తెలంగాణ ప్రభుత్వం ఇటీవల డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. పాఠశాల విద్యకు సంబంధించిన అడ్మినిస్ట్రేషన్‌లో ఈ పదవులు అత్యంత కీలకమైనవి.
పాఠశాలల పనితీరు, ఉపాధ్యాయ వృత్తిని మెరుగుపరచడం, విద్యార్థుల అభ్యసన ఫలితాలు, సమాజ భాగస్వామ్యం, విద్యా విధానాల అమలు వంటి పలు అంశాలపై ఈ అధికారుల నిర్ణయాలు ప్రత్యక్ష ప్రభావం చూపుతాయి. విద్యా నాయకత్వానికి సంబంధించిన ముఖ్యమైన పదవులు ఇవి.
అయితే విద్యా ప్రక్రియలో ప్రత్యక్ష అనుభవాలు కలిగిన ఉపాధ్యాయులు వీటికి అర్హులవుతారా లేదా ఎటువంటి బోధనా అనుభవం లేని వ్యక్తులు అర్హులవుతారా అనే ప్రాథమిక ప్రశ్న ఈ నియామకాల సందర్భంగా మన ముందుకొస్తుంది.
తరగతి గది నుంచే నిజమైన మార్పు..
గత మూడు దశాబ్దాలుగా ప్రపంచవ్యాప్తంగా విద్యా పరిశోధనలో ఉపాధ్యాయ నాయకత్వ భావనకు ప్రత్యేక ప్రాధాన్యత లభిస్తోంది.
దీని ప్రధాన భావం ఏమిటంటే పాఠశాలలలో నిజమైన మార్పు తరగతి గది నుంచి ప్రారంభమవుతుంది.
అందువల్ల విద్యా నాయకత్వం కూడా బోధన అనుభవం నుంచి ఎదగాలి.
ఉపాధ్యాయ నాయకత్వం అంటే కేవలం పరిపాలనా హోదా కాదు. అది బోధనలో నైపుణ్యం, సహచర ఉపాధ్యాయులకు మార్గదర్శకత్వం, పాఠశాల అభివృద్ధి కార్యక్రమాలలో నాయకత్వం, విద్యార్థుల అభ్యసనను మెరుగుపరచే సామర్థ్యం.
అమెరికన్ విద్యా తత్వవేత్త జాన్ డ్యూయీ పాఠశాలను ప్రజాస్వామ్య సమాజానికి సూక్ష్మ రూపంగా అభివర్ణించారు.
బ్రెజిల్ విద్యావేత్త పాలో ఫ్రెయిరే అభిప్రాయం ప్రకారం- విద్యా నాయకత్వం, సంభాషణ, భాగస్వామ్యం, విమర్శనాత్మక చైతన్యంతో అనుసంధానించబడాలి.
కాబట్టి పాఠశాలల్లో నాయకత్వం అనేది ఆదేశాలు జారీ చేసేదిగా మాత్రమే ఉండకుండా విద్యావ్యవస్థ వికాసానికి మార్గదర్శనం చేసే విస్తృత లక్ష్యంతో ఉండాలి.
పరిపాలనకు బోధనా అనుభవం అత్యావశ్యకం..
ఈ నేపథ్యంలో పాఠశాలల నాయకత్వ స్థానాలకు ఉపాధ్యాయ వృత్తి అనుభవం కలిగిన వ్యక్తులనే ఎంపిక చేయడం ప్రపంచవ్యాప్తంగా ఒక సాధారణ సూత్రంగా మారింది.
కాని భారతదేశంలో ఇప్పటికీ విద్యా పరిపాలనను సాధారణ ప్రభుత్వ పరిపాలనలో భాగంగా చూస్తున్నారు.
వైద్య రంగంలో ఆసుపత్రిని నడిపే వ్యక్తికి వైద్య పరిజ్ఞానం అవసరమైనట్లే, విద్యా వ్యవస్థను నడిపే వ్యక్తికి విద్యా ప్రక్రియపై లోతైన అవగాహన అవసరం.
కొఠారి కమిషన్ ఇదే విషయాన్ని స్పష్టంగా గుర్తించింది.
విద్యా పరిపాలనను ఒక ప్రత్యేక వృత్తి సేవగా అభివృద్ధి చేయాలని, దానికి ప్రత్యేక శిక్షణ పొందిన నిపుణులను తయారు చేయాలని సిఫారసు చేసింది. విద్యా నాయకత్వం సాధారణ పరిపాలనా నైపుణ్యాల కంటే భిన్నమైనదని, అది బోధన-అభ్యసన ప్రక్రియపై లోతైన అవగాహనను కోరుకుంటుందని కమిషన్ పేర్కొంది.
అంతర్జాతీయ సంస్థల సిఫార్సులు..
ఈ దృక్పథాన్ని యునెస్కో కూడా సమర్థిస్తోంది. విద్యా నాయకులు ముందుగా విద్యావేత్తలై ఉండాలని, తరువాత పరిపాలనా నైపుణ్యాలను అభివృద్ధి చేసుకోవాలని యునెస్కో నివేదికలు సూచిస్తున్నాయి.
పంతొమ్మిది వందల అరవై ఆరులో అంతర్జాతీయ కార్మిక సంస్థ, యునెస్కో సంయుక్తంగా బోధనను ఒక ప్రత్యేక వృత్తిగా అధికారికంగా గుర్తించాయి.
దీని ప్రకారం బోధన అనేది ప్రత్యేక జ్ఞానం, నైపుణ్యం, వృత్తిపరమైన అనుభవం, సామాజిక బాధ్యతలతో కూడిన వృత్తి.
బోధనను వృత్తిగా గుర్తిస్తున్నాము కాబట్టి ఆ వృత్తికి నాయకత్వం వహించే వ్యక్తులు కూడా అదే వృత్తి నుంచి రావడం సహజమైన ప్రజాస్వామ్య సూత్రం.
విద్యా పరిపాలనను సాధారణ ప్రభుత్వ పరిపాలనగా కాకుండా, బోధనా వృత్తిలో ఒక ఉన్నత స్థాయిగా పరిగణించినప్పుడే పాఠశాలల నాణ్యత, ఉపాధ్యాయుల పట్ల గౌరవం, విద్యార్థుల అభ్యసన మెరుగుపడతాయి.
వలసవాద విధానాలా? ఉపాధ్యాయ నాయకత్వమా?
కాని భారతదేశ విద్యా పరిపాలనపై వలస పాలన ప్రభావం ఇప్పటికీ కొనసాగుతోంది.
బ్రిటిష్ పాలకులు విద్యా శాఖ అధికారులను పాఠశాలలను అభివృద్ధి చేయడానికి కాకుండా, నియంత్రించడానికి ఉపయోగించారు.
దీని ఫలితంగా విద్యా పరిపాలనలో ఒక ‘బ్యూరోక్రటిక్ నియంత్రణ నమూనా’ ఏర్పడింది.
ఇందులో అధికారుల ప్రధాన పని- తనిఖీలు, నివేదికలు, గణాంకాలు, పరిపాలనా ఆదేశాల అమలు. కాని ప్రపంచవ్యాప్తంగా ‘ఉపాధ్యాయ నాయకత్వ నమూనా’ అమలు కాబడుతున్నది.
ఉపాధ్యాయ వృత్తి అభివృద్ధికి నాయకత్వం వహించడం, తరగతి గది బోధనను మెరుగుపరచడం, విద్యార్థుల అభ్యసనను విశ్లేషించడం, పాఠశాల అభివృద్ధికి ప్రణాళికలను రూపొందించడం, స్థానిక సమాజాన్ని పాఠశాలతో అనుసంధానించడం, ఈ నమూనా లక్షణాలు.
బ్యూరోక్రటిక్ నియంత్రణలో నియమాలు పాటించడం ప్రధానం అవుతుంది, కాని ఉపాధ్యాయ నాయకత్వంలో పిల్లలు నేర్చుకోవడం ప్రధానమవుతుంది.
ఈ రెండు నమూనాల మధ్య వ్యత్యాసాన్ని అర్థం చేసుకోవడం చాలా ముఖ్యం.
ప్రపంచ దేశాల అనుభవాలు – జాతీయ విద్యా విధానం..
ఫిన్లాండ్, నార్వే, స్వీడన్ వంటి దేశాలు ప్రపంచంలో అత్యుత్తమ విద్యా వ్యవస్థలను నిర్మించాయి. ఈ దేశాలలో పాఠశాల నాయకత్వం పూర్తిగా ఉపాధ్యాయ వృత్తి అనుభవం ఆధారంగా ఉంటుంది.
ఫిన్లాండ్లో ప్రధానోపాధ్యాయుడు లేదా విద్యా పరిపాలకుడు కావాలంటే ముందుగా ఉపాధ్యాయుడిగా పనిచేసి ఉండాలి.
తరువాత ప్రత్యేక నాయకత్వ శిక్షణ పొందాలి, నాయకత్వాన్ని అకడమిక్ లీడర్‌షిప్‌గా నిర్వచిస్తారు. అంటే బోధనను అర్థం చేసుకున్న వ్యక్తే నాయకుడు కావాలి.
ఈ దేశాలలో విద్యా పరిపాలకులు పాఠశాలలను తనిఖీ చేయడానికి మాత్రమే కాకుండా, ఉపాధ్యాయులకు సహకరించడానికి, అభ్యసన నాణ్యతను మెరుగుపరచడానికి పనిచేస్తారు.
జాతీయ విద్యా విధానం-రెండు వేల ఇరవై పాఠశాల నాయకత్వాన్ని విద్యా సంస్కరణల కేంద్ర అంశంగా గుర్తించింది.
పాఠశాల నాయకులు కేవలం పరిపాలకులు కాదు, వారు విద్యా మార్పుకు నాయకులు, ఉపాధ్యాయులకు మెంటర్లు, అభ్యసన నాణ్యతకు బాధ్యులు అని తెలిపింది.
అంటే నాయకత్వం అనేది ఫైళ్ల నిర్వహణ కంటే ఎక్కువ, అది విద్యా ప్రక్రియను అర్థం చేసుకుని దానిని మెరుగుపరచే సామర్థ్యం.
తెలంగాణ విద్యా విధాన నివేదిక కూడా పాఠశాలల నాణ్యత పెంపుకు ఉపాధ్యాయ స్వయంప్రతిపత్తి, స్థానిక నిర్ణయాధికారం, నాయకత్వాభివృద్ధి అవసరమని పేర్కొంది.
ప్రస్తుత నియామక ప్రక్రియలోని లోపాలు..
ప్రస్తుత డిప్యూటీ ఎడ్యుకేషనల్ ఆఫీసర్ నియామక పరీక్ష సిలబస్‌లో ఎడ్యుకేషనల్ లీడర్షిప్, అడ్మినిస్ట్రేషన్, మేనేజ్మెంట్కు ప్రత్యేక పేపర్‌ను కేటాయించడం అభినందనీయం.
అయితే నాయకత్వం గురించి ప్రశ్నలు అడగడం మాత్రమే సరిపోదు.
సమాచారాన్ని గుర్తుంచుకుని సరైన సమాధానం ఎంచుకునే సామర్థ్యంపైన ఆధారపడే ఆబ్జెక్టివ్ పరీక్ష ద్వారా విద్యా నాయకత్వాన్ని ఎంపిక చేయలేము.
ఇంకా ఆందోళనకరమైన విషయం ఏమిటంటే, ఈ నియామక ప్రక్రియలో వ్యక్తిత్వం, నాయకత్వ సామర్థ్యం, పాఠశాల నిర్వహణ అనుభవం, విద్యా దృష్టికోణం వంటి అంశాలను అంచనా వేసే వ్యక్తిగత ఇంటర్వ్యూ లేదా ఇతర మూల్యాంకన విధానాలు ఏమీ లేవు.
ఈత గురించి సిద్ధాంతపరమైన పరిజ్ఞానం ఉన్నంత మాత్రాన ఎవరూ ఈతకు శిక్షకులు కాలేరు.
అదేవిధంగా విద్యా నాయకత్వంపై పరీక్ష రాయడం మాత్రమే ఒక వ్యక్తిని విద్యా నాయకుడిగా మార్చదు.
నాయకత్వానికి పునాది అనుభవం; విద్యా నాయకత్వానికి పునాది బోధనా అనుభవం. అందుకోసం ఈ పదవులకు, కొన్ని సంవత్సరాల బోధనా అనుభవం, విద్యా నాయకత్వంలో ప్రత్యేక శిక్షణ వంటి అర్హతలను తప్పనిసరి చేయాలి.
కొఠారి కమిషన్ నుంచి ఎన్ఈపీ-రెండు వేల ఇరవై వరకు, యునెస్కో నుంచి ఫిన్లాండ్ వరకు ఒకే సందేశం మనకు ఉంది; అదేమిటంటే, విద్యా నాయకత్వం ఉపాధ్యాయ అనుభవం మీద నిర్మించబడాలి.
విద్యా పరిపాలనను ఒక ప్రత్యేక వృత్తిగా గుర్తించకుండా, పాఠశాల నాయకత్వాన్ని ఉపాధ్యాయ నాయకత్వంతో అనుసంధానించకుండా, బ్యూరోక్రాటిక్ నియంత్రణ స్థానంలో అకడమిక్ నాయకత్వాన్ని ప్రతిష్టించకుండా ప్రభుత్వ విద్యను బలోపేతం చేయడం సాధ్యం కాదు.
భారత విద్యా వ్యవస్థ ఎదుర్కొంటున్న సంక్షోభం కేవలం నిధుల కొరత, మౌలిక వసతుల లేమి లేదా ఉపాధ్యాయుల ఖాళీల సమస్య మాత్రమే కాదు, అంతకన్నా లోతైన నాయకత్వ సంక్షోభం.
విద్యలో నిజమైన సంస్కరణలు పాఠశాలల్లో అభ్యసనను ప్రేరేపించే నాయకత్వం ద్వారా మాత్రమే సాధ్యమవుతాయి.
(వ్యాస రచయిత కాకతీయ ప్రభుత్వ కళాశాల (అటానమస్), కాకతీయ విశ్వవిద్యాలయం, హనుమకొండలో అధ్యాపకులు. సొసైటీ ఫర్ చేంజ్ ఇన్ ఎడ్యుకేషన్ తెలంగాణ ప్రధాన కార్యదర్శి. విద్యారంగంలో వస్తున్న సంస్కరణలు, మార్కెట్ విధానాలు, సమాన విద్య, ప్రజాస్వామ్య బోధనపై రచనలు చేస్తున్నారు. ఎకనామిక్ అండ్ పొలిటికల్ వీక్లీ, మెయిన్ స్ట్రీమ్ వీక్లీలలో వ్యాసాలు ప్రచురించారు.)
Discover more from The Wire Telugu
Subscribe to get the latest posts sent to your email.
