తమిళనాడులోని ఈరోడ్ జిల్లా కలెక్టర్ డాక్టర్ ఆర్ ఆనంద్ కుమార్ 2011లో తన కుమార్తెను ప్రభుత్వ పాఠశాలలో చేర్పించడం ద్వారా ప్రభుత్వ పాఠశాలలను ఎలా మెరుగుపరచవచ్చో ఆచరణలో చూపించారు.
ఆ నిర్ణయం తర్వాత అధికారులు పాఠశాల మౌలిక సదుపాయాలు, పారిశుధ్యం, ఉపాధ్యాయుల సమయపాలన వంటి అంశాలపై ప్రత్యేక దృష్టి సారించారు.
ఈ ఉదాహరణ ఒక ముఖ్యమైన పాఠాన్ని చెబుతోంది: ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు, అలాగే మధ్యతరగతి కుటుంబాలు తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పిస్తే, పర్యవేక్షణ పెరుగుతుంది, మౌలిక సదుపాయాలు, బోధన నాణ్యత మెరుగుపడతాయి, మంచి ఉపాధ్యాయులను నియమించాలనే ఒత్తిడి ప్రభుత్వంపై సహజంగానే ఏర్పడుతుంది.
ముందుగా ప్రజాప్రతినిధులు, ఉన్నతాధికారులు స్వచ్ఛందంగా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లో చేర్పించే ఉద్యమానికి ఈ దిశగా రాష్ట్ర ప్రభుత్వం నాయకత్వం వహించవచ్చు.
2015 ఆగస్టులో అలహాబాద్ హైకోర్టు కూడా ఒక ముఖ్యమైన సూచన చేసింది. ప్రభుత్వ జీతాలు, సౌకర్యాలు పొందే వారంతా తమ పిల్లలను ప్రభుత్వ పాఠశాలల్లోనే చదివించాలని పేర్కొంది.
దీనిని చట్టపరంగా అమలు చేయడం సాధ్యమా కాదా అన్నది వేరే విషయం. కాని దాని వెనుక ఉన్న విద్యా తత్వం అత్యంత విలువైనది.
ప్రభుత్వ వ్యవస్థలను బలోపేతం చేయడానికి, వాటి గురించి నిర్ణయాలు తీసుకునే వారినే ఆ వ్యవస్థలో భాగస్వాములను చేయడం కంటే గొప్ప మార్గం మరొకటి లేదు.
నీతి ఆయోగ్ నివేదిక హెచ్చరికలు..
ఈ వాదనకు ఇటీవల నీతి ఆయోగ్ విడుదల చేసిన “స్కూల్ ఎడ్యుకేషన్ సిస్టమ్ ఇన్ ఇండియా: టెంపోరల్ అనాలసిస్ అండ్ పాలసీ రోడ్‌మ్యాప్ ఫర్ క్వాలిటీ ఎన్హాన్స్మెంట్” నివేదిక కూడా బలమైన ఆధారాన్ని అందిస్తోంది.
తెలంగాణలో విద్యా సమస్య ఇప్పుడు పాఠశాలల అందుబాటుకు సంబంధించినది కాదని, ప్రభుత్వ పాఠశాలల నాణ్యత, అభ్యసన ఫలితాలు, విద్యార్థుల కొనసాగింపు, డిజిటల్ సన్నద్ధతకు సంబంధించినదని ఆ నివేదిక స్పష్టం చేసింది.
ప్రభుత్వ పాఠశాలల్లో ఆంగ్ల మాధ్యమం, మౌలిక సదుపాయాలు మెరుగుపరిచినప్పటికీ ప్రజల విశ్వాసం ఇంకా పూర్తిగా పునరుద్ధరించబడలేదని పేర్కొంది.
ముఖ్యంగా హైదరాబాద్ పరిసర పట్టణాల్లో ప్రభుత్వ పాఠశాలల నుంచి ప్రైవేట్ పాఠశాలలకు విద్యార్థుల వలస కొనసాగుతుండడాన్ని ఉదహరించింది.
తెలంగాణ రాష్ట్రంలో 2,245 పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య తగ్గడం, 5,001 ఏకోపాధ్యాయ పాఠశాలలు ఉన్నాయన్న విషయాన్ని, మాధ్యమిక స్థాయిలో డ్రాప్ అవుట్ రేటు 13.3 శాతంగా ఉండటాన్ని, గ్రామీణ ప్రాంతాల్లో డిజిటల్ అసమానతలు, ఉపాధ్యాయుల అసమాన నియామకాలు, ప్రయోగశాలలు, గ్రంథాలయాలు, క్రీడా సదుపాయాల కొరత వంటి సమస్యలు కొనసాగుతున్నాయని నివేదిక హెచ్చరించింది.
అదే సమయంలో, సరైన విధాన సంస్కరణలు అమలు చేస్తే తెలంగాణ సమ్మిళిత, సాంకేతిక ఆధారిత ప్రజా విద్యలో దేశానికి ఆదర్శంగా నిలిచే సామర్థ్యం కూడా ఉందని పేర్కొంది.
ఈ నివేదికలోని పరిశీలనలు ఈ లేఖలో ప్రతిపాదిస్తున్న నాలుగు ప్రాథమిక సంస్కరణల అవసరాన్ని మరింత బలపరుస్తున్నాయి.
రెండవ ప్రాథమిక సంస్కరణ – ఉపాధ్యాయ విద్యను పునర్నిర్మించాలి..
ప్రపంచంలో ఎక్కడా కేవలం భవనాలు నిర్మించడం వల్ల గొప్ప విద్యా వ్యవస్థలు ఏర్పడలేదు.
వృత్తిపరంగా నైపుణ్యం కలిగిన, స్వేచ్ఛతో, గౌరవంతో పనిచేసే ఉపాధ్యాయుల వల్లే అవి నిర్మితమయ్యాయి. కాంక్రీటుపై కాకుండా మనుషులపై పెట్టే పెట్టుబడే అత్యుత్తమ పెట్టుబడి అవుతుంది.
ఉపాధ్యాయ విద్య, విద్యా పరిశోధన, విద్యా స్వేచ్ఛ, నిరంతర వృత్తిపరమైన అభివృద్ధిపై పెట్టే ప్రతి రూపాయి తరతరాలకు ఫలితాలను ఇస్తుంది.
అయితే దీనికి ఉపాధ్యాయులను తయారు చేసే సంస్థలను ముందుగా బలోపేతం చేయాలి.
దురదృష్టవశాత్తు మన రాష్ట్రంలోని ఉపాధ్యాయ విద్యా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యాశాఖలు ఎన్నో సంవత్సరాలుగా నిర్లక్ష్యానికి గురవుతున్నాయి.
అధ్యాపకుల, ఆచార్యుల పోస్టులు సంవత్సరాల తరబడి ఖాళీగానే ఉన్నాయి. పరిశోధనలు బలహీనపడ్డాయి. విద్యా నాయకత్వం క్షీణించింది.
భవిష్యత్ ఉపాధ్యాయులను తీర్చిదిద్దాల్సిన ఈ సంస్థలు, ఆలోచనాపరులైన విద్యావేత్తలను తయారు చేయడానికి బదులుగా పరీక్షలు నిర్వహించి డిగ్రీలు ఇచ్చే కేంద్రాలుగా మారిపోయే ప్రమాదం ఏర్పడింది.
ఇటీవల ఉపాధ్యాయ విద్యా కళాశాలల్లో అధ్యాపక నియామకాలను ప్రారంభించడం స్వాగతించదగిన విషయమే.
అయితే ఉపాధ్యాయ విద్యను సాధారణ పరిపాలనా నియామకంలా చూడకూడదు. భవిష్యత్ ఉపాధ్యాయులను తీర్చిదిద్దే అధ్యాపకులను ఎంపిక చేసే ప్రక్రియ అత్యంత శాస్త్రీయంగా, పారదర్శకంగా ఉండాలి. వారి పరిశోధనా సామర్థ్యం, బోధనా అనుభవం, విద్యా దృక్పథం, బోధనా వినూత్నత, విద్యా నాయకత్వం వంటి అంశాలకు తగిన ప్రాధాన్యం ఇవ్వాలి. ఎందుకంటే ఉపాధ్యాయులను తయారు చేసే వారి నాణ్యతే ప్రతి పాఠశాల నాణ్యతను నిర్ణయిస్తుంది.
చరిత్ర ఒక విషయాన్ని పదేపదే చెబుతోంది. అద్భుతమైన ఉపాధ్యాయ విద్యా సంస్థలను నిర్మించకుండా ఏ దేశమూ గొప్ప విద్యా వ్యవస్థను నిర్మించలేదు.
ఫిన్లాండ్ విశ్వవిద్యాలయాల్లో పరిశోధన ఆధారిత ఉపాధ్యాయ విద్యను అభివృద్ధి చేసింది.
సింగపూర్ ఉపాధ్యాయుల తయారీని, నిరంతర శిక్షణను జాతీయ ప్రాధాన్యంగా తీసుకుంది.
జపాన్, పాఠశాలల్లోనే ఉపాధ్యాయుల వృత్తిపరమైన అభ్యాస సంస్కృతిని పెంపొందించింది.
ప్రతి విజయవంతమైన దేశంలో సంస్కరణలు తరగతి గదిలో కాక, ఉపాధ్యాయులను తయారు చేసే సంస్థల్లోనే ప్రారంభమయ్యాయి.
తెలంగాణ నిజంగా ప్రపంచ స్థాయి విద్యా వ్యవస్థను నిర్మించాలనుకుంటే, ఉపాధ్యాయ విద్యా కళాశాలలు, విశ్వవిద్యాలయాల విద్యాశాఖలను పునరుజ్జీవింపజేయడం మొదటి ప్రాధాన్యంగా ఉండాలి.
మూడవ ప్రాథమిక సంస్కరణ – స్వతంత్ర విద్యా నాయకత్వం..
విద్యా వ్యవస్థను కేవలం పరిపాలనా అనుభవంతో మాత్రమే నడపలేం. ఐఏఎస్ అధికారులు విద్యావిధానాల అమలులో కీలక పాత్ర పోషిస్తారు.
కాని విద్యా దిశను నిర్దేశించేది అనుభవజ్ఞులైన ఉపాధ్యాయులు, విద్యావేత్తలు, బాల మనోవిజ్ఞాన నిపుణులు, పాఠ్యాంశ రూపకర్తలు, శాస్త్రవేత్తలు, విశ్వవిద్యాలయాల ఆచార్యులు. పిల్లలు ఎలా నేర్చుకుంటారు? విద్యా సంస్థలు ఎలా ఎదుగుతాయి? అనే విషయాలపై లోతైన అవగాహన ఉన్నవారే విద్యా సంస్కరణలకు మార్గదర్శకులు కావాలి.
విద్యా విధానాల కొనసాగింపు ప్రభుత్వాల మార్పులతో మారిపోకూడదు. విద్యా సంస్కరణలు ఎన్నికల కాలపరిమితితో కాక, ఒక తరం కాలపరిమితితో ఆలోచించబడాలి. దీర్ఘకాలిక విద్యా లక్ష్యాలకు స్వతంత్ర, నిపుణులతో కూడిన విద్యా నాయకత్వం అవసరం.
నాలుగవ ప్రాథమిక సంస్కరణ – గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలకు అత్యున్నత ప్రాధాన్యం..
కొత్త కొత్త సమాంతర విద్యా వ్యవస్థలను విస్తరించేముందు గ్రామీణ ప్రభుత్వ పాఠశాలలను బలోపేతం చేయాలి.
ప్రతి గ్రామ పాఠశాల విజ్ఞానానికి, సాంస్కృతిక కార్యక్రమాలకు, క్రీడలకు, సమాజ భాగస్వామ్యానికి కేంద్రంగా ఉండాలి.
మంచి గ్రంథాలయాన్ని కలిగి ఉండాలి. విద్యా వ్యవస్థ నాణ్యతను కొద్ది ఎలీట్ పాఠశాలలతో కాకుండా అత్యంత దూరంగా, గ్రామంలో ఉన్న ఒక చిన్న ప్రభుత్వ పాఠశాల నాణ్యతతో కొలవాలి.
సంస్కరణలకు ఒకే ఒక్క గీటురాయి..
గౌరవ ముఖ్యమంత్రి, ప్రతి విద్యా సంస్కరణను ఒకే ఒక్క ప్రశ్నతో పరీక్షించవచ్చు. ఈ సంస్కరణ వల్ల ప్రతి పరిసర ప్రభుత్వ పాఠశాల నాణ్యంగా మారుతుందా? సమాజంలోని ఏ కుటుంబమైనా తమ పిల్లలను ఎటువంటి సందేహం లేకుండా ఆ పాఠశాలలో చేర్పించగలదా? అనే ప్రశ్న వేసుకున్నప్పుడు జవాబు “అవును” అయితే ఆ సంస్కరణ సరైన దిశలో ఉందని భావించాలి.
తెలంగాణ మరో ఫిన్లాండ్‌గా, మరో జపాన్‌గా మారాల్సిన అవసరం లేదు.
అత్యుత్తమ ఉపాధ్యాయులతో, ప్రజల విశ్వాసాన్ని చూరగొన్న నాణ్యమైన పరిసర ప్రభుత్వ పాఠశాలలపై ఆధారపడిన “తెలంగాణ విద్యా నమూనా”ను నిర్మించే అవకాశం మన ముందుంది.
విద్యా సంస్కరణ విజయాన్ని విదేశీ అధ్యయన పర్యటనల సంఖ్యతో, ప్రారంభించిన భవనాలతో, రూపొందించిన వెబ్సైట్లతో, ప్రకటించిన పథకాలతో కొలవకూడదు.
ఒక సాధారణ తల్లి లేదా తండ్రి సమీప ప్రభుత్వ పాఠశాలలోకి ధైర్యంగా వెళ్లి – “నా బిడ్డ చదవాల్సింది ఇక్కడే” అని ప్రగాఢ విశ్వాసాన్ని వెలిబుచ్చ గలిగితేనే ఆ సంస్కరణ విజయవంతమైనదని చెప్పాలి.
ఆ విశ్వాసం ఏర్పడిన రోజున తెలంగాణ కేవలం తన విద్యా వ్యవస్థను సంస్కరించిన రాష్ట్రంగా కాకుండా, తన భవిష్యత్తును నిర్మించుకున్న రాష్ట్రంగా చరిత్రలో నిలిచిపోతుంది.
బలమైన ప్రభుత్వ పాఠశాలలు, అత్యుత్తమ ఉపాధ్యాయ విద్య, స్వతంత్ర విద్యా నాయకత్వం, గ్రామీణ పాఠశాలలకు అత్యున్నత ప్రాధాన్యం- ఈ నాలుగు ప్రాథమిక సంస్కరణల పైననే ప్రపంచంలోని ప్రతి విజయవంతమైన విద్యా వ్యవస్థ నిర్మితమైంది.
తెలంగాణ కూడా ఇదే మార్గాన్ని ఎంచుకుంటే, తనకంటూ ఒక విశిష్ట విద్యా నమూనాను ప్రపంచానికి చూపగలదు.
వినయపూర్వక నమస్కారములతో,
ఎడమ శ్రీనివాస రెడ్డి.
అధ్యాపకులు, కాకతీయ ప్రభుత్వ డిగ్రీ కళాశాల, హనుమకొండ,
ప్రధాన కార్యదర్శి, సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్, తెలంగాణ.
(వ్యాస రచయిత ఈపీడబ్ల్యూ, మెయిన్‌స్ట్రీమ్ వీక్లీలో విద్యారంగ సమస్యలపై వ్యాసాలు ప్రచురించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
