శాంతియుత నిరసనలకూ, నిజంగా అంతరాయం కలిగించే చర్యలకూ మధ్య తేడా చూపకుండా రూపొందించిన ప్రవర్తనా నియమావళి తమ రాజ్యాంగబద్ధ హక్కులపై భయానక ప్రభావం చూపుతోందని ఎంఎన్‌ఎల్‌యూ నాగపూర్ విద్యార్థులు తెలిపారు.
జూలై 5 నుంచి మహారాష్ట్ర నేషనల్ లా యూనివర్సిటీ, నాగ్‌పూర్ విద్యార్థులు క్యాంపస్‌లో భిన్నాభిప్రాయాలను అణచివేయడం, అధ్వాన్నమైన వసతి పరిస్థితులు, యాజమాన్యం ఏకపక్షంగా వ్యవహరించడం, ఇంటర్న్‌షిప్‌లు, ప్లేస్మెంట్లకు తగిన సహాయం లేకపోవడం లాంటి అంశాలపై నిరసన ప్రారంభించారు.
నిరసన ప్రారంభ సమయంలో కొంతమంది అధ్యాపకులు విద్యార్థులకు మద్దతు ఇవ్వగా, మరికొందరు దానిని నిరుత్సాహపరిచారని విద్యార్థులు తెలిపారు.
రాజ్యాంగబద్ధ హక్కుల హననం..
ఈ నిరసనకు ముందు, విద్యార్థులు జూలై 5న వైస్-చాన్సలర్ ప్రొఫెసర్ విజయేందర్ కుమార్, రిజిస్ట్రార్‌కు ఒక వినతిపత్రం సమర్పించారు.
ఆ వినతిపత్రంలో యూనివర్సిటీ అకడమిక్ కోడ్ ఆఫ్ కాండక్ట్ నిబంధనపై అభ్యంతరం వ్యక్తం చేశారు.
ఆ నిబంధన ప్రకారం నిరాహార దీక్షలు, ధర్నాలు, ఘెరావ్‌లు, సిట్-ఇన్లు అన్నింటినీ క్రమశిక్షణా ఉల్లంఘనగా పరిగణిస్తున్నారు.
విద్యార్థుల అభిప్రాయం ప్రకారం, శాంతియుత నిరసనలకు, నిజంగా అంతరాయం కలిగించే చర్యలకు మధ్య తేడా చూపకుండా ఈ నియమావళి రూపొందించబడటంతో, రాజ్యాంగంలోని అధికరణ 19(1)(ఎ) (భావ ప్రకటనా స్వేచ్ఛ), 19(1)(బి) శాంతియుత సమావేశాల హక్కు కింద తమకు ఉన్న హక్కులను వినియోగించుకొనేందుకు భయపడే పరిస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేశారు.
యాజమాన్యం నిర్లక్ష్యం, కనీస వసతుల లేమి..
వైస్-చాన్సలర్ నిర్వహించిన ఓపెన్ హౌస్ సమావేశాల్లో సమస్యలు ప్రస్తావించిన విద్యార్థుల పేర్లను అక్కడే ఉన్న అధ్యాపకులు నమోదు చేశారని కూడా వినతిపత్రంలో పేర్కొన్నారు.
అలాగే, ఇద్దరు విద్యార్థులు ప్రమాదానికి గురైన తర్వాత రిజిస్ట్రార్, చీఫ్ వార్డెన్ తదితర ఉన్నతాధికారులు అనుచిత వ్యాఖ్యలు చేశారని, వాటివల్ల బాధిత విద్యార్థులు, వారి సహచరులు తీవ్ర మనోవేదనకు గురయ్యారని ఆరోపించారు.
వినతిపత్రంలో ప్రధాన క్యాంపస్‌లో చాలా కాలంగా సక్రమమైన క్యాంటీన్ లేకపోవడం, సాయంత్రం 6 గంటల తర్వాత ఆహార సరఫరాను హాస్టల్ గేటు వరకే పరిమితం చేయడం గురించి కూడా ప్రస్తావించారు.
మెస్ సమీపంలో జరిగిన అగ్నిప్రమాద సమయంలో రిజిస్ట్రార్ స్వయంగా సంఘటనా స్థలానికి రాలేదని, హాస్టల్, అకడమిక్ బ్లాక్‌లలో తగినన్ని ఫైర్ ఎక్స్టింగ్విషర్లు లేవని పేర్కొన్నారు.
రిజిస్ట్రార్ ఆదేశాలతో అకడమిక్ బ్లాక్‌కు విద్యార్థుల ప్రవేశాన్ని పరిమితం చేశారని, హాస్టల్ నిబంధనలు ఇప్పటికీ అధికారికంగా అమల్లోకి రాలేదని కూడా తెలిపారు.
వేర్వేరు బ్యాచ్‌ల విద్యార్థులు ఒకరి గదికి మరొకరు వెళ్లినప్పుడు వార్డెన్లు వారిని ప్రశ్నిస్తున్నారని, బాలుర హాస్టల్లోని సీసీటీవీ పర్యవేక్షణను కూడా తోటి విద్యార్థులతో పరస్పర సంబంధాలను నిరుత్సాహపరచడానికి ఉపయోగిస్తున్నారని ఆరోపించారు.
డోంగర్గావ్ క్యాంపస్‌లో దుర్భర పరిస్థితులు..
వినతిపత్రంలో పెద్ద భాగం డోంగర్‌గావ్‌లో ఉన్న యూనివర్సిటీ విస్తరించిన హాస్టల్ క్యాంపస్ పరిస్థితుల గురించి ఉంది. 2025 ఆగస్టు నుంచి అక్కడ నివసిస్తున్న విద్యార్థులు తాగునీటి సమస్య, తరచూ విద్యుత్ కోతలు, పారిశుద్ధ్య లోపాలు, పాములు, తేళ్లు తరచూ కనిపించడం లాంటి సమస్యలను ప్రస్తావించారు.
మహిళా విద్యార్థుల భద్రత, గోప్యతపై కూడా ఆందోళన వ్యక్తం చేశారు.
ఒకే రూములో ఉంటున్న తోటి విద్యార్థుల అనుచిత ప్రవర్తనకు సంబంధించిన కొన్ని ఘటనలపై ఫిర్యాదులు చేసినప్పటికీ యాజమాన్యం స్పందించలేదని ఆరోపించారు.
రవాణా సమస్యల విషయానికి వస్తే, జూలై 1న సాయంత్రం డోంగర్‌గావ్‌కు విద్యార్థులను తీసుకెళ్లేందుకు ఒకే ఒక్క బస్సు రావడంతో పలువురు విద్యార్థులు అక్కడే చిక్కుకుపోయారని తెలిపారు.
కొందరు సొంత ఖర్చుతో ప్రైవేట్ వాహనాలు ఏర్పాటు చేసుకోగా, మరికొందరు కిక్కిరిసిన బస్సు ఫుట్‌బోర్డుపై నిలబడి ప్రయాణించాల్సి వచ్చిందని పేర్కొన్నారు.
ఆంక్షల చట్రంలో సాంస్కృతిక, అకడమిక్ కార్యక్రమాలు..
సాంస్కృతిక కార్యక్రమాలపై కూడా యాజమాన్యం అధిక ఆంక్షలు విధించిందని విద్యార్థులు ఆరోపించారు.
డీజే నైట్లు నిషేధించడం, స్పాన్సర్షిప్లను అనుమతించకపోవడం, సాంస్కృతిక ఉత్సవాలను రాత్రి 9:30 గంటలకే ముగించాలనే నిబంధనల కారణంగా విద్యార్థులకు వినోద కార్యక్రమాలు దాదాపు లేకుండా పోయాయని తెలిపారు.
దీని ఫలితంగా విశ్వవిద్యాలయం అందిస్తున్న మానసిక ఆరోగ్య కౌన్సెలింగ్‌ను ఆశ్రయించే విద్యార్థుల సంఖ్య పెరిగిందని పేర్కొన్నారు.
ప్లేస్మెంట్ల విషయంలో ప్రత్యేక ప్లేస్మెంట్ ఆఫీసర్ లేకపోవడంతో ఇంటర్న్‌షిప్‌లు, ఉద్యోగాలు పూర్తిగా విద్యార్థుల వ్యక్తిగత ప్రయత్నాలపైనే ఆధారపడుతున్నాయని వినతిపత్రంలో పేర్కొన్నారు.
గతంలో ఒక అధ్యాపకుడిపై బాటిల్ విసిరిన ఘటన, క్యాంపస్ వెలుపల టీ దుకాణంపై ఎన్సీబీ దాడి లాంటి సంఘటనల తర్వాత యాజమాన్యం తీసుకున్న క్రమశిక్షణా చర్యలు అతిగా ఉన్నాయని విద్యార్థులు విమర్శించారు.
ఆ సమయంలో కొంతమంది విద్యార్థులు మైనర్లు అయినప్పటికీ, పోలీసు విచారణలో వారికి సంస్థ నుంచి ఎలాంటి సహాయం అందలేదని తెలిపారు.
విద్యా సంబంధిత అంశాల్లో, పరీక్షలో ఐదు మార్కులలోపు తేడాతో ఫెయిల్ అయిన విద్యార్థులకు రీ-వాల్యుయేషన్ అనుమతించని నిబంధన పునఃసమీక్షించాలని, అలాగే బీఏ ఎల్ఎల్బీ కోర్సు విద్యార్థులు అప్రెంటిస్‌షిప్ సెమిస్టర్లో క్యాంపస్ వెలుపల ఉన్నప్పటికీ వారిపై వసూలు చేస్తున్న ఫీజుల వివరాలను స్పష్టం చేయాలని కోరారు.
పరిష్కారం దొరక్క నిరసన బాట..
అన్ని అంతర్గత మార్గాలను ఉపయోగించిన తర్వాత కూడా సమస్యలకు పరిష్కారం లభించకపోవడంతోనే ఈ వినతిపత్రం సమర్పించామని విద్యార్థులు పేర్కొన్నారు.
తాము లేవనెత్తిన అంశాలను వృత్తిపరమైన దృక్పథంతో పరిశీలించాలని, అలాగే ఈ సమస్యలను ప్రస్తావించినందుకు తమపై క్రమశిక్షణా చర్యలు తీసుకుంటారనే భయం తమలో ఉందని తెలిపారు.
విద్యార్థులు ప్రస్తుతం కాలపరిమితి ఉన్న డిమాండ్ల జాబితాను సిద్ధం చేస్తున్నారని చెప్పారు.
యాజమాన్యం ఈ సమావేశాన్ని గదిలోపల నిర్వహించాలని కోరుతున్నప్పటికీ, తాము బహిరంగ సమావేశం కావాలని పట్టుబడుతున్నామని విద్యార్థులు తెలిపారు.
ఈ అంశంపై స్పందన కోసం బార్ అండ్ బెంచ్ పత్రిక పలుమార్లు ఎంఎన్‌ఎల్‌యూ నాగ్‌పూర్ వైస్-చాన్సలర్‌ను సంప్రదించినప్పటికీ, ఈ కథనం ప్రచురించే సమయానికి ఆయన నుంచి ఎలాంటి స్పందన రాలేదు.
అనువాదం: డి. వెంకన్న
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
