ఒకప్పుడు భారతీయ మార్కెట్లో తిరుగులేని బంగారు సామ్రాజ్యంగా, స్విస్ రిఫైనరీ ‘వాల్కంబి’ని కొనుగోలు చేసి ప్రపంచవ్యాప్తంగా బెంగళూరు దిగ్గజం ‘రాజేష్ ఎక్స్‌పోర్ట్స్’ జైత్రయాత్ర చేసింది.
కానీ నేడు, అదే సామ్రాజ్యం చుట్టూ రూ 15.15 లక్షల కోట్ల ఆదాయ అవకతవకల సెగలు చుట్టుముడుతున్నాయి.
ఈ దేశంలో సామాన్య పెట్టుబడిదారుడు తన రక్తాన్ని చెమటగా మార్చి దాచుకున్న సొమ్మును, మార్కెట్ నియంత్రణ సంస్థ అయిన ‘సెబీ’ని నమ్మి ఇన్వెస్ట్ చేస్తే, చివరకు మిగిలింది గుండెకోత మాత్రమే. ఈ భారీ కుంభకోణంలో అసలు దోషి కంపెనీయా? లేక కళ్ళుండి కూడా చూడలేని, చేతులు కాలాక ఆకులు పట్టుకునే వ్యవస్థలా?
ఆకాశమంత సామ్రాజ్యం.. అగాధమంత పతనం..
1980ల్లో కేవలం రూ 1,200 అప్పుతో మొదలైన రాజేష్ మెహతా ప్రస్థానం, 2015లో రూ 3,800 కోట్ల ఆల్-క్యాష్ డీల్‌తో స్విట్జర్లాండ్‌కు చెందిన వాల్కంబి రిఫైనరీని కొనే స్థాయికి చేరింది.
అయితే, ఏ గగన విహారానికైనా ఒక ముగింపు ఉంటుంది.
ఆర్థిక సంవత్సరం 2021 నుంచి 2025 మధ్య కాలంలో కంపెనీ చూపిన మొత్తం ఆదాయంలో దాదాపు 99.80% (రూ 15.15 లక్షల కోట్లు) కేవలం కాగితాల మీదే సృష్టించిన మాయాజాలం అని సెబీ ప్రాథమికంగా ఆరోపించడంతో ఈ సామ్రాజ్యం కుప్పకూలింది.
తీగ లాగితే డొంక కదిలింది ఇలా..
మార్చి 2024లో ఒక అప్రమత్తమైన షేర్‌హోల్డర్ ఇచ్చిన ఫిర్యాదుతో సెబీ దర్యాప్తు ప్రారంభమైంది.
రెండేళ్లు దాటినా వసూలు కాని భారీ ట్రేడ్ రిసీవబుల్స్(రావలసిన బాకీలు) పై అనుమానం వచ్చి, సెబీ ఫోరెన్సిక్ ఆడిటర్ ‘బీడీఓ’ను రంగంలోకి దించింది.
ఆడిటర్లు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ దాఖలు చేసిన రికార్డులను, వారి స్విస్ అనుబంధ సంస్థ వాల్కంబి రికార్డులతో పోల్చి చూసినప్పుడు అసలు గుట్టు రట్టయింది.
ఆడిటింగ్ లెక్కల్లో తేలిన అసలు ‘గోల్మాల్’..
రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ తన మొత్తం గ్రూప్ ఆదాయంలో 97% నుంచి 99% విదేశీ అనుబంధ సంస్థల నుంచే వస్తోందని చూపించింది.
కానీ, కేపీఎంజీ ఆడిట్ చేసిన వాల్కంబి స్టాండ్అలోన్ రికార్డులను పరిశీలిస్తే, వారి ఐదేళ్ల ఆదాయం కేవలం రూ 3,027 కోట్లు మాత్రమే అని తేలింది.
ఈ రెండింటి మధ్య ఉన్న రూ 15.15 లక్షల కోట్ల భారీ వ్యత్యాసమే ఈ వివాదానికి మూలకారణం.
డెరివేటివ్స్ ట్రేడింగ్ వెనుక దాగున్న రహస్యం..
కంపెనీ చైర్మన్ రాజేష్ మెహతా, సెబీ రిజిస్టర్డ్ బ్రోకర్ ‘అఫ్లుయెన్స్ షేర్స్ అండ్ స్టాక్స్’ ద్వారా రూ 11,487 కోట్ల విలువైన గోల్డ్ డెరివేటివ్స్ విక్రయించి, మళ్లీ రూ 11,488 కోట్ల డెరివేటివ్స్ కొనుగోలు చేసినట్లు రికార్డులు చెప్తున్నాయి.
విచిత్రమేమిటంటే, అసలు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ అనే కంపెనీ తమ క్లయింటే కాదని, అలాంటి లావాదేవీలే జరగలేదని అఫ్లుయెన్స్ సంస్థ దర్యాప్తులో బాంబు పేల్చింది.
సమర్పించింది 400 జీబీ డేటా.. కానీ సహకారం శూన్యం..
సెబీ దర్యాప్తుకు రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ పూర్తిగా సహకరించలేదనే ఆరోపణలు ఉన్నాయి. కస్టమర్ల వివరాలు, వెండర్ రికార్డులు, విదేశీ సంస్థల పూర్తి ఆర్థిక నివేదికలను కంపెనీ దాచింది.
అయితే, తాము ఏకంగా 400 జీబీ డేటాను సెబీకి అందించామని, బల్కీగా(భారీగా) ఉండటం వల్ల సెబీ అధికారులు వాటిని సరిగ్గా చదవలేకపోయారని రాజేష్ మెహతా ఎదురుదాడికి దిగడం గమనార్హం.
కంపెనీ వాదన: ‘టర్నోవర్‌కు, మార్జిన్‌కు తేడా తెలియదా?’..
రాజేష్ మెహతా వాదన ప్రకారం- ఇదంతా సెబీకి ఉన్న కమ్యూనికేషన్ గ్యాప్, అపోహ మాత్రమే.
బంగారం రిఫైనింగ్ వ్యాపారంలో ముడి బంగారాన్ని కొని, శుద్ధి చేసి చిన్న మార్జిన్‌తో అమ్ముతారు. వాల్కంబి స్టాండ్అలోన్ బుక్స్‌లో కేవలం ఆ ప్రాసెసింగ్ ఫీజు(మార్జిన్) మాత్రమే నమోదవుతుందని, గ్రూప్ హోల్డింగ్ సంస్థ లెక్కల్లో మొత్తం టర్నోవర్ నమోదవుతుందని, సెబీ ఈ రెండింటికీ కన్ఫ్యూజ్ అయిందని ఆయన వాదిస్తున్నారు.
లోయర్ సర్క్యూట్ల ఉచ్చు.. ఇన్వెస్టర్ల కన్నీళ్లు..
ఈ ఆరోపణల నేపథ్యంలో 2026 జూన్‌లో సెబీ తాత్కాలిక ఆదేశాలు జారీ చేయడమే ఆలస్యం, రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ షేరు విలువలూ పాతాళానికి పడిపోయాయి.
ఒకప్పుడు రూ 1,028 వద్ద పలికిన షేరు ఏకంగా 5% లోయర్ సర్క్యూట్లతో రూ 80కి పడిపోయింది.
గత కొన్నేళ్లలో ఏకంగా 80% పైగా సంపద ఆవిరైపోవడంతో సామాన్య పెట్టుబడిదారులు, ఎల్ఐసీ వంటి ప్రభుత్వ సంస్థల నిధులు నిలువునా మునిగిపోయాయి.
ఈ కుంభకోణానికి సెబీనే ఎందుకు బాధ్యత వహించాలి?..
ఇక్కడే అసలు ప్రశ్న తలెత్తుతోంది.
ఈ దేశంలో ఒక కంపెనీ ఐదేళ్లపాటు(ఆర్థిక సంవత్సరం 21 నుంచి 25) లక్షల కోట్ల రూపాయల తప్పుడు లెక్కలు చూపిస్తుంటే, మార్కెట్ వాచ్‌డాగ్‌గా ఉన్న సెబీ ఏం చేస్తోంది? ఇన్వెస్టర్ల ప్రయోజనాలను రక్షించడమే పరమావధిగా పెట్టుకున్న సంస్థ, ఇంత పెద్ద మోసాన్ని ముందే ఎందుకు పసిగట్టలేకపోయింది?
ప్రతి త్రైమాసికం కంపెనీలు ఫైల్ చేసే నివేదికలను సెబీ కేవలం ఒక పోస్ట్‌మ్యాన్‌లా స్వీకరిస్తుందా, లేక పరిశీలిస్తుందా?
ఆలస్యపు దర్యాప్తు… ఎస్కేప్ రూట్ ఇచ్చినట్లేనా?..
దాదాపు 20 నెలల పాటు బహిరంగ దర్యాప్తు జరిపిన తర్వాత, కేవలం 2% సాక్ష్యాల ఆధారంగానే ఫోరెన్సిక్ ఆడిట్ నిర్వహించి, ఇప్పుడు హడావిడిగా ‘ఎక్స్-పార్టీ'(ఏకపక్ష) తాత్కాలిక ఉత్తర్వులు ఇవ్వడం సెబీ వైఫల్యాన్ని ఎత్తిచూపుతోంది.
ఈ 20 నెలల కాలంలో స్మార్ట్ ఇన్వెస్టర్లు, ప్రమోటర్లు తమ నిధులను సురక్షిత ప్రాంతాలకు తరలించుకోవడానికి సెబీనే పరోక్షంగా సమయం ఇచ్చినట్లయింది.
కంటితుడుపు చర్యలు.. తేలికపాటి శిక్షలు..
రూ 15 లక్షల కోట్ల భారీ కుంభకోణం అని ఆరోపిస్తూ, సెబీ ఇచ్చిన ఆదేశాలు మాత్రం చాలా సున్నితంగా ఉన్నాయి.
రాజేష్ మెహతాను మార్కెట్ నుంచి తాత్కాలికంగా నిషేధించడం, రికార్డులను సరిచేయమనడం చూస్తుంటే కొండను తవ్వి ఎలుకను పట్టినట్లుంది.
ఇంతటి నమ్మకద్రోహానికి పాల్పడిన వారిపై తక్షణ క్రిమినల్ చర్యలు, ఆస్తుల జప్తు వంటి కఠినమైన చర్యలు తీసుకోకపోవడం సామాన్యుడికి వ్యవస్థపై నమ్మకాన్ని పోగొడుతోంది.
సెబీ ప్రస్తుతం ఏమి చేస్తోంది?..
ప్రస్తుతం సెబీ జారీ చేసిన 109 పేజీల తాత్కాలిక ఆదేశాల ప్రకారం, రాజేష్ మెహతా సెక్యూరిటీల మార్కెట్లో లావాదేవీలు జరపకుండా నిషేధించింది. తప్పుడు ఫైలింగ్స్‌ను సరిదిద్దాలని కంపెనీని ఆదేశించింది.
అలాగే, విదేశీ అనుబంధ సంస్థల నుంచి పూర్తి స్థాయి ఆడిట్ పత్రాలను సమర్పించాలని ఒత్తిడి తెస్తోంది. అయితే ఈ చర్యలన్నీ ‘ఇళ్లు కాలిన తర్వాత బావులు తవ్వినట్లు’ ఉన్నాయి.
తక్షణమే ఏం చేయాలి?..
సెబీ ఇకనైనా ఒక రిటైల్ వ్యాపార కోణంలో కాకుండా, హై-వాల్యూమ్, థిన్-మార్జిన్ కలిగిన అంతర్జాతీయ కమోడిటీ వ్యాపారాల అకౌంటింగ్ ప్రమాణాలను లోతుగా పరిశీలించాలి.
ఒకవేళ మోసం నిజమని తేలితే, కేవలం మార్కెట్ నిషేధాలతో సరిపెట్టకుండా ప్రమోటర్ల వ్యక్తిగత ఆస్తులను అటాచ్ చేయాలి. క్రిమినల్ ఇన్వెస్టిగేషన్ ఏజెన్సీలను రంగంలోకి దించాలి.
అంతర్జాతీయ కొరడా.. అక్కడ జైలు శిక్షలు… ఇక్కడ నోటీసుల ప్రహసనమా?..
ఇలాంటి భారీ కార్పొరేట్ మోసాలు, అకౌంటింగ్ మాయాజాలాలు జరిగినప్పుడు అంతర్జాతీయ నియంత్రణ సంస్థలు ఎంత ఉక్కుపాదంతో అణచివేస్తాయో ‘సెబీ’ చూసి నేర్చుకోవాలి.
అమెరికాలో ‘ఎన్రాన్’ కుంభకోణం తర్వాత తీసుకువచ్చిన ‘సార్బేన్స్-ఆక్స్లీ చట్టం’ ప్రకారం- కంపెనీ లెక్కల్లో తప్పులున్నా, తప్పుడు సమాచారంతో ఇన్వెస్టర్లను బురిడీ కొట్టించినా ప్రమోటర్లకు, సీఈఓలకు ఏకంగా 20 ఏళ్ల వరకు జైలు శిక్ష విధించే కఠిన నిబంధనలు ఉన్నాయి.
బ్రిటన్‌కు చెందిన ‘ఫైనాన్షియల్ కాండక్ట్ అథారిటీ’ ఇలాంటి అనుమానాస్పద లావాదేవీలు కనిపిస్తే నిమిషాల వ్యవధిలో ఆస్తులను స్తంభింపజేసి, క్రిమినల్ విచారణకు ఆదేశిస్తుంది. కానీ, మన దేశంలో రూ 15.15 లక్షల కోట్ల అగాధం కళ్లముందు కనిపిస్తున్నా- మన నియంత్రణ చట్టాలు, సెబీ వ్యవస్థలు కేవలం ‘నోటీసులు’ జారీ చేయడం, ‘సహకరించడం లేదు’ అంటూ కాలయాపన చేయడం సామాన్య మదుపరులను దగా చేయడమే.
అంతర్జాతీయ స్థాయి కఠిన చట్టాల అమలు, తక్షణ జైలు శిక్షలు లేనంత కాలం, ఇక్కడి కార్పొరేట్ తిమింగలాలకు సామాన్యుడి సొమ్మును కొల్లగొట్టడం ఒక సులువైన వ్యాపారంగానే మిగిలిపోతుంది.
నియంత్రణ వ్యవస్థల్లో మారాల్సిన ధోరణి..
భారత మార్కెట్ నియంత్రణ సంస్థల వైఖరి ఎప్పుడూ ‘పోస్ట్-మార్టం'(సమస్య జరిగాక విశ్లేషించడం) లాగే ఉంటోంది తప్ప ‘ప్రివెంటివ్'(రాకుండా ఆపడం)గా ఉండటం లేదు.
సత్యం కంప్యూటర్స్ నుంచి నేటి రాజేష్ ఎక్స్‌పోర్ట్స్ వరకు ప్రతిసారీ రిటైల్ ఇన్వెస్టర్ల సంపద కొల్లగొట్టిన తర్వాతే సెబీ మేల్కొంటోంది. ఈ ధోరణి మారకపోతే భారతీయ స్టాక్ మార్కెట్ ఒక జూదశాలగా మిగిలిపోతుంది.
ఇన్వెస్టర్లకు ఇదొక చేదు పాఠం..
మార్కెట్ నిపుణుల అభిప్రాయం ప్రకారం, కేవలం కంపెనీ టర్నోవర్, బ్రాండ్ వాల్యూ, గత స్టాక్ ధరల రికార్డులను మాత్రమే చూసి పెట్టుబడులు పెట్టకూడదు.
కంపెనీ కార్పొరేట్ గవర్నెన్స్(పరిపాలన ప్రమాణాలు), లిక్విడిటీ, క్యాష్ క్వాలిటీ, ముఖ్యంగా ఆడిటర్ల వ్యాఖ్యలను నిరంతరం గమనించాలి. అపారదర్శకత ఎక్కడ ఉంటే అక్కడ ప్రమాదం పొంచి ఉన్నట్లే.
సామాన్యుడి నమ్మకానికి ప్రాణం పోసేదెవరు?..
రూ 15 లక్షల కోట్ల ఈ ‘రాజేశ్ ఎక్స్‌పోర్ట్స్’ ఉదంతం భారత ఆర్థిక రంగానికి ఒక హెచ్చరిక. ఇది కేవలం ఒక కంపెనీ చేసిన తప్పు కాదు, వ్యవస్థల నిస్సహాయతకు నిదర్శనం.
సెబీ కేవలం నోటీసులతో కాలయాపన చేయకుండా, తప్పు చేసిన వారిని బోనులో నిలబెట్టి, బాధ్యతారాహిత్యంగా వ్యవహరించిన తన అధికారులపై కూడా చర్యలు తీసుకున్నప్పుడే సామాన్య మదుపరుడి నమ్మకానికి, పెట్టుబడికి ఈ దేశంలో రక్షణ ఉంటుంది.
భవిష్యత్తులో ఇలాంటి మోసాలు పునరావృతం కాకుండా చూడటమే సెబీ ముందున్న ఏకైక అజెండా కావాలి.
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
