నిజామాబాద్ జిల్లా నందిపేట మండలంలోని డొంకేశ్వర్ గ్రామంలో, మహారాష్ట్రకు చెందిన 32 ఏళ్ల షెడ్యూల్డ్ కులం(మాల) మహిళ(వలస కూలీ)పై, ఫిబ్రవరి 13న సామూహిక అత్యాచారం జరిపి అనంతరం హత్య చేసినట్లు ఆరోపణ.
తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ, మే 20న పదిహేను రోజుల్లోగా సమగ్ర వాస్తవ నివేదికను సమర్పించాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించింది. అయినా హత్య కేసులో పురోగతి లేదని న్యాయవాది తెలిపారు.
హైదరాబాద్: దళిత మహిళ మృతిలో పోలీసుల నిర్లక్ష్యంపై సమగ్ర నివేదిక సమర్పించాలని నిజామాబాద్ పోలీసు కమిషనర్‌ను ఆదేశించి నెలకు పైగా గడిచినా, పురోగతి కనిపించలేదని అంబేద్కర్ వాద న్యాయవాది డాక్టర్ బీ కార్తిక్ నవయాన్ తెలిపారు.
అథారిటీ ఉత్తర్వులను సామాజిక మాధ్యమాల్లో పంచుకున్నారు. మే 20 నుంచి 15 రోజుల్లోగా నివేదిక సమర్పించాలని సూచించారు. అయినప్పటికీ, ఇప్పటివరకు ఎలాంటి ముందడుగు పడలేదని పేర్కొన్నారు.
లీగల్ నోటీసుతో కదిలిన అథారిటీ..
మృతురాలి బావ తరఫున న్యాయవాదులు డాక్టర్ బీ కార్తిక్ నవయాన్, స్వప్న గుంపుల మే 15న పంపిన లీగల్ నోటీసు అందిన తరువాత, తెలంగాణ హైకోర్టు మాజీ న్యాయమూర్తి, రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ చైర్మన్ డాక్టర్ బీ శివశంకరరావు విచారణ ప్రారంభించారు.
మే 15న అందిన లీగల్ నోటీసులో మహారాష్ట్రకు చెందిన ముప్పై రెండేళ్ల దళిత (మాల) మహిళపై (వలస కూలీ) ఫిబ్రవరి 13న నిజామాబాద్ జిల్లా నందిపేట మండలం డొంకేశ్వర్ గ్రామంలో సామూహిక అత్యాచారం జరిపి అనంతరం హత్య చేసినట్లు ఆరోపించారు.
అంతేకాకుండా, ఈ కేసులో బర్లా నర్సింగ్ రెడ్డి, విఠల్ ఎంఫల్వార్ అనే ఇద్దరు వ్యక్తుల పేర్లను నిందితులుగా పేర్కొన్నప్పటికీ, నందిపేట పోలీసులు, మృతురాలి భర్త దేవిదాస్ వాఘ్మారేపై మాత్రమే భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్) సెక్షన్ 108(ఆత్మహత్యకు ప్రేరేపించడం) కింద ఎఫ్ఐఆర్ నెంబరు ముప్పై మూడు నమోదు చేశారని లీగల్ నోటీసులో ఆరోపించారు.
హత్యను ఆత్మహత్యగా చిత్రీకరించే యత్నం..
ఫిర్యాదుదారు తన ఆరోపణలకు పోస్టుమార్టం నివేదికతో పాటు ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ నివేదికలను ఆధారంగా సమర్పించారు.
నివేదికలు హత్య జరిగినట్లు, అనంతరం దానిని ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేసినట్లు సూచిస్తున్నాయని ఫిర్యాదుదారు పేర్కొన్నారు.
మరణానికి ముందు తలకు తీవ్ర గాయం, ప్రాణం ఉన్నప్పుడే ఏర్పడిన ఉరి బిగింపు గుర్తులు, అలాగే ప్రతిఘటించే క్రమంలో ఏర్పడిన గాయాలు (డిఫెన్సివ్ అబ్రేజన్ గాయాలు) ఉన్నట్లు కూడా ఉత్తర్వుల్లో ప్రస్తావించారు.
దళిత కులానికి చెందిన మహిళపై సామూహిక అత్యాచారం, హత్య, సాక్ష్యాల ధ్వంసం, కులవివక్షకు సంబంధించి గుర్తించదగిన నేరాలకు ప్రాథమిక ఆధారాలు ఉన్నప్పటికీ, పోలీసులు ఉద్దేశపూర్వకంగా ఎలాంటి చర్యలు తీసుకోకపోవడం, షెడ్యూల్డ్ కులాలు, షెడ్యూల్డ్ తెగల (అత్యాచారాల నిరోధక) చట్టం, 2015లోని సెక్షన్ 4 ప్రకారం విధుల పట్ల ఉద్దేశపూర్వక నిర్లక్ష్యంగా పేర్కొన్నారు.
ఈ చర్యలు భారతీయ న్యాయ సంహిత (బీఎన్ఎస్), 2023లోని సెక్షన్ 255 పరిధిలోకి వస్తాయని లీగల్ నోటీసులో ఆరోపించారు.
లీగల్ నోటీసులో మరో ఆరోపణ ఏమిటంటే, బాధితురాలి భర్త ఇచ్చిన అనుబంధ వాంగ్మూలాన్ని క్రిమినల్ ప్రొసీజర్ కోడ్ సెక్షన్ 161 కింద మళ్లీ నమోదు చేయాలని పలు మార్లు కోరినా, దర్యాప్తు అధికారి అందుకు నిరాకరించారని పేర్కొన్నారు.
కానిస్టేబుళ్ల కుమ్మక్కు.. దర్యాప్తులో నిర్లక్ష్యం..
షబీర్, విజయ్‌గా గుర్తించిన ఇద్దరు పోలీసు కానిస్టేబుళ్లు పలుకుబడి ఉన్న నిందితులతో కుమ్మక్కై, అధికారిక పంచనామా నిర్వహించక ముందే మృతదేహాన్ని తొలగించారని, తప్పుడు వాంగ్మూలాన్ని నమోదు చేశారని, దేవిదాస్ వాఘ్మారేను ఏప్రిల్ 23న చట్టవిరుద్ధంగా అదుపులోకి తీసుకున్నారని కూడా నోటీసులో ఆరోపించారు.
ఫిర్యాదుదారు ఇప్పటికే నిజామాబాద్ పోలీసు కమిషనర్, జిల్లా కలెక్టర్, జిల్లా మేజిస్ట్రేట్లను ఆశ్రయించారు. కేసును తిరిగి దర్యాప్తు చేయాలని, సంబంధిత వ్యక్తుల వాంగ్మూలాలను మళ్లీ నమోదు చేయాలని, తగిన శిక్షార్హ నిబంధనలను చేర్చాలని, నిందితులను వెంటనే అరెస్ట్ చేయాలని, అలాగే ప్రత్యేక దర్యాప్తు బృందం (సిట్) ను ఏర్పాటు చేయాలని కోరుతూ మరో వినతిపత్రాన్ని కూడా సమర్పించినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
లీగల్ నోటీసును పరిశీలించిన, తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ సంస్థ చైర్మన్‌కు ఈ వ్యవహారంలో తక్షణ విచారణ అవసరమని, సంబంధిత అధికారుల నుంచి సమగ్ర నివేదిక కోరాల్సిన అవసరం ఉందని ప్రాథమికంగా సంతృప్తి కలిగినట్లు ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
కమిషనర్‌కు అథారిటీ సంధించిన ప్రశ్నలు..
తెలంగాణ రాష్ట్ర పోలీసు ఫిర్యాదుల అథారిటీ సంస్థ నిజామాబాద్ పోలీసు కమిషనరేట్, కమిషనర్‌ను 15 రోజుల్లోగా సమగ్ర వాస్తవ నివేదిక సమర్పించాలని ఆదేశించింది. ఆ నివేదికలో ఈ క్రింది అంశాలపై స్పష్టమైన వివరణ ఇవ్వాలని సూచించింది.
బీఎన్ఎస్ సెక్షన్ 108 కింద మాత్రమే ఎఫ్ఐఆర్ నమోదు చేయడానికి గల కారణాలు ఏమిటి? పోస్టుమార్టం నివేదిక, ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబొరేటరీ (ఎఫ్ఎస్ఎల్) నివేదికల ప్రకారం దర్యాప్తు ఏ దశలో ఉంది? దేవిదాస్ వాఘ్మారే అనుబంధ వాంగ్మూలాన్ని తిరిగి నమోదు చేశారా లేదా? ఏప్రిల్ 23న ఆయనను అదుపులోకి తీసుకున్నారనే ఆరోపణలపై వాస్తవ పరిస్థితి ఏమిటి? కానిస్టేబుళ్లు షబీర్, విజయ్ పాత్ర ఏమిటి? ఫిర్యాదుదారు గతంలో సమర్పించిన ఫిర్యాదులు, వినతిపత్రాలపై పోలీసులు ఇప్పటివరకు ఎలాంటి చర్యలు తీసుకున్నారు?
పై అన్ని అంశాలపై పూర్తి వివరాలతో నివేదిక సమర్పించాలని అథారిటీ సంస్థ తన ఉత్తర్వుల్లో ఆదేశించింది. నివేదిక సమర్పించే వరకు కేసుకు సంబంధించిన సాక్ష్యాధారాలను తారుమారు జరగకుండా చూడాలి. ఫిర్యాదుదారు లేదా సాక్షులను ఎట్టి పరిస్థితుల్లోనూ బెదిరించకుండా తగిన చర్యలు తీసుకోవాలని అథారిటీ సంస్థ ఆదేశించింది.
అయితే, డాక్టర్ బి. కార్తిక్ నవయాన్ సామాజిక మాధ్యమాల్లో చేసిన పోస్టు ప్రకారం, అథారిటీ సంస్థ నిర్దేశించిన పదిహేను రోజుల గడువు ముగిసినప్పటికీ, ఈ కేసులో ఇప్పటివరకు ఎలాంటి పురోగతి నమోదు కాలేదని ఆయన ఆరోపించారు.
అనువాదం:జె. నాగేశ్వర రావు
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
