“గాడిద లొటపెట అయితదా అన్న అనుమానమే వద్దు. రాజకీయ మందుదంటే ఏది ఏదన్న గావొచ్చు”- 1970లో తెలంగాణ ప్రజల భాషలో నేను రాసిన కవితా చరణం.
రాజకీయాల్లోకి పౌరాణిక పాత్ర రాముణ్ణి లాగొచ్చు. చరిత్ర నుంచి బాబర్(బాబ్రీ)ని లాగొచ్చు.
మహిమల్ని, మతాల్ని లాగొచ్చు. మత కలహాల పేరుతో దేశ ప్రజల భయభ్రాంతుల్ని కూడా రాజకీయం చెయొచ్చు.
అసలైతే చరిత్ర తెలిసిన వారందరికీ తెలుసు, ఈ దేశంలో మత సహనం జాతి సంస్కృతిలో అంతర్భాగమని; రాజకీయం ఒక్కోసారి ఒక్కో విషయంపై దృష్టి కేంద్రీకరిస్తుంది, ఉపయోగించుకుంటుంది.
మత కలహాల పేరుతో జరిగిన హత్యాకాండల్లోంచి రాజకీయాన్ని మైనస్ చేసి చూడండి.
చెదురుముదురు సంఘటనలు, చిన్న చిన్న పాత కక్షలు తప్ప, మతాల మధ్య, సామాన్యుల మధ్య నిజంగా కలహాల్లేవు. జరిగింది, జరుగుతూ ఉన్నది అంతా రాజకీయ వారసులు పోటీ పడడమే.
మతాల సారాంశం – ఇస్లాంపై వచ్చిన చిత్రాలు..
మతాన్ని సరైన అర్థంలో అవగాహన చేసుకోవడానికి వివిధ మతాలపై చలన చిత్రాలొచ్చాయి.
ఒక్కో మతం ఎలా పుట్టింది? ఎందుకు పుట్టింది? ఎలా వ్యాప్తి చెందింది? ఏం సాధించింది? దాని ప్రాథమిక సూత్రాలేమిటి? వంటి విషయాలు ఆలోచించినపుడు మనిషి మనిషిగా బతకాలని అన్ని మతాలు చెబుతున్నాయి. వాటి సారాన్ని తెలియజెప్పే కొన్ని ముఖ్యమైన సినిమాలు చూస్తే చాలు.
ఎందుకంటే, ఆయా చిత్ర దర్శకులు ఎంతో అధ్యయనం చేసి, పరిశోధన చేసి తమకంటూ ఒక నిర్దుష్టమైన అవగాహన ఏర్పరుచుకుని తీశారు కాబట్టి.
‘ఇస్లాం ఇన్ ఇండియా’- అనే సినిమాను దర్శకురాలు షమా జైదీ రూపొందించారు.
భారతదేశపు కోస్తా ప్రాంతాలలో అరబ్బులు వ్యాపారం చేయడం, మహ్మద్ బిన్ ఖాసిం, సింధ్ దాని పరిసర ప్రాంతాల్ని జయించడం – టర్కీ, ఆఫ్ఘనిస్తాన్ల నుంచి ఎంతో మంది ఈ దేశాన్ని ఆక్రమించడం, స్థావరాలేర్పరుచుకోవడం – ఇస్లాం మత ప్రాప్తికి, వ్యాప్తికి ఎంతో దోహదం చేశాయి.
అలాగే సూఫీ మత నాయకులూ, భక్తులూ దాతా గంజ్ బక్ష్, మొయినుద్దీన్ చిస్తీ, భక్తియార్ కాకీ, బాబా ఫరీద్, సయ్యద్ అలీ హమదానీ, షమ్స్ తబ్రేజ్ వంటి వారంతా ఈ నేల మీద శాంతి, సంతోషాల్ని నిలిపిపోయారు. అందుకే వేల ఏళ్ళ నుంచి ముస్లిం సంప్రదాయాలు, జీవిత విధానాలు భారతీయ సంస్కృతిలో భాగమయ్యాయి.
రెండు గంటల పాటు నడిచే ఈ ఇంగ్లీషు చిత్రాన్ని షమా జైదీ ప్రతిభావంతంగా తెరకెక్కించారు. ఈమెకు లోగడ శ్యామ్ బెనెగల్ చిత్రాలకు స్క్రిప్టు రాసిన అనుభవముంది.
సత్యజిత్ రే ‘శత్రంజ్ కే ఖిలాడీ’కి కాస్ట్యూమ్స్ సమకూర్చిన అనుభవముంది. ఎంఎస్ సత్యు ‘గరం హవా’, “కన్నేశ్వర రామా”, ‘బరి’ వంటి గొప్ప చిత్రాలెన్నింటికో స్క్రిప్టు రాశారు.
ఇలాంటిదే మరో ఫ్రెంచ్ సినిమా ‘వాయిస్ ఆఫ్ అల్లాహ్’. ఇది నైజీరియాలో ఇస్లాం మత వ్యాప్తి గురించి చర్చించింది.
ఎలెన్ డి లాటర్ అనే దర్శకురాలు రూపొందించిన ఈ చిత్రంలో అల్లాహ్ దూత అయిన షేక్, ఇస్లాం ఆధ్యాత్మిక, ధార్మిక విశేషాలపై ఇచ్చిన వివరాలు ఉన్నాయి.
నాస్తిక వాదులు ముస్లిం విధానాలను విమర్శించడం కూడా చిత్రంలో ఉంది. అంటే విషయాన్ని అన్ని కోణాల్నించి స్పృశించినట్లుగా అనిపిస్తుంది.
అయితే ఇస్లాం మతంపై వచ్చిన ఈ రెండు చిత్రాలూ మహిళా దర్శకులే రూపొందించడం విశేషం.
బౌద్ధ మతం – డాక్యుమెంటరీలు..
బౌద్ధ మతంపై దృష్టి సారించి దర్శకుడు ప్రకాశ్ మెహతా ‘జ్యువెల్ ఇన్ ద లోటస్’ చిత్రాన్ని రూపొందించారు.
మహాయాన బౌద్ధమత ప్రకారం పద్మం, దాని రంగుల ప్రాముఖ్యతను విశ్లేషించారు. ఈ చిత్రానికి సంబంధించిన చిత్రీకరణ టిబెట్‌లోని బౌద్ధారామంలో జరిగింది.
‘బుద్ధిస్ట్ కల్చర్ అండ్ పాలి’ అనే మరో లఘు చిత్రం సుహాసిని ముఖర్జీ రూపొందించారు.
సత్యం, ప్రేమ, స్వేచ్ఛ, మానవత్వం, అహింస వంటి విషయాలపై గౌతమ బుద్ధుడిచ్చిన వివరణల్ని దృశ్యమయం చేశారు.
బుద్ధుడి రచనలు / బోధనలు ఏవీ లిఖితపూర్వకంగా లేవు. ఆయన తన శిష్యకోటికి బోధించినవే మౌఖిక ప్రచారాన్ని పొందాయి.
బుద్ధుడు పాళీ భాషలో బోధ చేశారు. అది మార్పులు చెంది ‘మాగధి’ భాష అయింది.
‘పాళీ’ అంటే పవిత్రమైన వాచకం అని అర్థం. ఇది ఇతర భారతీయ మాండలికాలపై గొప్ప ప్రభావాన్ని చూపిందని తర్వాత కాలంలో పరిశోధకులు తేల్చారు.
ఇదే బౌద్ధ మతానికి సంబంధించి ‘ఓషన్ ఆఫ్ విజ్డమ్’ (జ్ఞాన సముద్రం) అనే మరో లఘు చిత్రం కూడా వచ్చింది.
ఇది పద్నాలుగవ దలైలామా టెన్జిన్ గ్యాత్సో జీవిత చిత్రణ. ఆరు మిలియన్ల టిబెట్ ప్రజలకు ఏకైక మత నాయకుడిగా ఆయన ఎంతటి ప్రాముఖ్యాన్ని సంపాదించుకున్నారన్నది ఈ చిత్రం చూపుతుంది.
బౌద్ధానికి మూల పురుషుడైన బుద్ధుడు హిందువుల దశావతారాల్లో ఒకడు ఎట్లా అయ్యాడు – అనేది ఎవరూ సినిమా తీసినట్టు లేదు.
పోనీ కూలంకషంగా చర్చించినట్టు లేదు. బౌద్ధుల కన్నా ముఖ్యంగా ఈ విషయం మీద హిందూ మత పెద్దలు మాట్లాడాలి. ఏ కొంచెం మంచి కనిపించినా ‘మేం వారిని దేవుణ్ణి చేస్తాం’ అని చెబుతారేమో.
అలాగైతే జైనుడేం తక్కువ చేశాడు, జైనుణ్ణి మరో అవతారంగా కలుపుకోవాల్సింది. షిరిడీ బాబా దాదాపు దేవుడై పూజలందుకుంటున్నాడు. పౌరోహిత్యం నెరిపే వారంతా బాబా గుళ్ళలో ఇమిడి పోయారు. ఓ సినీ నటికి గుడి కట్టిన మూఢ జనం ఏమైనా చేయగలరు. అందుకే ప్రసిద్ధ శాస్త్రవేత్త అంటారు “విశ్వానికి అంతుందేమో గాని, మూఢత్వానికి లేదు” – అని.
కులవ్యవస్థపై తిరుగుబాటు – ‘మాలపిల్ల’..
తెలుగు చలన చిత్రాలు ప్రారంభమైన తొలి రోజుల్లోనే, జాతిని చైతన్యం చేయడానికి గూడవల్లి రామబ్రహ్మం కంకణం కట్టుకున్నారు. అంటరానితనం అడుగంటాలని, కులవ్యవస్థను కూకటి వ్రేళ్ళతో పెళ్ళగించి వేయాలని ఒక మహోన్నతమైన సంస్కరణ వాదంతో ‘మాలపిల్ల’ చిత్రం రూపొందించారు.
బ్రాహ్మణాధిక్యత గల ఆనాటి సమాజంలో మాలల దుస్థితి ఎలుగెత్తి చెప్పడమే కాకుండా, ఇతర కులాల వారు వారిని పెండ్లాడి మనుషులుగా గుర్తించాలని కూడా ఆ చిత్రం సూచించింది.
1938లో వెలువడ్డ ‘మాలపిల్ల’ తమిళులను కూడా విశేషంగా ఆకర్షించింది. అవి భారత స్వాతంత్య్రం కోసం అహింసా పద్ధతిలో పోరాటం సాగుతున్న రోజులు. సహాయ నిరాకరణోద్యమం, సత్యాగ్రహం నిత్యజీవితంలో భాగమైన రోజులు. ఆనాటి రోజుల్ని, నాటి సాంఘిక పరిస్థితుల్ని, చిత్తశుద్ధితో, విప్లవ స్ఫూర్తితో చిత్రీకరించారు గూడవల్లి రామబ్రహ్మం.
చిత్రం ఇతివృత్తం ఈ విధంగా ఉంటుంది – హరిజనుడొకడు గొడుగు వేసుకుని వెళ్ళడం బ్రాహ్మణులకు నచ్చదు. బ్రాహ్మణ పెద్దలు పిలిచి దుర్భాషలాడి చెప్పుతో కొడతారు. హరిజనుల్లో సంచలనం బయలు దేరుతుంది. బ్రాహ్మణాధిక్యతను సహించలేక గుడి తలుపులు తోసుకుని లోనికి వెళ్ళే ప్రయత్నం చేస్తారు.
సనాతన వాది, ఆలయ ధర్మకర్త మేడిచర్ల సుందర రామ శాస్త్రికి విషయం తెలుస్తుంది. “మాలలు దేవాలయం అపవిత్రం చేస్తుంటే.. చూస్తూ ఊరుకోవడమేనా? .. .. మీలో బ్రాహ్మణ రక్తం లేదూ?” అని తన వాళ్ళను దూషిస్తాడు.
మరోవైపు దౌర్జన్య రహితంగా బ్రాహ్మణుల కళ్ళు తెరిపించాలని గాంధేయ వాది అయిన చౌదరి, హరిజనుల్ని సమాధాన పరుస్తుంటాడు. “పికిలిపిట్ట, పేడపురుగు ఒకటే అవుతుందా? సింహం, చీమ ఒకటే అవుతాయా?” అని బ్రాహ్మణులు తమను తాము పొగడుకుంటారు.
“పంచములు ఆదివాసులయ్యారని, వారే నేడు హరిజనులయ్యారని, ఇంకా రేపు ఏమవుతారో”నని ధర్మకర్త రామశాస్త్రి హేళన చేస్తాడు. “కిన్నెరలు, కింపురుషులు, బ్రహ్మర్షులు అవుతారేమో”నని గేలి చేస్తాడు. అవసరమైతే బ్రాహ్మణులు క్షాత్రం పూనగలరని హెచ్చరిస్తాడు.
యుగయుగాలుగా తమదై ఉన్న ఈ తాత్త్విక సంపదను, ధార్మిక ఆచారాల్ని పరులకు ఏమాత్రమూ అందించబోమని ఖరాఖండిగా చెబుతాడు.
అంతేకాదు, హరిజనులు గుడికి పోకుండా కట్టుదిట్టం చేస్తాడు. “బాపనోడికి సుఖంగా తిని కూచునే కర్మ, మాలోడికి బువ్వలేక, నీరులేక మల మల మాడే కర్మ – ఇదేం న్యాయం” అని హరిజనులు దేవుడి మీద కూడా తిరుగు బాటు చేస్తారు.
“సుఖంగా గుళ్ళో ప్రసాదాలు తిన మరిగిన దేవుడు కూడా, బొమ్మల పక్షమే”నని తీర్మానించుకుంటారు. ‘మాలపిల్ల’ చలన చిత్రం వెలువడి సుమారు ఎనభై ఏళ్ళవుతున్నా మన సమాజంలో మాత్రం మార్పు రావాల్సినంత రాలేదు – కుల, మత, ప్రాంతీయ భేదాలు రోజు రోజుకూ పేట్రేగిపోతున్నాయి.
మూర్ఖపు ఆచారాలపై ‘ఘటశ్రాద్ధ’..
ఈ సందర్భంలో చెప్పుకోవాల్సిన కన్నడ సినిమా ‘ఘటశ్రాద్ధ’. ఇది దర్శకుడు గిరీష్ కాసరవల్లి తొలి చిత్రం. దీని ఇతి వృత్తమేమిటంటే – నీతితప్పి పాపాత్మురాలైన బ్రాహ్మణ విధవరాలికి కుటుంబంతో ఉన్న అన్ని సంబంధాలను తెగతెంపులు చేయడం ‘ఘట శ్రాద్ధ’ ముఖ్యోద్దేశం.
మనిషి చనిపోయినప్పుడు చేసే వైదిక కర్మలతో ఇది సమానం. కానీ భేదం ఏమిటంటే “పాప పంకిలమైన” ఆత్మ ఇక్కడ సజీవంగా ఉంటుంది. అంటే విధవరాలు బతికి ఉండగానే ఆమెకు శ్రాద్ధం పెడతారన్నమాట. ఆమెకు కుటుంబంతో సంబంధాలు తెగిపోతాయి. ఆస్తి పాస్తుల మీద హక్కు పోతుంది. బ్రాహ్మణ అగ్రహారం నుండి బహిష్కరింపబడుతుంది.
ఆచార కర్మలలో ఒక మట్టి పాత్రను పగల గొడతారు. ఇక్కడ మట్టి పాత్ర స్త్రీ గర్భానికి సంకేతం. అంటే సంతానోత్పత్తి అర్హతను పగలగొట్టడమన్న మాట.
బాల్యవివాహాల వల్ల, యవ్వనదశలోనే విధవరాలైన యువతను జీవచ్ఛవంగా తయారు చేస్తారు. ఆమె బతికి ఉండగానే తద్దినం పెట్టే నీచమైన ఆచారం ఇది. ఎందరో సంఘ సంస్కర్తలు, మరెందరో హేతువాదులు పూనుకుని మార్పు కోసం నిరంతరం కృషి చేస్తూ ఉంటే, సమాజం ఈ దశకైనా వచ్చింది. అయితే రావల్సిన మార్పు ఇంకా చాలా ఉంది.
మత సామరస్యం – వాస్తవికత..
ఈ విధంగా వివిధ మతాల గూర్చి, మత దురాచారాల గూర్చి వచ్చిన చలన చిత్రాలెన్నో ఉన్నాయి. వాటి గూర్చి ఎంతైనా చెప్పుకోవచ్చు.
అయితే బాబా మజ్గాంకర్ రూపొందించిన “వుయ్”(మేం) అనే చిత్రం మతాలన్నీ జాతీయ సమైక్యతకు పాటు పడాలని ఉద్బోధిస్తుంది. అలాగే రాజేంద్ర జల్లే రూపొందించిన ‘మాండూ’ సినిమా గూర్చి ప్రత్యేకంగా చెప్పుకోవాలి. ఇది మధ్యప్రదేశ్ లోని ‘మాండూ’ అనే స్థలం గొప్పదనాన్ని తెలియజేస్తుంది. హిందూ ముస్లింల కలిమికి చెలిమికి ప్రతీకగా నిలిచే స్థలం అది.
బాజ్ బహదూర్ చక్రవర్తికి, రూపమతి అనే గొర్రెలు కాచే యువతికి మధ్య ప్రణయానికి – పరిణయానికి గుర్తు ఆ స్థలం. ఈ కథ మన హైదరాబాదు యువరాజు – భాగమతిల ప్రణయ గాథను పోలి ఉంటుంది.
రచయితలు ఏ కథైనా రాసుకోవచ్చు, దర్శకులు ఏ సినిమానైనా తీసుకోవచ్చు. మూఢనమ్మకాల్ని పెంచే దిశలో అభూత కల్పనల్ని మాత్రం ప్రచారం చెయ్యొద్దు. కాలం మారింది. యువత ప్రతి దానికీ కారణం వెతుకుతున్నారు. స్వర్గాలు, నరకాలు, పునర్జన్మల కాలం చెల్లింది. ఏదైనా ఇక వాస్తవాల పునాదుల మీద రావాల్సి ఉంది.
ఒక తాజా ఉదాహరణ చెప్తాను. మయన్మార్‌లో ఒక మిలియనీర్ అస్వస్థుడయ్యాడు. ‘లాభం లేదు ఎక్కువ కాలం బతకడం’ అని డాక్టర్లు చెప్పారు. అతను కూడా తనకు తాను గ్రహించుకున్నాడు. దానితో పాటు తన దగ్గరున్న మిలియన్ల డబ్బు, చనిపోయాక తనతో రాదు అని వాస్తవం తెలుసుకున్నాడు. ప్రతి రోజూ కొంత కొంత డబ్బు పేదలకు పంచడం ప్రారంభించాడు.
వ్యాస రచయిత సుప్రసిద్ధ సాహితీ వేత్త, సైన్స్ ప్రొఫెసర్
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
